బంగారుకొండ..భలే భలే గుట్టలు | KCR surveys Rachakonda area | Sakshi
Sakshi News home page

బంగారుకొండ..భలే భలే గుట్టలు

Published Tue, Dec 16 2014 2:56 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

బంగారుకొండ..భలే భలే గుట్టలు - Sakshi

బంగారుకొండ..భలే భలే గుట్టలు

చౌటుప్పల్ / సంస్థాన్ నారాయణపురం :‘‘ఎంతో అద్భుతమైన గుట్టలు.. వేలఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లు గుర్తుకొస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది’’... ఇదీ రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. మన జిల్లాతో పాటు రంగారెడ్డి సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన గాలి మోటార్‌లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు.
 
 మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు. రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంత రం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్‌లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గంటసేపు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి, 2.10గంటలకు హెలికాప్టర్‌లో తిరుగుపయనమయ్యారు. కేసీఆర్ మొత్తంగా రెండున్నర గంటలపాటు రాచకొండలోనే గడిపారు.
 
 నోవాటెల్ జొన్నరొట్టె మస్తు..మస్తు
 రాచకొండలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే లంచ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించారు. ఆయన జొన్నరొట్టె, చికెన్, చేపలతో తన భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రాచకొండకు కేసీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు.
 
 కట్టుదిట్టమైన బందోబస్తు
 రాచకొండలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్‌జోన్. దాదాపు 20సంవత్సరాల పాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంతవరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గురయ్యారు. తొలుత ఈ నెల3నే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదాపడ్డట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల కాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు  మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలు, 500మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండ్ అయిన గుట్టల చుట్టూ  పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్టా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం పర్యటనను డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్ రావులు పర్యవేక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ఆర్డీఓలు, దేవ రకొండ, భువనగిరి డీఎస్పీలు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
 
 ‘టైం’టేబుల్ ఇదీ....
 సీఎం కేసీఆర్ మంత్రులు గుంటకడ్ల జగ దీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మలతో కలిసి, రాచకొండలో 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు.
 భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు ఘనంగా స్వాగతం పలికారు.
 అనంతరం 11:40 నిమిషాల నుంచి 11:52 నిమిషాల వరకు రాచకొండ గుట్టల్లోని భూములను నల్లగొండ, రంగారెడ్డి కలెక్టర్లు సీఎంకు మ్యాపుల ద్వారా వివరించారు.
 మంత్రులు జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్‌లు మొదటి విడతలో హెలికాప్టర్‌లో 12 గంటలకు ఏరియల్ సర్వేకు వెళ్లారు.12.15 గంటలకు కిందకు దిగారు.
 రెండో విడతలో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు 12.25గంటలకు హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. 12.47గంటలకు కిందికి దిగారు.
 అనంతరం సీఎం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. తిరిగి 2.10గంటలకు కేసీఆర్ హెలికాప్టర్‌లో తిరుగుపయనమయ్యారు.
 
 ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి : బూర నర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి
 తెలంగాణ రాష్ర్టంలో పెట్టబడులు పెట్టేందుకు 60విదేశీ సంస్థలు సీఎం కేసీఆర్‌ను కలిశాయి. సోలార్ పరిశ్రమ, ఫార్మాసిటి, ఫిలింసిటీ, ఎకోటూరిజం, అమెరికాకు చెందిన డిస్నీలాండ్, రోస్‌కంపెనీ లాంటి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 42వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. వీటన్నింటినీ కలిపి అతిపెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భాగంగానే ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. సర్వే పూర్తయితే, ఈ భూమిని క్లస్టర్లుగా విభజించి, ఎడ్యుకేషన్ హబ్, ఫిలింసిటీ, డిఫెన్స్‌సిటీ, ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించనుంది. మొత్తంగా మరుగునపడ్డ రాచకొండ చరిత్ర ప్రాచుర్యంలోకి రానుంది.
 
 రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు:
 కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మునుగోడు వెనుకబడిన నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వ ద్ద అనేక ఆలోచనలున్నాయి. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న రాచకొండకు మహర్దశ పట్టనుంది. కేసీఆర్ ఏరియల్ సర్వేతో ఈ ప్రాంతాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ముశ్చర్ల మీదుగా రాచకొండ వరకు, 65వ నంబరు హైవే నుంచి రాచకొండకు నాలుగులేన్ల రోడ్డు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి, స్వాధీనం చేసుకున్నాక, క్లస్టర్లుగా విభజించనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement