అభీష్ట ప్రదాత తిరుత్తణిగై | Subramanian Swamy temple special | Sakshi
Sakshi News home page

అభీష్ట ప్రదాత తిరుత్తణిగై

Published Wed, Aug 16 2017 12:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

అభీష్ట ప్రదాత తిరుత్తణిగై

అభీష్ట ప్రదాత తిరుత్తణిగై

పుణ్య తీర్థం

తమిళంలో మురుగన్‌ అంటే అందం అని అర్థం. అందానికి ప్రతీకగా భక్తులచే పూజలందుకునే దైవంగా కీర్తి చెందిన సుబ్రమణ్యస్వామి (మురుగన్‌) తన ఆరు పుణ్యక్షేత్రాల్లో ఉగ్రరూపుడిగా దర్శనమిచ్చినా ఒక్క తిరుత్తణి కొండలో మాత్రం శాంతస్వరూపుడిగా  భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ ఆలయంలో స్వామికి నిర్వహించే అభిషేకాల్లో వినియోగించే విభూది, గంధ ప్రసాదాల ద్వారా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని విశ్వాసం. ఆరోగ్యం, విద్య, వ్యాపారం, కోర్టు సమస్యలు, వివాహం తదితర సమస్యలు సుబ్రమణ్యస్వామిని దర్శించుకుంటే తొలగుతాయని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుత్తణికి విచ్చేస్తుంటారు. ఈ క్షేత్రానికి తమిళంలో తొండ్రుతొట్టు అని పేరు. అంటే తప్పులు, పాపాలను మన్నించి సౌభాగ్యాలు ప్రసాదించడం అని, తిరుత్తణిగై అంటే శాంతించిన దేవుడని అర్థం. ఇప్పుడక్కడ ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా...

స్థలపురాణం
దేవతలు, మునులు, రుషులను బాధపెట్టిన శూరపద్ముడనే రాక్షసునితో ఉగ్రరూపుడిగా భీకర యుద్ధం చేపట్టి, వల్లీదేవిని వివాహం చేసుకునేందుకు బోయ రాజులతో తేలికపాటి పోరు ముగిసిన తరువాత స్వామి శాంతస్వరూపుడిగా కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుత్తణి కొండమీద తూర్పుదశలో వున్న ఆలయానికి ఇరుపక్కల రెండు పర్వత్రÔó ణులు వ్యాపించి వున్నాయి. ఉత్తరాన గల పర్వతం తెల్లగా ఉండడం వల్ల పచ్చిబియ్యపు కొండగా, దక్షిణం వైపున్న పర్వతం నల్లగా వున్నందున గానుగ పిండి పర్వతంగా పిలుస్తారు. ఈ కొండను చేరుకునేందుకు 365 మెట్లు వున్నాయి. తన తండ్రి పరమేశ్వరుని కొలిచేందుకు తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో వున్న శివలింగానికి కుమారేశ్వరుడని పేరు. దేవసేనను తిరుప్పరంకుండ్రంలోనూ, ఇంద్రుడి కుమార్తె వల్లీదేవిని తిరుత్తణికొండలోనూ వివాహం చేసుకుంటాడు.

వివాహం సందర్భంగా ఇంద్రుడు కానుకగా ఇచ్చిన గజరాజం ఆలయ వాకిలికి ముందు ధ్వజ స్తంభానికి ఆనుకుని ఇప్పటికీ దర్శనమిస్తుంటుంది. ఈ గజరాజాన్ని దర్శించుకున్నాకనే ఆలయంలోకి అడుగుపెట్టడం ఆచారం. ఇంద్రుడు ఇచ్చిన మరో కానుక గంధపు రుబ్బురాయి. కొండ ఆలయంలోని రెండవ ప్రాకారంలో యాగశాలకు ఎదురుగా వున్న ఈ రుబ్బురాతిలోనే నేటికీ స్వామివారి సేవలకు వినియోగించే గం«ధాన్ని తీస్తారు. మొదటి ప్రాకారానికి వెనుక వైపు బాలమురుగన్‌ సన్నిధిలో ఆరుద్ర దర్శనంలో బాలమురుగన్‌కు వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. ఆలయంలోని నాల్గవ ప్రాకారంలో నెలకొని వున్న మూలమూర్తి ఎడమ చేతిలో శూలంతో దర్శనమిస్తున్నాడు. స్వామివారికి ఇరువైపులా దేవసేన, వల్లీదేవతలకు వేర్వేరుగా సన్నిధులున్నాయి. ఈ ఆలయంలో నిర్వహించే ఏకాంత సేవలో ఒకరాత్రి వల్లీదేవితో, మరురాత్రి దేవసేనతో సుబ్రమణ్యస్వామి కొలువుదీరడం మరే ఆలయంలో లేని ప్రత్యేకత.

లక్ష రుద్రాక్ష మండపం
ఉత్సవర్లు కొలువుదీరిన లక్ష రుద్రాక్షమండపం ఈ ఆలయ ప్రత్యేకత. లక్ష రుద్రాక్షలతో రూపుదిద్దుకున్న పల్లకిలో నిత్యం వల్లీదేవీ, దేవసేన సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే షణ్ముఖర్, ఆపత్సహాయక వినాయకుడు, ఆది బాలసుబ్రమణ్యం, కుమారేశ్వరుడు, బైరవుడు తదితర సన్నిధులను కూడా కచ్చితంగా దర్శించుకోవడం నియమం.  

విశిష్ట ఉత్సవ వేడుకలు
సుబ్రమణ్యస్వామి కృత్తిక నక్షత్రంలో జన్మించడంతో ప్రతి కృత్తిక, మంగళవారం రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆషాఢంలో శరవణ పుష్కరిణిలో మూడు రోజులపాటు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కావిళ్లతో కొండకు వస్తారు. ముందుగా తలనీలాలు సమర్పించి శరవణ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మెట్లమార్గంలో ఆలయం చేరుకుని స్వామికి కావళ్లు చెల్లించి హుండీల్లో కానుకలు చెల్లించడం పరిపాటి.  

ఎలా వెళ్లాలంటే..?
అప్పట్లో తమిళ, తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న తిరుత్తణిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చారు. అయితే తమిళ భాషాభిమానులు చేపట్టిన ఉద్యమంతో తిరుత్తణి తమిళనాట అంతర్భాగంగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సరిహద్దులోని తిరుత్తణి చెన్నైకు 80 కిలోమీటర్లు, తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. చెన్నై నుంచి ముంబయి రైలు మార్గంలోని అరక్కోణం రైల్వే జంక్షన్‌కు పది కిలోమీటర్ల దూరంలో వుంది.
– చక్రాల నరసింహులు, సాక్షి, తిరుత్తణి (తమిళనాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement