బూతులు వినాల్సి వస్తుందేమో అనుకున్నా: సమంత | Super Deluxe star Samantha Akkineni | Sakshi
Sakshi News home page

చేమంత

Published Sun, Mar 31 2019 12:34 AM | Last Updated on Sun, Mar 31 2019 8:07 AM

Super Deluxe star Samantha Akkineni - Sakshi

ఏమంతా..!’ అనుకుంటున్నారా?చే, సమంతా మరి. అనుకోకుండా ఎలా ఉంటాం? కోడలు ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? అత్తమామలు ఎలా ఉండాలి? ‘ఇలాగే ఉండాలని’ పెళ్లికి ముందుఏమైనా ఫిక్స్‌ చేశామా? పెళ్లి.. ఫిక్సింగ్‌ కాదు. స్వేచ్ఛ ఇచ్చే బంధం.అలాంటి అనుబంధమే..నాగచైతన్య, సమంతలది.

శుక్రవారం తమిళ సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’ రిలీజైంది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తు న్నాయి. ముఖ్యంగా మీ నటనకు... కంగ్రాట్స్‌.
సమంత: థ్యాంక్యూ. ఈ అభినందనలు ఊహించ లేదు. నేను చేసిన పాత్రకు కచ్చితంగా సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తాయేమో? బూతులు వినాల్సి వస్తుందేమో? అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి సినిమా గురించి బాగా రాస్తున్నారు. ఆడియన్స్‌  సినిమాలో సమంతని చూడలేదు. వేంబు అని నేను చేసిన పాత్రను మాత్రమే చూశారు. అది నా విజయం అనుకుంటాను. రిస్క్‌ తీసుకుంటే కచ్చి తంగా ప్రయోజనం ఉంటుంది. ఆ రిస్క్‌ తీసుకున్నం దుకు చాలా సంతోషంగా ఉంది. 

ఈ సినిమాలో మీరు చేసిన పాత్రను మామూలు హీరోయిన్‌ చేయడం వేరు. కాని మీలాంటి పెళ్లయిన హీరోయిన్‌ చేయడం వేరు. ఆ రిస్క్‌ ఎలా తీసుకోగలిగారు?
సినిమా చూడనివాళ్లకు నేను తీసుకున్న రిస్క్‌ ఏంటో తెలియదు. నేను కూడా చెప్పను. థియేటర్లో చూడాల్సిందే. పెళ్లనేది ఒక అమ్మాయిని రిజర్వ్‌గా చేసేస్తుందన్నది చాలామంది అభి ప్రాయం. అయితే నా మటుకు నాకు పెళ్లి స్వేచ్ఛ నిచ్చింది. ఇంట్లో చాలా సెక్యూర్డ్‌గా ఉన్నప్పుడు స్త్రీ చాలా స్ట్రాంగ్‌ అవుతుంది.  నా ఫ్యామిలీ నేను చేసే సినిమాలను ఒప్పుకుంటూ, నన్ను సపోర్ట్‌ చేయడం వల్ల గట్స్, కాన్ఫిడెన్స్‌ వస్తాయి. ఇంకా విభిన్న పాత్రలు చేయాలనే ధైర్యం ఇస్తుంది.

ఓ నటిగా మీరు చేసే విభిన్న పాత్రలను వ్యక్తిగా మీకు అన్వయించి మిమ్మల్ని జడ్జ్‌ చేసే అవకాశం కూడా ఉంది కదా?
సమంత మంచి భార్య, మంచి వ్యక్తి, మంచి కోడలు. స్క్రీన్‌ మీద పాత్రను బట్టి కనిపించే సమంత వేరు. నిజ జీవిత సమంత వేరు. ఎన్ని రోజులని అవే బబ్లీ రోల్స్‌ చేస్తాం.  ప్రేక్షకులు సమంత అదే బోరింగ్‌ రోల్స్‌ చేస్తుంది అనుకోకూడదు. యాక్టర్‌గా నాకు ఆశ ఎక్కువ. పని చేయడం మొదలుపెట్టి 9 ఏళ్లయిపోయింది. ఇప్పుడు కూడా రిస్క్‌ తీసుకోక పోతే ఇంకెప్పుడు తీసుకుంటాం. ఆ రిస్క్‌ అప్పుడు చేసుంటే బావుండు అని బాధపడకూడదు. చాలెంజింగ్‌ పాత్ర ఏదైనా చేస్తే ‘ఈ సమంతని ఇన్ని రోజులు ఎక్కడ దాచారు?’ అంటారు. దాచడం కాదు, అలాంటి పాత్ర ఎవ్వరూ ఇవ్వలేదు. ఇంతకు ముందూ అదే సమంత. తేడా  అవకాశం రాకపోవడమే. ఉమెన్‌కు స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ వచ్చేదే తక్కువ. వచ్చినప్పుడు ప్రూవ్‌ చేసుకోవాలను కుంటాం.

‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలో మీ పాత్ర గురించి చైతన్యతో చెప్పారా? 
సినిమా అంగీకరించే ముందు చైతన్యతో చెప్పాను. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్ర ఇది... ఫస్ట్‌ సీన్‌ ఇలా ఉంటుంది.... చేయాలా? వద్దా? అని అడిగాను. తను వెనక్కి  తిరిగి అలా చూశారు. ఓకే.. నీకిష్టం అయితే చెయ్‌ అన్నారు. 

సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు మీ ఇద్దరి మధ్య యాక్టర్‌ – యాక్టర్‌ ఈక్వేషనే ఉంటుందా? 
లేదు. భార్యాభర్తల ఈక్వేషన్‌లోనే మాట్లాడు కుంటాం. 

విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇలా పర్మిషన్‌లు తీసుకోవడం ఏమైనా ఇబ్బందిగా  అనిపిస్తుందా? 
అలా అడగటాన్ని పర్మిషన్‌ తీసుకోవడం అనుకోను. నాగచైతన్య నా బెస్ట్‌ ఫ్రెండ్‌. భర్త నుంచి పర్మిషన్‌ తీసుకుంటున్నట్టు కాదు, నా నుంచి నేనే అనుమతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చైతన్యతో మాట్లాడేటప్పుడు వేరే మనిషితో మాట్లాడుతున్నట్టు ఫీల్‌ అవ్వను. నాతో నేనే మాట్లాడుకుంటున్నట్టు భావిస్తాను. మా రిలేషన్‌ షిప్‌ అలా ఉంటుంది. 

చైతన్య కూడా అలానే ఫీల్‌ అవుతారా?
ఊ.. అనుకుంటున్నాను. ఈ మధ్య మీరు గ్లామరస్‌ డ్రెస్‌ వేసుకున్నప్పుడు ‘అక్కినేని కుటుంబ పరువు తీస్తున్నావు’ అని సోషల్‌ మీడియాలో వినిపించిన కామెంట్స్‌కి ఏం చెబుతారు?
మనం వేసుకునే బట్టలు, చేసే పాత్రల వల్ల మన క్యారెక్టర్‌ని డిసైడ్‌ చేసుకుంటారు కొందరు. ఇలా కామెంట్‌ చేసేవాళ్లందరికీ ఏం చెప్పాలనుంటుందంటే.. నా హస్బెండ్‌ నాతో హ్యాపీగా ఉన్నాడు. మా అత్తమామలు సంతోషంగా ఉన్నారు.  కామెంట్‌ చేసేవాళ్లే అనవసరమైన తలనొప్పి తీసుకుంటున్నారు అనిపిస్తోంది.  అలాగే నేను వేసుకునే బట్టలు, నా పాత్రలు మాత్రమే నేను కాదు. వీటన్నింటినీ దాటి  నేనంటే ఇంకా చాలా ఉంటుంది కదా? అది అర్థం చేసుకోగలగాలి. నా వల్ల నా కుటుంబ ఫీల్‌ అయితే కచ్చితంగా ఆ పనులు చేయను. 

అంటే.. ‘ఇలాంటి డ్రెస్సులు వద్దు స్యామ్‌’ అని మీ ఫ్యామిలీ చెబితే వేసుకోరా?
100 శాతం పాటించేస్తాను. మా ఫ్యామిలీలో ఎవ్వరు చెప్పినా వింటాను. నా వ్యక్తిత్వం అలాంటిది. నాకు నచ్చని వాక్యం ఏదైనా ఉందంటే అది ‘నేను ఇంతే’ అనేది. ఎవ్వరూ కూడా నేనింతే అనుకోకూడదు. ఒక రిలేషన్‌షిప్‌లో కాంప్రమైజ్‌లు ఉంటాయి. మార్చుకోవాలి, మారాలి. నిన్న మామగారు (నాగార్జున) నాకు ఫోన్‌ చేసి ‘సూపర్‌ డీలక్స్‌ పెద్ద హిట్‌ అంట కదా. నువ్వు నాకేం చెప్పలేదు. ట్రైలర్‌ కూడా పంపించలేదేంటి?’ అని అడిగారు. ‘లేదు మీరు బిజీగా ఉంటారు కదా. డిస్ట్రబ్‌ చేయడం ఎందుకని’ అన్నాను. ‘నేను బిజీ అని నీతో చెప్పానా?’ అని సరదాగా మాట్లాడుకున్నాం. వాళ్ల అబ్బాయిలను సపోర్ట్‌ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్‌ చేస్తుంటారు. 

మీ స్టైలిష్‌ మామయ్యగారి ఏజ్‌ అస్సలు తెలియదు.. 
యస్‌.. వెరీ స్టైలిష్‌ మామయ్య. మా అత్తమ్మ వయసు కూడా తెలియదు. తను కూడా చాలా స్మార్ట్‌గా ఉంటారు. ఆ జీన్సే చైతన్యకు కూడా వచ్చాయి. ‘మజిలీ’లో స్కూల్‌ బాయ్‌లా కూడా బాగా సెట్‌ అయ్యారు. 45 నిమిషాలు పాటు ఆ లుక్‌లోనే ఉంటారు. 

పెళ్లయ్యాక అమ్మాయిలను ఉద్దేశించి ‘అత్తింటి పరువు కాపాడు’ అంటుంటారు. మరి.. పెళ్లయితే అమ్మగారి కుటుంబ పరువుకి, అమ్మాయికీ సంబంధం ఉండదా?
చిన్నప్పుడు మా అమ్మ అబ్బాయిలను, అమ్మాయిలను ఒకేలా పెంచారు. చైతన్య ఫ్యామిలీ కూడా అంతే. ఎవరి పరువు ఎవరూ తీయడానికి కుదరదు. వాళ్ల పరువు గురించి ఎవరికి వాళ్లు జాగ్రత్తపడాలి (నవ్వుతూ). నీ పరువు నువ్వు కాపాడుకోవాలి అంతే అని మా అమ్మ చెబుతారు, మా అత్తగారు కూడా చెబుతారు. మా అత్తగారు నా ఇన్‌స్టాగ్రామ్‌ (ఫోటో షేరింగ్‌ యాప్‌) లో నన్ను ఫాలో అవుతారు. అయ్యో.. మా అత్తగారు నా ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తారు. అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని అనుకోను. నా ప్రతి ఫొటో ఆమె చూస్తారు. ఆమె చూస్తారు కదా అని భయపడాల్సిన స్థితిలో నా కుటుంబం నన్ను పెట్టలేదు. ఇలాంటి  మానసిక ప్రశాంతత ప్రతి పెళ్లయిన అమ్మాయికి ఉండాలని కోరుకుంటాను. 

తమిళ హిట్‌ ‘96’ రీమేక్‌లో నటించబోతున్నారు? ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందనుకుంటున్నారా?
అదే దర్శకుడు కాబట్టి మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుంది అనుకుంటున్నాను. బ్యూటిఫుల్‌ స్క్రిప్ట్, మంచి పాత్ర అది. 

‘96’ సినిమా చాలా స్పెషల్‌.  రీమేక్‌ చేయకూడదు అని ట్వీటర్‌లో మీరే ఓసారి అన్నారు.  మీరే రీమేక్‌ చేస్తున్నారు? 
రీమేక్‌ చేయాలా వద్దా? సినిమా ఆడకపోతే అని త్యాగరాజ కుమారరాజా (‘సూపర్‌ డీలక్స్‌’ చిత్ర దర్శకుడు) గారిని అడిగాను. ‘సినిమా ఆడలేదు. నీకు పోయేదేంటి? కానీ ఈ సినిమా చేయకపోతే ఓ అద్భుతమైన పాత్ర కోల్పోతావు. మంచి దర్శకుడు, టీమ్‌తో వర్క్‌ చేసే ఫన్‌ జర్నీ అంతా మిస్‌ అవుతావు. ఆ 60 రోజుల హ్యాపీనెస్‌ని లూజ్‌ అవుతావా?’ అని సలహా ఇచ్చారు. వెంటనే సినిమా ఓకే చేశాను. 

జిమ్‌లో అంతంత హెవీ వెయిట్స్‌ ఎలా మోస్తున్నారు? 
స్ట్రాంగ్‌గా ఉండాలని. ఏ బరువైనా అమాం తంగా ఎత్తకూడదు. స్లోగా ఎత్తాలి. అప్పుడు రిస్క్‌ ఉండదు. 

ఫైనల్లీ జూనియర్‌ సమంత, జూనియర్‌ చైతూ ఎప్పుడు వస్తారు? మరో మూడేళ్ల లోపు అనుకోవచ్చా?
అమ్మో.. మూడేళ్లా? అంత దూరంలో లేదు (నవ్వుతూ).
– డి.జి. భవాని

►వెంకటేశ్‌గారి అమ్మాయి పెళ్లిలో మీ అత్తగారు, మీరు ఒకేలాంటి డ్రెస్‌ వేసుకున్నారు? అవును. కానీ అది ప్లాన్‌ చేసింది కాదు. లంచ్‌ తర్వాత నేను, అత్త కలిశాం. సర్‌ప్రైజింగ్‌గా ఇద్దరం ఒకటే డ్రెస్‌. ఆ డ్రెస్‌లు మ్యాచ్‌ అయినట్టే మా టేస్ట్, ఆలోచనా విధానం, నమ్మే విలువలు అన్నీ ఒక్కటే.

►ఆంటీ అని పిలుస్తారా? అత్తయ్యగారూ అంటారా?అమ్మా అని పిలుస్తాను. ఆవిడ నన్ను స్యామ్‌ అంటుంది. 

►పెళ్లయింది కదా ఇలా చేయకూడదు, అలా చేయకూడదనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. వినిపిస్తూనే ఉంటాయి. ఆ కామెంట్స్‌ ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి అనుకుంటున్నా. పెళ్లి తర్వాత ఓసారి షార్ట్‌ డ్రెస్‌ వేసుకున్నాను. అప్పుడు బాగా కామెంట్స్‌ వచ్చాయి. కానీ రోజు రోజుకి అవి తగ్గుతున్నాయి. ఆ తేడా నాకు కనిపిస్తోంది.

మా ప్రేమను చూపించే మజిలీ
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణదర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం వచ్చేనెల 5న విడుదల కానుంది. ‘మజిలీ’ గురించి సమంత చెప్పిన విశేషాలు.

నేనొక్కదాన్నే నటించేప్పుడు మానిటర్‌లో నా పాత్ర వరకే చూసుకునేదాన్ని. పెళ్లి తర్వాత చైతన్యతో కలసి నటించడంతో నా పర్ఫార్మెన్స్‌ కంటే కూడా తన పర్ఫార్మెన్స్‌నే ఎక్కువగా చూస్తున్నాను. చాలా ప్రొటెక్టివ్‌ భార్యలా ప్రవర్తిస్తున్నాను (నవ్వుతూ). క్లైమాక్స్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. యాక్టర్‌గా చైతన్య నెక్ట్స్‌ లెవల్లోకి వెళ్ళిపోయారు.పెళ్లి తర్వాత మేం కలసి నటిస్తే అంచనాలు ఉంటాయని తెలుసు. వాటిని చేరుకోగలమా అనుకున్నాం. మా పెళ్లయి రెండేళ్లయింది. మళ్లీ లవ్‌స్టోరీ చేస్తే ఎవరు చూస్తారు? అనుకున్నాం. పెళ్లి తర్వాత నేను చాలా పీస్‌ఫుల్‌ పర్సన్‌ అయ్యాను. చాలా మార్పు వచ్చింది. పెళ్లి తర్వాత ఉండే ప్రేమను ఎవరైనా చూపిస్తే బావుండూ అని అనుకుంటున్న సమయంలోనే ‘మజిలీ’ కథ వచ్చింది. వెంటనే ఓకే చేశాం.

►ఈ చిత్రంలో నేను పోషించిన శ్రావణి పాత్ర చాలా తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా స్ట్రాంగ్‌ అమ్మాయి తను. స్ట్రాంగ్‌ అనే క్వాలిటీలో శ్రావణితో నన్ను నేను పోల్చుకో గలను. కానీ తక్కువ మాట్లాడటమా? నో చాన్స్‌ (నవ్వుతూ).

►కథ చెప్పిన వెంటనే త్వరగా నిర్ణయం తీసుకుంటాను. స్క్రిప్ట్‌ నచ్చాక మార్పులు ఏమీ చెప్పను. నచ్చనప్పుడు ఎన్ని మార్పులు చేసి తీసుకువచ్చినా సినిమాను అంగీకరించలేను.

►ఇప్పటికే కొన్ని వేల ప్రేమకథలు చూశాం. ప్రేమ కథల్లో పాత్రలకు ఎంతగా కనెక్ట్‌ అవుతాం అన్నదాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.  ‘మజిలీ’ అనేది సినిమా కథలా అనిపించదు. ‘శ్రావణి, పూర్ణ, అన్షు’ అనే ముగ్గురి జీవితాలను వాళ్ల ఇంటి కిటికీలో నుంచి చూసినట్టుగా అనిపిస్తుం టుంది. రెండున్నర గంటల్లో ఫ్యామిలీ, లవ్, కుటుంబం... ఇలా అన్ని అంశాలను చూపించారు దర్శకుడు శివ నిర్వాణ. 

►ఆన్‌స్క్రీన్‌లో టచ్‌ అయినా, హగ్‌ అయినా, కిస్‌ అయినా ఒకేలా చూస్తాను. ఇందులో చైతన్య, దివ్యాన్షకు లిప్‌కిస్‌ సీన్‌ ఉంది. ఆ సీన్‌ ఉందని నాకు ముందు తెలీదు. ఆ సీన్‌ షూట్‌ చేసిన తర్వాత దర్శకుడు శివ, ‘నీకోటి చూపించాలి’ అంటూ చూపించాడు. ఆ సన్నివేశానికి ఆ కిస్‌ అవసరమైంది. గాళ్‌ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి కబుర్లు చెప్పరు కదా. అప్పుడప్పుడు ముద్దులు కూడా ఉంటాయి కదా. 

►ఈ సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి. జనరల్‌గా నేను ఎమోషనల్‌ సీన్స్‌లో గ్లిజరిన్‌ లేకుండా ఏడుస్తాను. అలా ఏడ్చినప్పుడే కంప్లీట్‌ యాక్టర్‌ అని భావిస్తాను. 

►స్పోర్ట్‌ బేస్డ్‌ సినిమాల్లో నటించాలని ఉంది. జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగారు అన్న కథల్ని యూనివర్శల్‌గా అంగీకరిస్తారు. అలాంటి స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ వస్తే కచ్చితంగా చేస్తాను. అలాగే పూర్తి స్థాయి కామెడీ చేసే పాత్ర చేయాలనుంది. ‘ఆఅ’లో కొంచెం కామెడీ చేశాను. ‘ఓ బేబీ’లో ఫుల్‌ కామెడీ చేశాను.

సమ్మర్‌లో నాకు మూడు రిలీజ్‌లు ఉన్నాయి. ఆల్రెడీ తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’ రిలీజైంది. తెలుగుల ‘మజిలీ’మరో వారంలో విడుదలవుతుంది. ‘ఓ బేబీ’ రిలీజ్‌ కూడా సమ్మర్‌లోనే ఉంటుంది. ఏప్రిల్‌ మొత్తం సమ్మర్‌ హాలిడేస్‌ నాకు. ఆ తర్వాత ‘96’ రీమేక్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement