మాడుతోందా? | All nutrients should be taken to ensure a balanced diet | Sakshi
Sakshi News home page

మాడుతోందా?

Published Thu, May 23 2019 12:58 AM | Last Updated on Thu, May 23 2019 12:58 AM

All nutrients should be taken to ensure a balanced diet - Sakshi

ఎండాకాలంలో సూర్యుడికి దగ్గరగా ఉండేది మాడు. ఒక వయసు దాకా పర్వాలేదు గానీ ఎండల ప్రభావం మాడు మీద, జుట్టు మీద ఎక్కువగానే ఉంటుంది. వేడి పెరిగే కొద్దీ అపోహలు కూడా పేలుతూ ఉంటాయి. తికమకపడకుండా ఈ వాస్తవాలను తలకెక్కించుకోండి. మాడుకు అంటించుకోండి.

‘నడినెత్తికి మాడు అనే పేరెందుకొచ్చిందో?!’... అంటూ అడిగామనుకోండి. ‘ఎండలు మండిపోతూ ఉన్నప్పుడు మిట్టమధ్యాన్నం పూట బయటకు రాగానే తొలుత చుర్రుమనేది నడినెత్తి. అలా ఎండకు మొదటగా మాడిపోయేది అదే కాబట్టి దానికి మాడు అని పేరు పెట్టారేమో?!’ కాస్త సరదా, చిలిపిదనం ఉన్న పిల్లాడిలాంటి వారి నుంచి వచ్చే సమాధానం ఇలాగే ఉంటుంది. ‘నెత్తి మీద జొన్నల తవ్వ పెడితే అవి పేలాలై  పేలిపోతున్నాయి. తల మీద గొడుగో లేదా తువ్వాలైనా వేసుకో... అంటూ పెద్దవాళ్లు సలహా ఇస్తుంటారు. ఎండకు మాడే మాడును వేసవి నుంచి రక్షించుకోవడం ఎలాగో... ఈ సీజన్‌లో దానికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకోవడం కోసమే ఈ పది ప్రశ్నలూ... వాటికి సమాధానాలతో కూడిన ఈ కథనం.   

1 స్కాల్ప్‌ అంటే ఏమిటి...?
మనం తెలుగులో మాడు అని పిలిచే శరీర భాగాన్నే ఇంగ్లిష్‌లో స్కాల్ప్‌ అంటాం.  నిజానికి స్కాల్ప్‌ అనేది ఒక పదం కాదు. స్కాల్ప్‌ అంటే మిగతా అవయవాల్లాగా మాడుకు అది ఇంగ్లిష్‌ పేరు కాదు. మాడు మీది చర్మంలోని ఐదు భాగాల పేర్ల తాలూకు ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్‌’ అనే పదాన్ని రూపొందించారు. మన మాడుపైన మొదట చర్మం ఉంటుంది. అదే ఇంగ్లిష్‌లో స్కిన్‌. ఇలా స్కిన్‌లోని స్పెల్లింగ్‌ మొదటి అక్షరం అయిన ‘ఎస్‌’ను ముందుగా తీసుకున్నారు.

అలాగే వరసగా ఆ తర్వాత చర్మంలోని పొరలైన పేర్లలోని మొదటి అక్షరాలను ఒకదాని తర్వాత మరొకటి అమర్చారు. అంటే... సీ అంటే కనెక్టివ్‌ టిష్యూ అనీ, ఏ అంటే ఎపోన్యూరోటికా అనీ, ఎల్‌ అంటే లూజ్‌ ఏరియోలా అనీ, పీ అంటే పెరియాస్టియమ్‌ అనీ... ఆయా మాటలను ఆయా అక్షరాలు సూచిస్తాయన్నమాట. ఇలా స్కిన్‌ మొదలుకొని... పి అంటే పెరియాస్టియమ్‌ వరకు వరసగా ఉంటే పొరలకు ఉన్న పేర్ల తొలి అక్షరాలతో ‘స్కాల్ప్‌’ అనే మాట రూపొందింది.

2 ఎండవల్ల మాడుకు అనర్థాలు కలుగుతాయా?
మన మిగతా చర్మంతో పోలిస్తే మన మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్‌ గ్లాండ్స్‌ అనీ... ఆ నూనెను సీబమ్‌ అని అంటారు. ఈ సీజన్‌లో ఎండ ప్రభావం నుంచి మాడును రక్షించడానికి వాస్తవానికి స్రవించాల్సిన దానికంటే మరింత ఎక్కువ మోతాదులో  సీబమ్‌ స్రవిస్తుంటుంది. పైగా మిగతా చర్మం కంటే మాడులో ఈ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల కూడా స్రావాల పరిమాణం కూడా ఆ మేరకు పెరిగిపోతుంది. దాంతో వేసవిలో జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది.

పైగా జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్‌) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకే మిగతా సమయాలకంటే ఈ సీజన్‌లో తల జిడ్డుగా మారడం మరింత ఎక్కువ. ఇక ‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్‌కు మన తలపైన ఉన్న చర్మమే ఆవాసం. దానికి  ఈ ‘సీబమే’ ఆహారం. ఎండల్లో తిరిగేవారిలో సీబమ్‌ మోతాదు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఫంగస్‌ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అది చుండ్రుకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్‌ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్‌ డర్మటైటిస్‌’ అనే చర్మవ్యాధికి కారణమవుతుంది.

3 ఎండా, చెమటా కలిస్తే మాడు మీద డబుల్‌ ఇంపాక్ట్‌ ఉంటుందా?
ఎండలో మాడుపై సీబమ్‌ ఎలాగూ స్రవిస్తుంటుందన్న విషయం తెలిసిందే కదా. దానికి తోడు కొందరిలో వారి శరీర తత్వానికి అనుగుణంగా చాలా ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. దాంతో జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ ఏర్పడి... అక్కడ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్‌ ఫాలికిల్స్‌కు) ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. ఈ సమస్యనే ఇంగ్లిష్‌లో ‘ఫ్యాలిక్యులైటిస్‌’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్‌ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి మనల్ని నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.

4 ఎండ వల్ల కూడా జుట్టు రాలుతుందా?  
మాడుపై నేరుగా పడే ఎండ కారణంగా కొందరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్‌ టెలోజెన్‌ ఎఫ్లూవియమ్‌’ అని కూడా అంటారు. వీటితో పాటు కొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి వస్తుంటాయి.

5 ఎండలో హెల్మెట్‌ పెట్టుకుంటే మరింతగా జుట్టు రాలుతుందా?
ఎండవేళల్లో హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింతగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి హెల్మెట్‌... ఇటు జుట్టును, అటు మాడును ఎండ నుంచి రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని  కాలుష్యం నుంచి కూడా కాపాడుతుంది. దాంతో ఎండ వేళల్లో హెల్మెట్‌ పెట్టుకోని ద్విచక్రవాహనదారులతో పోలిస్తే హెల్మెట్‌ వాడే వారిలో జుట్టు రాలిపోకుండా ఉంటుందన్నమాట.

అయితే హెల్మెట్‌ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన గుడ్డను కాస్తంత లూజ్‌గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్‌ పెట్టుకుంటే... మన హెల్మెట్‌లోపలి భాగం చెమటతో తడిసిపోకుండా ఉంటుంది. దాంతో మాటిమాటికీ తడిసిన హెల్మెట్‌నే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పెట్టుకునే గుడ్డను తరచు ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉతికిన గుడ్డను వాడుకోవచ్చు. కానీ హెల్మెట్‌ను శుభ్రపరచుకోలేం కదా. అందుకే ఈ జాగ్రత్త.

6 ఎండ వల్ల వెంట్రుకలు మెరుస్తూ అందంగా కనిపిస్తాయా?
ఇది కూడా చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూ వాడి తలస్నానం చేశాక...  కాసేపు ఎండలో ఉంటే వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వాటిని డల్‌గా మార్చేస్తుంది. కురుల ఆరోగ్యాన్ని కోరుకునే వారు... నేరుగా ఎండపడే సమయంలో వెంట్రుకలకు రక్షణగా క్యాప్‌ ధరించడం మేలు. అది కాస్తంత వదులుగా ఉండే కాటన్‌ క్యాప్‌ అయితే మరింత మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్‌ క్యాప్‌ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.

7 ఎండవేళల్లో మాడు మాడకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
అవును కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.... ఎండలో మాడును రక్షించుకోవడంతో పాటు దాన్ని ఆరోగ్యంగానూ ఉంచుకోవచ్చు. అవి...
►మాడుపై సీబమ్‌ ఎక్కువగా స్రవిస్తున్నప్పుడు జుట్టు జిడ్డుగా మారుతుంది. దాంతో ఆ జిడ్డు కారణంగా అది మరింత డల్‌గా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.
►మన స్కాల్ప్‌ పైనున్న భాగం పీహెచ్‌ విలువ 5.5 ఉంటుంది. సరిగ్గా ఇదే పీహెచ్‌ ఉన్న షాంపూలను వాడితే మాడుకు మంచిది.
►చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్‌ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను సంప్రదించి... వారు సూచించే మందులను తీసుకోవాలి. వారు సూచించే జాగ్రత్తలను తప్పక పాటించాలి. చుండ్రు ఉన్నవారు కీటకెనజోల్‌ వంటి యాంటీఫంగల్‌ షాంపూను అవసరానికి అనుగుణంగా మెయింటెనెన్స్‌ ట్రీట్‌మెంట్‌లాగా వాడుకోవచ్చు. వారానికి ఒకసారి వాడుతూ ఉంటే ఎంతకాలం వాడినా దాంతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.
►అప్పటికే జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పెట్టడం అంత మంచిది కాదు.
►ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అందరికే మేలు.

8 మాడు రక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలేమైనా ఉంటాయా?
అవును... అన్ని పోషకాలు అందేలా సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాంతో మంచి వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దాంతో మాడుకు వచ్చే అనేక సమస్యల నుంచి మనకు నివారణ లభిస్తుంది. ఐరన్, జింక్‌ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారంతో జుట్టు మరింత అరోగ్యంగా ఉంటుంది.
►రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా  నీరు తాగడం వల్ల మాడు మీద చర్మంపైన  మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
►జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు  మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్‌ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి?

9 జుట్టును ఎలా దువ్వుకోవాలి?
►దువ్వుకొనే విధానంలో మార్పులతోనూ జుట్టును రక్షించుకోవచ్చా? అవుననే అంటున్నారు నిపుణులు. మీకు జుట్టు రాలకుండా ఉండాలంటే... మాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి.
►తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరగాలంటే మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.
►వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. అది మాడుకు మేలు చేస్తుంది.

10  మాడు విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
ఈ కింద పేర్కొన్న లక్షణాలతో మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహిస్తే... వెంటనే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
►మాడు మీద విపరీతంగా దురద పెడుతున్నప్పుడు
►ఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరిగినప్పుడు
►చీముతో కూడిన కురుపులు కనిపించినప్పుడు
►మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్‌లో పెచ్చులు వస్తున్నప్పుడు
►ఎండలో తిరిగినప్పుడల్లా ఎక్కువగా జుట్టు రాలిపోతున్నప్పుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement