యువతుల కిడ్నాప్‌నకు యత్నం | Attempt to kidnap young women | Sakshi
Sakshi News home page

యువతుల కిడ్నాప్‌నకు యత్నం

Published Sun, May 20 2018 2:11 AM | Last Updated on Sun, May 20 2018 2:11 AM

Attempt to kidnap young women - Sakshi

చౌటుప్పల్‌: స్థానిక కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు యువతులను ఓ యువకుడు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.  యువతులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడి బారి నుంచి తప్పించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంఎంఆర్‌ కళాశాలలో జరిగే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌కు వచ్చారు. స్థానిక చిన్నకొండూర్‌ చౌరస్తా వద్ద బస్సు దిగారు. తాము వచ్చిన విషయాన్ని తమ ఉపాధ్యాయుడికి తెలిపారు.

వారున్న చోటుకు కారు పంపిస్తానని ఆయన వారికి చెప్పాడు. అదే సమయంలో చిన్నకొండూర్‌ రోడ్డు మీదుగా హైవేపైకి కారులో వచ్చిన ఓ యువకుడు వారిని పలకరించాడు. తాము తంగడపల్లి ఎంఎంఆర్‌ కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో, తానూ అక్కడికే వెళ్తున్నానని, తనతో తీసుకెళతానని వారిని  కారులో ఎక్కించుకున్నాడు. నేరుగా వలిగొండ చౌరస్తా వద్దకు వెళ్లిన యువకుడు కారును హైదరాబాద్‌ వైపు మళ్లించాడు.

దీన్ని గమనించిన యువతులు తమవారికి ఫోన్‌ చేయబోగా ఆ యువకుడు ఒకరి ఫోన్‌ లాక్కున్నాడు. మరో యువతి వేగంగా స్పందించి తమ ఉపాధ్యాయుడికి ఫోన్‌ చేసింది. దీంతో భయపడిన ఆ యువకుడు వెంటనే కారులో ఉన్న యువతులను అక్కడే దింపి పారిపోయాడు. కారు నంబర్‌ను  నోట్‌ చేసుకున్న యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నంబర్‌ ఆధారంగా పోలీసులు చౌటుప్పల్‌కు చెందిన ఆ యువకుడిని  అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement