Majili Movie
-
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
‘రొమాంటిక్’హోలీ.. రంగు పడింది.. ప్రేమ పుట్టింది
హోలీ వచ్చిందంటే ఆ సందడే వేరు. బంధువులు సన్నిహితులంతా ఒక్కచోట చేరి రంగుల్లో మునిగితేలుతూ సంబరాలు చేసుకుంటారు. ఆకాశంలోని ఇంద్ర దనుస్సు నేలకు దిగి వచ్చిందా అనేంతగా ప్రజలంతా రంగుల్లో మునిగిపోతారు. ఇక ఈ పండుగ ప్రత్యేకతను చాటుతూ వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ప్రేమికులను కలిపేందుకు ఈ హోలీ పండుగను వేదికగా మలిచిన ప్రేమ కథ చిత్రాలేన్నో. కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా… అంటూ కింగ్ నాగార్జున అందాల భామలను పడేశాడు. రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలాడు. రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ డార్లింగ్ ప్రభాస్ అందాల భామలతో సందడి చేశాడు. ఇలా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య సయ్యాటలు, పాటలకు ఈ రంగుల పండుగను చేర్చి మరితం ఆకర్షనీయంగా మలిచిన ఆ చిత్రాలేంటో ఓ సారి చూద్దాం! ‘మజిలి’లో చై-సామ్ హోలీ! ఈ సినిమా సమంత, హీరో నాగ చైతన్య చాటుమాటుగా ప్రేమిస్తుంది. క్రికెట్ ఆడుతూ తన స్నేహితులతో జాలిగా తిరుగుతున్న హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అతడి అల్లరి చూస్తూ మురిపోతుంటుంది. తన ప్రేమను చెప్పకుండా వన్ సైడ్ లవ్‌లో పడుతుంది. నేరుగా అతడికి ఎదురుపడేందుకు భయపడే సామ్ హోలీ పండగలో మాత్రం ఏకంగా హీరోకి చాటుగా కలర్ పూసి ఆనందపడిపోతుంది. అలా ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకు ఈ హోలీ పండుగ వేదికగా నిలిచింది. నాని-లావణ్యల ‘భలే భలే’ హోలీ భలే భలే మగాడివో చిత్రంలో నాని-లావణ్య త్రిపాఠిల ప్రేమలో కూడా హోలీ పండుగను చేర్చారు. రోడ్డుపై హీరోయిన్ చూసిన నాని అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వెంటనే మొట్ట మొదటి సారి అంటూ పాట వేసుకుంటాడు నాని. ఇక ఇందులో హీరోయిన్‌తో కలిసి హోలీ ఆడుతూ ఆమెతో ప్రేమ ఆటలు ఆడుతాడు. ఇక ఆ తర్వాత తన మతిమరుపు జబ్బు దాచి హీరోయిన్ ఎలాగోలా ప్రేమలో పడేస్తాడు. ఛార్మితో నాగ్ ‘మాస్’ హోలీ కింగ్ నాగార్జున కెరీర్లో హిట్ సినిమాల్లో ‘మాస్’ సినిమా ఒకటి. అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలతో తర్వాత నాగార్జున యూత్ మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2004లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మిలు హారోయిన్లుగా నటించారు. తన పగ కోసం చార్మి ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండేందకు వచ్చిన నాగ్ తన ఉనికిని ఎవరికి తెలియకుండ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో నాగ్ అపార్ట్మెంట్ వాసులకు దగ్గరయ్యేందుకు లారెన్స్ హోలీ పండగను వేదికగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ‘మాస్’లో ఛార్మితో ఆడిపాడాడు. ఈ పాట తర్వాతే ఛార్మీ నాగ్ ప్రేమలో పడుతుంది. రంగుల్లో భూమిక ప్రేమలో పడ్డ ‘వాసు’ తన ఫ్రెండ్‌ను కొట్టిన విలన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళతాడు వెంకటేశ్. అయితే అప్పుడే హీరోయిన్‌తో వెంకి ప్రేమలో పడతాడు. ఈ సీన్ ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు రంగుల పండుగను తీసుకున్నాడు డైరెక్టర్. విలన్లను కొట్టేందుకు వచ్చిన వెంకీ రంగుల మబ్బుల్లో చందమామల హీరోయిన్ వైట్ డ్రెస్‌తో ఎంట్రీ ఇస్తుంది. తనపై రంగుల పడకుండా నవ్వుతూ పరుగెడుతుంటే వెంకీ ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తునే ఉండిపోతాడు. అలా వైట్ డ్రెస్‌తో చందమామల మెరిసిపోయిన్ హీరోయిన్ భూమికతో లవ్‌లో పడతాడు. అమెరికాలో ‘దేవదాసు’ హోలీ సెలబ్రెషన్స్ రామ్-ఇలియాన వెండితెర ఎంట్రీ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఇండియాలో ఉండే రామ్ అమెరికా సెనెటర్ కూతురైన ఇలియానతో ప్రేమలో పడతాడు. ఇండియాకు వచ్చిన మధుతో లవ్‌లో పడ్డ హీరో తన ప్రేమను గెలిపించుకునేందుకు అమెరికాకు వెళతాడు. అక్కడ ఆమెను కలుసుకునేందుకు హోలీని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. షామిలిని పడేసేందుకు హోలీని అడ్డుపెట్టుకున్న సిద్దూ ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంబంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్‌గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేసి హీరో చివరకు ప్రేమ కథను ముగిస్తాడు. -
మజిలీ బ్యూటీతో నాగచైతన్య పెళ్లా? హీరోయిన్ ఏమందంటే..
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శోభిత దూళిపాళతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపించింది. అంతేకాదు మజిలీ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు హీరోయిన్గా ఛాన్స్ రావడానికి కూడా నాగ చైతన్యనే కారణమని, ఆయనే దివ్యాంశ పేరును రికమెండ్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా దివ్యాంశ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐ లవ్ నాగచైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీలో నాకు ఛాన్స్ రావడానికి చై కారణమంటూ వచ్చిన రూమర్స్‌లో కూడా నిజం లేదు' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. -
అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. ఫోటో వైరల్
సినిమా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌తో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలామంది కలలు కంటారు. అదే గనుక నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం వేద్. తెలుగులో మజిలీ చిత్రానికి రీమేక్ ఇది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లారు చిత్ర యూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్‌పైకి వచ్చి రితేష్‌తో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పింది. అభిమాని కోరిక మేరకు వెంటనే రితేష్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె ఆనందం తట్టుకోలేక ఏడుస్తూ అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు తాకడంతో అతని బిహేవియర్‌కు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రితేష్‌ను చూస్తే అర్థమవుతుందంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చైతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య విడిపోయి సుమారు 6నెలలు కావోస్తుంది. అయినప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా హల్చల్ చేస్తుంది. అసలు చై-సామ్ విడాకులకు సంబంధించి కారణాలు ఏంటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక విడాకుల తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. రీసెంట్గా చైని ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసేసింది. అయితే తాజాగా సామ్ విడాకుల అనంతరం తొలిసారిగా నాగచైతన్య ఫోటోని షేర్ చేసింది. అయితే ఇది పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది మాత్రం కాదు. ఇద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరి మజిలీ 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 3ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ పోస్టర్ని షేర్ చేసుకుంది. డివోర్స్ తర్వాత తొలిసారి సామ్ చై ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. -
యూట్యూబ్‌లో సత్తా చాటుతున్న ‘మజిలీ’ హిందీ వెర్షన్
పెళ్లి తర్వాత సమంత-నాగచైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. రీయల్ లైఫ్‌లోనే కాకుండా రీల్ లైఫ్‌లో కూడా చైతూ- సామ్‌లు కపుల్స్‌గా కనిపించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. శివనిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. 2019లో భారీ హిట్‌గా నిలిచిన ‘మజిలీ’ మూవీ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. కాగా ఈ చిత్రం హిందీలో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డబ్బింగ్ వెర్షన్‌కు యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ఈ హిందీ వెర్షన్ 100 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ ప్రస్తుతం ట్రెండ్ంగ్ జాబితాలో చేరింది. ఓ తెలుగు హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఈ స్థాయిల రెస్పాన్స్ రావడం అంటే సాధారణ విషయం కాదు. కాగా ఇటీవల సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్’ సీరిస్ ఓటీటీ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య అమిర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చధా’తో త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆలస్యమైంది. మరోవైపు నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు -
నువ్వు నా వాడివి, నేను నీ దానిని: సమంత
‘ఏ మాయ చేశావే’ సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్య- సమంత 2017 అక్టోబరు 6న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరొందిన చై- సామ్ మంగళవారం నాడు మూడో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన సామ్.. ‘‘నువ్వు నా వాడివి. నేను నీ దానిని, ఎల్లవేళలా కలిసే ఉంటూ జీవితంలోని అన్ని మలుపులను కలిసి స్వాగతిద్దాం. శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు’’అంటూ నాగ చైతన్యపై ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చై- సామ్‌లపై శుభాకాంక్షల వర్షం కురిసింది. అదే విధంగా చైతూ కజిన్ రానా దగ్గుబాటితో పాటు వ్యాపారవేత్త ఉపాసన వంటి సెలబ్రిటీలు సైతం వారిని విష్ చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా సామ్ నటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మరోసారి జంటగా నటించిన మజిలీ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు టైమ్ కేటాయించుకుంటూ.. వీలు చిక్కినప్పుడల్లా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఇటు పర్సనల్ లైఫ్‌ను, అటు ప్రొఫెషనల్ లైఫ్‌నూ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చైసామ్‌లు. . View this post on Instagram You are my person and I am yours , that whatever door we come to , we will open it together . Happy anniversary husband @chayakkineni ❤️ A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Oct 5, 2020 at 8:40pm PDT -
మరో చిత్రానికి పచ్చజెండా?
సినిమా: నటి సమంత కోలీవుడ్‌లో మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లేనా?.. అంటే అవుననే ప్రచారమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. 2019లో సక్సెస్‌పుల్ కథానాయకిగా కొనసాగిన నటి ఈ బ్యూటీ. తమిళంలో సూపర్‌డీలక్స్, తెలుగులో మజిలి, ఓ బేబీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళంలో సంచలన విజయాన్ని అందుకున్న 96 చిత్ర తెలుగు రీమేక్‌లో నటించి పూర్తిచేసింది. కాగా ఇప్పుడు తొలి సారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. దీ ఫ్యామిలీ మాన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. కాగా ఇటీవల చిత్రాల ఎంపికలో ఆచీతూచి నిర్ణయాలను తీసుకుంటూ వచ్చింది. తాజాగా మళ్లీ నటిగా వేగం పెంచినట్లు తెలుస్తోంది. తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇప్పటికే తాప్సీ హీరోయిన్గా గేమ్ ఓవర్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సరవణన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందనున్నట్లు సమాచారం. కాగా తాజాగా మరో చిత్రానికి సమంత పచ్చజెండా ఊపినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతకుముందు మలయాళ నటుడు నవీన్ పౌలీ హీరోగా రిచ్చీ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ రామచంద్రన్ కొత్త చిత్రానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇందులో నటి సమంత ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇదిచాలా ఆసక్తికరమైన కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందని టాక్. మరో విషయం ఏమింటే దీన్ని స్క్రీన్ సీన్స్ మీడియా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల సుందర్ సీ హీరోగా ఇరుట్టు చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శశికుమార్ హీరోగా ఎంజీఆర్ మగన్ చిత్రాన్ని, హరీశ్‌కల్యాణ్ హీరోగా ధారల ప్రభు అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా సమంత హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే చిత్రాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ద్వితీయ విఘ్నం దాటారండోయ్
ఇండస్ట్రీలో ఒక గమ్మల్తైన గండం ఉంది. ఫస్ట్ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా కూడా రెండో సినిమాకు తడబడుతుంటారు దర్శకులు. సినిమా భాషలో దీనికి ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీలో ఇది తరచూ కనిపించేదే. దర్శకులు మొదటి సినిమాతో ఎంతలా మెప్పించినా, రెండో సినిమాతో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు దర్శకులు మాత్రం సెకండ్ హిట్ కూడా ఇచ్చేస్తారు. అలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొందరు దర్శకులు ఈ ఏడాది తమ రెండో సినిమాతో వచ్చారు. కానీ ముగ్గురు దర్శకులు మాత్రం ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేశారు. ఈ ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ను సక్సెస్‌ఫుల్‌గా దాటేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ స్టోరీ. శివ మజిలీ ‘నిన్ను కోరి’ (2017) సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు శివ నిర్వాణ. ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని ముందుకు సాగించొచ్చు అని ‘నిన్ను కోరి’లో చెప్పారు. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, టేకింగ్, పాటలు, ఫెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా సక్సెస్ కొట్టింది. రెండో సినిమాగా టాలీవుడ్ యంగ్ కపుల్ నాగచైతన్య, సమంతలతో ‘మజిలీ’ తీశారు శివ నిర్వాణ. వివాహం తర్వాత చైతన్య, సమంత స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిదే. మనం కోరుకున్నవాళ్లు మనకు కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మనల్ని కోరుకునేవాళ్లూ మనకోసం ఉండే ఉంటారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు శివ. ఎమోషనల్ మీటర్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత గుర్తుంచుకునే చిత్రం అయింది. ప్రస్తుతం తన తొలి హీరో నానీతో ‘టక్ జగదీష్’ చేస్తున్నారు శివ. మళ్ళీ హిట్ మొదటి చిత్రానికి ప్రేమకథను ఎన్నుకున్నారు గౌతమ్ తిన్ననూరి. కథను చెప్పడంలో, కథను ఎంగేజ్ చేయడంలో తనదైన శైలిలో ‘మళ్ళీ రావా’ని తెరకెక్కించారు. ఇందులో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించారు. మన ఫస్ట్ లవ్ మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తే? ఆమెను వదులుకోకూడదనుకునే ఓ ప్రేమికుడి ప్రయాణమే ఈ సినిమా. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాగా నానీతో ‘జెర్సీ’ని తెరకెక్కించారు గౌతమ్. వందమందిలో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్కడి గురించి అందరూ చర్చించుకుంటారు. మిగతా 99 మందికి సంబంధించిన కథే ‘జెర్సీ’. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెటర్‌గా టీమ్‌లో సెలక్ట్ కావాలనుకున్న ఓ ప్లేయర్ కల నెరవేరిందా లేదా అనేది కథ. నాని కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా ఉండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. నో కన్ఫ్యూజన్ ‘దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు ‘మెంటల్ మదిలో’ తొలి సినిమా. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఏ సందర్భంలో అయినా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయ్యే మనస్తత్వం హీరోది. అలాంటి అతను లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకున్నాడన్నది కథ. హీరో కన్ఫ్యూజ్డ్ అయినప్పటికీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా బావుందనేశారు. దాదాపు అదే టీమ్‌తో ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కించారు వివేక్. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్. ప్రస్తుతం మూడో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులూ ద్వితీయ విఘ్నాన్ని దాటేశారు. ప్రస్తుతం మూడో సినిమా పనిలో ఉన్నారు. మూడో హిట్‌ని కూడా ఇస్తే ‘హ్యాట్రిక్ డైరెక్టర్స్’ అనిపించుకుంటారు. – గౌతమ్ మల్లాది -
తప్పులో కాలేసిన తమన్!
సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి తమన్ చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఓ ట్వీట్‌ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది. తాజాగా మరోసారి తప్పులో కాలేశాడు తమన్. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమన్ తన సోషల్ మీడియా పేజ్‌లో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఫేస్బుక్లో లీడ్ పెయిర్ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయటంపై సెటైర్లు పడుతున్నాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అయ్యింది. -
ఐ లవ్ యు 3000!
పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. ప్రేమికులుగా ఉన్నప్పుడు విజయాలు అందుకున్న ఈ జంట భార్యాభర్తలయ్యాక విజయం అందుకోవడం చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు. అయితే ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేలోపే ‘వెంకీమామ’ సెట్లో జాయినైపోయారు చైతూ. ఇప్పుడు టైమ్ దొరకడంతో సమ్మర్ వెకేషన్‌ని ప్లాన్ చేసుకున్నారు చైతూ అండ్ సామ్. నచ్చిన ఫ్లేస్‌లో నచ్చిన ఫుడ్ లాగిస్తూ, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. స్పెయిన్ వీధుల్లో ప్రేమ విహారం చేస్తున్నారు. దొరికిన హాలిడేని మనసారా అస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఓ ఫొటోలో ఓ ఫొటో పై ‘ఐ లవ్ యు 3000’ అని చైతూని ఉద్దేశించి పోస్ట్ చేశారు సమంత. ఇంతకీ ‘ఐ లవ్ యు 3000’ అంటే ఏంటో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా చూసినవాళ్లకు అర్థం అయ్యే ఉంటుంది. అందులో ఐరన్ మేన్‌ని అతని కుమార్తె ‘ఐ లవ్ యు 3000’ అంటుంది. అంటే.. బోలెడంత ప్రేమ అని అర్థం. సమంతకు కూడా చైతూ అంటే బోలెడంత ప్రేమ. అందుకే అలా అని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
పారితోషికం పెంచిందట
సినిమా: డిమాండ్ ఉంటే రేటు పెరుగుతోంది. ఇది వ్యాపార లక్షణం. నటన అనేది వృత్తి అయినా, సినిమా కూడా వ్యాపారమే కాబట్టి డిమాండ్ అండ్ సప్లై అనేది ఈ రంగంలోనూ వర్తిస్తుంది. అయితే ఇక్కడ విజయాలే కొలమానం. నటి సమంత ఇదే కొటేషన్‌ను పాటిస్తోంది. ఇతర కథానాయికలకు సమంతకు వ్యత్యాసం ఉంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి అయిన తరువాత సైడైపోతారు. ఒక వేళ మళ్లీ నటించడానికి సిద్ధం అయినా అక్క, వదిన లాంటి పాత్రలకే పరిమితం అవుతుంటారు. అయితే నటి సమంత మాత్రం పెళ్లయిన తరువాత కూడా హీరోయిన్గా రాణిస్తోంది. అదీ మరింత క్రేజీగా, సక్సెస్‌ఫుల్‌గా. నిజం చెప్పాలంటే వివాహానంతరమే సమంత కేరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన తెలుగు చిత్రం మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక తమిళంలో చాలా ధైర్యం చేసి నటించిన సూపర్ డీలక్స్ చిత్రంలోనూ తన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో చాలా చర్చనీయాంశ పాత్రలో నటించింది. ఇక వివాహానంతరం గ్లామరస్‌గా నటించడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం కూడా సమంత క్రేజ్ పెరగడానికి ఒక కారణం కావచ్చు. ఈ అమ్మడు ప్రస్తుతం ఇరానీ చిత్రానికి రీమేక్ అయిన ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. అదేవిధంగా తమిళంలో సంచలన విజయం సాధించిన 96 చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా మన్మధుడు–2 చిత్రంలో తన మామ నాగార్జునతో కలిసి నటించడానికి రెడీ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నటి సమంత ఇప్పటివరకూ రూ.2 కోట్లు పారితోషికం పుచ్చుకుంటుందట. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రూ.3కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. తన మామ నాగార్జునతో నటించనున్న మన్మధుడు–2 చిత్రానికి రూ.3 కోట్లు డిమాండ్ చేయగా నిర్మాతలు అందుకు ఓకే అన్నట్టు సమాచారం. -
అన్నకు హ్యాండిచ్చినా.. తమ్ముడు చాన్స్ ఇచ్చాడు!
అక్కినేని నటన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సక్సెస్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ తన నాలుగో సినిమా చేయనున్నాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్‌కు తొలి విజయాన్ని అందించేందుకు అల్లు అరవింద్ కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని భావించినా బడ్జెట్‌ను వీలైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో దేవీని పక్కన పెట్టేశారు. తరువాత తమన్ పేరు వినిపించినా ఫైనల్ గా గోపిసుందర్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమాకు నేపథ్యసంగీతం పూర్తి చేయకుండానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అలా అన్న నాగచైతన్యకు హ్యాండిచ్చిన సంగీత దర్శకుడు గోపి సుందర్‌ను తమ్ముడు అఖిల్ ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా తీసుకోవటం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
‘మజిలీ’ గ్రాండ్ థ్యాంక్స్ మీట్
-
మజిలీ సక్సెస్ నాకెప్పుడూ ప్రత్యేకమే: నాగచైతన్య
‘‘నా లైఫ్‌లో, నా కెరీర్లో నిజంగా ఒక క్రూషియల్ పాయింటాఫ్ టైమ్‌లో అందమైన పాత్రను, ఎప్పటికీ మరచిపోలేని సక్సెస్‌ను ఇచ్చాడు శివ నిర్వాణ. ఫ్యూచర్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కానీ, ఈ సక్సెస్ అన్నది నాకెప్పుడూ ప్రత్యేకమే. థ్యాంక్యూ సో మచ్ బ్రో’’ అని నాగచైతన్య అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్రాండ్ థ్యాంక్స్ మీట్’లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా సక్సెస్ అన్నది ఎవరో ఒకరి వల్ల అవదు. ఒక డైరెక్టర్ విజన్‌తో స్టార్ట్ అయి, ఆ విజన్‌ని నిర్మాతలు సపోర్ట్ చేసి, ఎంతోమంది నటీనటులు ఆ కథ విని ఓకే చేసి, ఆ తర్వాత సాంకేతిక నిపుణులు జాయిన్ అయ్యి, లాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండా జస్ట్ ట్రైలర్స్, టీజర్స్ చూసి, సినిమా కొని, ప్రేక్షకులకు అందించి.. ఫైనల్లీ ఒక మంచి హిట్‌ని అందుకుంటాం. ఈ ప్రాసెస్‌లో ఉన్న అందరూ ఈ రోజు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నా చివరి చిత్రాలు పెద్ద ఎంకరేజింగ్‌గా లేకపోయినా సాహు, హరీష్‌గారు నన్ను ప్రోత్సహించి, పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. చివరి నిమిషంలో తమన్ ఈ సినిమాని ఒప్పుకుని జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ... ‘‘శివ నిర్వాణ ‘మజిలీ’ ఐడియా చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అని దానయ్యగారితో అన్నాను. మంచి రైటింగ్, సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి, సినిమా కూడా ఇలాగే నేలమీదుండాలి.. అలాంటి కథలు తక్కువ అని శివకి చెప్పాను. వైజాగ్ నేపథ్యం, నటీనటులను ఎంచుకున్న విధానం బాగా నచ్చింది. ఒక్క సీన్లో నటించినవారు కూడా బాగా గుర్తుండిపోయారు. శివది ఎక్స్ట్రార్డినరీ వర్క్. నీలో ఓ చిన్న నొప్పి ఉంది. లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందేమో (నవ్వుతూ).. రావు రమేశ్, పోసానిగారులాంటి నటులు ఉండటం మా ఇండస్ట్రీ అదృష్టం. చైతన్యగారిని స్క్రీన్‌పై చూసినప్పుడు చాలా నిజాయతీగా కనిపిస్తారు. తన బలం, బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. నిజాయతీగా ఉండటం వల్ల ప్రతి పాత్ర ఆయన చేస్తుంటే గుర్తుండిపోతోంది. ‘మజిలీ’ సినిమా చూసినప్పుడు మీ నటనని నమ్మలేకపోతున్నాను. పూర్ణ (చైతన్య పాత్ర)ని చూస్తుంటే వైజాగ్‌లోని రైల్వే కాలనీలో నిజంగానే అలాంటి పాత్ర ఉందేమో అనిపించింది. సమంతగారు గ్రేట్ ఆర్టిస్ట్. ‘జనతా గ్యారేజ్’కి పనిచేశా. సాహు, హరీష్ మరెన్నో హిట్ సినిమాలు తీయాలి’’ అన్నారు. నటుడు రావు రమేశ్ మాట్లాడుతూ... ‘‘హిట్ అవుతుంది అనుకున్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఈ చిత్రంలో అన్ని పాత్రలను శివ నిర్వాణ ఎంతో ధైర్యంగా డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. ఫస్టాఫ్‌లో చైతన్య, దివ్యాంశ లవ్‌ట్రాక్ చూస్తే ‘టైటానిక్’ సినిమా చూసినట్టుంది. సెకండాఫ్‌లో చైతు, సమంత ట్రాక్ కూడా చాలా బాగా కుదిరింది’’ అన్నారు. నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... ‘‘పరుచూరి బ్రదర్స్ వద్ద నేను చెన్నైలో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్లేవాణ్ణి. సినిమా హిట్టయ్యాక నటీనటులు, సాంకేతిక నిపుణులకు షీల్డ్‌లు ఇచ్చేవారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ‘మజిలీ’ సినిమా హిట్ షీల్డ్ అందుకుంటుండటం హ్యాపీ. నాగచైతన్య.. నీ తొలి సినిమా ‘జోష్’లో నువ్వు బొమ్మలా ఉన్నావ్.. ఈ సినిమాలో అంతకు మించి ఉన్నావ్. కామెడీ, సెంటిమెంట్ పాత్రలు చేయాలని నాకు బాగా కోరిక. నాకు స్కూల్‌డేస్‌లో, యూనివర్శిటీలో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. నాకు పోలీస్, తండ్రి పాత్రలు నచ్చవు. కానీ, ఆ తండ్రి పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ‘టెంపర్’లో పోలీసు పాత్రతో ఎంత పేరొచ్చిందే, నా జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. ‘టెంపర్’ కి ఎంత పేరొచ్చిందో ‘మజిలీ, చిత్రలహరి’ సినిమాల్లో తండ్రి పాత్రలకు అంత పేరొచ్చింది’’ అన్నారు. ‘‘8రోజుల్లో ‘మజిలీ’ సినిమాకి నేపథ్య సంగీతం అందించాను. ఎంతో ప్రేమించి పనిచేశా’’ అన్నారు తమన్. శివ నిర్వాణ మాట్లాడుతూ... ‘‘ఇటీవల కొన్ని రోజుల వరకూ నాకు గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియదు. కానీ 15రోజుల నుంచి కొత్త కొత్త విషయాలు చూస్తున్నా. ఇన్ని కోట్లు వసూలు చేసింది సినిమా అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు వస్తుండటం, వసూళ్ల నంబర్స్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా చైతన్యగారికోసం చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆయనకి ఈ రేంజ్లో సక్సెస్ రావడం చాలా హ్యాపీ. చైతన్యగారిలో ఇంత మంచి నటుడు ఉన్నాడని అనుకోలేదు, చాలా బాగా చూపించారని చాలా మంది అన్నారు. ‘ఏమాయ చేసావే’ నుంచి తన నటనని నేను నమ్మాను. తనకు కరెక్ట్ పాత్ర పడితే తనకంటే న్యాయం చేసేవారెవరూ ఉండరని అనుకున్నా. ‘మజిలీ’ లో చైతన్య కాకుండా వేరే ఎవరైనా అయితే బాగుండని ఒక్కరూ అనలేదు. సినిమా చూస్తున్నప్పుడు సమంతగారికి నేను ఫ్యాన్‌గా మారిపోతున్నానేమో అనుకున్నా. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో ఆమె చాలా బాగా చేశారు. రేపంటూ ఒక కథ రాస్తే సమంతగారి లాంటి నటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాస్తా. ఈ సినిమాకి చైతన్య, సమంతగారు లైఫ్ ఇచ్చారు’’ అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రబృందాన్ని అభినందించారు.ట -
‘బాగా నటించకపోతే చైతన్యని తిడతాను’
ప్రతి మనిషి జీవితం పెళ్లికి ముందు.. తరువాతలా ఉంటుంది. అందుకు నటీమణులు అతీతం కాదు. ఈ నేపథ్యంలో సమంత కూడా పెళ్లికి ముందు ఆ తరువాత జరుగుతున్న విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం. ‘వివాహానంతరం మనసుకు ప్రశాంతత లభించింది. పెళ్లికి ముందు నేను నటించిన ప్రతి సన్నివేశాన్ని నేను మానిటరింగ్ చేసుకుని నటించేదాన్ని. బాగా నటించానా అన్నది నాకు నేనే పరిశీలించుకునేదాన్ని. వివాహానంతరం నా భర్త నాగచైతన్య నటించే సన్నివేశాలను మానిటరింగ్ చేస్తున్నాను. తగిన సలహాలు ఇస్తుంటాను. ఇదంతా చూసి నా భర్త నువ్వెందుకు కష్టపడతావు దర్శకుడు చూసుకుంటారుగా అని అంటుంటారు. అయినా నేను ఊరుకోను. భర్త గురించి ఆలోచించడం భార్య బాధ్యత అని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘వివాహానంతరం మా మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాం. మేమిద్దం సెలబ్రిటీలమే. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మాపై అభిమానుల అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి మంచి కథా చిత్రాల్లోనే కలిసి నటించాలన్నదే ఆ ఒప్పందం. అలా నటించిన చిత్రమే మజిలీ. ఇకపై కూడా వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయాలన్నదే నా కోరిక. నిజ జీవితానికి సినిమా జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నాగచైతన్య ఒక సన్నివేశంలో బాగా నటిస్తే ప్రశంసిస్తాను. ఆశించిన విధంగా నటించకపోతే తిట్టేస్తాను. ఇకపోతే నేను నటించే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటే ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కథలో తల దూర్చను. అదే కథ నచ్చకపోతే ఆ తరువాత ఎన్ని మార్చులు చేసినా నటించడానికి అంగీకరించన’న్నారు. ‘సినీనటిగా ఒక లక్ష్యాన్ని చేరుకున్నాను. సినిమా విషయంలో నా శ్రద్ధ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ అయ్యింది. ఐదారు చిత్రాల్లో ఒకే సారి నటించడం కంటే మంచి కథా చిత్రం ఒక్కటి చేస్తే చాలు అని భావిస్తున్నాను. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నా గురించి పలు విమర్శలు ప్రచారం అవుతున్నాయి. అయితే అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను. తమిళంలో నేను నటించిన సూపర్ డీలక్స్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నేను స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా నటించాను. దానిని పలువురు విమర్శిస్తున్నారు. నటిస్తున్నప్పుడు సహ నటుడిపై చేయి వేయడం, ముద్దు పెట్టడం, సన్నిహిత సన్నివేశాల్లో నటించడం, పాత్రకు తగ్గట్టుగా నటించడం నా వృత్తి. ఎందుకంటే నేను నటిని. నటించకుండా ఎలా ఉండగలను అని ప్రశ్నించారు. ‘ముందే చెప్పినట్లు, సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో నేను భావోద్రేకాలకు గురవ్వను. అలసిపోను. అందుకు విభిన్నంగా మజిలీ చిత్రంలో నటించాను. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నిజంగానే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేశాను. ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. నాకు ఒక క్రీడాకారిణిగా నటించాలన్నది ఆశ. అదే విధంగా దివ్యాంగురాలిగానూ నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు విరామం లేకుండా నటిస్తున్నాను. కాస్త నటనకు గ్యాప్ తీసుకుందామంటే సమంతకు అవకాశాలు లేవు అని ప్రచారం చేసేస్తారు. తమిళ చిత్రం ‘96’ రీమేక్‌లో నటించబోతున్నాను. ఇది మేలో సెట్‌పైకి వెళ్లబోతోంది. తాజాగా నటించిన ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని సమంత పేర్కొన్నారు. -
మై నేమ్ ఈజ్ అన్షూ...దివ్యాన్షు!
నాగచైతన్య ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఢిల్లీ సుందరి దివ్యాన్ష కౌశిక్. ‘‘స్టోరీలైన్ నచ్చితే చిన్నపాత్ర అయినా చేస్తాను’ అంటున్న దివ్యాన్షు తన గురించి తాను చెప్పుకున్న కొన్ని ముచ్చట్లు.... అమ్మా నాన్నా నేను మొదటిసారి నాగచైతన్యను కలిసినప్పుడు ‘‘నా పేరు దివ్యాన్షు’’ అని పరిచయం చేసుకున్నాను. నా పేరులోని చివరి అక్షరాలతో ‘మజిలీ’లోని నా పాత్రకు ‘అన్షూ’గా పేరు పెట్టారు. ఇంట్లో నన్ను ‘అన్నీ’ అని పిలుస్తారు. అమ్మ ‘అనూ’, నాన్న ‘అశ్విన్’ నా పేరులో ధ్వనిస్తారు! నాటకాలు వేశాను మా అమ్మ ఢిల్లీలో పేరున్న మేకప్–ఆర్టిస్ట్, బ్యూటీ ఎడిటర్. ఆమె నిరంతర విద్యార్థి. ఇప్పటికీ ఫ్యాషన్ వరల్డ్‌కు సంబంధించి కొత్త కోర్సులు చదువుతూనే ఉంటుంది. ఢిల్లీలో అమ్మతో పాటు షూట్స్‌కు వెళుతుండేదాన్ని.‘‘మీ అమ్మాయి బాగుంది. సినిమాల్లోకి తీసుకురావచ్చు కదా’’ ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. ఈ సంగతి ఎలా ఉన్నా ముస్సోరిలోని బోర్డింగ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో డిబేట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నాటకాలు వేసేదాన్ని. అయితే నటనను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. భవిష్యత్‌లో మేక్‌ప్–ఫీల్డ్‌లో పనిచేయాలని అనుకునేదాన్ని. అమ్మకు ఢిల్లీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో స్పా, సెలూన్‌ను ఉన్నాయి. ఆ సినిమా చూసిన తరువాత... ‘కబీ ఖుషీ కబీ ఘమ్’ సినిమాలో కరీనాకపూర్‌ను చూసిన తరువాత యాక్టర్ కావాలని డిసైడైపోయాను.అంతకుముందు జర్నలిస్ట్ కావాలని, ఒక పత్రికకు ఎడిటర్ కావాలని అనుకునేదాన్ని!అప్పట్లో కాస్త లావుగా ఉండేదాన్ని.సినిమాల్లో నటించాలనే ఆలోచన వచ్చిన తరువాత...‘‘అసలు ఈ బరువుతో సాధ్యమేనా?’’ అనే సందేహం వచ్చింది. ఆ తరువాత మాత్రం బరువు తగ్గడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఆమెతో మళ్లీ పనిచేయాలని ఉంది! యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో పనిచేస్తున్నప్పుడు కాస్టింగ్, ఫిల్మ్‌మేకింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకున్నాను. మోటర్‌సైకిల్ కమర్షియల్ పదిమంది దృష్టిలో పడేలా చేసింది. ఆ సమయంలోనే డైరెక్టర్ శివ నిర్వాణ ‘‘తెలుగు ఫిల్మ్ అడిషన్‌కు ఆసక్తి ఉందా?’’ అని అడిగారు. ఉంది అన్నాను. సెలెకై్టపోయాను. ముఖ్యవిషయం ఏమిటంటే నేను సమంతకు పెద్ద ఫ్యాన్. మక్కీ(ఈగ) సినిమా చాలాసార్లు చూశాను. ఆమెతో మళ్లీ పనిచేయాలని ఉంది. -
నా హార్ట్ ఇక్కడే ఉంది
‘‘మజిలీ’ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాం. ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ అది ఓ డ్యామేజ్‌లా ఉండిపోతుంది. అందుకే ఎలాగైనా వర్కౌట్ అవ్వాలనుకున్నాం. పెళ్లితర్వాత కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్ పడ్డాం. మంచి స్పందన వచ్చినందుకు ఇప్పుడు హ్యాపీ’’ అని నాగచైతన్య, సమంత అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ ముఖ్య తారలుగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘మజిలీ’. ఈ నెల 5న విడులైంది. శనివారం చైతూ, సమంత ఇద్దరూ కలిసి చెప్పిన ‘మజిలీ’ కబుర్లు. ► మీకు కెరీర్లో విడి విడిగా హిట్స్ ఉన్నాయి. కంబైన్డ్‌గా ఉన్నాయి. ‘మజిలీ’ హిట్ ఎంత స్పెషల్? సమంత: మోర్ స్పెషల్. పెళ్లి తర్వాత ఈ సినిమా హిట్ మాకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సరైన సమయంలో సరైన సినిమాతో సరైన హిట్ వచ్చిందనుకుంటున్నాను. కథ విన్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో స్పెషల్ జరుగుతోందనే భావన మనసులో ఉంది. అదే ఫీల్‌ని, స్పెషల్‌ని ఆడియన్స్ కూడా ఫీలై మాకు మంచి విజయం అందించారు. వారికి ధన్యవాదాలు. ► సమంత మీ లక్కీఛార్మ్ అని మరోసారి ప్రూవ్ అయిందని నమ్ముతారా? (సమంత అందుకుంటూ....) ఆయనే నాకు ఇంకా లక్కీఛార్మ్. ఎందుకంటే... మ్యారేజ్ తర్వాత నా యాక్టింగ్ కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తోందన్న ఫీలింగ్ కలుగుతోంది. చైతన్య: లక్కీఛార్మ్ అనడం కన్నా సపోర్ట్ అంటాను. సక్సెస్ టైమ్‌లో సపోర్టివ్‌గా చాలామంది ఉంటారు. ఫెయిల్యూర్స్ అప్పుడు సపోర్ట్ చాలా ముఖ్యం. ► పెళ్లి తర్వాత కలిసి నటించడానికి బాగా ఆలోచించారా? మళ్లీ నటిస్తారా? చైతూ: యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఓ సినిమా చేద్దామని మా అంతట మేము ఏ దర్శక–నిర్మాతలను సంప్రదించలేదు. దర్శకుడు శివ భార్యాభర్తల కథతో మా దగ్గరకు రావడం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ఎలా అయితే మ్యాజిక్ జరిగిందో అలాగే భవిష్యత్‌లో జరిగితే తప్పకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. ‘మనం’ చిత్రానికి కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ► పూర్ణ (చైతూ పాత్ర పేరు) క్యారెక్టర్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూసినప్పుడు ఒక ప్రేక్షకురాలిగా మీరెలా ఫీల్ అయ్యారు? సమంత: చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. యాక్టర్‌గా చైతన్యలో పెద్ద గ్రోత్ కనిపించింది. ఒక సినిమా చేసేప్పుడు ఈ సీన్ బాగా చేశాను.. ఈ సీన్ బాగా వచ్చిందని ఫీలింగ్ కలగవచ్చు... కానీ ఫైనల్ ప్రొడక్ట్ చూసేప్పుడు అలా అనిపించకపోవచ్చు. ఈ సినిమాలో నేను లేని సీన్స్‌ను వెండితెరపై చూసినప్పుడు షాక్ అయ్యాను. యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్స్‌లో చైతన్య మంచి వేరియేషన్ చూపించారు. అద్భుతంగా నటించారు. ► సెకండాఫ్‌లో చైతూని సమంత టేకోవర్ చేశారని అంటున్నారు? చైతూ: నా క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి కారణం సినిమాలో సమంత చేసిన శ్రావణి క్యారెక్టరే. లవ్‌స్టోరీలో హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్‌స్క్రీన్ అయినా పూర్ణ క్యారెక్టర్‌కు సామ్ మంచి సపోర్ట్. తను ఒప్పుకోదు కానీ క్లైమాక్స్ కంప్లీట్‌గా తనదే. సమంత: అలా ఏం లేదు (నవ్వుతూ). ► ఈ సినిమాలో చైతూకి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చారు. చైతూతో మీకు పెళ్లి అయ్యాక.. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? చైతూ: నా బర్త్‌డేకి ఓ స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చింది. సమంత: అవును.. బైక్ ఇచ్చాను. ► ఈ సినిమా సక్సెస్ గురించి నాగార్జునగారి రియాక్షన్? సమంత: సడన్‌గా ఇంటికి వచ్చేశారు (నవ్వుతూ). చైతూ: ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్యామిలీలో కొంతమందికి చూపించాను. షో అయ్యాక ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎర్రబారిన కళ్లతో తలదించుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. నాకు నిజంగా అర్థం కాలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి రియాక్షన్ చూశాం. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మాట్లాడలేకపోయారని తర్వాత అర్థమైంది. నెక్ట్స్డే మార్నింగ్ ఫోన్‌చేసి అందరూ మాట్లాడారు. సినిమా బాగుందని అభినందించారు. ఫస్ట్‌టైమ్ నాన్నగారికి లేట్‌గా సినిమా చూపించాను. ఆర్ఆర్ లేట్ అవ్వడం వల్ల ముందే చూపించలేకపోయాను. కథ కూడా అంతగా నాన్నగారికి తెలీదు. ► సాధారణంగా నాగార్జునగారు మీ సినిమాల రషెస్ చూస్తుంటారు. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమాను మీకే వదిలేయడం వెనక కారణం ఏంటి? చైతూ: ‘ఏదైనా ఒక పాయింట్ నచ్చినప్పుడు నువ్వు చేసెయ్. నా దగ్గరకు తీసుకు రావొద్దు’ అని ఎప్పట్నుంచో నాన్నగారు చెబుతున్నారు. ‘నీ ఆత్మవిశ్వాసం, నీ నిర్ణయంపై ముందుకు సాగిపో’ అని చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు నాకు ఒక్క డౌట్ కూడా లేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా? అనే ఆలోచన రాలేదు. ఎటువంటి డౌట్ లేనప్పుడు మన జడ్జ్‌మెంట్‌ని ఓసారి పరీక్షించుకుందాం అనుకున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కథ వినమని నాన్నగారికి చెబుతాను. సమంత: నాకు డౌట్ వచ్చింది. కానీ ఇది చాలా మంచి స్క్రిప్ట్. డైరెక్టర్‌కు సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ ఉండాలి. అది శివగారిలో కనిపించింది. ► మీ కెరీర్లో హయ్యస్ట్ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్ (50కోట్లు) ఈ సినిమాకు వచ్చాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చైతూ: చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒప్పుకునే ముందు ఇంత వసూలు చేయాలి, అంత వసూలు చేయాలని పెద్దగా ఆలోచించను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమా ఫస్ట్‌వీక్ కలెక్షన్స్‌తోనే అందరూ ప్రాఫిట్ జోన్లోకి వచ్చారంటుంటే సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్స్ పట్ల అభిమానులు, ఫ్యాన్స్ ఇంకా ఎగై్జటెడ్‌గా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా. ప్రాఫిట్‌తో పాటు సక్సెస్ వస్తే అది అల్టిమేట్ కాంబినేషన్ అవుతుంది. సమంత: ఇంట్లో కలెక్షన్స్ నేను చూసుకుంటాను. ► ఎలక్షన్ టైమ్‌లో కూడా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం గురించి.... చైతూ: స్టార్టింగ్‌లో కొంచెం టెన్షన్ పడ్డాం. సమ్మర్ ఫస్ట్ ఫిల్మ్ తప్పకుండా అడ్వాంటేజ్ ఉంటుంది, రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రోత్సహించారు. సినిమా బాగుంటే ఆడియన్స్ సపోర్ట్ తప్పకుండా ఉంటుందన్నారు. ► ‘మజిలీ’ సినిమా తర్వాత ఫస్ట్‌టైమ్ నాగార్జున గారు మీ ఇంటికి వచ్చారు అన్నారు? అంటే ఇంతకుముందు సినిమాలకు రాలేదా? సమంత: చెప్పి వస్తారు. ఆహ్వానిస్తే వస్తారు. కానీ చెప్పకుండా వచ్చారు. చైతూ: ఆ రోజు సడన్‌గా మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడున్నారు? వస్తున్నాను? అని చెప్పి వచ్చేశారు. అలా ఎప్పుడూ రాలేదు. సమంత: చాలా కష్టపడి సినిమా చేశాం. ఆడియన్స్, అభిమానులకు నచ్చింది. కానీ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం వేరు కదా. ► సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ చూశారా? చైతూ: ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే కథ చెప్పింది. అందుకే పెద్దగా షాక్ అవ్వలేదు. స్టెప్ బై స్టెప్ యాక్టర్‌గా నేను ఇప్పుడే గ్రో అవుతున్నాను. భవిష్యత్‌లో తప్పకుండా ఇలాంటి సినిమాలు చేస్తాను. ► ఒకవేళ ‘సూపర్ డీలక్స్’ లాంటి సినిమా చేయొద్దని చైతన్య చెబితే మీరు ఏం చేస్తారు? సమంత: ఆయన అలా చెప్పరని నాకు తెలుసు. పెళ్లి తర్వాత నా నిర్ణయాలు, నా కాన్ఫిడెన్స్ పట్ల నాకు మరింత నమ్మకం కుదిరింది. ఆ నమ్మకానికి కారణం ఇంట్లోని పరిస్థితులే. చైతూ ప్రోత్సాహం. తెలియకుండానే నాకో బలం వచ్చింది. ► ‘మజిలీ’లో ఓ సీన్లో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు. నిజంగా ఆడటం వచ్చా? సమంత: నాకు పెద్దగా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలని మాత్రం ఉంది. ► మీరు తమిళంలోకి ఎప్పుడు వెళ్తున్నారు? చైతూ: నాకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నతనంలో తమిళ సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేశాను. కానీ నా హృదయం ఇక్కడే ఉంది. ఏమో... నటుడిగా ఇక్కడ ఇంకా చాలా ఆకలిగా ఉన్నాను. చాలా హిట్స్ ఇవ్వాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ప్రస్తుతానికి మనసు టాలీవుడ్‌పైనే ఉంది. ► బైలింగ్వల్ సినిమా ఆలోచన ఉందా? చైతూ: అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. కానీ ప్రస్తుతం తెలుగే. ► ‘యు–టర్న్, ఓ బేబి’... ఇటీవల ‘96’ ఇలా రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతున్నట్లున్నారు? సమంత: రీమేక్స్ అంటే కాస్త రిస్కే. ఇవన్నీ మంచి సినిమాలు. అందుకే నో చెప్పలేకపోయాను. హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథలకు నో చెప్పడం నాకు ఇష్టం లేదు. ► చైతూతో పెళ్లికి ముందు ‘ఏ మాయ చేసావె, మనం, ఆటోనగర్‌సూర్య’ సినిమాలు చేశారు. తాజాగా ‘మజిలీ’. అప్పటి చైతూకి, ఇప్పటి చైతూకి యాక్టింగ్‌లో వచ్చిన తేడా ఏంటి? సమంత: నాకు తెలిసిన చైతన్య ఎందుకు స్క్రీన్‌పై కనిపించడం లేదనే ఫీలింగ్ ఉండేది. అవుట్‌సైడ్ చైతన్య మాటలు, ప్రవర్తన, లుక్స్ అమేజింగ్‌గా ఉంటాయి. అది ‘మజిలీ’ సినిమాలో స్క్రీన్‌పై నాకు కనిపించింది. తన రియల్ పర్సనాలిటీని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇక యాక్టర్‌గా తను చాలా పరిణితి చెందారు. చైతన్యలో బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘ఏ మాయ చేసావె’ టు ‘మజిలీ’ ఒక పర్సన్‌గా, యాక్టర్‌గా చాలా పాజిటివ్‌గా మారారు. ► ‘బంగార్రాజు’ ఎంతవరకు వచ్చింది? ఇంకా స్క్రిప్టింగ్ జరుగుతోంది. జూలై నుంచి స్టార్ట్ చేయవచ్చు. నేను, నాన్నగారు కలిసి చేస్తాం. ► ‘ఏ మాయ చేసావె’ సినిమా టైమ్‌లో చైతన్యను చూసి ఇన్నోసెంట్ అనుకున్నారా? లేక హ్యాండ్సమ్ అని ఫీల్ అయ్యారా? సమంత: నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇన్నోసెంటే (నవ్వుతూ). అప్పుడు నాకు తెలుగు రాదు. చాలా పెద్ద స్క్రిప్ట్. ఎప్పుడూ డైలాగ్స్ చదువుతూనే ఉండేదాన్ని. సెట్లో ప్రతి రోజూ షివరింగే. గౌతమ్ మీనన్‌గారు కట్ కూడా చెప్పరు. ‘ఏ మాయ చేసావె’ అప్పుడే వేరే ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. చైతూ: నాకు ఫొటో చూపించారు. అమ్మాయి చాలా బాగుంది. హీరోయిన్గా పెట్టుకుందాం అనుకున్నాం. కట్ చేస్తే చెన్నైలో లుక్ టెస్ట్. ► నాగార్జునగారి ‘మన్మథుడు –2’లో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని తెలిసింది. నిజమేనా? సమంత: అవును... చేస్తున్నాను. ► సమ్మర్ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారు? చైతూ: ఈ నెలాఖరు వరకు ‘వెంకీమామ’ షూటింగ్ ఉంది. మే ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేద్దామనుకుంటున్నాం. సమంత: నాకు వెకేషన్ తప్పకుండా కావాలి. ఈ సినిమా విషయంలో ఇంతవరకు ఎప్పుడూ ఫీల్ అవ్వని స్ట్రెస్ ఫీల్ అయ్యాను. -
మరోసారి చైతూ - సామ్!
రీల్ పెయిర్‌గా సక్సెస్ అయి తరువాత రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ పెయిర్ అనిపించుకున్న జంట నాగ చైతన్య, సమంత. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట తరువాత మనం, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. సక్సెస్‌ను పక్కన పెడితే చైతూ సామ్‌ల కెమిస్ట్రీకి మాత్రం ఫుల్ మార్కపడ్డాయి. తాజాగా మజిలీ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేశారు ఈ జోడి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ ఘన విజయం సాధించటమే కాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటింది. దీంతో మరో సినిమాలో కలిసి నటించేందుకు చైతూ, సమంతలు రెడీ అవుతున్నారట. 2019లోనే వీరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మరోసారి అక్కినేని జంట మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. -
వసూళ్లలో దూసుకెళ్తోన్న ‘మజిలీ’
నాగ చైతన్య, సమంత రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌నే.. రీల్ లైఫ్‌లో పోషించిన మజిలీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. సమంత, నాగచైతన్యల నటనకు విమర్శకులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. ‘నిన్ను కోరి’ సినిమాతో హిట్ కొట్టిన శివ నిర్వాణ.. మరో అందమైన కథతో మజిలీని తెరకెక్కించాడు. గత వారం విడుదలైనా కూడా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్ అవుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు సమాచారం. చైతన్య కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డు సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో మరో హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. -
మజిలీ నుంచే మొదలు!
ఇటీవల కాలంలో సినిమాల థియేట్రికల్ రైట్స్‌తో డిజిటల్ రైట్స్ పోటిపడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోవటంతో వాటి మధ్య పోటి నెలకొంది. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాల డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే డిజిటల్లో ప్రదర్శించుకునే ఒప్పందం చేసుకుంటున్న అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో మూవీస్ లాంటి సంస్థలు థియేటర్ల ఆక్యుపెన్సీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లపై ఆంక్షలు విధించారు. సినిమా విడుదలైన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిబంధన మజిలీ సినిమా నుంచే ఆచరణలోకి వచ్చింది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. -
‘మజిలీ’ దర్శకుడితో విజయ్
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డియార్ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు విజయ్ దేవరకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్నుకోరి సినిమా తరువాత మజిలీతో మరో హిట్ సాధించిన శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాలతో అలరించిన శివా.. విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి. -
నా లైఫ్‌లో మజిలీ స్పెషల్ జర్నీ
‘‘చాలా రోజుల తర్వాత నటుడిగా ‘మజిలీ’ చిత్రం సంతృప్తినిచ్చింది. ఈ మూవీ నా లైఫ్‌లో స్పెషల్ జర్నీ’’ అన్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడులైంది. ‘మజిలీ’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు నేను ఏయే అంశాలకు కనెక్ట్ అయ్యానో అవే అంశాలకు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. శివను నేను నమ్మాను. శివ నన్ను నమ్మాడు. పోసానిగారు, రావురమేష్‌గారు కో–స్టార్స్‌గా బాగా సపోర్ట్ చేశారు. సినిమాలోని శ్రావణి క్యారెక్టర్ లాంటి మంచి భార్య కావాలని సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూశాను. నిజంగానే నాకు శ్రావణి లాంటి అమ్మాయి వైఫ్‌గా దొరికింది. శ్రావణి క్యారెక్టర్‌ను సమంత బాగా చేసింది. దివ్యాంశా కౌశిక్ బాగా నటించారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే తట్టుకోలేను. ఈ సినిమా ఫలితం పట్ల వారు హ్యాపీగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నా రిలీజ్ రోజు ఏదో చిన్న టెన్షన్. సాహుగారు ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని చెప్పారు. అరగంటసేపు ఏడ్చాను. స్ట్రెస్ అంతా పోయింది. ‘ఏ మాయ చేశావె’ తర్వాత ‘మజిలీ’ నాకు స్పెషల్ మూవీ. నాగ్‌మామ డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి అభినందించారు. చైతూ భార్యగా గర్వపడుతున్నాను’’ అని సమంత అన్నారు. ‘‘ఒక సినిమా మంచి సినిమాగా నిలవడం వేరు, కమర్షియల్‌గా విజయం సాధించడం వేరు. కానీ ఈ రెండింటినీ ‘మజిలీ’ చిత్రం సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్‌గా డైరెక్టర్‌కి ఫోన్ చేసి సినిమా రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కింద లెక్క. చైతూగారు నన్ను బాగా నమ్మారు. నిర్మాతలు బాగా సహకరించారు. వీరితోనే మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమాతో చైతన్య ఎంత మంచి నటుడో అందరికీ తెలిసింది. సమంత నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు, నాలుగు లొకేషన్స్తోనే ప్రపంచం అంతా సినిమా చూపించాడు శివ. ఇలాంటి కథను నాకు ఇచ్చి ఇంత బాగా తీయమంటే నేను తీయలేను’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సెట్లో నాగచైతన్య చాలా కూల్‌గా ఉంటారు. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించారు. సమంత, దివ్యాంశ బాగా చేశారు. బాధ కలిగించే అంశాలను కమర్షియల్‌గా స్క్రీన్‌పై బాగా చూపించారు శివ’’ అన్నారు రావు రమేష్. దివ్యాంశా కౌశిక్ మాట్లాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సక్సెస్ జోష్‌లో ‘మజిలీ’
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ మూవీపై హైప్ ఏర్పడింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం అందర్నీ మెప్పించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, శివ నిర్వాణ, పోసాని మురళీకృష్ణ, రావు రమేష్‌లు పాల్గొన్నారు. ఈ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 21కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తోంది. -
‘మజిలీ’ మూవీ రివ్యూ
టైటిల్ : మజిలీ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్, రావూ రమేష్ సంగీతం : గోపి సుందర్ నేపథ్య సంగీతం : తమన్ దర్శకత్వం : శివా నిర్వాణ నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మాస్ యాక్షన్ జానర్లో తెరకెక్కించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్ డ్రామానే ఎంచుకున్నాడు చైతూ. అంతేకాదు తన రియల్ లైఫ్ పార్టనర్‌తో కలిసి రీల్ లైఫ్‌లో మరో సక్సెస్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన సినిమా మజిలీ. మరి ఈ సినిమా అయినా చైతూ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? కథ : పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువుతూ ఎలాగైన రైల్వేస్ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు. ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల కారణంగా పూర్ణ.. శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్నా.. ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. చివరకు పూర్ణ, శ్రావణికి ఎలా దగ్గరయ్యాడు? పూర్ణలో మార్పుకు కారణం ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా నాగచైతన్య ప్రతీ సినిమాకు పరిణతి సాదిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్‌లో యువకుడిగా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్ పర్ఫామెన్స్తో మెప్పించాడు. తొలి పరిచయంలోనే దివ్యాంశ కౌశిక్ మంచి నటనతో ఆకట్టుకుంది. కేవలం సెకండ్ హాఫ్‌లోనే కనిపించినా సమంత తన సూపర్భ్ పర్ఫామెన్స్తో అందరినీ డామినేట్ చేసేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో సమంత నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ : నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్ డ్రామానే ఎంచుకున్నాడు. ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు మరోసారి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్.. చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, ఫ్రెండ్స్ తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్‌గా కథ నడిపించాడు. అయితే అక్కడక్కడ కథనం నెమ్మదించటం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. గోపి సుందర్ అందించిన పాటలు కథలో భాగం వచ్చిపోతూ అలరిస్తాయి. తమన్ తన నేపథ్య సంగీతంతో సీన్స్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మా కోసం కథ రాయమని అడగలేదు
‘‘నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రొమాన్స్ జానర్లో ఆడియన్స్ నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలు వచ్చినప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. హానెస్ట్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ కూడా ఉండాలి. ప్రస్తుతం రొమాన్స్ జానర్ నా ఫేవరెట్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘మజిలీ’. సమంత, దివ్యాంకా కౌశిక్ కథానాయికలుగా నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► నేను, స్యామ్ (సమంత) కలిసి ‘ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్ సర్య’ సినిమాలు చేశాం. అన్నీ ప్రేమకథలే. మా వివాహం తర్వాత విభిన్నమైన కథ ప్రయత్నిస్తే బాగుంటుందనుకున్నాం. సరిగ్గా అలాంటి స్క్రిప్ట్‌నే శివ తీసుకుని వచ్చాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాల్లో ఉండే ఎత్తుపల్లాలు ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి అంశాలతో కూడిన చిత్రం ‘మజిలీ’. ఇలాంటి చిత్రం మా దగ్గరకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ► నాకు, స్యామ్‌కి కథ రాయమని నేను శివను అడగలేదు. శివ తొలి సినిమా ‘నిన్ను కోరి’ చూశాను. నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌ను శివ హానెస్ట్‌గా డీల్ చేయడం పట్ల ఇంప్రెస్ అయ్యాను. అలాంటి సినిమాలంటే నాకు ఇష్టం. మంచి కథ ఉంటే సినిమా చేసే ఆలోచన ఉందని శివతో అన్నాను. ఓ రెండు నెలల తర్వాత శివ ‘మజిలీ’ స్టోరీ లైన్ చెప్పారు. బాగా ఎగై్జట్ అయ్యాను. అప్పుడే స్యామ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సినిమాలో ఓ హీరోయిన్గా స్యామ్‌ను సజెస్ట్ చేసింది శివనే. కథపై దాదాపు 7 నెలలు వర్క్ చేశాం. ఈ ప్రాసెస్‌లో నేను, శివ మంచి మిత్రులైపోయాం. హీరో, డైరెక్టర్ రిలేషన్‌షిప్‌ను బాగా ఎంజాయ్ చేశాను. పూర్ణ క్యారెక్టర్ చేయడం కూడా నాకు ఈజీ అయింది. ► స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్‌కి బాగా హార్డ్‌వర్క్ చేయాలనుకున్నాను. సినిమాలోని పూర్ణ పాత్ర కోసం శివ నన్ను బాగా ప్రిపేర్ చేశాడు. నిజానికి నాకు బ్యాట్ పట్డుకోవడం కూడా రాదు. నాలుగు నెలలు కష్టపడి క్రికెట్ నేర్చుకున్నాను. మ్యాచ్‌లు ఆడలేను కానీ కెమెరా ముందు ఆడతాను. అలాగే పూర్ణ క్యారెక్టర్లో ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని డైట్ ఫాలో అయ్యాను. ► కొత్త హీరోయిన్ అయితే స్నేహం పెరగడానికి కాస్త టైమ్ పడుతుంది. స్యామ్తో అలా కాదు. మంచి కంఫర్ట్, అండర్స్టాండింగ్ ఉంటుంది. తప్పులు అర్థమైపోతాయి. ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ కోసం ఇంట్లో కాస్త డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాం. కానీ సాధారణంగా 9–6 వర్క్ మోడ్‌లో ఉంటాం. సాయంత్రం 6కి ఆఫ్ అయిపోతాం. కొత్త కథలు వచ్చినప్పుడు భవిష్యత్‌లో ఇద్దరం కలిసి ఇంకా సినిమాలు చేస్తాం. ► సినిమాలో శ్రావణి క్యారెక్టర్‌ను స్యామ్ చేయడం ప్లస్సే. మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. స్యామ్ తనకంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. అది తన స్వభావం. నాకు నిజంగానే మంచి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికింది. ► ఇప్పటివరకు నేను చేసిన 60 శాతం సినిమాల్లో... ఇది కరెక్ట్‌గా వెళ్తుందా? మనం ఫస్ట్ అనుకున్న కథనే తీస్తున్నామా? ఎక్కువ మార్పులు చేశామా? అనే ఆలోచనలు వచ్చాయి. అది నా నటనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం డౌట్ ఉంటే నాకు తెలిసిపోతుంది. ఈ సినిమా చేసేప్పుడు నాకు డౌటేమీ లేదు. ► ‘మజిలీ’లాంటి స్క్రిప్ట్‌ని ఓకే చేయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. నాకు, సమంతకు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా. మన బేనర్లో మీ ఇద్దరితో కలిసి నేను ఎందుకు తీయలేదు? అని నాన్నగారు కూడా ఓ సందర్భంలో అన్నారు. నాన్నగారు ఇంకా సినిమా చూడలేదు. ► కొన్ని సినిమాలు బాగా ఆడతాయనుకున్నాను. ఆడలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. వైఫల్యాలను తట్టుకుని జీవి తంలో ఎలా నెగ్గుకు వస్తాం అన్నదే ముఖ్యం. సినిమాలోని పూర్ణ క్యారక్టర్ కూడా అలానే ఉంటుంది. సమంత తమిళంలో నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. సమంతనే కాదు. అందరూ బాగా నటించారు. కథ నచ్చితే ఇలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► రేసింగ్ నాకు ఇష్టమైన స్పోర్ట్. ప్రజెంట్ ‘క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ’ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. రేసింగ్‌పై సినిమా గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలెంజింగ్‌గా ఉంది. ఈ నెల 8నుంచి ‘వెంకీమామ’ సెట్లో జాయిన్ అవుతాను. జూలై కల్లా షూటింగ్‌ను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాన్నగారు ‘సోగ్గాడే చిన్నినాయనా’ రెండో పార్టును ప్లాన్ చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటే ఆగస్టులో సెట్స్‌కు వెళ్లిపోతాం. ఇంకా కథలు వింటున్నాను. -
నాకా ఆందోళన లేదు
‘‘నేను చేసింది రెండు సినిమాలే (నిన్ను కోరి, మజిలీ). నేను ఎప్పుడూ రెండోసారి కథ చెప్పలేదు. సింగిల్ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే అవుతుంది. ఆ తర్వాత టీమ్‌తో ఆ కథ గురించి చర్చలు జరుపుతా’’ అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్ కథానాయికలుగా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. ► ‘నిన్ను కోరి’ చిత్రానికి మంచి అభినందనలు వచ్చాయి. రవితేజ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌గార్లు మాట్లాడారు. ఇలాంటి పాయింట్‌తో కథ చెప్పి ఎలా ఒప్పించావ్? అని ఎక్కుమంది అన్నారు. నేను ఒప్పించడం కాదు. నానీగారు ఒప్పుకోవడం గొప్ప అన్నాను. ► ఆ తర్వాత నాగచైతన్యగారు ఫోన్ చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడా ప్రేమకథ ఏమైనా ఉంటే చెప్పమన్నారు. 20 రోజుల తర్వాత ఐడియాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘మజిలీ’ సినిమా తట్టింది. ‘క్రికెట్.. ప్రేమ.. పెళ్లి’ అనే మూడు అంశాలను తీసుకుని మిడిల్ క్లాస్ డ్రామాతో క్లబ్ చేయాలనే ఆలోచనలోంచి ఈ సినిమా కథ వచ్చింది. సింగిల్ నరేషన్లో చైతన్యగారు ఒప్పుకున్నారు. 19 ఏళ్ల కుర్రాడిలా, 34 ఏళ్ల వ్యక్తిలా ఇలా చైతన్యను స్క్రీన్‌పై ఎలాగైనా చూపింవచ్చు. అది కూడా ప్లస్ అయ్యింది. అలా ‘మజిలీ’ ప్రయాణం మొదలైంది. ‘నిన్ను కోరి’ లవ్‌స్టోరీ. ‘మజిలీ’ మాస్ లవ్‌స్టోరీ అని చెప్పగలను. వెంట వెంటనే సేమ్ జానర్లో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ‘నిన్ను కోరి’ కంటే ‘మజిలీ’ చిత్రానికి ఎక్కువ కష్డపడ్డాం. ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ముగ్గురు (చైతన్య, సమంత, దివ్యాంక) ఒక ఫ్రేమ్‌లో ఉండరు. అదే ‘నిన్ను కోరి’కి, మజిలీ సినిమాకు డిఫరెన్స్. డేట్స్ క్లాష్ వల్ల సంగీత దర్శకుడు గోపీసుందర్‌గారు రీ–రికార్డింగ్ చేయలేకపోయారు. ఆ తర్వాత తమన్‌గారు వచ్చారు. బాగా చేశారు. ► క్రికెటర్ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. నా సినిమాల్లో నా రియల్‌లైఫ్, నా స్నేహితుల జీవితాల్లోని సంఘటనలు ఉంటాయి. సెన్సిబుల్ కథలను నిర్మాతలు అర్థం చేసుకుంటే ఇంకా మంచిసినిమాలు వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రనిర్మాతలు బాగా సహకరించారు. ► సమంతగారు ఎప్పుడూ బాగా నటిస్తారు. కానీ చైతన్య ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. చైలో ఎంత సామర్థ్యం దాగి ఉందో స్క్రీన్‌పై తెలుస్తుంది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. ► ట్రైలర్లో గమనిస్తే ఓ షాట్లో చైతన్యకు సమంత గొడుగు పడుతుంది. అది ఇంట్రవెల్లో వస్తుంది. ‘నిజజీవితంలో నిజంగా అలాంటి భార్యలు ఉంటారా?’ అని చాలామంది అడిగారు. మనకు తెలియదు కానీ మన∙లైఫ్‌లో మన వైఫ్లు మన కోసం నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం గుర్తించం అంతే. అయితే అందరూ గొడుగులు పట్టక్కర్లేదు. అది చెప్పడానికే ట్రై చేశాను. ► వెధవలకు మంచి పెళ్లాలే దొరుకుతారు అనేది పూర్ణ పాత్రను పోసానిగారు చూసిన దృష్టికోణంలోనిది. అది జనరలైజ్ చేసి చెప్పింది కాదు. నటీనటుల ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించను. థియేటర్లోకి ప్రేక్షకులు వెళ్లాక కథలో నాగచైతన్య గుర్తుంటే నేను ఫెయిలైనట్లే. పూర్ణ గుర్తు ఉంటే నేను సక్సెస్ అయినట్లు. ► నా తొలి సినిమా ‘నిన్ను కోరి’ సక్సెస్ అయ్యింది. రెండో సినిమా జాగ్రత్త అని చాలామంది అన్నారు. కానీ నాకా ఆందోళన లేదు. ఈ రెండో సినిమా దాటేస్తే... మూడో సినిమా ఫ్లాప్ కొట్టినా.. పర్లేదా.. నాలుగో సినిమా వస్తుందా? అని అడిగాను. రెండు కథలను పక్కన పెట్టేలా చేసింది ఈ సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ► ప్రస్తుతం నా దగ్గర ఒక కామెడీ, ఓ యాక్షన్ థ్రిల్లర్ కథలు రెడీగా ఉన్నాయి. ఏది చేస్తాను అనేది ‘మజిలీ’ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘‘ఏ మాయ చేసావె’ సినిమా చూసినప్పుడు చైతు, సమంత చక్కటి జంట అనుకున్నా. ‘మనం’ సినిమాలో వీళ్లిద్దరూ నాతో కలిసి నటించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నాకు అప్పుడు తెలియదు. నాకు ఏమాత్రం తెలియకుండా సైలెంట్‌గా రొమాన్స్ చేస్తున్నారని ఆ తర్వాత తెలిసింది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. గోపీ సుందర్ స్వరాలు అందించారు. ఇందులోని తొలి నాలుగు పాటలను నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్లు పరశురామ్, బాబీ (కె.ఎస్.రవీంద్ర), సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను వెంకటేశ్ ఆవిష్కరించారు. పాటల సీడీని వెంకటేశ్ విడుదల చేసి నాగార్జునకు అందించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్లో ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు’ అనే డైలాగ్ విన్నప్పుడు బాధ కలిగింది. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. కానీ, నేను చెప్పేది సినిమా చూడకముందు. కానీ, సినిమా చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి, మంచి అమ్మాయి దొరికిందనిపించింది. ఏప్రిల్ 6న మాకు మంచి ఉగాది అవుతుంది. ‘మజిలీ’ ట్రైలర్ చూస్తుంటే రెండుసార్లు కన్నీళ్లొచ్చాయి. సినిమా ఇంకెంత బావుంటుందో’’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ‘సినిమా చూసిన తర్వాత అందరూ చైతూని కౌగలించుకుంటారని’ శివ నిర్వాణ అన్నాడు. నేను ట్రైలర్ చూడగానే కౌగలించుకుంటున్నాను. శ్యామ్, చైతూ, దివ్య చాలా బాగా చేశారు. ఏప్రిల్ 5న ఫ్యాన్స్ ఉగాది పండగను భారీగా చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో చైతూ, శ్యామ్ అద్భుతంగా నటిస్తారు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘శివగారు ఈ సినిమా గురించి అడగ్గానే నాకు ఓకే అనిపించింది. శ్యామ్.. నాకు ఇంకో హీరోయిన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. నాన్న, వెంకీమామ నా పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్యామ్, నేను పెళ్లి తర్వాత ఇంత త్వరగా కలిసి సినిమా చేస్తామనుకోలేదు. నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్లల్లో శివ హానెస్ట్ ఫిల్మ్ మేకర్. వ్యక్తిగా కూడా నిజాయతీపరుడు. తనతో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. సాహు, హరీష్ చాలా మంచి నిర్మాతలు. నాకు, శ్యామ్‌కి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ సినిమాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కామ్‌గా ఉన్నాం. ‘మజిలీ’ చూసి ఎవరూ అసంతృప్తికి లోనవరు’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘నాగార్జున, వెంకటేశ్‌గార్ల వల్ల ఒక పాజిటివ్ నమ్మకం వచ్చింది. వాళ్ల ప్రభావం మా మీద చాలా ఉంది. ప్రతి లవ్ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటుంది. ‘మజిలీ’ నిజమైన లవ్‌స్టోరీ. ‘ఏమాయ చేసావె, మనం’ తర్వాత ‘మజిలీ’ నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకు శివగారికి ధన్యవాదాలు. మా ఆయన గురించి నేనే చెబితే బాగోదు. కానీ, ఏప్రిల్ 5 తర్వాత అందరూ చెబుతారు. నేను అది విని ఆనందిస్తాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత జానర్ మారుద్దామనుకున్నా. అప్పుడు నాగచైతన్యగారు ఫోన్ చేసి ‘నీ సినిమా నచ్చింది. నీకు నచ్చిన కథ ఉంటే తీసుకురా చేద్దాం’ అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. 20 రోజుల తర్వాత వచ్చిన ఓ ఐడియాని చైతన్యగారి దగ్గరకు వెళ్లి చెప్పా. సినిమాని మార్కెట్ చేసుకోవాలని చైతన్య, సమంతని పెట్టలేదు. వాళ్ల నటనను గౌరవించి పెట్టా. సమంతగారితో ఎన్ని సినిమాలకు పని చేయడానికైనా నేను సిద్ధమే. అటు ఎలక్షన్, ఇటు ఐపీయల్ ఉన్నా అంతకుమించిన కిక్కు మా సినిమాలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మా చైతన్యగారు, సమంతగారు అందించిన సపోర్టు మరువలేనిది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. నిర్మాత హరీశ్, కథానాయిక దివ్యాంశ కౌశిక్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుక
-
బూతులు వినాల్సి వస్తుందేమో అనుకున్నా: సమంత
‘ఏమంతా..!’ అనుకుంటున్నారా?చే, సమంతా మరి. అనుకోకుండా ఎలా ఉంటాం? కోడలు ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? అత్తమామలు ఎలా ఉండాలి? ‘ఇలాగే ఉండాలని’ పెళ్లికి ముందుఏమైనా ఫిక్స్ చేశామా? పెళ్లి.. ఫిక్సింగ్ కాదు. స్వేచ్ఛ ఇచ్చే బంధం.అలాంటి అనుబంధమే..నాగచైతన్య, సమంతలది. శుక్రవారం తమిళ సినిమా ‘సూపర్ డీలక్స్’ రిలీజైంది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తు న్నాయి. ముఖ్యంగా మీ నటనకు... కంగ్రాట్స్. సమంత: థ్యాంక్యూ. ఈ అభినందనలు ఊహించ లేదు. నేను చేసిన పాత్రకు కచ్చితంగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తాయేమో? బూతులు వినాల్సి వస్తుందేమో? అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి సినిమా గురించి బాగా రాస్తున్నారు. ఆడియన్స్ సినిమాలో సమంతని చూడలేదు. వేంబు అని నేను చేసిన పాత్రను మాత్రమే చూశారు. అది నా విజయం అనుకుంటాను. రిస్క్ తీసుకుంటే కచ్చి తంగా ప్రయోజనం ఉంటుంది. ఆ రిస్క్ తీసుకున్నం దుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మీరు చేసిన పాత్రను మామూలు హీరోయిన్ చేయడం వేరు. కాని మీలాంటి పెళ్లయిన హీరోయిన్ చేయడం వేరు. ఆ రిస్క్ ఎలా తీసుకోగలిగారు? సినిమా చూడనివాళ్లకు నేను తీసుకున్న రిస్క్ ఏంటో తెలియదు. నేను కూడా చెప్పను. థియేటర్లో చూడాల్సిందే. పెళ్లనేది ఒక అమ్మాయిని రిజర్వ్‌గా చేసేస్తుందన్నది చాలామంది అభి ప్రాయం. అయితే నా మటుకు నాకు పెళ్లి స్వేచ్ఛ నిచ్చింది. ఇంట్లో చాలా సెక్యూర్డ్‌గా ఉన్నప్పుడు స్త్రీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. నా ఫ్యామిలీ నేను చేసే సినిమాలను ఒప్పుకుంటూ, నన్ను సపోర్ట్ చేయడం వల్ల గట్స్, కాన్ఫిడెన్స్ వస్తాయి. ఇంకా విభిన్న పాత్రలు చేయాలనే ధైర్యం ఇస్తుంది. ఓ నటిగా మీరు చేసే విభిన్న పాత్రలను వ్యక్తిగా మీకు అన్వయించి మిమ్మల్ని జడ్జ్ చేసే అవకాశం కూడా ఉంది కదా? సమంత మంచి భార్య, మంచి వ్యక్తి, మంచి కోడలు. స్క్రీన్ మీద పాత్రను బట్టి కనిపించే సమంత వేరు. నిజ జీవిత సమంత వేరు. ఎన్ని రోజులని అవే బబ్లీ రోల్స్ చేస్తాం. ప్రేక్షకులు సమంత అదే బోరింగ్ రోల్స్ చేస్తుంది అనుకోకూడదు. యాక్టర్‌గా నాకు ఆశ ఎక్కువ. పని చేయడం మొదలుపెట్టి 9 ఏళ్లయిపోయింది. ఇప్పుడు కూడా రిస్క్ తీసుకోక పోతే ఇంకెప్పుడు తీసుకుంటాం. ఆ రిస్క్ అప్పుడు చేసుంటే బావుండు అని బాధపడకూడదు. చాలెంజింగ్ పాత్ర ఏదైనా చేస్తే ‘ఈ సమంతని ఇన్ని రోజులు ఎక్కడ దాచారు?’ అంటారు. దాచడం కాదు, అలాంటి పాత్ర ఎవ్వరూ ఇవ్వలేదు. ఇంతకు ముందూ అదే సమంత. తేడా అవకాశం రాకపోవడమే. ఉమెన్‌కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వచ్చేదే తక్కువ. వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలను కుంటాం. ‘సూపర్ డీలక్స్’ సినిమాలో మీ పాత్ర గురించి చైతన్యతో చెప్పారా? సినిమా అంగీకరించే ముందు చైతన్యతో చెప్పాను. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్ర ఇది... ఫస్ట్ సీన్ ఇలా ఉంటుంది.... చేయాలా? వద్దా? అని అడిగాను. తను వెనక్కి తిరిగి అలా చూశారు. ఓకే.. నీకిష్టం అయితే చెయ్ అన్నారు. సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు మీ ఇద్దరి మధ్య యాక్టర్ – యాక్టర్ ఈక్వేషనే ఉంటుందా? లేదు. భార్యాభర్తల ఈక్వేషన్లోనే మాట్లాడు కుంటాం. విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇలా పర్మిషన్లు తీసుకోవడం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అలా అడగటాన్ని పర్మిషన్ తీసుకోవడం అనుకోను. నాగచైతన్య నా బెస్ట్ ఫ్రెండ్. భర్త నుంచి పర్మిషన్ తీసుకుంటున్నట్టు కాదు, నా నుంచి నేనే అనుమతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చైతన్యతో మాట్లాడేటప్పుడు వేరే మనిషితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వను. నాతో నేనే మాట్లాడుకుంటున్నట్టు భావిస్తాను. మా రిలేషన్ షిప్ అలా ఉంటుంది. చైతన్య కూడా అలానే ఫీల్ అవుతారా? ఊ.. అనుకుంటున్నాను. ఈ మధ్య మీరు గ్లామరస్ డ్రెస్ వేసుకున్నప్పుడు ‘అక్కినేని కుటుంబ పరువు తీస్తున్నావు’ అని సోషల్ మీడియాలో వినిపించిన కామెంట్స్‌కి ఏం చెబుతారు? మనం వేసుకునే బట్టలు, చేసే పాత్రల వల్ల మన క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటారు కొందరు. ఇలా కామెంట్ చేసేవాళ్లందరికీ ఏం చెప్పాలనుంటుందంటే.. నా హస్బెండ్ నాతో హ్యాపీగా ఉన్నాడు. మా అత్తమామలు సంతోషంగా ఉన్నారు. కామెంట్ చేసేవాళ్లే అనవసరమైన తలనొప్పి తీసుకుంటున్నారు అనిపిస్తోంది. అలాగే నేను వేసుకునే బట్టలు, నా పాత్రలు మాత్రమే నేను కాదు. వీటన్నింటినీ దాటి నేనంటే ఇంకా చాలా ఉంటుంది కదా? అది అర్థం చేసుకోగలగాలి. నా వల్ల నా కుటుంబ ఫీల్ అయితే కచ్చితంగా ఆ పనులు చేయను. అంటే.. ‘ఇలాంటి డ్రెస్సులు వద్దు స్యామ్’ అని మీ ఫ్యామిలీ చెబితే వేసుకోరా? 100 శాతం పాటించేస్తాను. మా ఫ్యామిలీలో ఎవ్వరు చెప్పినా వింటాను. నా వ్యక్తిత్వం అలాంటిది. నాకు నచ్చని వాక్యం ఏదైనా ఉందంటే అది ‘నేను ఇంతే’ అనేది. ఎవ్వరూ కూడా నేనింతే అనుకోకూడదు. ఒక రిలేషన్షిప్లో కాంప్రమైజ్‌లు ఉంటాయి. మార్చుకోవాలి, మారాలి. నిన్న మామగారు (నాగార్జున) నాకు ఫోన్ చేసి ‘సూపర్ డీలక్స్ పెద్ద హిట్ అంట కదా. నువ్వు నాకేం చెప్పలేదు. ట్రైలర్ కూడా పంపించలేదేంటి?’ అని అడిగారు. ‘లేదు మీరు బిజీగా ఉంటారు కదా. డిస్ట్రబ్ చేయడం ఎందుకని’ అన్నాను. ‘నేను బిజీ అని నీతో చెప్పానా?’ అని సరదాగా మాట్లాడుకున్నాం. వాళ్ల అబ్బాయిలను సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేస్తుంటారు. మీ స్టైలిష్ మామయ్యగారి ఏజ్ అస్సలు తెలియదు.. యస్.. వెరీ స్టైలిష్ మామయ్య. మా అత్తమ్మ వయసు కూడా తెలియదు. తను కూడా చాలా స్మార్ట్‌గా ఉంటారు. ఆ జీన్సే చైతన్యకు కూడా వచ్చాయి. ‘మజిలీ’లో స్కూల్ బాయ్‌లా కూడా బాగా సెట్ అయ్యారు. 45 నిమిషాలు పాటు ఆ లుక్‌లోనే ఉంటారు. పెళ్లయ్యాక అమ్మాయిలను ఉద్దేశించి ‘అత్తింటి పరువు కాపాడు’ అంటుంటారు. మరి.. పెళ్లయితే అమ్మగారి కుటుంబ పరువుకి, అమ్మాయికీ సంబంధం ఉండదా? చిన్నప్పుడు మా అమ్మ అబ్బాయిలను, అమ్మాయిలను ఒకేలా పెంచారు. చైతన్య ఫ్యామిలీ కూడా అంతే. ఎవరి పరువు ఎవరూ తీయడానికి కుదరదు. వాళ్ల పరువు గురించి ఎవరికి వాళ్లు జాగ్రత్తపడాలి (నవ్వుతూ). నీ పరువు నువ్వు కాపాడుకోవాలి అంతే అని మా అమ్మ చెబుతారు, మా అత్తగారు కూడా చెబుతారు. మా అత్తగారు నా ఇన్స్టాగ్రామ్ (ఫోటో షేరింగ్ యాప్) లో నన్ను ఫాలో అవుతారు. అయ్యో.. మా అత్తగారు నా ఇన్స్టాగ్రామ్ చూస్తారు. అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని అనుకోను. నా ప్రతి ఫొటో ఆమె చూస్తారు. ఆమె చూస్తారు కదా అని భయపడాల్సిన స్థితిలో నా కుటుంబం నన్ను పెట్టలేదు. ఇలాంటి మానసిక ప్రశాంతత ప్రతి పెళ్లయిన అమ్మాయికి ఉండాలని కోరుకుంటాను. తమిళ హిట్ ‘96’ రీమేక్‌లో నటించబోతున్నారు? ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నారా? అదే దర్శకుడు కాబట్టి మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ స్క్రిప్ట్, మంచి పాత్ర అది. ‘96’ సినిమా చాలా స్పెషల్. రీమేక్ చేయకూడదు అని ట్వీటర్లో మీరే ఓసారి అన్నారు. మీరే రీమేక్ చేస్తున్నారు? రీమేక్ చేయాలా వద్దా? సినిమా ఆడకపోతే అని త్యాగరాజ కుమారరాజా (‘సూపర్ డీలక్స్’ చిత్ర దర్శకుడు) గారిని అడిగాను. ‘సినిమా ఆడలేదు. నీకు పోయేదేంటి? కానీ ఈ సినిమా చేయకపోతే ఓ అద్భుతమైన పాత్ర కోల్పోతావు. మంచి దర్శకుడు, టీమ్‌తో వర్క్ చేసే ఫన్ జర్నీ అంతా మిస్ అవుతావు. ఆ 60 రోజుల హ్యాపీనెస్‌ని లూజ్ అవుతావా?’ అని సలహా ఇచ్చారు. వెంటనే సినిమా ఓకే చేశాను. జిమ్‌లో అంతంత హెవీ వెయిట్స్ ఎలా మోస్తున్నారు? స్ట్రాంగ్‌గా ఉండాలని. ఏ బరువైనా అమాం తంగా ఎత్తకూడదు. స్లోగా ఎత్తాలి. అప్పుడు రిస్క్ ఉండదు. ఫైనల్లీ జూనియర్ సమంత, జూనియర్ చైతూ ఎప్పుడు వస్తారు? మరో మూడేళ్ల లోపు అనుకోవచ్చా? అమ్మో.. మూడేళ్లా? అంత దూరంలో లేదు (నవ్వుతూ). – డి.జి. భవాని ►వెంకటేశ్‌గారి అమ్మాయి పెళ్లిలో మీ అత్తగారు, మీరు ఒకేలాంటి డ్రెస్ వేసుకున్నారు? అవును. కానీ అది ప్లాన్ చేసింది కాదు. లంచ్ తర్వాత నేను, అత్త కలిశాం. సర్ప్రైజింగ్గా ఇద్దరం ఒకటే డ్రెస్. ఆ డ్రెస్‌లు మ్యాచ్ అయినట్టే మా టేస్ట్, ఆలోచనా విధానం, నమ్మే విలువలు అన్నీ ఒక్కటే. ►ఆంటీ అని పిలుస్తారా? అత్తయ్యగారూ అంటారా?అమ్మా అని పిలుస్తాను. ఆవిడ నన్ను స్యామ్ అంటుంది. ►పెళ్లయింది కదా ఇలా చేయకూడదు, అలా చేయకూడదనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. వినిపిస్తూనే ఉంటాయి. ఆ కామెంట్స్ ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి అనుకుంటున్నా. పెళ్లి తర్వాత ఓసారి షార్ట్ డ్రెస్ వేసుకున్నాను. అప్పుడు బాగా కామెంట్స్ వచ్చాయి. కానీ రోజు రోజుకి అవి తగ్గుతున్నాయి. ఆ తేడా నాకు కనిపిస్తోంది. మా ప్రేమను చూపించే మజిలీ పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణదర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం వచ్చేనెల 5న విడుదల కానుంది. ‘మజిలీ’ గురించి సమంత చెప్పిన విశేషాలు. నేనొక్కదాన్నే నటించేప్పుడు మానిటర్లో నా పాత్ర వరకే చూసుకునేదాన్ని. పెళ్లి తర్వాత చైతన్యతో కలసి నటించడంతో నా పర్ఫార్మెన్స్ కంటే కూడా తన పర్ఫార్మెన్స్‌నే ఎక్కువగా చూస్తున్నాను. చాలా ప్రొటెక్టివ్ భార్యలా ప్రవర్తిస్తున్నాను (నవ్వుతూ). క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. యాక్టర్‌గా చైతన్య నెక్ట్స్ లెవల్లోకి వెళ్ళిపోయారు.పెళ్లి తర్వాత మేం కలసి నటిస్తే అంచనాలు ఉంటాయని తెలుసు. వాటిని చేరుకోగలమా అనుకున్నాం. మా పెళ్లయి రెండేళ్లయింది. మళ్లీ లవ్‌స్టోరీ చేస్తే ఎవరు చూస్తారు? అనుకున్నాం. పెళ్లి తర్వాత నేను చాలా పీస్ఫుల్ పర్సన్ అయ్యాను. చాలా మార్పు వచ్చింది. పెళ్లి తర్వాత ఉండే ప్రేమను ఎవరైనా చూపిస్తే బావుండూ అని అనుకుంటున్న సమయంలోనే ‘మజిలీ’ కథ వచ్చింది. వెంటనే ఓకే చేశాం. ►ఈ చిత్రంలో నేను పోషించిన శ్రావణి పాత్ర చాలా తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా స్ట్రాంగ్ అమ్మాయి తను. స్ట్రాంగ్ అనే క్వాలిటీలో శ్రావణితో నన్ను నేను పోల్చుకో గలను. కానీ తక్కువ మాట్లాడటమా? నో చాన్స్ (నవ్వుతూ). ►కథ చెప్పిన వెంటనే త్వరగా నిర్ణయం తీసుకుంటాను. స్క్రిప్ట్ నచ్చాక మార్పులు ఏమీ చెప్పను. నచ్చనప్పుడు ఎన్ని మార్పులు చేసి తీసుకువచ్చినా సినిమాను అంగీకరించలేను. ►ఇప్పటికే కొన్ని వేల ప్రేమకథలు చూశాం. ప్రేమ కథల్లో పాత్రలకు ఎంతగా కనెక్ట్ అవుతాం అన్నదాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ‘మజిలీ’ అనేది సినిమా కథలా అనిపించదు. ‘శ్రావణి, పూర్ణ, అన్షు’ అనే ముగ్గురి జీవితాలను వాళ్ల ఇంటి కిటికీలో నుంచి చూసినట్టుగా అనిపిస్తుం టుంది. రెండున్నర గంటల్లో ఫ్యామిలీ, లవ్, కుటుంబం... ఇలా అన్ని అంశాలను చూపించారు దర్శకుడు శివ నిర్వాణ. ►ఆన్‌స్క్రీన్‌లో టచ్ అయినా, హగ్ అయినా, కిస్ అయినా ఒకేలా చూస్తాను. ఇందులో చైతన్య, దివ్యాన్షకు లిప్‌కిస్ సీన్ ఉంది. ఆ సీన్ ఉందని నాకు ముందు తెలీదు. ఆ సీన్ షూట్ చేసిన తర్వాత దర్శకుడు శివ, ‘నీకోటి చూపించాలి’ అంటూ చూపించాడు. ఆ సన్నివేశానికి ఆ కిస్ అవసరమైంది. గాళ్‌ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి కబుర్లు చెప్పరు కదా. అప్పుడప్పుడు ముద్దులు కూడా ఉంటాయి కదా. ►ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయి. జనరల్‌గా నేను ఎమోషనల్ సీన్స్‌లో గ్లిజరిన్ లేకుండా ఏడుస్తాను. అలా ఏడ్చినప్పుడే కంప్లీట్ యాక్టర్ అని భావిస్తాను. ►స్పోర్ట్ బేస్డ్ సినిమాల్లో నటించాలని ఉంది. జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగారు అన్న కథల్ని యూనివర్శల్‌గా అంగీకరిస్తారు. అలాంటి స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ కథ వస్తే కచ్చితంగా చేస్తాను. అలాగే పూర్తి స్థాయి కామెడీ చేసే పాత్ర చేయాలనుంది. ‘ఆఅ’లో కొంచెం కామెడీ చేశాను. ‘ఓ బేబీ’లో ఫుల్ కామెడీ చేశాను. సమ్మర్లో నాకు మూడు రిలీజ్లు ఉన్నాయి. ఆల్రెడీ తమిళంలో ‘సూపర్ డీలక్స్’ రిలీజైంది. తెలుగుల ‘మజిలీ’మరో వారంలో విడుదలవుతుంది. ‘ఓ బేబీ’ రిలీజ్ కూడా సమ్మర్లోనే ఉంటుంది. ఏప్రిల్ మొత్తం సమ్మర్ హాలిడేస్ నాకు. ఆ తర్వాత ‘96’ రీమేక్ షూటింగ్లో జాయిన్ అవుతాను. -
గ్లామర్ పాత్రలకు సిద్ధమే
‘‘మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిషన్స్‌లోనే ‘మజిలీ’ సినిమాకు ఎంపిక అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అని దివ్యాంశా కౌశిక్ అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దివ్యాంశా కౌశిక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుదలవుతుంది. ‘మజిలీ’ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను. నాగచైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్. అమేజింగ్ కోస్టార్. చైతన్యతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. ఇందులో సమంతతో కలిసి నటించలేదు. తెలుగులోకి ఎంట్రీ కాకముందు ‘ఏమాయ చేసావె’ సినిమా చూశాను. చైతన్య–సమంత పెయిర్‌ను బాగా ఇష్టపడ్డాను. ‘అర్జున్ రెడ్డి, నిన్ను కోరి’ చిత్రాలు చూశాను. ‘రంగస్థలం, ఆర్ఎక్స్ 100’ సినిమాలు చూడాలి. సమంతగారు నటించిన ‘ఈగ’ సినిమా హిందీ అనువాదాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. డైరెక్టర్ శివగారు ఇచ్చిన స్వేచ్ఛ, నాలో నింపిన నమ్మకంతో ‘మజిలీ’లో బాగా నటించాను. తెలుగుతో పోల్చితే తమిళ్లో నటించడం కొంచెం కష్టంగా అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్లో ఆలియా భట్, కరీనా కపూర్, అనుష్కా శర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.. వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు. -
‘మజిలీ’ మ్యూజిక్ డైరెక్టర్ మారాడా..?
పెళ్లి తరువాత నాగచైతన్య, సమంతలు కలిసి నటిస్తున్న పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ మజిలీ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాటలకు సంబందించిన వర్క్ పూర్తి కాగా నేపథ్యం సంగీతం చేయాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి గోపి సుందర్ తప్పుకోవటంతో తమన్‌తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించే ఆలోచనలో ఉన్నారట మజిలీ టీం. ప్రస్తుతానికి సంగీత దర్శకుడి మార్పుపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఫిలిం నగర్లో మాత్రం ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. -
సమ్మరంతా సమంత
గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి 5 సినిమాల్లో కనిపించారు సమంత. అందులో మూడు చిత్రాలు (రంగస్థలం, మహానటి, అభిమన్యుడు) బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఈ సమ్మర్లో మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించనున్నారు సమంత. ఇందులో ఓ తమిళ సినిమా, రెండు తెలుగు సినిమాలున్నాయి. మార్చి 29న సమంత, విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్ ఫాజిల్ నటించిన మల్టీస్టారర్ తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ రిలీజ్ కానుంది. తమిళంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాతి వారంలో ఏప్రిల్ 5న ‘మజిలీ’ రిలీజ్ అవుతుంది. వివాహం తర్వాత భర్త నాగచైతన్యతో కలసి సమంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రమిది. ఈ రెండూ కాకుండా సమంత లీడ్ రోల్లో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబి’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇది సమ్మర్లోనే రాబోతుందని చిత్రబృందం ప్రకటించింది. వీటికితోడు ‘96’ తెలుగు రీమేక్ షూటింగ్‌ని కూడా ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారు. సో.. ఈ ఏడాది సమ్మరంతా సమంతే సమంత అన్నమాట. -
మోడ్రన్ దేవదాసుగా చైతూ
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మజిలీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడట. అంతేకాదు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగచైతన్య కోసం ఓ ప్రేమకథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా దేవదాసుకు మోడ్రన్ వర్షన్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కథా కథనాలు ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా సాగినా క్లైమాక్స్ మాత్రం దేవదాసు తరహాలోనే విషాదాంతమే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
కష్టాల్లో ‘మజిలీ’
అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంతలు జోడిగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత చైతూ, సామ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా కావటంతో మజిలీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సమ్మర్ సీజన్ కావటంతో కలెక్షన్లు కూడా బాగుంటాయని ఆ డేట్‌ను ఫిక్స్ చేశారు. నిన్నకోరి ఫేం శివా నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ల హడావిడితో మజిలీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ప్రభావం మజిలీ కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉందని భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మజిలీని చెప్పిన డేట్‌కే రిలీజ్ చేస్తారా? లేక వాయిదా వేస్తారా అన్నది చూడాలి. అదే రోజు విడుదల కావాల్సిన నాని జెర్సీ సినిమాను ఇప్పటికే ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. -
ప్రియతమా..ఇష్టమైన సఖుడా
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట లిరికల్ వెర్షన్‌ను చిత్రం యూనిట్ సోమవారం విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను గాయని చిన్మయి శ్రీపాద చాలా హృద్యంగా ఆలపించారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్న ఈ మూవీలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ స్వరాలను సమకూర్చారు. -
‘మజిలి’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్
అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మజిలి. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావటంతో మజిలిపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్నుకోరి ఫేమ్ శివా నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కలను సన్ నెట్వర్క్ సంస్థ 5 కోట్లకు తీసుకుంది. డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 3.5 కోట్లకు హిందీ అనువాద హక్కులు 4.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మీడియం బడ్జెట్ సినిమా కావటంతో డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తోనే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. -
మజిలీ ముగిసింది
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలసి స్క్రీన్‌పై తొలిసారి చేసిన ‘మజిలీ’ ముగిసింది. మరి ఈ ప్రయాణంలో ఇద్దరి అలకలు, ప్రేమ ఊసులు, గొడవలు.. ఇవన్నీ తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా రూపొందిన చిత్రం ‘మజిలీ’. దివ్యాన్షిక కౌశిక్ మరో కథానాయిక. సాహు గరికపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగానే నటించారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో నాగచైతన్య కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘‘మజిలీ’ ముగిసింది. ఈ సినిమాకు పని చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ కథను మా ద్వారా చెప్పినందుకు థ్యాంక్స్ శివ’’ అని నాగచైతన్య అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ. -
మజిలీ టీజర్: వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనేది ఉపశీర్షిక. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఇందులో నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం. ఒక్కసారి పోతే తిరిగి రావు అది వస్తువైనా, అమ్మాయైనా అని రావు రమేష్ చెప్పే డైలాగ్ అభిమానులని ఆకట్టుకుంది. చివర్లో వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరకుకుతారంటూ పోసాని చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇక చిత్రంలో పలు సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మజిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. (ప్రేమ ఉంది.. బాధ ఉంది) సమంత, చైతన్యల వివాహానంతరం కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడం, అందులోను ఇద్దరూ భార్యాభర్తలుగానే నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ. (ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్లో ప్రియురాలు) -
ప్రేమికుల రోజున ‘మజిలీ’ టీజర్
ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం లాంటి సినిమాల్లో నటించిన నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. వీరి వివాహానంతరం తెరపై మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’. ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు సంబరపడుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. ప్రేమికుల రోజున ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 14 ఉదయం 9.09గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో రాబోతోన్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ సమ్మర్లో రిలీజ్లో కానుంది. -
చైతు మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడా?
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. గతకొంతకాలం నుంచి చైతూకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైన హిట్ లేక అక్కినేని హీరోలు సతమతమవుతున్నారు. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు అనకున్నంతగా విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నాగ చైతన్య మజిలీ, వెంకీమామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీని దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మస్తున్న చిత్రంలో చైతు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
కొత్త కాంబినేషన్
యువ దర్శకులతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేయనున్నారు. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయ్యారట చైతు. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్నారని సమాచారం. నాగచైతన్య కోసం ఓ కొత్త పాయింట్ రెడీ చేశారట మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్ బ్యానర్ యూత్‌ఫుల్ సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకోవడంతో పాటు భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలు రూపొందిస్తారన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఈ నెల మూడో వారం నుంచి ‘వెంకీ మామ’లో జాయిన్ అవుతారు నాగచైతన్య. మేర్లపాక గాంధీ సినిమాను కూడా ‘వెంకీ మామ’తో సమాంతరంగా చేస్తారో లేదో వేచి చూడాలి. -
దిల్‌రాజు బ్యానర్లో చైతు!
అక్కినేని వారసుడిగా నాగచైతన్యను జోష్ సినిమాతో దిల్‌రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎంతో మంది హీరోలకు హిట్లు ఇచ్చిన దిల్ రాజు మళ్లీ ఇన్నేళ్లకు చైతుకు కూడా సూపర్‌హిట్‌ను అందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చైతు ప్రస్తుతం మజిలీ, వెంకీ మామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తైన వెంటనే దిల్ రాజు సినిమాను పట్టాలెక్కిస్తారని వినికిడి. ‘ఎఫ్2’ ఇచ్చిన బూస్ట్‌తో దిల్ రాజు చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నట్లు సమాచారం. -
ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్లో ప్రియురాలు
2017 అక్టోబర్ 6... నాగచైతన్య, సమంత తమ ప్రేమ ప్రయాణంలో పెళ్లి అనే ‘మజిలీ’ని చేరుకున్న రోజు. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘మజిలీ’. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనేది ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. జనవరి 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో గడ్డంతో సమంత సరసన కనిపించారు చైతూ. సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ చిత్రం సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చేతిలో బ్యాట్, క్లీన్ షేవ్‌తో కనిపించారు చైతూ. అయితే ఈసారి ఫొటోలో సమంత కనిపించడంలేదు. రెండో హీరోయిన్గా చేస్తున్న దివ్యాంశ కౌశిక్ ఆత్మీయంగా చైతూని హగ్ చేసుకుని కనిపిస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు సమంత అయితే గ్రౌండ్లో ప్రియురాలు దివ్యాంశ అనుకోవాలేమో. అంటే.. ఇదేమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఏప్రిల్‌లో తెలుసుకుందాం. ఈ చిత్రకథ మాత్రం విశాఖపట్నం నేపథ్యంలో ఉంటుందట. రావు రమేశ్, పోసాని కృష్ణముర ళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ. -
చైతూ కూడా క్రికెటర్‌గానే..!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పిరియాడిక్ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ఘనవిజయం సాధించగా ప్రస్తుతం నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. అదే బాటలో అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య కూడా ఓ పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మజిలి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంతలు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే చైతూ, సామ్‌ల లుక్‌లను రిలీజ్ చేసిన మజిలి టీం తాజాగా సంక్రాంతి కానుకగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాగ చైతన్య క్రికెటర్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో మరో హీరోయిన్ దివ్యాంషా కౌషిక్ లుక్‌ను రివీల్ చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. Here's refreshing #Majili2ndLook featuring Yuvasamrat @Chay_Akkineni and @divyanshak_ Releasing worldwide on 5th April A film by @ShivaNirvana #Majili @Samanthaprabhu2 @sahrudayg @harish_peddi #GopiSundar @Shine_Screens @VishnuSarmaDOP @sahisuresh #ChaySam4 #MajiliOnApr5th pic.twitter.com/SmGgeUx5AI — Shine Screens (@Shine_Screens) 14 January 2019 -
ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!
పెళ్లి తరువాత రూట్ మార్చిన సమంత ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మజిలిలో నటిస్తున్న ఈ బ్యూటీ నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రానికి ఓకె చెప్పింది. ఈ సినిమా సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనుందన్న టాక్ గట్టిగా వినిపించింది. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ముందుగా ఈ సినిమాలో వృద్ధ మహిళ పాత్రను కూడా తానే చేయాలని భావించిన సమంత ఇప్పుడు నో చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే ఏజ్డ్లుక్లో కనిపిస్తే కెరీర్ పరంగా నష్టం జరుగుతుందన్న ఆలోచనతో కేవలం యంగ్ లుక్ లో మాత్రం నటించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఏజ్డ్ రోల్ కోసం సీనియర్ నటి లక్ష్మీని తీసుకున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో యువ కథానాయకుడు నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడు. -
ప్రేమ ఉంది.. బాధ ఉంది
టాలీవుడ్ యంగ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్ సినిమాతో హిట్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అన్నది ఉపశీర్షిక. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘మజిలీ’ ఫస్ట్ లుక్‌లో చైతన్య, సమంత ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకుని ఉండటం చాలా ఎమోషనల్‌గా ఉంది. పైగా వారి లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. చై, సామ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్, విశాఖపట్నం అని బోర్డుపై రాసుంది. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య’ చిత్రాల తర్వాత, వివాహానంతరం సమంత, నాగచైతన్య నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మంచి అంచనాలున్నాయి. -
‘మజిలీ’.. ప్రేమ ఉన్న దగ్గరే బాధ ఉంటుంది..!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చైతూ-సామ్‌లు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. మజిలీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను కూడా సినిమా కాన్సెప్ట్ ఎంటో చూపించేలా డిజైన్ చేశారు. పోస్టర్ డిజైన్‌ను బట్టి చూస్తే సినిమా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాను 2019 వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.