వార్థక్యం ఆమె దగ్గరికి రానంటుంది. యవ్వనం ఆమెను వదిలి పోనంటుంది. ఉత్సాహం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఉల్లాసం ఆమెను తన చిరునామాగా చెబుతుంది. తొంభై అయిదేళ్ల వయసులో కూడా శరీరాన్ని విల్లులా వంచుతూ ఆమె చేసే విన్యాసాలకి ప్రపంచమే హ్యాట్సాఫ్ చెబుతోంది. ఆమె పేరును తనలో లిఖించుకోవడం తన అదృష్టమంటూ గిన్నిస్‌బుక్ సైతం గర్వపడుతోంది. ఆమె ఎవరో తెలుసా... తావ్ పోర్షోన్ లించ్. ప్రపంచంలోనే అత్యధిక వయసు గల యోగా టీచర్, డ్యాన్సర్!
వయసులో ఉండీ ఏదీ చేయకుండా కాలం గడుపుతుంటారు కొందరు. శక్తి ఉండి కూడా ఏమి చేయాలన్నా బద్దకిస్తుంటారు ఇంకొందరు. అలాంటివాళ్లందరికీ ఓ పాఠం... తావ్ పోర్షోన్ లించ్. న్యూయార్క్‌లో నివసించే 95 యేళ్ల పోర్షోన్‌కి వయసు ఉడిగిపోవడం, శక్తి తగ్గిపోవడం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే... ఆమె వయసు తొంభై దాటినా, మనసు మాత్రం ఇరవైల్లోనే ఆగిపోయింది!
కళ్లు తెరిచింది ఇక్కడే!
పోర్షోన్‌ని అందరూ అమెరికన్ అంటారు. నిజానికి ఆమె మూలాలు మనదేశంలోనే ఉన్నాయి. భారతీయురాలైన తల్లికి, ఫ్రెంచ్ తండ్రికి 1918, ఆగస్ట్ 13న పాండిచ్చేరిలో పుట్టింది పోర్షోన్. పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని మోసుకొచ్చింది. ఆమెకు జన్మనిస్తూ తల్లి మరణించింది. దాంతో కూతురిని సాకలేనంత విషాదంలో మునిగిపోయాడు తండ్రి. పసిగుడ్డుగా ఉన్న పోర్షోన్‌ని తన సోదరికి, ఆమె భర్తకి అప్పగించి కెనడా వెళిపోయాడు.
దాంతో ఊహ తెలిసేనాటికి తల్లిదండ్రులిద్దరికీ దూరమైంది పోర్షోన్. ఆ బాధ ఆమెను కుంగదీస్తుందనుకున్నారంతా. కానీ లేనివాళ్ల గురించి, కాదనుకున్నవాళ్ల గురించి బాధపడటం కంటే... ఉన్న వాళ్లతో సంతోషంగా ఉండటమే మంచిదనుకుంది పోర్షోన్. ఆంటీ, అంకుల్‌నే అమ్మానాన్నలుగా భావించి, వాళ్ల ప్రోత్సాహంతో భవిష్యత్తును మలచుకుంది.
మూడు దేశాల్లో మెరిసింది...
‘‘మీది ఏ దేశం అని ఎవరైనా అడిగితే నేను మూడు దేశాల పేర్లు చెప్పాలి’’ అంటుంది పోర్షోన్ నవ్వుతూ. ఎందుకంటే, ఇండియాలో మొదలైన ఆమె ప్రయాణం... యూకే మీదుగా సాగి ఆమెరికా దగ్గర ఆగింది. ఎనిమిదో యేట పాండిచ్చేరి బీచ్‌లో ఒక వ్యక్తి యోగా నేర్పించడం చూసిన పోర్షోన్‌కి యోగా పట్ల ఆసక్తి కలిగింది. ఆంటీతో చెబితే ‘అవన్నీ మగాళ్లకి, నీకెందుకు’ అంది. దాంతో రహస్యంగా సాధన చేయసాగింది. అది చూసి మనసు మార్చుకున్న ఆమె ఆంటీ... పోర్షోన్ కోరుకున్నట్టుగా యోగా, భరతనాట్యం నేర్పించింది. పెద్దయ్యాక మోడల్ అవ్వాలనుకుంది పోర్షోన్. కానీ అంతలో రెండో ప్రపంచయుద్ధం మొదలయ్యింది. దేశంలో పరిస్థితులు మారసాగాయి. దాంతో ఆమె కుటుంబం యూకే వెళ్లిపోయింది. అక్కడ మోడల్‌గా బిజీ అయ్యింది. బాల్‌రూమ్ డ్యాన్స్ కూడా నేర్చుకుని, ప్రదర్శనలిచ్చింది. స్థిరపడ్డాం అనుకునేలోగా వారి కుటుంబం ఉత్తర అమెరికాకి మరలింది.
అయితే ఎక్కడికెళ్లినా కొత్త గుర్తింపును తెచ్చుకోవడానికే ప్రయత్నించింది పోర్షోన్. అమెరికా వచ్చాక నటిగా కూడా మారింది. నృత్యప్రదర్శనలు ఇచ్చేది. యోగా టీచర్ కూడా అయ్యింది. వయసు పెరిగేకొద్దీ నటనకు దూరమైంది కానీ యోగా, డ్యాన్స్‌లను వదిలి పెట్టలేదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా ఆమె దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆమె శిష్యుల్లో బాలీవుడ్ తారలు కూడా ఉన్నారు. దేవానంద్ అయితే ఆమెకి అత్యంత సన్నిహితులు. తాను చనిపోయేవరకూ కూడా పోర్షోన్‌తో స్నేహాన్ని కొనసాగించారాయన.
గిన్నిస్‌బుక్ ఆమెని ‘ఓల్డెస్ట్ యోగా టీచర్ ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తించి గౌరవించింది. ఈ వయసులో ఇంత ఓపిక ఎలా వస్తోంది, మీ ఆరోగ్యం రహస్యం ఏమిటి అంటే నవ్వేస్తుంది పోర్షోన్. ‘‘యోగా నా శరీరాన్ని బలపరిస్తే, ధ్యానం నా మనసును బలపర్చింది. శాకాహారం తీసుకుంటాను. ఏదో ఒక పని చేస్తుంటాను. అంతకుమించి ఏం చేయను’’ అంటుంది సింపుల్‌గా. ఆమె ప్రతిభకు, కీర్తికి... ఈ సింప్లిసిటీ మరింత అందాన్ని అద్దుతుంది. హ్యాట్సాఫ్ పోర్షోన్!
- సమీర నేలపూడి
1962లో బిల్ లించ్‌ని పెళ్లాడింది పోర్షోన్. లించ్‌కు వైన్‌యార్డ్స్ ఉండేవి. ఇద్దరూ కలిసి ‘అమెరికన్ వైన్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించారు. తర్వాత అదిఅనేక శాఖలుగా విడిపోయింది. న్యూయార్క్ వైన్ సొసైటీకి 1970లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది పోర్షోన్. ‘ద బేవెరేజ్ కమ్యునికేటర్’ అనే పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపింది. ఇప్పటికీ పలు వైన్ కాంపిటీషన్లకు జడ్జిగా వ్యవహరిస్తుంది. 1982లో లించ్ అనారోగ్యంతో కన్నుమూశారు. పిల్లలు కూడా లేకపోవడంతో... భర్త మరణం తనకు పెద్ద వెలితిని మిగిల్చింది అంటుందామె!
యోగ విన్యాసిని
Published Sun, Feb 23 2014 10:54 PM | Last Updated on Wed, May 29 2019 2:59 PM
Advertisement
Advertisement