ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే! | Election Commission clarification on eligibility for MPTC and ZPTC nominations | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!

Published Mon, Mar 9 2020 4:43 AM | Last Updated on Thu, Jul 28 2022 3:33 PM

Election Commission clarification on eligibility for MPTC and ZPTC nominations - Sakshi

సాక్షి, అమరావతి: ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. అయితే.. 1994, మే 30కి ముందు మాత్రమే ముగ్గురు పిల్లలు పుట్టి ఉండాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ పదవులకు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ పదవులకు జెడ్పీ సీఈవో కార్యాలయాల్లో నామినేషన్లు సమర్పించాలి. ఈ నేపథ్యంలో పోటీకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే అంశాల్లో ఎన్నికల కమిషన్‌ స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం..
- ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారికి నామినేషన్ల పరిశీలన జరిగే తేదీ నాటికి కనీసం 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఎంపీటీసీగా పోటీ చేసేవారు ఆ మండల పరిధిలోని ఏదో ఒక ఎంపీటీసీ పరిధిలో.. జెడ్పీటీసీగా పోటీ చేసే వారికి ఆ జిల్లా పరిధిలోని ఏదో ఒక జెడ్పీటీసీ పరిధిలో ఓటు ఉండాలి. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వారు కూడా అభ్యర్థి పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో ఓటరై ఉండాలి.
- 1994, మే 30కి ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. ఆ తేదీ నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, 1995, మే తర్వాత మరొక సంతానం ఉంటే పోటీకి అనర్హులవుతారు. 
1995, మే 29 తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోటీకి అనర్హులు. అయితే, మొదట ఒకరు పుట్టి, రెండో సంతానంగా కవలలు పుడితే మాత్రం వారు పోటీకి అర్హులవుతారు.
- 1995, మే 29 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టి, మొత్తం సంతానం ముగ్గురు దాటని వారు కూడా పోటీకి అర్హులే.
- ముగ్గురు పిల్లలు కలిగి ఉండి, ఒకరిని ఇతరులకు దత్తత ఇస్తే అనర్హులే అవుతారు.
- ఇప్పటికే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి గర్భవతిగా ఉన్నా అలాంటి వారు కూడా పోటీకి అర్హులే.
- రేషన్‌ షాపు డీలరుగా పనిచేసే వారు పోటీకి అర్హులే. అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.
దేవదాయ శాఖ పరిధిలో ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్‌ లేదంటే సభ్యులుగా ఉన్న వారు పోటీకి అనర్హులు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసేవారు ఆ పరిధిలో ఓటు కలిగి ఉండి, ఏదైనా పట్టణ ప్రాంతంలో మరొక ఓటు కలిగి ఉన్నా అర్హులే. ఇలాంటి వారిని అనర్హులుగా పేర్కొనడానికి చట్టంలో ప్రత్యేకంగా ఏ నిబంధన లేని కారణంగా వారిని అర్హులగానే పరిగణిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement