cautuppal
-
యువతుల కిడ్నాప్‌నకు యత్నం
చౌటుప్పల్: స్థానిక కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు యువతులను ఓ యువకుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. యువతులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడి బారి నుంచి తప్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంఎంఆర్ కళాశాలలో జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌కు వచ్చారు. స్థానిక చిన్నకొండూర్ చౌరస్తా వద్ద బస్సు దిగారు. తాము వచ్చిన విషయాన్ని తమ ఉపాధ్యాయుడికి తెలిపారు. వారున్న చోటుకు కారు పంపిస్తానని ఆయన వారికి చెప్పాడు. అదే సమయంలో చిన్నకొండూర్ రోడ్డు మీదుగా హైవేపైకి కారులో వచ్చిన ఓ యువకుడు వారిని పలకరించాడు. తాము తంగడపల్లి ఎంఎంఆర్ కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో, తానూ అక్కడికే వెళ్తున్నానని, తనతో తీసుకెళతానని వారిని కారులో ఎక్కించుకున్నాడు. నేరుగా వలిగొండ చౌరస్తా వద్దకు వెళ్లిన యువకుడు కారును హైదరాబాద్ వైపు మళ్లించాడు. దీన్ని గమనించిన యువతులు తమవారికి ఫోన్ చేయబోగా ఆ యువకుడు ఒకరి ఫోన్ లాక్కున్నాడు. మరో యువతి వేగంగా స్పందించి తమ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. దీంతో భయపడిన ఆ యువకుడు వెంటనే కారులో ఉన్న యువతులను అక్కడే దింపి పారిపోయాడు. కారు నంబర్‌ను నోట్ చేసుకున్న యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు చౌటుప్పల్‌కు చెందిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యం
చౌటుప్పల్ :ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేయడం వ్యాపారులకు నిత్యాకృత్యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల అక్రమ వ్యాపారుల పంట పండుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బియ్యాన్ని తరలించాలంటే అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి వాహనంలో లోడు విలువను బట్టి ఐదు శాతం ట్యాక్స్ చెల్లించాలి. కానీ ట్యాక్స్ చెల్లించేందుకు అధికారులు సిద్ధపడట్లేదు. తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తే.. తిమ్మినిబమ్మిని చేసి నామమ్రాతంగా చెల్లించి అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ చెల్లించిన దానికంటే రెండింతలు ఎక్కువగా లోడును తీసుకెళ్తారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎప్పుడోఒకప్పుడు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా నాలుగు డీసీఎంల బియ్యం పట్టివేత ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాలుగు డీసీఎం వాహనాల్లో తరలుతున్న బీపీటీ బియ్యంతోపాటు ఇసుకను తీసుకెళ్తున్న మరో డీసీఎంను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి వద్ద జాతీయ రహదారిపై జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలుతున్న బియ్యం, ఇసుక డీసీఎం వాహనాలను గుర్తించా రు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న ఒక డీసీఎంతో పాటు అదే జిల్లా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న రెండు డీసీఎంలు, అలా గే గరిడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న మరో డీసీఎంను పట్టుకున్నారు. ఇవేకాక, నకిరేకల్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఇసుక డీసీఎం పట్టుబడింది. సరుకుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ కేసుకు సంబంధిచిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారూలకు అందించామని విజిలెన్స్ సీఐ రాజు తెలిపారు. ఆయా శాఖల అధ్వర్యంలోనే కేసులు నమోదు చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా నాలుగు డీసీఎంలలో ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్న విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. -
ఏప్రిల్‌లో వాటర్‌గ్రిడ్‌పైలాన్ ఆవిష్కరణ
చౌటుప్పల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి చిహ్నంగా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్‌ను ఏప్రిల్ మొదటి వారంలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తె లిపారు. సోమవారం పైలాన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పైలాన్ ఆవరణలో ఒకే రకమైన మొక్కలు కాకుండా, వివిధ రకాల మొక్కలు నాటాలని సూచించారు. పైలాన్‌కు నాలుగు వైపుల నుంచి వేస్తున్న రోడ్లను సుందరం తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పైలాన్ నిర్మాణ పనులు మరో ఐదారు పూర్తికానున్నాయన్నారు. ప్రస్తుతం నిర్మాణాలకు తుదిమెరుగులు దిద్దుతున్నట్టు వివరించారు. పనులు వేగవంతంగా పూర్తిచేసిన ఆర్డ బ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్లును అభినందించారు. అలాగే హరితహారం పథకం కింద జిల్లాలో 4.86కోట్ల మొక్కలు నాటేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 470 నర్సరీల్లో 4.30కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు వివరించారు. మరో 30లక్షల యూకలిప్టస్ మొక్కలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, దీన్‌దయాల్, తహసీల్దార్ షేక్ అహ్మద్, ముటుకుల్లోజు దయాకరాచారి, తరుణ్, సైదాసాహేబ్ తదితరులున్నారు. కథలు చెప్పొద్దు.. ఏడీపై ఆగ్రహం చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని టెక్స్‌టైల్‌పార్కును సోమవారం ఉదయం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సందర్శించారు. ఇటీవల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.5కోట్లు విడుదల చేసిందని, దీనికి అనుగుణంగా పార్కులో మౌళిక వసతుల క ల్పనకు ఆర్అండ్బీ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. యూనిట్లను పరిశీలించారు. యూనిట్లకు అవసరమైన కార్మికులను అందించేందుకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం సక్రమంగా నడవకపోవడంపై చేనేత జౌళిశాఖ ఏడీ సంజీవరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటిసాకులు, కట్టుకథలు చెప్పొద్దు, పనితీరును మార్చుకోండి, నిరంతరంగా శిక్షణ కేంద్రంను నడపాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ షేక్‌అహ్మద్, హరిశ్చంద్రారెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, దబ్బటి కృష్ణ తదితరులున్నారు. చోరీపై ఎస్పీతో మాట్లాడిన కలెక్టర్ టెక్స్‌టైల్‌పార్కులోని కుట్టుశిక్షణ కేంద్రంలో ఇటీవల చోరీ జరిగింది. రూ.4లక్షల విలువైన కుట్టుమిషన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ ఏడీ సంజీవరావును ప్రశ్నించారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీసులు ఇంత వరకు దొంగలను పట్టుకోలేదని సమాధానమిచ్చారు. దీంతో కలెక్టర్ నేరుగా ఫోన్లో ఎస్పీతో మాట్లాడారు. వారం రోజుల్లో దొంగలను పట్టుకోవాలనిఆదేశించారు. ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణకు సన్నాహాలు వాటర్ గ్రిడ్ పైలాన్‌ను దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీని కూడా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. -
‘మావో’ పోస్టర్ల కలకలం
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో ఆదివారం రాత్రి మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చౌటుప్పల్ గ్రామపంచాయతీ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, చైతన్య కళాశాల గోడలకు నాలుగు పోస్టర్లు అంటించారు. సోమవారం ఉదయం పోస్టర్లను గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారమందిం చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సిబ్బందితో హుటాహుటీనా వెళ్లి, పోస్టర్లను తొల గిం చారు. పోస్టర్లపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్న రాజకీయ నాయకులకు, ప్రభు త్వ అధికారులకు శిక్ష తప్పదు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉద్యమించండి. మోదీ, ఒబామా దిష్టిబొమ్మలను దహనం చేయండి. 26న భారత్ బంద్‌ను జయప్రదం చేయం డి. ఎఫ్‌డీఐలతో లాభం పొందే రాజ కీయ నాయకులను, విదేశీ పెట్టుబడిదారులను, చిల్లర వర్తక రంగం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించండి అని మావోయిస్టు పార్టీ పేరు రాసి ఉంది. కాగా, చౌటుప్పల్‌లో మండలంలో రెండు నెలల కాలంలో రెండో సారి పోస్టర్లు వెలువడడం ఆందోళన కలిగిస్తోంది. డిసె ంబర్ 4వ తేదీన తాళ్లసింగారం, లింగోజిగూడెం, మందోళ్లగూడెం,పెద్దకొండూరు గ్రామాల్లో పోస్టర్లు వెలువడిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవినీతి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తూ, పోస్టర్లు వెలిశాయి. మండలంలో ఇటీవలి కాలంలో పోస్టర్లు వెలుస్తుండడంతో మావోల కదలికలపై అనుమానం రేకెత్తుతోంది. పైకి పోలీసులు ఆకతాయిల ప నేనని పైకి కొట్టిపారేస్తున్నారు. సానుభూతిపరుల పనే: డీఎస్పీ మోహన్‌రెడ్డి చౌటుప్పల్ మండలంలో వెలిసిన మావోయిస్టు పోస్ట ర్లు సానుభూతిపరుల పనిగా భువనగిరి డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి అభివర్ణించారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. మావోయిస్టు పో స్టర్లపై పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లుతో మా ట్లాడారు. పోస్టర్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పోస్టర్లు వేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూ దాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాలకు చెందిన దాదాపు 150మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని, విచారించామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు కూడా చేశామన్నారు. పోస్టర్లను చూస్తుంటే గతంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేసిన వారి పనే అయి ఉంటుందని అవగతమవుతుందన్నారు. ఈప్రాం త ంలో మావోయిస్టులు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. -
బంగారుకొండ..భలే భలే గుట్టలు
చౌటుప్పల్ / సంస్థాన్ నారాయణపురం :‘‘ఎంతో అద్భుతమైన గుట్టలు.. వేలఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లు గుర్తుకొస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది’’... ఇదీ రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. మన జిల్లాతో పాటు రంగారెడ్డి సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన గాలి మోటార్లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు. మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు. రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంత రం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గంటసేపు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి, 2.10గంటలకు హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. కేసీఆర్ మొత్తంగా రెండున్నర గంటలపాటు రాచకొండలోనే గడిపారు. నోవాటెల్ జొన్నరొట్టె మస్తు..మస్తు రాచకొండలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే లంచ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించారు. ఆయన జొన్నరొట్టె, చికెన్, చేపలతో తన భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రాచకొండకు కేసీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు. కట్టుదిట్టమైన బందోబస్తు రాచకొండలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్‌జోన్. దాదాపు 20సంవత్సరాల పాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంతవరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గురయ్యారు. తొలుత ఈ నెల3నే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదాపడ్డట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల కాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 500మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండ్ అయిన గుట్టల చుట్టూ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్టా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం పర్యటనను డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్ రావులు పర్యవేక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ఆర్డీఓలు, దేవ రకొండ, భువనగిరి డీఎస్పీలు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ‘టైం’టేబుల్ ఇదీ.... సీఎం కేసీఆర్ మంత్రులు గుంటకడ్ల జగ దీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మలతో కలిసి, రాచకొండలో 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 11:40 నిమిషాల నుంచి 11:52 నిమిషాల వరకు రాచకొండ గుట్టల్లోని భూములను నల్లగొండ, రంగారెడ్డి కలెక్టర్లు సీఎంకు మ్యాపుల ద్వారా వివరించారు. మంత్రులు జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్‌లు మొదటి విడతలో హెలికాప్టర్లో 12 గంటలకు ఏరియల్ సర్వేకు వెళ్లారు.12.15 గంటలకు కిందకు దిగారు. రెండో విడతలో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు 12.25గంటలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. 12.47గంటలకు కిందికి దిగారు. అనంతరం సీఎం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. తిరిగి 2.10గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి : బూర నర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి తెలంగాణ రాష్ర్టంలో పెట్టబడులు పెట్టేందుకు 60విదేశీ సంస్థలు సీఎం కేసీఆర్‌ను కలిశాయి. సోలార్ పరిశ్రమ, ఫార్మాసిటి, ఫిలింసిటీ, ఎకోటూరిజం, అమెరికాకు చెందిన డిస్నీలాండ్, రోస్కంపెనీ లాంటి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 42వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. వీటన్నింటినీ కలిపి అతిపెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భాగంగానే ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. సర్వే పూర్తయితే, ఈ భూమిని క్లస్టర్లుగా విభజించి, ఎడ్యుకేషన్ హబ్, ఫిలింసిటీ, డిఫెన్స్సిటీ, ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించనుంది. మొత్తంగా మరుగునపడ్డ రాచకొండ చరిత్ర ప్రాచుర్యంలోకి రానుంది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు: కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మునుగోడు వెనుకబడిన నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వ ద్ద అనేక ఆలోచనలున్నాయి. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న రాచకొండకు మహర్దశ పట్టనుంది. కేసీఆర్ ఏరియల్ సర్వేతో ఈ ప్రాంతాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ముశ్చర్ల మీదుగా రాచకొండ వరకు, 65వ నంబరు హైవే నుంచి రాచకొండకు నాలుగులేన్ల రోడ్డు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి, స్వాధీనం చేసుకున్నాక, క్లస్టర్లుగా విభజించనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తోంది. -
కూతురుని చంపి, తల్లి ఆత్మహత్య
చౌటుప్పల్ : భర్త వేధింపులకు తాళలేక 11నెలల పసిగుడ్డును చంపి, ఓ మాతృమూర్తి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కాసోజు అనిత (21), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కొండోజు ప్రవీణ్‌చారి (26)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 11నెలల పాప స్పందన ఉంది. ప్రవీణ్‌చారి కులవృత్తి చేస్తున్నాడు. అనితకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తాత నానమ్మలే పెంచిపెద్దచేశారు. ఇంటర్మీడియట్ వరకు చదివించి పెళ్లిచేశారు. పెళ్లయిన నాటినుంచి ప్రవీణ్‌చారి వరకట్నం కోసం వే ధిస్తున్నాడు. గత 15రోజుల క్రితం అనిత కూతురుతో కలిసి, పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం తాత నానమ్మలతో అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, కూతురు ఊపిరి ఆడకుండ చేసి చంపింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాతనానమ్మలు వచ్చి చూసి, లబోదిబోమన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాచకొండపై నజర్
చౌటుప్పల్ : పరిశ్రమల ఏర్పాటు, ఫిలింసిటీ, వాటర్‌గ్రిడ్ నిర్మాణం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు కావాల్సిన భూమి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ అటవీప్రాంతాన్ని, పరిసర గ్రామాలను డిసెంబర్ మూడో తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. కాగా, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వీటిని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసి, భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచనతోనే పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కే టాయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాచకొండ ప్రాతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, 65వ నంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనదిగా ప్రభుత్వం భావిస్తోంది. ఫిలింసిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతం రాచకొండ ప్రాంతం సినీ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా ప్రభుత్వం భావిస్తోంది. రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటన కూడా చేశారు. అయితే హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉన్న చిత్ర పరిశ్రమ రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోకుండా ఉండేందుకు రాష్ట్ర రాజధాని నగరం సమీపంలో హైటెక్ హంగులతో సినిమా, సీరియళ్ల చిత్రీకరణకు అనుగుణంగా అలాగే స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిపించేలా 2వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన 2వేల ఎకరాల ప్రభుత్వభూమి హైదరాబాద్ సమీపంలో మరెక్కడా లేదు. దీనికి తోడు రాచకొండ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని, ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా కేవలం 25కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ప్రాంత మంతాగుట్టలతో నిండి, ప్రకృతి అందాలను మైమరపించే లొకేషన్లతోపాటు, గుట్టలపై నుంచి జాలువారే సెలయేళ్లు ఉన్నాయి. సుమారు 400సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాకతీయుల పాలన నాటి అపురూపవైన కట్టడాలు, చారిత్రక సంపద ఎంతో ఉంది. రామోజీ ఫిలిం సిటీ కూడారాచకొండకు కేవలం 15కిలోమీట్ల లోపే ఉండడంతో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేస్తోంది. రాచకొండ మీదుగా మరో రింగు రోడ్డు .. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డుకు అనుసంధానంగా, హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న జాతీయ రహదారులను కలుపుతూ ప్రభుత్వం మరో రింగురోడ్డుకు రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్‌నుంచి 60నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఈ రింగురోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. కరీంనగర్, వరంగల్, విజయవాడ, సాగర్, శ్రీశైలం హైవేలను అనుసంధానించడం ద్వారా హైదరాబాద్‌కు వచ్చే వాహనాల తాకిడిని తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డు రాచకొండ మీదుగా వెళ్లనుంది. త ద్వారా రాచకొండలో ఏర్పాటయ్యే ఫిలిం ఇండస్ట్రీ, పరిశ్రమలకు కూడా రవాణా సౌకర్యం కల్పించవచ్చన్న యోచనలో ఉంది. దీనికి తోడు కృష్ణాజలాల కోసం మునుగోడు నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు నీటి అవ సరాలను కూడా అధిగమించొచ్చన్న ఆలోచన చేస్తోంది. ఆ పక్కన పరిశ్రమలు.. రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండకు ఈ ప్రక్కన సంస్థాన్ నారాయణపురం మండలం ఉంటే, ఆ పక్కన మంచాల మండలం ఉంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయిం చింది. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసీ అధికారులు ఆ భూములను పరిశీలించారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
చౌటుప్పల్ : భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందోళ్లగూడెం గ్రామానికి చెందిన ఎన్నపల్లి వెంకట్‌రెడ్డి, వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన రజిని(31)లు 6సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే రజినికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు క ట్నం తీసుకురమ్మని వేధించేవాడు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. గతంలో ఓ హత్య కూడా చేశాడు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, రజినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. 2సంవత్సరాల క్రితం నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇతడిపై కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి వెంకట్‌రెడ్డి రజినితో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిని ఉదయం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన వెంకట్‌రెడ్డి, తల్లి సత్తమ్మలు వెంటనే చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రజిని మృతిచెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంకట్‌రెడ్డి,రజిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో వేసి, తల్లి సత్తమ్మను ఎక్కించి ఇంటికి పంపించాడు. అతను అక్కడి నుంచే జారుకున్నాడు. తల్లి సత్తమ్మ ఇంటికి వచ్చి, మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచి, ఆమె కూడా పరారయ్యింది. గ్రామస్తులు రజిని తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో, వారు వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త వెంకట్‌రెడ్డి, అత్త సత్తమ్మలపై కేసునమోదు చేసినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు. కాగా, రజినికి 2సంవత్సరాల వయస్సు గల పాప ఉంది. -
మోక్షం కలిగేనా..?
చౌటుప్పల్ : కాలంచెల్లిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతుండడంతో, వీటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జపాన్, ఇంగ్లండ్ దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా 6రాష్ట్రాల్లో మానవ రహిత కంప్యూటరీకరణ ద్వారా వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో సర్వేనంబర్486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10 ఎకరాల భూమిని కేటాయించారు. 2012, ఆగసులో భూమిని చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. గుట్టను ఇటాచీల సాయంతో తవ్వి, కొంతవరకు చదును చేశారు. ఇదే సర్వేనంబరులో క్రషర్ మిల్లులకు భూమిని కేటాయించారు. క్రషర్ మిల్లులకు సమీపంలోనే వాహనాల సామర్థ్య కేంద్రానికి భూమిని కేటాయించడంతో, క్రషర్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. రెండింటికి మధ్య కనీసంగా 500గజాల దూరం లేకపోవడంతో, కోర్టు స్టేతో ఏడాదిన్నర క్రితం వాహనాల సామర్థ్య కేంద్రం పనులు నిలిచిపోయాయి. నిధులు వెనక్కివెళ్లే ప్రమాదం.. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లతోపాటు మన రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్లను మంజూ రు చేసింది. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.15కోట్ల చొప్పున మంజూరు చేసింది. మిగతా రాష్ట్రాల్లో ఫిట్నెస్ సెంటర్ల పనులు పూర్తి కావస్తున్నా, మన రాష్ట్రానికి మంజూరైన ఫిట్నెస్ సెంటర్ పనులకు కోర్టు స్టే రూపంలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రూ.1.50కోట్లు విడుదల కావడంతో, భూమి చదు ను చేసే పనులతోపాటు భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. ఆర్అండ్బీ అధికారులు భూమిని చదును చేసే పనులను కొంతవరకు చేశారు. ఈ కేంద్రం పనులు త్వరగా ప్రారంభించి, నిధులను ఖర్చు చేయకపోతే, కేంద్రం విడుదల చేసిన మిగిలిన నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. కేంద్రం నిర్మాణం పూర్తయితే.. ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్‌ను 65వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలన్నింటినీ ఇక్కడ తనిఖీ చేస్తారు. ఇంగ్లండ్, జపాన్ దేశాల నుంచి వచ్చే యంత్రాల సాయంతో మానవ ప్రమేయం లేకుండానే వాహనాల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రతి వాహనం కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత ఇక్కడ కచ్చితంగా పరీక్షించాలి. సామర్థ్యం బాగుందనుకుంటేనే, ఆ వాహనం తిరిగేందుకు అవకాశమిస్తారు. ఒకవేళ ఆ వాహనాలకు కాలంచెల్లితే రోడ్డెక్కకుండా, తగిన చర్య తీసుకుంటారు. భూ కేటాయింపునకు తాజా ప్రతిపాదనలు సర్వేనంబరు 486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10, జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి మొదట 5ఎకరాల చొప్పున పక్కపక్కనే భూమిని కేటాయించారు. కానీ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి 10 ఎకరాలు కావాలని జాతీయ పోషకాహార సంస్థ అధికారులు పేచీ పెట్టడంతో, గత నెల 21న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ పాండురంగారావులు రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వారం రోజుల్లో పనులను పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించి పక్షం రోజులు దాటినా అతీగతీ లేదు. కాగా, వాహనాల సామర్థ్య కేంద్రానికి 8.12 ఎకరాలు, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి 8ఎకరాలు కేటాయించేలా తాజాగా మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భూమి కేటాయింపు జరిగేందుకు మరికొంత కాలం పట్టనుంది. ఈ ప్రక్రియ ముగిసే -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
జి.తిర్మలగిరి(చివ్వెంల):వేర్వేరు రోడ్డు ప్రమదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలు జిల్లాలోని చివ్వెంల, చౌటుప్పల్, చిలుకూరు మండలాల పరిధిలో శనివారం చోటు చేసుకున్నాయి. వివరాలు.. పెన్‌పహాడ్ మండలం భ క్తాళపురం ఆవాసం ఎర్రంశెట్టిగూడేనికి చెందిన ఎర్రంశెట్టి లిం గయ్య(54), ఆతడి భార్య సుక్కమ్మ బైక్‌పై ఉదయం చివ్వెంల మండలం వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ శివారు శ్రీ ఎచ్చెర్ల ముత్యాలమ్మ ఆలయానికి వచ్చారు. అక్కడ ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తిర్మలగిరి వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్య, సుక్కమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లింగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు పరిశీలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. చౌటుప్పల్: మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన కొండూరు సంతోష్‌కుమార్(22) చౌటుప్పల్‌లోని హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పనిముగించుకొని ఇంటికి వెళ్లేందుకు, బస్టాండ్ ఎదుట రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో తుఫ్రాన్‌పేట వద్ద మృతిచెందాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్‌లు ఢీకొనడంతో.. చిలుకూరు : హుజూర్‌నగర్‌కు చెందిన లింగయ్య పని నిమిత్తం బైక్‌పై కోదాడ వైపు వస్తున్నాడు. మండల పరిధిలోని సీతరాంపురం గోదాముల వద్దకు రాగానే వేగంగా వస్తున్న కోదాడకు చెందిన షేక్ అబ్జల్(30) తనబైక్తో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అబ్జల్ అక్కడికక్కడే మృతిచెందగా లింగయ్యకు తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని స్థానికులు 108 సిబ్బంది హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తీసుకెళ్లారు. అబ్జల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చీకటి కావడం, వర్షం పడుతుం డడం, బైక్‌లు వేగగంగా ఉండడం అదుపుతప్పి ప్రమా దం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
కరెంటు కోతలు నిరసిస్తూ రైతుల ధర్నా
ఎల్.లింగోటం (చౌటుప్పల్), న్యూస్‌లైన్ :వారం రోజులుగా వేళాపాలా లేని కరెంటు కోతలను నిరసిస్తూ ఎస్.లింగో టం గ్రామరైతులు సోమవారం చౌటుప్పల్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వ్యవసాయానికి 7గంటల కరెంటును సక్రమంగా ఇవ్వడం లేదని, నారుమళ్లు కూడా ఎండిపోయాయని అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్తంభాలు, వైరు శిథిలావస్థకు చేరి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా మంజూ రైన సబ్‌స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏడీ, డీఈ లతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తానని ఏఈ శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నగోని అం జయ్యగౌడ్, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ ఆనగంటి భిక్షమయ్య, ఉపసర్పంచ్ పల్సం దశరథ, ఢిల్లీ మాధవరెడ్డి, జనార్దన్‌రెడ్డి, తూర్పింటి పెంటయ్య, ఆకుల అశోక్, రాములు, బాతరాజు నాగయ్య, కృష్ణ, శ్రీను, యాదయ్య, మల్లయ్య, వెంకటేశం, రమేష్, కృష్ణారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. -
పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు!
చూపులు కలవడం...ప్రేమించడం... పార్కులు... షికార్లు... ఐస్‌క్రీములు.. చాకొలేట్లు... గంటల తరబడి ఫోన్ చాటింగ్‌లు... కొన్నిరోజులకి బ్రేకప్‌లు... మరో ప్రయత్నం... మరో బ్రేకప్... మరో ప్రయత్నం... మరో బ్రేకప్... ఇదంతా యువజంటలకు సర్వసాధారణం! ఈ అంశాన్ని ఎంతో హాస్యంగా ‘పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ చిత్రం ద్వారా చిట్టి తెరమీద చూపాడు వెంకట్ కర్నాటి. డెరైక్టర్స్ వాయిస్: మాది నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. ఒకలా చెప్పాలంటే నాకు సినిమాలంటే చాలా పిచ్చి. ఇంటర్ పూర్తి కాగానే ఉద్యోగం రావడంతో అక్కడితో చదువు ఆపేశాను. ఆ తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తిచేశాను. సినిమాల మీద ఉండే ఆసక్తి కొద్దీ, యానిమేషన్ కోర్సు పూర్తి చేశాను. డీక్యూ ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో త్రీడీ యానిమేటర్‌గా పనిచేశాను. ఆ తరవాత ఉద్యోగం మానేసి, ‘ఉయ్యాలజంపాల’ చిత్రం తీస్తున్న విరించివర్మ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. ఈ రంగంలో నేనింత చురుకుగా పాల్గొనడానికి మా తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. నా ఫ్రెండ్ ‘నానీ’ వల్ల నాకు ఈ ప్రాజెక్టు చేసే అవకాశం వచ్చింది. కథ ప్రకారం ఇందులోని క్యారెక్టర్లకి రెండు పేర్లు ఉండాలి. అందువల్ల మిత్రులంతా... పవన్‌కల్యాణ్ అనే పేరు సూచించడంతో, వెంటనే నేను ఆ పాత్రకు అనిరుధ్‌ని సెలక్ట్ చేసుకున్నాను. ‘ఐ క్లిక్ మూవీస్ (iqlik movies) వారి సహకారంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాను. అజయ్ అరసాడ సంగీతం చేశాడు. ఈ ప్రాజెక్టు వల్ల నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా చూసి వెన్నెల కిశోర్‌గారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘సల్మాన్‌ఖాన్ షాదీ’ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలోకి రీ మేక్ చేస్తున్నాం. షార్ట్ స్టోరీ: పవన్ కల్యాణ్ అనే కుర్రవాడు, పవన్ పేరుతో కొందరు అమ్మాయిలకు, కల్యాణ్ పేరుతో మరి కొందరు అమ్మాయిలకు లైన్ వేస్తుంటాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమకబుర్లు చెబుతుంటాడు. ఇలా ఎందరో అమ్మాయిలతో ప్రేమలో పడడం, విషయం బయటపడటంతో బ్రేకప్ చెప్పడం అతనికి ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటు వల్ల అతనికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏమిటో చిట్టి తెర మీద చూడవలసిందే. కామెంట్: ‘పవన్‌కల్యాణ్’ పేరు పెట్టాడే కాని కథకు పవన్‌కు సంబంధం లేదని ముందుమాటలోనే వివరించాడు దర్శకుడు. కథను మంచి క్వాలిటీతో చిట్టితెరకు ఎక్కించారు ఐక్లిక్ మూవీస్. ప్రేమించడంలోనూ, బ్రేకప్ చెప్పడంలోనూ ఎంతో సునిశిత హాస్యం చూపాడు దర్శకుడు. హీరోగా అనిరుధ్, ఫ్రెండ్‌గా పడమటిలంక నవీన్ చాలా బాగా చేశారు. హీరోయిన్లుగా నటించిన అమ్మాయిలు బాగున్నారు కాని, వాయిస్‌లో మాత్రం పట్టు లేదు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవలసిందే. మంచి గొంతు ఉన్నవారితో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. సంభాషణలు సరదాగా ఉన్నాయి. ‘పువ్వుల్లో పెట్టి దాచుకుంటే తుమ్మెదలు వచ్చి వాలతాయని, గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు’ ‘అబద్ధాన్ని గొప్పగా చెప్పచ్చు, కాని నిజాన్ని నిజం కంటె గొప్పగా చెప్పలేం కదా’ ‘హృదయానికి నాలుగ్గదులుంటాయి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరుంటారు’ ‘ఫ్రెండనుకున్నాడా, ఏటిఎం అనుకున్నాడా’ వంటి సంభాషణలు కథకు అందం తీసుకువచ్చాయి. దర్శకుడు వెంకటే స్వయంగా సంభాషణలు రచించాడు. పాటల చిత్రీకరణ, ట్యూన్స్, లొకేషన్స్, కెమెరా, టేకింగ్... అన్ని విషయాలలోనూ మంచి క్వాలిటీ చూపారు. ఈ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన మూడురోజుల్లోనే రెండు లక్షల మంది చూశారు. ఈ దర్శకుడు చిన్నచిన్న లోపాలను సరిచేసుకుంటే ఇతనికి నూటికినూరు మార్కులు ఇచ్చేయవచ్చు. మీరు స్టూడెంటా! యూట్యూబ్‌లో మీ షార్ట్‌ఫిల్మ్‌లు పెట్టారా! అయితే మీ లఘుచిత్రాలకు సంబంధించిన వివరాలను, మీ ఫోన్ నంబర్లను ఈ కింద ఇచ్చిన మెయిల్‌కు పంపండి. మంచివాటిని పరిశీలించి ‘యూట్యూబ్ స్టార్’ లో పరిచయం చేస్తాం. sakshiutube@gmail.com - డా. వైజయంతి