టైటిల్ : మజిలీ
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్, రావూ రమేష్
సంగీతం : గోపి సుందర్
నేపథ్య సంగీతం : తమన్
దర్శకత్వం : శివా నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మాస్ యాక్షన్ జానర్లో తెరకెక్కించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్ డ్రామానే ఎంచుకున్నాడు చైతూ. అంతేకాదు తన రియల్ లైఫ్ పార్టనర్‌తో కలిసి రీల్ లైఫ్‌లో మరో సక్సెస్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన సినిమా మజిలీ. మరి ఈ సినిమా అయినా చైతూ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..?
కథ :
పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువుతూ ఎలాగైన రైల్వేస్ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు.
ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల కారణంగా పూర్ణ.. శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్నా.. ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. చివరకు పూర్ణ, శ్రావణికి ఎలా దగ్గరయ్యాడు? పూర్ణలో మార్పుకు కారణం ఏంటి? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
హీరోగా నాగచైతన్య ప్రతీ సినిమాకు పరిణతి సాదిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్‌లో యువకుడిగా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో మెప్పించాడు. తొలి పరిచయంలోనే దివ్యాంశ కౌశిక్ మంచి నటనతో ఆకట్టుకుంది. కేవలం సెకండ్ హాఫ్‌లోనే కనిపించినా సమంత తన సూపర్భ్ పర్ఫామెన్స్‌తో అందరినీ డామినేట్ చేసేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో సమంత నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ :
నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్ డ్రామానే ఎంచుకున్నాడు. ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు మరోసారి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్.. చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, ఫ్రెండ్స్ తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్‌గా కథ నడిపించాడు. అయితే అక్కడక్కడ కథనం నెమ్మదించటం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. గోపి సుందర్ అందించిన పాటలు కథలో భాగం వచ్చిపోతూ అలరిస్తాయి. తమన్ తన నేపథ్య సంగీతంతో సీన్స్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సమంత
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment