చౌటుప్పల్ : భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందోళ్లగూడెం గ్రామానికి చెందిన ఎన్నపల్లి వెంకట్‌రెడ్డి, వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన రజిని(31)లు 6సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే రజినికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు క ట్నం తీసుకురమ్మని వేధించేవాడు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. గతంలో ఓ హత్య కూడా చేశాడు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, రజినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. 2సంవత్సరాల క్రితం నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇతడిపై కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి వెంకట్‌రెడ్డి రజినితో గొడవపడి తీవ్రంగా కొట్టాడు.
దీంతో మనస్తాపానికి గురైన రజిని ఉదయం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన వెంకట్‌రెడ్డి, తల్లి సత్తమ్మలు వెంటనే చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రజిని మృతిచెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంకట్‌రెడ్డి,రజిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో వేసి, తల్లి సత్తమ్మను ఎక్కించి ఇంటికి పంపించాడు. అతను అక్కడి నుంచే జారుకున్నాడు. తల్లి సత్తమ్మ ఇంటికి వచ్చి, మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచి, ఆమె కూడా పరారయ్యింది. గ్రామస్తులు రజిని తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో, వారు వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త వెంకట్‌రెడ్డి, అత్త సత్తమ్మలపై కేసునమోదు చేసినట్టు పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు. కాగా, రజినికి 2సంవత్సరాల వయస్సు గల పాప ఉంది.
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
Published Sun, Nov 9 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement