చూపులు కలవడం...ప్రేమించడం...
పార్కులు... షికార్లు... ఐస్‌క్రీములు.. చాకొలేట్లు...
గంటల తరబడి ఫోన్ చాటింగ్‌లు...
కొన్నిరోజులకి బ్రేకప్‌లు... మరో ప్రయత్నం... మరో బ్రేకప్...
మరో ప్రయత్నం... మరో బ్రేకప్...
ఇదంతా యువజంటలకు సర్వసాధారణం!
ఈ అంశాన్ని ఎంతో హాస్యంగా ‘పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ చిత్రం ద్వారా చిట్టి తెరమీద చూపాడు వెంకట్ కర్నాటి.
డెరైక్టర్స్ వాయిస్: మాది నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. ఒకలా చెప్పాలంటే నాకు సినిమాలంటే చాలా పిచ్చి. ఇంటర్ పూర్తి కాగానే ఉద్యోగం రావడంతో అక్కడితో చదువు ఆపేశాను. ఆ తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తిచేశాను. సినిమాల మీద ఉండే ఆసక్తి కొద్దీ, యానిమేషన్ కోర్సు పూర్తి చేశాను. డీక్యూ ఎంటర్‌టెయిన్‌మెంట్లో త్రీడీ యానిమేటర్‌గా పనిచేశాను. ఆ తరవాత ఉద్యోగం మానేసి, ‘ఉయ్యాలజంపాల’ చిత్రం తీస్తున్న విరించివర్మ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. ఈ రంగంలో నేనింత చురుకుగా పాల్గొనడానికి మా తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. నా ఫ్రెండ్ ‘నానీ’ వల్ల నాకు ఈ ప్రాజెక్టు చేసే అవకాశం వచ్చింది. కథ ప్రకారం ఇందులోని క్యారెక్టర్లకి రెండు పేర్లు ఉండాలి. అందువల్ల మిత్రులంతా... పవన్‌కల్యాణ్ అనే పేరు సూచించడంతో, వెంటనే నేను ఆ పాత్రకు అనిరుధ్‌ని సెలక్ట్ చేసుకున్నాను. ‘ఐ క్లిక్ మూవీస్ (iqlik movies) వారి సహకారంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాను. అజయ్ అరసాడ సంగీతం చేశాడు. ఈ ప్రాజెక్టు వల్ల నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా చూసి వెన్నెల కిశోర్‌గారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘సల్మాన్‌ఖాన్ షాదీ’ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలోకి రీ మేక్ చేస్తున్నాం.
షార్ట్ స్టోరీ: పవన్ కల్యాణ్ అనే కుర్రవాడు, పవన్ పేరుతో కొందరు అమ్మాయిలకు, కల్యాణ్ పేరుతో మరి కొందరు అమ్మాయిలకు లైన్ వేస్తుంటాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమకబుర్లు చెబుతుంటాడు. ఇలా ఎందరో అమ్మాయిలతో ప్రేమలో పడడం, విషయం బయటపడటంతో బ్రేకప్ చెప్పడం అతనికి ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటు వల్ల అతనికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏమిటో చిట్టి తెర మీద చూడవలసిందే.
కామెంట్: ‘పవన్‌కల్యాణ్’ పేరు పెట్టాడే కాని కథకు పవన్‌కు సంబంధం లేదని ముందుమాటలోనే వివరించాడు దర్శకుడు. కథను మంచి క్వాలిటీతో చిట్టితెరకు ఎక్కించారు ఐక్లిక్ మూవీస్. ప్రేమించడంలోనూ, బ్రేకప్ చెప్పడంలోనూ ఎంతో సునిశిత హాస్యం చూపాడు దర్శకుడు. హీరోగా అనిరుధ్, ఫ్రెండ్‌గా పడమటిలంక నవీన్ చాలా బాగా చేశారు. హీరోయిన్లుగా నటించిన అమ్మాయిలు బాగున్నారు కాని, వాయిస్‌లో మాత్రం పట్టు లేదు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవలసిందే. మంచి గొంతు ఉన్నవారితో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది.
సంభాషణలు సరదాగా ఉన్నాయి. ‘పువ్వుల్లో పెట్టి దాచుకుంటే తుమ్మెదలు వచ్చి వాలతాయని, గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు’ ‘అబద్ధాన్ని గొప్పగా చెప్పచ్చు, కాని నిజాన్ని నిజం కంటె గొప్పగా చెప్పలేం కదా’ ‘హృదయానికి నాలుగ్గదులుంటాయి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరుంటారు’ ‘ఫ్రెండనుకున్నాడా, ఏటిఎం అనుకున్నాడా’ వంటి సంభాషణలు కథకు అందం తీసుకువచ్చాయి. దర్శకుడు వెంకటే స్వయంగా సంభాషణలు రచించాడు. పాటల చిత్రీకరణ, ట్యూన్స్, లొకేషన్స్, కెమెరా, టేకింగ్... అన్ని విషయాలలోనూ మంచి క్వాలిటీ చూపారు. ఈ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మూడురోజుల్లోనే రెండు లక్షల మంది చూశారు. ఈ దర్శకుడు చిన్నచిన్న లోపాలను సరిచేసుకుంటే ఇతనికి నూటికినూరు మార్కులు ఇచ్చేయవచ్చు.
మీరు స్టూడెంటా! యూట్యూబ్‌లో మీ షార్ట్‌ఫిల్మ్‌లు పెట్టారా! అయితే మీ లఘుచిత్రాలకు సంబంధించిన వివరాలను,
మీ ఫోన్ నంబర్లను ఈ కింద ఇచ్చిన మెయిల్‌కు పంపండి. మంచివాటిని పరిశీలించి
‘యూట్యూబ్ స్టార్’ లో పరిచయం చేస్తాం. sakshiutube@gmail.com
- డా. వైజయంతి
పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు!
Published Wed, Dec 4 2013 11:29 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM
Advertisement