టెక్నో నెక్ పోశ్చర్ అంటే...?
నా వయసు 45 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల నేను ముందుకు ఒంగిపోతున్నానంటూ నా కొలీగ్స్ చెబుతున్నారు. బహుశా దానివల్లనేమో నాకు మెడ, నడుము నొప్పి కూడా వస్తున్నాయి. నా సమస్యలు తీరడానికి ఏం చేయాలో చెప్పండి. - వంశీకృష్ణ , హైదరాబాద్
ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వ్యవధి గణనీయంగా పెరిగిపోయింది. అంతేకాదు... అటు ల్యాప్‌టాప్ గానీ, స్మార్ట్‌ఫోన్‌గానీ, టెలివిజన్ చూసేప్పుడుగానీ, ఏదైనా బ్యాగ్ మోసేప్పుడుగానీ... ఇలా ప్రతి విషయంలోనూ ముందుకు ఒంగే పనిచేస్తున్నాం. పిల్లలు కూడా గేమ్స్ ఆడే సమయంలోనూ ఇదే భంగిమను అనుసరిస్తున్నారు. దాంతో తలనొప్పులు, తీవ్రమైన అలసట, కాళ్లచివర స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, మెడ దగ్గర నొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
కూర్చోవడంలో గానీ, నిలబడటంలోగానీ ఈ తరహా లోపాల వల్ల కనిపించే సమస్యలన్నింటినీ కలుపుకొని ‘టెక్నో నెక్ లేదా టెక్ట్స్ నెక్ ‘ఐ’ పోశ్చర్’ అంటారు. గత కొంతకాలంగా మనం సాంకేతికంగా పురోగమిస్తుండం, ఇప్పుడు ప్రతివారూ కంప్యూటర్‌ను లేదా ముందుకు వంగి చూస్తూ సెల్‌ఫోన్‌నైనా ఉపయోగిస్తూ ఉండటం వల్ల మనం ఇదివరకులా నిటారుగా అంటే ఇంగ్లిష్ ‘ఐ’ అక్షరం ఆకృతిలో నిల్చోవడం తప్పిపోయింది. ఈ కింద పేర్కొన్న నిల్చున్న భంగిమల్లో మధ్య భంగిమ సరైనదని గుర్తించి, అలా నిల్చుంటే మన శరీరం అన్నివైపులా సమానమైన సౌష్ఠవంతో ఉంటుందని గ్రహించి ఎప్పుడూ ఇలా నిలబడటానికి ప్రయత్నించండి. కూర్చొని పనిచేసే సమయంలోనూ తలను నిటారుగా ఉంచండి. లేకపోతే తన బరువంతా మీ మెడపై పడుతుంది.
మీ భంగిమ సక్రమంగా ఉందో లేదో తెలుసుకోడానికి ఈ కింది స్వీయపరీక్షలు చేసుకొని సరిదిద్దుకోండి. 1) మీరు నిల్చునప్పుడు రెండు భుజాలూ సమానంగా ఉంటున్నాయా లేక ఒకటి పైకి, మరొకటి కిందికీ ఉంటోందా? 2) మీరు నడుస్తున్నప్పుడు ఏదో ఒకవైపునకు ఒంగుతున్నారా 3) మీ రెండు భుజాల నుంచి తల సమానమైన దూరంలో ఉంటుందా? ఈ స్వీయపరీక్షలతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఇక మీ సమస్యలను తగ్గించుకోడానికి యోగా, ఈత వంటి వ్యాయామాలు చేయండి. ఈతకు వెళ్లలేకపోతే కనీసం పడక మీదే కాసేపు ఈదుతున్నట్లుగా అనుకరించండి. దాంతో మీ సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
తరచు ముక్కు నుంచి రక్తం..?
మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. వేడి చేయడం వల్ల అలా అవుతుందేమో అని ఎప్పటికప్పుడు చలువ చేసే పదార్థాలు ఇస్తూ వస్తున్నాము. అయితే ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ ప్రయోజనం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- డి. రాధిక, టంగుటూరు
పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కు రంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అయితే ఇలా ముక్కు నుంచి రక్తం రావడానికి మరికొన్న కారణాలున్నాయి. అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.
నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. పిల్లల్ని ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. అలాగే వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది.
మలంలో రక్తం పడటానికి కారణాలు మలద్వారం వద్ద చీలిక (ఫిషర్)
ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కిందిభాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు.
హోమియోవైద్యం
పాజిటివ్ హోమియోపతిలో చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది.
మీరు ఆందోళన పడకుండా సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి,
హైదరాబాద్
ప్రతి వర్షాకాలంలో బాబుకు జలుబు!
మా బాబుకు పదేళ్లు. ప్రతీ ఏడాదీ వర్షాకాలంలో తరచూ జలుబు, దగ్గు వస్తుంటాయి. మందులు వాడితే అప్పటికి తగ్గుతుంది. మా పాపకు 13 ఏళ్లు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. బాబుకు మాత్రమే తరచూ ఎందుకిలా అవుతోంది. వాడెందుకు ఇలా అనారోగ్యానికి గురవుతున్నాడు. మాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీలత, ఒంగోలు
సాధారణంగా వర్షాకాలంలో మన పరిసరాల్లో, తినే ఆహారంలో, నీటిలో కాలుష్యాలు పెరగడానికి అవకాశం ఎక్కువ. దీనివల్ల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా అనారోగ్య సమస్యలు రావడానికీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు కొంతమందిలో అలర్జీ సంబంధిత సమస్యలు (కొన్ని వాతావరణాలు, ఆహార పదార్థాలు సరిపడకపోవడం) రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక మీ బాబు విషయంలో కూడా కేవలం వర్షాకాలంలోనే తరచూ జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు వస్తున్నాయి అని మీరు చెబుతున్నారు.
అంటే... మొదటి కారణం... మీ బాబుకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో నిండిన వాతావరణం, ఆహార పదార్థాల కారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తుండవచ్చు లేదా చుట్టూ ఉన్న వాతావరణం లేదా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల అతడికి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తుండవచ్చు లేదా అతడికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల ఇతరులకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన అతడు తేలిగ్గా పడిపోతుండవచ్చు. ఇలాంటివారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాబుకు ఈ సీజన్‌లోనే అనారోగ్యం కలగటానికి కారణాలను ముందుగా తెలుసుకోవాలి. ఇక చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా మిగతా ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.
మీ బాబు విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి. ఇవి మీ బాటుతో పాటు ఆరోగ్యంగా ఉండటం విషయంలో చాలామందికి ఉపయోగపడతాయి. అవి... తాగేనీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. (కాచి, వడబోసిన నీటిని వాడటం మంచిది). బయటి ఆహారం, నీరు తీసుకోకూడదు. గుంపులు గుంపులుగా ప్రజలు పోగయ్యేచోట ఆహారం, నీరు తీసుకోకపోవడం మేలు వర్షంతో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినీ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి నిల్వు ఉంచిన ఆహారాలను తీసుకోకూడదు గొంతులో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడే గోరువెచ్చని నీటిలో, కాస్త ఉప్పు వేసుకొని పుక్కిలించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారించవచ్చు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఆహారం తీసుకోవడానికి ముందు) జలుబుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో విక్స్ వేసి ఆవిరిపట్టడం వల్ల ఉపశమనం ఉంటుంది ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే మిగతా వారికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ జాగ్రత్తల తర్వాత కూడా మీ అబ్బాయి తరచూ అనారోగ్యానికి గురవుతుంటే మీకు దగ్గర్లోని ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించండి.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... సర్జరీ అవసరమా?
నేను నెల రోజుల క్రితం క్యాజువల్‌గా హెల్త్ చెకప్ చేయించుకున్నాను. పొట్ట స్కానింగ్ చేసినప్పుడు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటివరకు ఎప్పుడూ పొట్టనొప్పి రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. నేను అయోమయంలో ఉన్నా. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- ఆర్. దొరబాబు, విశాఖపట్నం
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ‘ఎసింప్టమాటిక్ గాల్‌స్టోన్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. అంటే రాళ్లు ఉంటాయిగానీ, ఎలాంటి లక్షణాలూ కనిపించవన్నమాట. ఇలాంటి కండిషన్ ఉన్న ప్రతి వందమందిలో ఇద్దరికి మాత్రమే లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే మిగతా 98% మంది నార్మల్‌గా ఉంటారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించనంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. కాబట్టి మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఒకసారి మీ రిపోర్టులు చూశాక సలహా ఇవ్వడం మంచిది. కాబట్టి మీరు మీ దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును ఒకసారి సంప్రదించండి.
నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితేనే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు.
- లక్ష్మయ్య, నిజామాబాద్
సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు.
డాక్టర్ భవానీరాజు
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్