మైక్రోసాఫ్ట్ గుర్తించిన అతిచిన్న టెక్నాలజీ స్పెషలిస్ట్...
తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ప్రణవ్ కళ్యాణ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ టెక్నాలజీ (ఎం.సి.టి.ఎస్.) నిర్వహించిన ఎ.ఎస్.పి.నెట్. ఫ్రేమ్‌వర్క్ 3.5 ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణుడై అతిపిన్న ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందాడు. దీనిని ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కంప్యూటర్ పరీక్షగా భావిస్తారు. ఇప్పటికే పిన్న వయసులో కంప్యూటర్ సైన్స్‌లో అసాధారణ ప్రతిభను కనబర్చిన వ్యక్తుల వికీపీడియా జాబితాలో ప్రణవ్ స్థానం పొందాడు.
ప్రణవ్ రెండు సంవత్సరాల వయసులోనే బొమ్మలతో కాకుండా కంప్యూటర్‌పై ఆసక్తి చూపేవాడు. లాస్‌ఏంజిలెస్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసే ఈ చిన్నది తండ్రి కళ్యాణ్‌కుమార్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ప్రణవ్‌కు ఉన్న ఆసక్తి చూసి ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధం చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచి ప్రణవ్ హెచ్‌టిఎమ్‌ఎల్ ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం ప్రారంభించి, రానురాను కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి పెంచుకున్నాడు.
ప్రణవ్ లెక్కల్లో చాలా చురుగ్గా ఉంటాడని, 18 నెలల పాటు ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధమయ్యాడని అతని తండ్రి తెలిపారు. శని, ఆదివారాల్లో ఎనిమిది గంటల పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సమయం కేటాయించేవాడని ఆయన అన్నారు.
‘భవిష్యత్తులో ఏం అవుతావు’ అని అడిగితే... ‘కంప్యూటర్ ప్రోగ్రామర్‌గానే కాకుండా అంతరిక్ష వ్యోమగామి కూడా కావాలనుకుంటున్నాను’ అని ప్రణవ్ బదులిచ్చాడు.