Joginder Singh
-
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
ఖబడ్దార్ చైనా
భారత్–చైనా సరిహద్దు ప్రాంతం ‘డోక్లామ్’ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొద్ది నెలలుగా అక్కడ చైనా సైనికుల కదలికలు ఎక్కువయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి, గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు కూడా స్నేహద్రోహానికి పాల్పడి భారత్‌పై యుద్ధానికి దిగితే.. గట్టి సమాధానమే ఇచ్చేందుకు భారతీయ సైనికులు కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సర్దార్ జోగీందర్ సింగ్’ అనే పంజాబీ బయోపిక్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోని ప్రతి యువకుడూ ‘ఖబడ్దార్ చైనా’ అంటూ, సైనిక దళాల్లో చేరేందుకు స్ఫూర్తినిచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. నెహ్రూ ప్రేమమయుడు. శాంతి ప్రియుడు. శత్రువు ఖడ్గం తీస్తే, ఆ ఖడ్గంతో కరచాలనం కోసం మృదువైన తన చేయిని చాస్తాడు! అయితే ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్లడం లేదు. ‘పరమ వీర చక్ర సుబేదార్ జోగీందర్ సింగ్’ అనే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం కథ కాదు. నిజ జీవిత కథ. ఏప్రిల్ 6న ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ అని సినిమాగా విడుదల కాబోతున్న సాహస గాథ. చైనాను నెహ్రూ గుడ్డిగా నమ్మకపోతే 1962 ఇండో చైనా యుద్ధమే లేదు. ఆ యుద్ధమే లేకపోతే సుబేదార్ జోగీందర్ సింగ్ అనే సినిమానే ఉండబోయేదే కాదు. నిబద్ధతలో గెలుపు మనదే! శత్రువును నమ్మొద్దని ఇండో–చైనా యుద్ధం మనకు నేర్పింది. ‘శత్రువును తరిమికొట్టేందుకు.. సైనికుడా.. నువ్వు నీ చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు’ అని జోగీందర్ సింగ్ స్ఫూర్తినిచ్చాడు! యుద్ధంలో భారత్ ఓడిపోయింది. నిబద్ధతలో భారత సైన్యానిదే గెలుపని నిరూపించాడు జోగీందర్. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు నెల రోజుల యుద్ధమది. మనవైపు 1383 మంది సైనికులు చనిపోయారు. 3,968 మంది సైనికులు చైనాకు బందీలయ్యారు. బందీ అయ్యాక కూడా తిరగబడి, వీరమరణం పొందిన సైనికుడు సుబేదారు జోగీందర్ సింగ్! గాయాల నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని బౌండరీలపై రెడ్మార్కులుగా పెట్టి, ‘దాటితే చస్తావ్’ అని శత్రు మూకల్ని హడలుకొట్టి, అరుణాచల్‌ప్రదేశ్‌ను భరతమాత ఒడి జారనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు జోగీందర్ సింగ్. అరుణాచల్‌ప్రదేశ్‌కు అప్పటికొక పేరు లేదు. ‘నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ’ (ఎన్.ఇ.ఎఫ్.ఎ) అది. దాని కోసమే చైనా యుద్ధానికొచ్చింది. యుద్ధంలో గెలిచి కూడా ఎన్.ఇ.ఎఫ్.ఎ.ని పొందలేకపోయింది. ఆ ఘనకీర్తి జోగీందర్దీ, జోగీందర్ నడిపించిన ‘బమ్ లా’ దళానిది. చైనా నుంచి నెహ్రూ ఏం కోరుకున్నాడో అది దక్కనందుకు యుద్ధం వచ్చింది. చైనా ఏం కోరుకుందో అది దక్కకుండా చేసినందుకు జోగీందర్ హీరో అయ్యాడు. చైనా నుంచి నెహ్రూ స్నేహాన్ని కోరుకున్నాడు. చైనా విప్లవ నేత మావో జెడాంగ్ని తన స్నేహితుడు అనుకున్నాడు. ‘‘మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది’’ అన్నాడు నెహ్రూ. ‘‘అలాగైతే అక్సాయ్చిన్ని, అరుణాచల్నీ ఇవ్వు’’ అన్నాడు జెడాంగ్. ‘‘భౌగోళికంగా కాదు, బాంధవ్యాలతో పెనవేసుకుందాం’’ అన్నాడు నెహ్రూ. జెడాంగ్ మౌనంగా ఉండిపోయాడు. భారత్ సరిహద్దుల్లోకి గుట్టు చప్పుడు కాకుండా చైనా చొరబడింది. నెహ్రూకి యుద్ధం చెయ్యక తప్పలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ సినిమా మొదలౌతుంది. 1962 సెప్టెంబర్ 9. డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మీనన్ నుంచి వేళకాని వేళలో నెహ్రూకి కాల్! ‘‘వేరే దారి లేదు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. చైనా దళాలు ‘తలా రిడ్జ్’లో సౌత్‌కి వచ్చేశాయి’’ అంటున్నాడు మీనన్. స్నేహాన్ని నమ్మినంత కాలం నమ్మాం. ఇప్పుడు సైన్యాన్ని నమ్ముకోవలసిన కాలం వచ్చేసిందని నెహ్రూకి అర్థమైంది. నెహ్రూ అప్పుడు లండన్‌లో ఉన్నాడు. కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ మీట్లో. సరిగ్గా అర నిమిషం తర్వాత నెహ్రూ నుంచి మీనన్‌కి ‘డన్’ అని సంకేతం. వెంటనే మన సెవన్త్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్.. చైనా సేనలు బలంగా నిలుచుని ఉన్న ‘నమ్కా ఛు’ వైపు కదిలింది. ‘సిక్కు రెజిమెంట్’ ఆ బ్రిగేడ్లోనే ఉంది. జోగీందర్ సింగ్ ఆ రెజిమెంట్‌లోనే ఉన్నాడు. సుబేదార్ అతడు. దళపతి. ‘నమ్కా ఛు’ని చేరుకునే దారిలో ‘బమ్ లా’ పోస్టు దగ్గర మూడు వైపుల్నుంచీ కదిలి వచ్చిన చైనా సేనల్ని సిక్కు రెజిమెంట్ అడ్డుకుంది. వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు తక్కువగా ఉన్నారు. ఎక్కువ తక్కువల్ని చూసుకోలేదు సుబేదార్ జోగీందర్ సింగ్. తన సేనల్లో స్ఫూర్తిని నింపి అన్ని వైపులకు కదిలించాడు. కానీ శత్రువుల బలగం ఎక్కువగా ఉంది. నిమిష నిమిషానికీ మన బ్రిగేడ్ బలం సన్నగిల్లుతోంది. సిక్కు రెజిమెంట్‌లో ఉన్నదే 20 మంది సైనికులు. వారిలోనూ పది మంది నేలకు ఒరిగారు. మిగిలింది జోగీందర్, మరో తొమ్మిది మంది! వారి దగ్గర కూడా బాయ్నెట్లే మిగిలాయి. వాటితోనే పోరాడుతున్నారు. జోగీందర్ ఒంటినిండా బలమైన గాయాలు. చివరికి ఆ గాయాలు అతడిని చైనా సైనికులకు బందీని చేశాయి! బందీగానే మరణించాడు జోగీందర్ . తండ్రి మరణ వార్త వినగానే జోగీందర్ సింగ్ పెద్ద కూతురు కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. చైనా అతడి చితాభస్మాన్ని సైనిక మర్యాదలతో ఇండియాలోని బెటాలియన్‌కి పంపించింది. భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. వందల మంది శత్రుదేశ సైనికులతో పోరాడిన ఇరవైమంది సైనికుల వీరోచిత పోరాటానికి దృశ్యరూపం .. ‘సుబేదార్ జోగీందర్ సింగ్’. సింగ్‌గా గిప్పీ గ్రేవాల్ నటిస్తున్నారు. టీజర్ చివర్లో.. ‘ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా’ అంటాడు గ్రేవాల్. అలా అంటున్నప్పుడు అతడిని చూస్తే.. జోగీందర్ సింగ్ ఆత్మ అతడిలో ప్రవేశించిందా అనిపిస్తుంది. పంజాబీలనే కాదు, మిగతా రాష్ట్రాల యువకులనీ సైన్యంలోకి పట్టి తీసుకుపోయేంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది సుబేదార్ జోగీందర్ సింగ్ లైఫ్ హిస్టరీ. అదిప్పుడు తగిన సమయంలో తెరకెక్కబోతోంది. సుబేదార్ జోగీందర్ సింగ్ పరమవీరచ్ర - 1921–1962 జననం : పంజాబ్ -
సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్‌సింగ్(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. మాజీ ఎంపీ మనీశ్ తివారి జోగిందర్ మృతి చెందారన్న విషయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు. సుదీర్ఘ అనారోగ్యంతో జోగిందర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1961 బ్యాచ్‌కు చెందిన, కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జోగిందర్ సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. పదవీ విరమణ తరువాత ఆయన 25కు పైగా పుస్తకాలు రచించారు. ఓ సందర్భంలో ‘ది హిందూ’ కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ...పలువురు ప్రముఖుల ప్రమేయమున్న దాణా కుంభకోణం విచారణ జరుగుతున్నపుడు తనను బుట్టలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. -
కశ్మీర్లో పాక్ గూఢచారి అరెస్టు
జమ్మూ: భద్రతా దళాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన భోద్ రాజ్ అనే పాకిస్తాన్ గూఢచారిని జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. సైనికుల కదలికలు, విస్తరణ తదితర వివరాలు అతను సేకరించిన సమాచారంలో ఉన్నట్లు తెలిసింది. భారత సైనిక కదలికలకు సంబంధించిన ఓ మ్యాప్‌ను, రెండు పాక్ సిమ్‌కార్డులను అధికారులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి చాంగియా గ్రామంలో రాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్పీ జోగిందర్ సింగ్ వెల్లడించారు. భారత్‌లో తయారైన రెండు మొబైల్స్‌తో పాటు రూ.1711లను స్వాధీనం చేసుకున్నామని, విచారణ సాగుతున్నట్లు చెప్పారు. ఇద్దరు జేఈఎం తీవ్రవాదుల అరెస్టు శ్రీనగర్: ఇద్దరు జైషే మహ్మద్(జేఈఎం) తీవ్రవాదులను భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలో గత ఆగస్టు 16న జరిగిన ఓ దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు సహా ఓ పోలీసు మృతిచెందారు. అరెస్టయిన వారిని సాఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్‌లుగా గుర్తించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఏకే రైఫిల్, పిస్టల్లతో పాటు మందుగుండు సామగ్రిని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
సోదరిపై ఎనిమిదేళ్లుగా అత్యాచారం
గుర్గావ్: అర్ధరాత్రిరోడ్డు మీదనో, ఆఫీసులోనో కాదు.. సొంతింట్లో కూడా రక్షణ లేకుండా పోయింది అమ్మాయిలకు. కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు అన్న తేడా లేకుండా చెలరేగిపోతున్నారు కామాంధులు. అతనో డాక్టర్. మనుషుల ప్రాణాలను నిలబెట్టాల్సినవాడు. కానీ మానవత్వం మరిచి సమాజమంతా అసహ్యించుకునే పని చేశాడు. గుర్గావ్కు చెందిన 32 ఏళ్ల రాజేశ్‌కుమార్ ఎనిమిదేళ్లుగా తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారం చేస్తున్నాడు. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం డ్యూటీ మేజిస్ట్రేట్ జోగిందర్ సింగ్ ముందు హాజరు పరిచారు. విచారించిన ఆయన 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. 27 ఏళ్ల బాధితురాలు ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలోని సమాచార విభాగంలో పనిచేస్తోంది. తన సోదరుడి ఘాతుకంపై ఆమె శనివారం మేన్సార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బయటకు తెలిస్తే తనకు, తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందేమోనని భయపడే ఇన్నేళ్లపాటు ఆ గాయాలను భరించానని ఆమె పోలీసులకు తెలిపింది. తన సోదరుడు 2005లో తాను 12వ తరగతిలోఉండగానే మొదటిసారి తనపై లైంగికంగా దాడి చే శాడని, ఎవరికీ చెప్పుకోలేక వెంటనే తన సోదరి ఇంటికి వెళ్లిపోయానని బాధితురాలు పేర్కొంది. అయితే తల్లిని చూడడానికి ఇంటికి వచ్చిన ప్రతిసారీ తనకో విషమ పరీక్షే ఎదురయ్యేదని పోలీసులకు తెలిపింది. గుర్గావ్కు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం వీరిది. ఐదుగురు అక్కాచెల్లెళ్లున్న ఆ కుటుంబంలో ఏకైక కొడుకు రాజేశ్‌కుమార్. అతనిపై అత్యాచారం, దాడి, బెదిరించిన నేరాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ మహిళ వైద్య పరీక్షలకు వెళ్లడానికి నిరాకరించింది. -
బ్రిటిష్ యువతి దాడిలో 80 ఏళ్ల సిక్కు వృద్ధుడి మృతి
లండన్‌లో బ్రిటిష్ యువతి ముఖం మీద గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన 80 ఏళ్ల సిక్కు వృద్ధుడు మరణించారు. కోవెంట్రీ నగరంలో ఆగస్టు నెలలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. అక్కడి ట్రినిటీ స్ట్రీట్‌లో ఆగస్టు పదో తేదీన జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన జోగీందర్ సింగ్‌ను తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన తర్వాత కూడా మళ్లీ అనారోగ్యం పాలు కావడంతో మరోసారి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. అయితే.. ఆయన ఇటీవలే మరణించినట్లు వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు తెలిపారు. బ్రిటిష్ యువతి కోరల్ మిల్లర్చిప్ (19) జోగీందర్ర సింగ్‌పై దాడి చేస్తున్న సంఘటనను ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఆ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమె తీవ్రంగా కొట్టి కింద పారేయడంతో ఆయన తలపాగా కూడా పడిపోయింది. కిందపడిన జోగీందర్‌పై ఆమె ఉమ్మేసినట్లు కూడా వీడియోలో ఉంది. అనంతరం ఆమె కొంతమంది యువకులతో కలిసి వెళ్లిపోయింది. జోగీందర్ సింగ్ మృతికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోడానికి పోస్టుమార్టం చేశారు. ఈ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఆమె కొట్టడం వల్లే చనిపోయారా లేదా అన్న విషయం నిర్ధారణ అయితే తప్ప తదుపరి చర్యలు తీసుకోలేమని పోలీసులు అంటున్నారు.