పేరెంట్స్, టీచర్లు, స్కూలు యాజమాన్యాలు.. చదువుల చుట్టూ పరిభ్రమిస్తున్నారే కానీ, పిల్లల చుట్టూ ఎవరూ తిరగడం లేదు. ఇందుకు భిన్నంగా ఒక సరికొత్త మార్గం ఎంచుకున్నాడు మాంజా మహదేవ అనే ఉపాధ్యాయుడు.
ఒకప్పుడు వానాకాలం చదువులు అనేవారు. వర్షం వస్తే ఇల్లే స్కూల్. ఇల్లే ఆటస్థలం. ఆ రోజుల్లో పిల్లలని స్కూల్స్‌కి తీసుకు వెళ్లడానికి మాస్టార్లు ఇంటికి వచ్చేవారు. గుమ్మంలో నిలబడి పిల్లల్ని పిలిచి వాళ్లకి తాయిలాలు పెట్టి, పిల్లల్ని చంకనేసుకుని తీసుకెళ్లేవారు. కన్నతండ్రి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని వాళ్లని ఉత్తమ పౌరులుగా తీర్చేవారు. విద్యార్థులు కూడా గురువుల పట్ల గౌరవంగా ఉండేవారు. గురుశిష్యులు ఒకరితో ఒకరు అభిమానంతో కూడిన ప్రేమతో ఉండేవారు.
రోజులు మారుతూ వస్తున్నాయి. స్కూల్ బస్సులలో పిల్లల్ని పాఠశాలలకు మోసుకెళ్తున్నారు. దీనివల్ల పిల్లలు గురువుల మధ్య అనుబంధం కొరవడింది. ‘మేము లక్షల ఫీజులు కడుతున్నాం. మా పిల్లల్ని తిట్టే కొట్టే అర్హత లేదు’ అంటున్నారు తల్లిదండ్రులు. పేరెంట్స్, టీచర్లు, స్కూలు యాజమాన్యాలు.. చదువుల చుట్టూ పరిభ్రమిస్తున్నారే కానీ, ఎవరూ పిల్లల చుట్టూ తిరగడం లేదు. ఇందుకు భిన్నంగా ఒక సరికొత్త మార్గం ఎంచుకున్నాడు మాంజా మహదేవ అనే టీచరు.
కర్ణాటక ఉడిపి జిల్లా రగిహకలు గ్రామానికి చెందిన మాంజా మహదేవ తను పని చేస్తున్న పాఠశాలలో రోజురోజుకీ విద్యార్థులు తగ్గిపోవడం గమనించాడు. పిల్లలు స్కూల్ కి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేదని, అందువల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారని అర్థం చేసుకున్నాడు. ఇంత చిన్న కారణంతో పిల్లల భవిష్యత్తు కుంటు పడడం ఆయనకు బాధ కలిగించింది. రానురాను ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 90 దగ్గర ఆగిపోయింది. తల్లిదండ్రులు కూడా మా ప్రాప్తం ఇంతే అని ఊరుకున్నారు.
కానీ నిజమైన గురువుల మనసు ఇందుకు అంగీకరించదు. అందులోనూ మాంజా మహదేవ మరింత బాధపడ్డారు. ఎలాగయినా వారిని పాఠశాలకు రప్పించాలనుకున్నారు. అందుకోసం తన మారుతి వాన్‌ను బయటకు తీసి డ్రైవర్ అవతారం ఎత్తారు! ప్రతి ఉదయం విద్యార్థులని తన కారులో స్కూలుకు తీసుకు వచ్చి, సాయంత్రం మళ్లీ వాళ్లను ఇంటి దగ్గర దింపడం మొదలుపెట్టారు. క్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం మొదలైంది. మాంజా సంతోషానికి అవధులు లేవు.
ఇదంతా పరిశీలించిన స్కూల్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ కమిటీ త్వరలోనే ఈ పాఠశాలకు ఒక వ్యాన్ మంజూరుకు ఆలోచిస్తోంది. మాంజాను ఇప్పుడు గ్రామస్థులు దేవుడిగా భావిస్తున్నారు. బడి మానేసిన 20 మంది పిల్లలు.. ఆయన చొరవతో మళ్లీ ఇప్పుడు హాయిగా చదువుకోగలుగుతున్నారు. సాధారణంగా శిష్యులు గురుదక్షిణ చెల్లిస్తారు. ఇందుకు భిన్నంగా ఈ గురువు శిష్య వాత్సల్యం చూపుతూ అపర విశ్వామిత్రుడు అయ్యారు. ఆచార్య దేవో భవ అంటారు. మహదేవో భవ అనాల్సిందే మనం.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment