చల్లని ఉపశమనం
వేసవిలో వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో తేమ తగ్గిపోయి చమటపట్టి చల్లదనం కోరుకుంటాం. ఇంట్లోనూ, ఒంట్లోనూ చల్లదనంతో ఉపశమనం పొందాలంటే...
♦ ఎండవేళలో చాలామంది పదే పదే ఫ్రిజ్ డోర్ తీసి చల్లని నీళ్లు తీసుకుంటూ ఉంటారు. దీంతో ఫ్రిజ్ మోటార్‌పై మరింత భారం పడుతుంది. మిగతా కాలాలతో పోల్చితే ఎండాకాలం నీళ్లు, పదార్థాలు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. పదే పదే డోర్ తీయడం వల్ల విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది.
♦ వేడి తక్కువ ఉండే ఉదయం, సాయంత్రాలు వంటలు చేయడం ముగించాలి. స్టౌ, ఓవెన్‌లు పగటి వేళలో ఉపయోగిస్తే ఇంట్లో వేడి శాతం పెరుగుతుంది. గ్రిల్, బొగ్గుల కుంపటి వంటివాటి మీద వండాలంటే బయట ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి.
♦ కిటికీలు, రూఫ్ మీద సోలార్ స్క్రీన్లను ఏర్పాట్లు చేసుకుంటే ఇంట్లో విద్యుత్ వాడకం తగ్గుతుంది. చల్లదనమూ పెరుగుతుంది.
♦ బయటివైపు కిటికీల మీద నుంచి ఏటవాలుగా ప్లాస్టిక్, కలప వంటి షీట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల సూర్య కిరణాలు నేరుగా ఇంటిలోకి రాకుండా అడ్డుకోవచ్చు.