తాన్యా షేర్గిల్
జనవరి పదిహేను మనకు సంక్రాంతి. దేశానికి ఆర్మీ డే. సంక్రాంతికి మకరజ్యోతి కనిపిస్తుంది. ఆర్మీడేకి పరేడ్ గ్రౌండ్ నుంచి పదఘట్టన వినిపిస్తుంది. ఈ ఏడాది ఆ పదఘట్టనల్ని నడిపించిన చోదక జ్యోతి.. తాన్యా షేర్గిల్. ఆర్మీ డేలో తొలి మహిళగా పురుష సైనిక దళాన్ని కవాతు చేయించిన తాన్యా.. ఇప్పుడిక రిపబ్లిక్ డే కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ ఆడ్జుటెంట్’గా ముందుండబోతున్నారు.
నాన్న ఆర్మీ. తాత ఆర్మీ. ముత్తాత ఆర్మీ. తాన్యా షేర్గిల్ ఆర్మీ. అయితే ఇది కాదు స్టోరీ. పంజాబ్‌లో ఆర్మీవాళ్లు ఎక్కువగానే ఉంటారు. ‘షేర్గిల్’ అనే ఇంటి పేరున్నవాళ్లు కూడా ఎక్కువే. షేర్గిల్ కుటుంబీకులు ప్రపంచంలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. అన్నిటికన్నా అత్యున్నత స్థానం.. ఆర్మీ! తాన్యా కూడా ఈ అత్యున్నత స్థానాన్నే కోరుకున్నారు. కోరుకుని, ఆర్మీలో చేరారు కానీ.. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్మీ డే’ కవాతులో.. ఆల్–మెన్ కంటింజెంట్ (అందరూ పురుషులే ఉండే సైనికదళం) ను ముందుండి నడిపించే అవకాశం వస్తుందని మాత్రం తాన్యా ఊహించనేలేదు. కోరుకున్నది దొరికితే సంతోషం లభిస్తుంది. ఊహించనిది అందితే..? జాతీయ పతాకంలా మనసు రెపరెపలాడుతుంది.
ఆర్మీ డేలో తొలి మహిళ
ఏడు దశాబ్దాలుగా ఢిల్లీలో ఆర్మీ డే కవాతు జరుగుతోంది. అన్ని కవాతుల్నీ పురుషులే నడిపించారు. తొలిసారిగా మొన్నటి 72వ ఆర్మీడే కవాతును ఒక మహిళ నడిపించింది. ఆమే తాన్యా షేర్గిల్. అయితే ఇది కూడా కాదు స్టోరీ. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్‌ను కూడా తాన్యానే లీడ్ చెయ్యబోతున్నారు! తొలి మహిళగా!! గత ఏడాది రిపబ్లిక్ డే కి కూడా ఒక తొలి మహిళ పేరు విన్నాం కదా. మరి ఆమె ఎవరు? లెఫ్ట్‌నెంట్ భావనా కస్తూరి. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆల్–మెన్ ఆర్మీ కంటింజెంట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ.
(ఆర్మీ డేలో ఆల్–మెన్ కంటింజెంట్‌కు సార్థ్యం వహించిన తొలి మహిళ తాన్యా). భావన తొలి మహిళా లెఫ్ట్‌నెంట్‌గా రిపబ్లిక్ డేలో పురుష దళాన్ని ముందుండి నడిపిస్తే.. తాన్యా షేర్గిల్ తొలి మహిళా ‘పరేడ్ ఆడ్జుటెంట్’గా ఈ ఏడాది రిపబ్లిక్ డే కవాతును నిర్వహించబోతున్నారు. భావన ఒక్క రిపబ్లిక్ డే కే తొలి మహిళ. తాన్యా.. ఆర్మీ డేకి, రిపబ్లిక్ డేకి కూడా తొలి మహిళ. ఇదేమీ ఎక్కువ తక్కువల లెక్క కాదు. పోయిన ఏడాదే తొలి మహిళ అన్నారు కదా.. మళ్లీ ఏమిటి ఈ తొలి మహిళ అనే సందేహం రాకుండా ఉండడం కోసం. పరేడ్ ఆడ్జుటెంట్ అంటే కవాతు నిర్వహణ బాధ్యత గల సైనిక అధికారి!
రిపబ్లిక్ డేకీ సారథ్యం
తాన్యా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో పట్టభద్రురాలు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాక 2017 మార్చిలో సైనిక దళంలోని ‘ఆర్మీ కోర్స్ ఆఫ్ సిగ్నల్స్’ విభాగంలో చేరారు. ఇప్పుడామె ఆర్మీ కెప్టెన్. కెప్టెన్ తాన్యా షేర్గిల్. ఈ నెల 26 ఆదివారం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ ఆడ్జుటెంట్ ఆఫీసర్‌గా తాన్యా కవాతు చేయించబోయే దళంలో గొప్పగొప్ప సైనిక వ్యవస్థలే ఉండబోతున్నాయి. అంతకన్నా ముందు ఆమె ఆ కవాతును ఎవరెవరి ముందు నిర్వహిస్తారో చూడండి.కమాండర్–ఇన్– చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్.. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన ఉంటారు. త్రివిధ దళాధిపతులు.. జనరల్ మనోజ్ ముకుంద్ నవరణె (ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ (నేవీ), మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా (ఎయిర్ ఫోర్స్).. ఈ ముగ్గురూ ఉంటారు.‘చీఫ్’ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉంటారు. భారత రక్షణ దళంలో ఈ ఏడాది కొత్తగా వచ్చి చేరిన హోదా.. ‘చీఫ్’ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇక ప్రధాని, రక్షణశాఖ మంత్రి ఎలాగూ ఉంటారు.
వాళ్లతో పాటు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో! ఇంతమంది అసామాన్యులు, అతిరథులు ఉన్న పరేడ్‌లో తాన్యా షేర్గిల్ సర్వసత్తాక సార్వభౌమాధికారం గల తన దేశపు శక్తి సామర్థ్యాలు ఎలాంటివో పరేడ్ ఆడ్జుటెంట్‌గా చూపించబోతున్నారు. అరుదైన అవకాశం! మహిళగా తాన్యాకు గర్వకారణమైన బాధ్యత. ఆమె తండ్రి 101 మీడియం రెజిమెంట్ (ఆర్టిలరీ)లో చేశారు. ఆమె తాత 14వ ఆర్మ్‌డ్ రెజిమెంట్ (సిందే హార్స్)లో చేశారు. ఆమె ముత్తాత సిక్కు రెజిమెంట్‌లో చేశారు. వాళ్లకంటే ఎలాగూ గర్వకారణమే. తమ వంశంలోని అమ్మాయి.. అని. తాన్యా నడిపించబోతున్న పెరేడ్‌లో ఇన్‌ఫాంట్రీ కంబాట్ వెహికల్ బి.ఎం.పి–2కె (18 మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ), ధనుష్ గన్ సిస్టమ్, కోర్స్ ఆఫ్ సిగ్నల్స్, సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ, కుమావున్ రెజిమెంట్, గ్రెనడియర్స్, పారాచ్యూట్ రెజిమెంట్ ఉన్నాయి. మనమిక వేచి చూడవలసింది.. ఈ దేశ రక్షణ బలగాలను ఒక యువతి ముందుండి నడిపించే ఒక అపురూపమైన గణతంత్ర దినోత్సవ దృశ్యం కోసం.
Comments
Please login to add a commentAdd a comment