బీజింగ్: చైనాలో ముగ్గురు బిడ్డల విధానానికి చైనా జాతీయ అసెంబ్లీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దేశ జనాభాలో వస్తున్న మార్పులను గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ముగ్గురు బిడ్డల విధానానికి పచ్చజండా ఊపింది. దేశంలో జనన రేటు విపరీతంగా క్షీణిస్తూ వస్తోన్న తరుణంలో రివైజ్డ్ పాపులేషన్ అండ్ ఫామిలీ ప్లానింగ్ లాకు ఎన్‌పీసీ(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కు చెందిన స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ఎన్‌పీసీలో చర్చకు పెట్టి అధికారికంగా అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం చైనా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందింస్తుంది. పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చైనా యువత పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో జననాల రేటు బాగా తగ్గింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకే కొత్త చట్టం తెచ్చారు. పిల్లల పెంపకం వల్ల అయ్యే అదనపు ఖర్చును భరించడంలో, వారి విద్యాభ్యాస వ్యయంలో ప్రభుత్వం తల్లిదండ్రులకు మద్దతునిస్తుంది. అలాగే వారి పన్నులు, బీమా పథకాలు, ఇల్లు, ఉపాధి అంశాల్లో కూడా అండగా నిలుస్తుంది. మేలో పాలక కమ్యూనిస్టు పార్టీ రెండు బిడ్డల విధానం నుంచి మూడు బిడ్డల విధానానికి ఆమోదం పలికింది. అనంతరం ఈ నిర్ణయంపై స్టాండింగ్ కమిటీ చర్చించింది.
వికటించిన వన్ ఛైల్డ్ విధానం
గతంలో చైనాలో విపరీతంగా జనాభా పెరగడంతో కచ్ఛితమైన జనాభా నియంత్రణను అవలంబించారు. వన్ ఛైల్డ్ విధానంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు తరుగుదల ఆశించినంతగా మెరుగుపడకపోవడం, మరోవైపు 60ఏళ్ల పైబడిన జనాభాలో వృద్ధి వేగమవడంతో తాజాగా ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు. చైనాలో పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల ఎక్కువమంది ఒకరికి మించి పిల్లల కోసం యత్నించడం లేదు. దీన్ని చక్కదిద్దాలంటే దంపతులకు పుట్టే ప్రతి కొత్త బిడ్డకు ఏడాదికి దాదాపు పది లక్షల యువాన్లు ఇవ్వాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా తెచ్చిన ముగ్గురు పిల్లల విధానంతో కొంత మెరుగుదల ఉండొచ్చని, కానీ ప్రత్యక్ష నగదు సాయం లేకుండా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ దాటేస్తుందని ఐరాస అంచనా వేసింది.
చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా మహిళా జనాభాలో ఫెర్టిలిటీ రేటు సైతం వరుసగా పడిపోతూ వస్తోంది. 2025కు చైనా జనాభా వృద్ధిలో నెగిటివ్ గ్రోత్ ఉంటుందని చైనా పీపుల్స్ బ్యాంక్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల వినియోగ డిమాండ్ తగ్గిపోతుందని, ఇందుకునుణంగా విధాన నిర్ణయాలుండాలని సూచించింది. ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోకపోతే 2050 నాటికి దేశంలో వృద్ధుల పరిరక్షణకు అమెరికా కన్నా ఎక్కువ వ్యయం చేయాల్సివస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ జోక్యం లేకపోతే జనాభా తరుగుదల తాలుకు ఆర్థిక విపరిణామాలను వెనక్కు తిప్పలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హెచ్చరికల ఫలితంగా ప్రభుత్వం క్రమంగా జనాభా విధానాలను సడలిస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment