టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...! | Teddy Bear Picnic Day Celebrated On July 10 | Sakshi
Sakshi News home page

మీకూ ఉందా ఓ సుతిమెత్తని ప్రియనేస్తం!

Published Wed, Jul 10 2019 2:06 PM | Last Updated on Mon, Jul 15 2019 8:07 PM

Teddy Bear Picnic Day Celebrated On July 10 - Sakshi

పేద్ద తల... చిన్ని కళ్లు.... గుండ్రటి ముక్కు... చూడగానే హత్తుకోవాలి అనిపించే ‘సుతిమెత్తని’ రూపం.. ప్రేయసి అలకను తీర్చేందుకు ప్రియుడు... పిల్లల మారాన్ని ఇట్టే మాయం చేసేందుకు పెద్దలు.. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఆకట్టుకునే.. అందరికీ అందుబాటులో ఉండే ముచ్చటైన బహుమతి బుజ్జి ఎలుగుబంటి అదేనండీ టెడ్డీబేర్‌.

సాక్షి, వెబ్‌ప్రత్యేకం : చిన్నా, పెద్దా అందరికీ ప్రియనేస్తంగా మారిన టెడ్డీబేర్‌ గుర్తుగా జూలై 10న కెనడా, యూరప్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రత్యేకంగా టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డేని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బోలెడన్నీ టెడ్డీబేర్ల మధ్య తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి కిండర్‌గార్డెన్‌లో టీ పార్టీ చేసుకుని సరదాగా గడుపుతారు. 1988 నుంచి వివిధ దేశాల్లో దీనిని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా ప్రతీ చిన్నారి చేతిలో కనిపించే ఈ టెడ్డీబేర్‌ పుట్టుక, టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది తెలుసా!!

మనసొప్పక వదిలేశారు!
1902 నవంబరులో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. ఈ క్రమంలో వేటకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు ఆయనకు ఓ గాయపడిన ఎలుగుబంటిని బహూకరించారు. చెట్టుకు కట్టేసి దానిని కాల్చాలని కోరారు. అయితే బుజ్జి పిల్ల అయిన ఆ ఎలుగుబంటి ప్రాణాలు తీయడానికి రూజ్‌వెల్ట్‌కు మనసొప్పక.. జాలితో దానిని విడిచిపెట్టేశారు. ఈ సంఘటన గురించి క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు చక్కని కార్టూన్ రూపొందించారు. ఓ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్‌ ఆధారంగా బొమ్మల షాపు యజమానులు రోజ్‌, మోరిస్‌ మిచ్‌టమ్‌ ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి అధ్యక్షుడి అనుమతితో దానికి ‘టెడ్డీబేర్‌’ అని నామకరణం చేశారు. ఈ విధంగా ‘నిన్ను నేను సంరక్షిస్తాను’ అనే భావనకు ప్రతిరూపంగా ‘టెడ్డీ బేర్’  అనే బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది.

అలా మొదలైంది!!
జాన్‌ వాల్టర్‌ అనే అమెరికన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ 1907లొ ది టెడ్డీ బియర్స్‌ పిక్‌నిక్‌ అనే పాటను రాశారు. ఎంతో హృద్యంగా సాగిపోయే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1932లో జేమ్స్‌ కెన్నడీ మరో రైటర్‌ ఇదే పాటను కాస్త మార్చి చిన్నారుల గుండె తాకేలా కంపోజ్‌ చేశారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్స్‌ సాంగ్‌ను దాదాపుగా అందరూ టాప్‌ మ్యూజిషియన్స్‌ సరికొత్తగా రూపొందించడం మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన ఈ పాట అందరి మనుస్సుల్లో చెరగని ముద్ర వేసింది.

ఈ క్రమంలో టెడ్డీబేర్స్‌ పిక్‌నిక్‌ ఆధారంగా1988లో కలెక్టిబుల్స్‌(వివిధ రకాల వస్తువుల సేకరించే) డీలర్‌ రాయల్‌ సెలాంగర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కంపెనీ జ్యువెల్లరీ బాక్సులు, ఆట వస్తువుల విడుదల సందర్భంగా టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డే పేరిట వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా కేరింతలు కొడుతున్న చిన్నారులను చూసిన చాలా మంది తల్లిదండ్రులు.. వారి పిల్లల పుట్టినరోజున ఇదే థీమ్‌తో పార్టీలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు.  ఈ విధంగా అనతికాలంలోనే టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో జూలై 10 ను జాతీయ టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డేగా యునైటెట్‌ స్టేట్స్‌ ప్రకటించింది. క్రమేపీ కెనడా, యూరోప్‌, ఆస్ట్రేలియాల్లో కూడా ఈరోజును హాలీడేగా ప్రకటించి.. కిండర్‌గార్డెన్‌లలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందంచడం మొదలుపెట్టాయి. అలా కిండర్‌గార్డెన్లలో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆడుకునేలా సరికొత్త సంప్రదాయానికి తెరతీశాయి. ఇక ఆనాటి బుజ్జి ఎలుగుబంటి పుణ్యమాని నేటికీ చిన్నారుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఓ రోజును కేటాయిస్తూ వారితో  గడిపే అవకాశం దక్కింది.

ఒక్కోచోట ఒక్కోలా...
టెడ్డీబేర్‌ పిక్‌నిక్‌ డేను ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు. కెనడాలో చిన్నా, పెద్దా అంతా తమ టెడ్డీలతో కలిసి ‘ది టెడ్డీబేర్‌ మ్యాన్‌’ను చూసేందుకు వెళ్తారు. అనంతరం అతడితో కలిసి డ్యాన్స్‌ చేస్తారు. ఇక ఆస్ట్రేలియాలోని వెస్ట్‌మీడ్‌లో సిటీ అంతటా పిక్‌నిక్‌ డే కార్యక్రమం ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బును చిన్నారుల ఆస్పత్రికి విరాళంగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల బాల్యం నుంచే పిల్లల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడం వారి ఉద్దేశం.

ఇదండీ.... చుట్టూ ఎవరూ లేనప్పుడు మన భావోద్వేగాలకు సాక్షీభూతంగా నిలిచే ప్రియనేస్తం టెడ్డీబేర్‌ కథాకమామీషు. ఇంకెందుకు ఆలస్యం  మీరు కూడా టెడ్డీబేర్‌ను తీసుకుని ప్రియమైన వారితో కలిసి మీకు ఇష్టమైన చోటికి వెళ్లి హాయిగా గడపండి!!
- సుష్మారెడ్డి యాళ్ల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement