ఎండ కూడా మంచిదే!
రెట్టింపు నీళ్లు శ్రేయస్కరం...
చలికాలం, వర్షాకాలం రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. అదే వేసవి కాలంలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలి. అప్పుడే చర్మం తన సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగలేం అనుకునేవారు మజ్జిగ, పండ్ల రసాల రూపంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు.
పదే పదే సబ్బు వాడకం వద్దు...
వేసవిలో పదే పదే ముఖాన్ని, చేతులను చల్లని నీటితో కడుక్కోవాలనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు పదే పదే సబ్బును ఉపయోగించడం వల్ల స్వేదరంధ్రాలలో ఉండే సహజసిద్ధమైన నూనె తొలగిపోతుంది. చర్మం తిరిగి నూనెను ఉత్పత్తి చేయడానికి తీసుకునే సమయం పెరుగుతుంది. లేదంటే కొన్ని నూనె గ్రంధులు నూనెను ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. దుమ్ము, ధూళి కణాలు ఆ నూనెపై చేరి, మొటిమలకు కారణం అవుతాయి. కాబట్టి రోజుకు రెండు సార్లు మాత్రం ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బుకు బదులు ఫేస్‌వాష్‌ను ఉపయోగించాలి. మిగతా సమయాల్లో చల్లని నీటితో మాత్రమే ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
వేసవిలో ఎండ వల్ల త్వరగా నీరసించిపోతామని భయపడతామే తప్ప ఈ కాలం కలిగించే ప్రయోజనాలను పట్టించుకోం. ఎండ వల్ల శరీరానికి తగినంత ‘డి’ విటమిన్ లభిస్తుంది. మిగతా కాలాల్లో నిస్తేజంగా ఉన్న చర్మం కూడా ఈ కాలం కాంతిమంతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు యవ్వనవంతమైన చర్మాన్ని ఈ కాలం సులువుగా పొందవచ్చు.
సన్‌స్క్రీన్ లోషన్ తప్పని సరి...
ఎండకాలం బయటకు వెళితే సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి నేరుగా తగులుతాయి. ఫలితంగా చర్మం కములుతుంది. దీని వల్ల చర్మ సౌందర్యమే కాదు ఆరోగ్యమూ దెబ్బతింటుంది. అందుకని సూర్యకాంతికి -చర్మానికి మధ్య అడ్డుతెరలా ఎస్.పి.ఎఫ్ 30 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ని తప్పనిసరిగా ఉపయోగించాలి. బయటకు వెళ్లడానికి పది-పదిహేను నిమిషాల ముందు ఈ లోషన్ రాసుకోవాలి.
స్క్రబ్బింగ్ మంచిదే!
వేసవిలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం. స్వేదరంధ్రాలలో మురికి, అధిక జిడ్డు. స్వేదరంధ్రాలలోని మురికి, జిడ్డు తొలగించకపోతే బ్యాక్టీరియా చేరి మొటిమలు, యాక్నె, బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. మచ్చలేని చర్మకాంతి సొంతమవ్వాలంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు ఇంట్లోనే చేసుకోదగిన స్క్రబ్బింగ్ పద్ధతులు మేలైనవి. సన్నని గోధుమ పొట్టు, పసుపు, పాలు స్క్రబ్‌కి మేలైన సాధనాలు. వీటిని కలిపి, ముఖానికి రాసి, మృదువుగా వలయాకారంగా రుద్దుతూ... పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందుతారు.
మేకప్ తొలగింపు తప్పనిసరి...: రాత్రి నిద్రించడానికి ముందు తప్పని సరిగా మేకప్ తొలగించాలి. లేకుంటే స్వేదరంధ్రాలు మూసుకుపోయి, మొటిమలు రావడానికి కారణం అవుతుంది. చర్మకాంతీ తగ్గుతుంది. అందుకని తప్పనిసరిగా మేకప్ తీసివేసి, మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్స్ రాసుకోని పడుకోవాలి.
వాటర్‌ప్రూఫ్ సౌందర్యం...
చలికాలం, వర్షాకాలం ఉపయోగిం చిన సౌందర్య ఉత్పత్తులనే ఈ కాలమూ ఉపయోగించడం చర్మానికి మంచిది కావు. అందుకని ‘ఆయిల్ ఫ్రీ’వి అందులోనూ ఎస్.పి.ఎఫ్ శాతం ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఎక్కువ ఫౌండేషన్ వాడకం వల్ల చర్మం త్వరగా నల్లగా కనిపిస్తుంది. అందుకని లిప్‌గ్లాస్, వాటర్‌ప్రూఫ్ ఐ లైనర్, మస్కారా ఉపయోగిస్తే చాలు ముఖారవిందం అందంగా కనిపిస్తుంది. చర్మం కాంతిమంతంగా కనిపించాలని క్రీమ్ ఫౌండేషన్లూ ఈ కాలం వాడకపోవ డమే మేలు. తప్పనిసరి మేకప్ ఉత్పత్తులను వాడేటట్ల యితే వాటర్‌ప్రూఫ్ సౌందర్య ఉత్పత్తులను ఉపయో గించడం మేలు.
కేశసంపదకు షాంపూ...
శరీరంలో శిరోజాలదీ ప్రత్యేకమైన స్థానమే. వెంట్రుక చిట్లడం, పొడిబారడం ఈ కాలం వేధించే ప్రధాన సమస్యలు. కురుల సంరక్షణకు ఉపయోగించే షాంపూ వంటి ఉత్పత్తుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఉత్పత్తులలో సల్ఫేట్ లేనివి ఎంచుకోవడం శ్రేయస్కరం.
మాయిశ్చరైజర్ తప్పనిసరి...
చర్మం ఎక్కువ జిడ్డు ఉండకూడదు. అలాగని వాతావరణ మార్పుల వల్ల పొడిబారకూడదు. దీనికి సరైన సమాధానం మాయిశ్చరైజర్‌తో మసాజ్. ముఖం, చేతులు కడుకున్న ప్రతీసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పడుకోవడానికి ముందూ పాదాలు, చేతులు, ముఖానికి తప్పనిసరి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ జాగ్రత్త వల్ల చర్మ కాంతి ఏమాత్రం తగ్గదు.