సంగీతమే ప్రాణంగా ‘కోయిలమ్మ’ సీరియల్‌లోని చిన్ని పాత్ర ఉంటుంది. స్టార్ మా టీవీలో వచ్చే ఈ సీరియల్ ద్వారా చిన్ని పాత్రతో తెలుగింటికి పరిచయం అయ్యింది తేజస్విని. అందంలోనూ, అభినయంలోనూ భేష్ అనిపించుకుంటున్న ఈ కన్నడ కోకిల ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు...
మీరు కన్నడ, తెలుగు బుల్లి తెరకు ఎలా పరిచయం అయ్యారు?
బెంగుళూరులోని థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. అంతకు మూడునెలల ముందు ‘బిలీ హెన్సీ’ అనే కన్నడ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ నుంచే నాకు ‘కోయిలమ్మ’ సీరియల్ ఆఫర్ వచ్చింది. తెలుగింటికి పరిచయం చేసిన ‘స్టార్ మా’ వాళ్లకు ముందుగా థాంక్స్. ఈ ప్రాజెక్ట్‌కు ముందు ‘కోయిలమ్మ’ సీరియల్ చూశాను. బాగా నచ్చింది. పెద్దయ్యాక ‘చిన్ని’గా నేను ఎలా ఉంటానో, ఆ పాత్ర ద్వారా తెలుగువారు నన్ను రిసీవ్ చేసుకుంటారోలేదోనని నాలుగు వారాలు చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు బయటకు వెళితే ‘చిన్ని చిన్ని’ అని పిలుస్తున్నారు. ఈ పాత్ర ద్వారా నాకు మంచి పేరు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
మీ ఫ్యామిలీ గురించి..
నేను, అమ్మ భ్రమరాంబ బెంగుళూరులో ఉంటాం. అమ్మ సివిల్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నారు. అమ్మనాన్నలకు నేను ఒక్కత్తే కూతురుని. ఐదేళ్ల క్రితం మా నాన్నగారు(మల్లికార్జున్) చనిపోయారు. టీవీ ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలో ఆసక్తి ఉండటం వల్ల డ్యాన్స్ నేర్చుకున్నాను. జాబ్ మానేసి థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను.
సీరియల్‌లో మాదిరిగానే లైఫ్‌లో మలుపులు..
(నవ్వుతూ) సీరియల్‌లో చాలా ట్విస్టులు ఉన్నాయి. నా జీవితంలో అలాంటివేవీ లేవు. చాలా సింపుల్‌గా గడిచిపోతోంది. నన్ను ఈ రంగంలోకి పంపే ముందు అమ్మ కొంత ఆలోచించారు. కానీ, సాంస్కృతిక రంగం పట్ల నాకుండే ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఇక్కడ షూటింగ్ వారం విడిచి వారం ఉంటుంది. అందువల్ల వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకొని వెళతాను.
‘చిన్ని’పాత్ర సింగర్.. బయట ?
నాకు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. మ్యూజిక్ నేర్చుకున్నాను. ‘కోయిలమ్మ’ కూడా సింగింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్. నాకు నచ్చిన కాన్సెప్ట్ అవడంతో మరింత హ్యాపీ. ఈ పాత్ర ద్వారా తెలుగింటి వారినుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. జనాలంతా గుర్తించాలి. ఈ ఇండస్ట్రీకి రాకముందు డ్యాన్స్, మ్యూజిక్ ..అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు వీటితో పాటు ఈ ఇండస్ట్రీయే నా ఇంట్రస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటుంటారు. ‘సాఫ్ట్‌వేర్ రొటీన్ ఫీల్డ్. నువ్వు లక్కీ. నచ్చిన క్రియేట్ ఫీల్డ్‌ను ఎంచుకున్నావు..’ అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment