సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ఇప్పుడు స్థానిక సమరానికి గంటలు మోగుతున్నాయి. పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పోటీచేయాలనుకుంటున్న ఔత్సాహికులను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతోంది.
సాక్షి, బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తరువాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదు గదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ పోటీ చేయాలనుకున్నవారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే.
ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీ చేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్పుకుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంతమంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తరువాత ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునేసరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి దాదాపు ఆరునెలలు పైనే అవుతోంది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, మున్సిపాల్టీ అభ్యర్థుల పదవీకాలం కూడా పూర్తికావస్తోంది. గుంటూరు జిల్లాలో 57 మండలాల్లోని పంచాయతీలు, మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల గడువు సమీపించటంతో ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది.
స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు
ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచా యతీలో ఓటరుగా వారి పేరు నమోదై ఉం డాలి. పోటీ చేయడంతోపాటు పోటీ చేసి న వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించేవారికిఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి.
రేషన్ డీలర్లు పోటీకి అర్హులే...
కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్‌షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంగన్‌వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్లలోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు.కోర్టు విధించిన శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తరువాత...దాన్ని ఆమోదించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment