నలుగురికి 80 బాటిళ్ల పాలు... | supermum as sarha ward | Sakshi
Sakshi News home page

నలుగురికి 80 బాటిళ్ల పాలు...

Published Wed, Nov 5 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

నలుగురికి 80 బాటిళ్ల పాలు...

నలుగురికి 80 బాటిళ్ల పాలు...

సారా.. ఒక సూపర్ మామ్..!
ట్రిప్లెట్స్.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుడితే వాళ్లను ట్రిప్లెట్‌గా వ్యవహరిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందిలా.. ఎనిమిది వేల మందిలో ఒక అమ్మ మాత్రమే ట్రిప్లెట్స్‌కు జన్మనిస్తుందని వైద్యుల అంచనా. అయితే ఈ తల్లికి అలా పుట్టిన ముగ్గురూ ఆరోగ్యంగా ఉండటం, ఉండవలసినంత బరువుతో ఉండటం విశేషం. పది నెలల వ్యవధిలో రెండు కాన్పుల్లో నలుగురు పిల్లలు పుట్టినా తల్లీ పిల్లలూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన సారావార్డ్‌కు తొలుత ఒక బాబు పుట్టాడు.

ఆ తర్వాత వెంటనే గర్భం ధరించిన ఆమె ట్రిప్లెట్స్‌కు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె పిల్లల పెంపకం అందరికీ ఆసక్తికరంగా మారింది. ఏడాది వయసులోపు పిల్లలు నలుగురిని ఆమె ఎలా చూసుకోగలుగుతోంది... ఆమెకు ఏమీ కష్టం కావడం లేదా?! అని అనేకమంది ఆరాలు తీస్తుండడంతో సారావార్డ్ పిల్లల పెంపకం మీడియాకు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆమె నలుగురు పిల్లలను ఆడించడం దగ్గర నుంచి నిద్రపుచ్చడం వరకూ ప్రతిదీ ఒక పాఠమే అవుతోంది.
 
మన దగ్గర కూడా ప్రస్తుత కుటుంబ వ్యవస్థల్లో.. భార్యాభర్త ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల మధ్య పిల్లల పెంపకం చాలా కష్టమైన అంశమే అవుతోంది. తోడుగా ఉండి చూసుకొనే పెద్దవాళ్లు ఉంటే ఫరవాలేదు కానీ.. లేకపోతే ఆ దంపతుల ఇబ్బందులు చెప్పనలవి కాదు. వారికి వారానికి 175 సార్లు న్యాపీలు మార్చాల్సి ఉంటుందట, ఒక్కొక్కరికి 20 బాటిళ్ల చొప్పున వారంలో నలుగురికీ కలిసి 80 బాటిళ్ల పాలు పట్టించాల్సి ఉంటుంది. ఇక నెలల పాపాయిల ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ ఉంచాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాత్రిపూట ఎవరో ఒకరు ఆరున్నొక్క రాగం అందుకొన్నారంటే... అది కూడా ఒకరి తర్వాత మరొకరు మొదలెట్టారంటే... ఆ రాత్రి సారా దంపతులకు జాగారమే. భర్త ఆఫీసుకు వెళ్లాక సారా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. పిల్లలు మేలుకుని ఉంటే కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లే పరిస్థితి కూడా ఉండదంటే ఆ తల్లి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత శ్రమ ఉన్నా.. నలుగురు పిల్లలూ ఒక్కసారి నవ్వులు రువ్వుతూ కనిపిస్తే తన ఇబ్బందులేమీ గుర్తురావనీ, వారి బోసి నవ్వుల కోసం ఏమైనా చేయవచ్చనిపిస్తుందని సగటు అమ్మలానే చెప్పే సారా కచ్చితంగా సూపర్‌మామ్ కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement