ఊటీ... చుక్కలేంటి? దెయ్యాన్నే చూపించింది: జయసుధ | telugu actor jayasudha special interview with sakshi | Sakshi
Sakshi News home page

మంచి మనుషులంటే మంచి మనసులు

Published Sun, Mar 24 2019 1:33 AM | Last Updated on Sun, Mar 24 2019 9:52 AM

telugu actor jayasudha special interview with sakshi - Sakshi

మనం మంచిగా ఉన్నామంటేమనల్ని ఎంతోమంది మంచి మనసుతో దీవించారని.నిజానికి మంచితనం వ్యాపించినంతగా చెడు విస్తరించలేదు.ఈ విషయం వై.ఎస్‌. కుటుంబాన్ని చూసినప్పుడు జయసుధకు అర్థమైందట. స్వచ్ఛమైన మనసుతో కూడిన గొప్ప ఆకాంక్ష ఎప్పుడూ.. గొప్ప మంచినే చేస్తుంది. అనుభవం కన్నా ఉద్దేశం గొప్పది. ఉద్దేశం ఉంటే సంకల్పం ఉంటుంది. ‘‘సంకల్పం ఉంటే  క్షేమం, సంక్షేమం..  రెండూ ఉంటాయి’’ అని అంటున్న సినీ నటి జయసుధతో ‘ఫ్యామిలీ’ ఇంటర్వ్యూ.

14 ఏళ్ల వయసులో నటిగా స్క్రీన్‌పై కనిపించి, 47 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌తో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇప్పుడేం సినిమాలు చేస్తున్నారు?
జయసుధ: ఏం చేస్తున్నానా? రెండు సినిమాలు వదులుకున్నాను. ఒకటి తమిళ సినిమా. కార్తీ హీరో. లొకేషన్‌ అంటే ఉన్న ఫోబియా వల్ల ఆ సినిమా వదులుకున్నా. అది చల్లని లొకేషన్‌ ఊటీ (నవ్వుతూ). ఊటీలో షూటింగా? కుదరదండీ అన్నాను. సమ్మర్‌ కదా అని అలా అన్నానేమో అనుకున్నారు. ‘అక్కడ చాలా చల్లగా ఉంది మేడమ్‌’ అన్నారు. విషయం చల్లదనం గురించి కాదు.. వేరే కథ ఉందిలే అనుకుని నవ్వుకున్నాను.

వేరే కథ ఏంటి? లొకేషన్‌ ఫోబియాతో సినిమా వదులుకున్నారా? 
అప్పట్లో ఎక్కువ షూటింగ్‌లు ఊటీలో జరిగేవి. అయితే ఎప్పుడు ఊటీ వెళ్లినా హెల్త్‌ ఇష్యూ వచ్చేది. ఒకటి షూటింగ్‌ ఆగిపోవడమో, ఆరోగ్యం పాడవ్వడమో లేకపోతే వేరే ఏదైనా సమస్య... ఏదో ఒకటి జరిగేది. ఆ పరంగా ఊటీకి చాలా కథలున్నాయి. ముఖ్యంగా నాకు ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురయ్యేది. ఒకసారైతే చాలా సీరియస్‌ అయింది. దాంతో ఇక ఊటీ వద్దురా బాబూ అనే ఫీలింగ్‌ వచ్చింది. ‘కాలాంతకుడు’ షూటింగ్‌ ఊటీలో జరిగినప్పుడైతే నాకు ఫుల్‌ ఫీవర్‌. జయలలితగారు ఓ తమిళ సినిమా కోసం వచ్చారు. ఆవిడకు ఆ రోజు షూటింగ్‌ లేదు. నాకేమో జ్వరం వచ్చి షూటింగ్‌ చేయలేకపోయాను. నాన్నగారు కర్చీఫ్‌లో యుడికులాన్‌ వేసి, తలమీద పెడుతుండేవారు.  అప్పుడు జయలలితగారు వచ్చి, ఓ గంట సేపు కూర్చున్నారు. నాన్నగారు చేసినట్లే నాకు సపర్యలు చేశారు. మా అందరి మధ్య అంత మంచి వాతావరణం ఉండేది.

మీకు మాత్రమేనా? ఊటీ వేరే స్టార్స్‌కీ చుక్కలు చూపించిందా?
చుక్కలేంటి? దెయ్యాన్నే చూపించింది (పెద్దగా నవ్వుతూ). ఆ రోజుల్లో బాత్రూమ్‌లవీ ఉండేవి కాదు కదా. చెట్టు వెనకాల ఓ డ్యాన్సర్‌ టాయ్‌లెట్‌కి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా బిహేవ్‌ చెయ్యడం మొదలుపెట్టింది. దెయ్యం పట్టిందన్నారు. దెయ్యాలంటే నాకు నమ్మకంలేదు. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను. అలా ఊటీ నన్ను మాత్రమే కాదు... చాలామందిని ఇబ్బందులపాలు చేసింది. 

మరి చివరిసారిగా ఊటీ ఎప్పుడు వెళ్లారు?
‘యువకుడు’ సినిమాకి వెళ్లాను. అది కూడా మా ఆయన (నితిన్‌కపూర్‌), కొడుకులతో (నిహార్, శ్రేయాన్‌) వెళ్లాను. మొత్తం ఫ్యామిలీ వెళ్లాం. ఏం జరుగుతుందో ఏమో అని ఒకటే భయం. షాట్‌లో డైలాగ్‌ చెప్పడానికి మాత్రమే నోరు తెరిచేదాన్ని. ఆ తర్వాత అంతా సైలెంట్‌. మనసులోనే ‘దేవుడా.. దేవుడా...’ అనుకునేదాన్ని, ఏదైనా చెడు జరుగుతుందేమోనని మనసులో ఒకటే ఫీలింగ్‌. ఏమీ జరగకుండా బయటపడ్డాం. ఇంతకుముందు చెప్పినట్లు నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు. కానీ ఊటీలో షూటింగ్‌ చేసినప్పుడు మాత్రం వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించేది.

మీరు వదులుకున్న ఇంకో సినిమా ఏంటి?
మోహన్‌లాల్‌ చేస్తున్న మలయాళ సినిమా. పీరియాడికల్‌ మూవీ అన్నారు. భారీసెట్లు, స్మోక్‌ ఎఫెక్టులు ఉంటాయని తెలిసింది. స్మోక్‌ అంటే నాకు అలర్జీ వచ్చేస్తుంది. పైగా సమ్మర్‌. మాంచి ఎండ తగిలితే కళ్లు తిరిగి పడిపోతా. అందుకని ఆ సినిమా వదులుకున్నా. ఎన్నోఏళ్ల నుంచి మేలో షూటింగ్‌ చేయడం మానేశాను. 

ఇలా వదిలేసుకుని, ఆ తర్వాత ఎందుకు వదులుకున్నానా? అని ఫీలైన సినిమాలేమైనా ఉన్నాయా?
ఒక్క ‘సాగర సంగమం’ సినిమా అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఆ సినిమాకి ముందు నన్నే తీసుకున్నారు విశ్వనాథ్‌గారు. అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. డేట్స్‌ కూడా కన్‌ఫార్మ్‌ చేసేశాను. అయితే కమల్‌హాసన్‌ డేట్స్‌ విషయంలో కొంచెం అటూ ఇటూ అవ్వడంతో నేను డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోయాను. అప్పటికి ఆ డేట్స్‌ని రామారావుగారు, నాగేశ్వరరావుగారి సినిమాలకు ఇచ్చాను. ఆ ఇద్దరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ‘సాగర సంగమం’ వదులుకున్నాను. అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేశాను.  

అంటే.. ఇప్పుడు మిమ్మల్ని ఏ సినిమాలో చూడగలుగుతాం?
‘మహర్షి’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమా ఒకటి. నరేశ్‌ కొడుకు నవీన్‌ ఈ సినిమాలో హీరో. ఇంకో సినిమా ఉంది. కథ చాలా బాగుంది. దాని గురించి ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి అనౌన్స్‌మెంట్‌ వచ్చాక చెబుతాను. 

ఓకే.. ఎండలంటే పడవన్నారు. ఇప్పుడు పొలిటీషియన్‌గా ఎండల్లో ఎలా ప్రచారం చేస్తారు?
బై గాడ్స్‌ గ్రేస్‌ ఈసారి మే ఎండల నుంచి ఎస్కేప్‌. ఏప్రిల్‌లోనే ఎలక్షన్స్‌ కాబట్టి ఫర్వాలేదు. మే ఎండలకంటే ఏప్రిల్‌ ఎండలు తక్కువే కదా. ఈ నెలాఖరున ప్రచారం మొదలుపెడతానేమో.

2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరడానికి కారణం ఏంటి?
నిజానికి పాలిటిక్స్‌లో ఉండాలా? వద్దా అనే మీమాంసతో జరిగిన మార్పు అది. ‘ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి ఓడిపోవడానికి కారణం మీరు కాదు. రాష్ట్ర విభజన’ అని నా సన్నిహితులు అన్నారు. తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌ యాక్టివ్‌గా లేకపోవడంతో నాకేం చేయాలో పాలుపోని స్థితి. దాంతో 2015 ఎండ్‌లోనో, 2016 బిగినింగ్‌లోనో.. సరిగ్గా గుర్తు లేదు. టీడీపీలో జాయిన్‌ అయ్యా. కారణం ఏంటంటే... మా తల్లిదండ్రుల తరఫు వాళ్లది ఆంధ్ర, రాయలసీమ. కాబట్టి మీరు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలంటే, తెలుగుదేశంలో చేరితే మంచిదని కొంతమంది సలహా ఇచ్చారు. సరే.. అని టీడీపీలో చేరాను. 

వేరేవాళ్ల సలహా పాటించడం ఏంటి? మీ సొంత నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మళ్లీ టీడీపీ నుంచి ఎందుకు వచ్చేశారు?
నేను రాజకీయాల్లోకి చేరేనాటికి వాటి మీద నాకు కనీస అవగాహన లేదు. 2014 నాటికి కాస్త అవగాహన వచ్చినప్పటికీ.. సన్నిహితులు ఇచ్చిన సలహా కరెక్టేనేమో అనిపించి పాటించాను. మళ్లీ తెలుగుదేశం వీడడానికి కారణం.. అక్కడ నాకు ఏ బాధ్యతా అప్పగించకపోవడమే. వెళ్లటం వెళ్లటమే నేనేమీ మినిస్ట్రీ కోరలేను కదా.. అలాగని ఏ బాధ్యతా లేకుండా కూడా ఖాళీగా ఉండలేం. అందుకని ఏదో ఒక రోల్‌ ఇవ్వమని అడిగాను. ‘డెఫినెట్‌గా ఇస్తాను’ అన్నారు. ఆ తర్వాత ‘ఇంటర్నేçషనల్‌ ఉమన్‌ ఫెస్టివల్‌’కి పిలిచారు. లేపాక్షి ఉత్సవాలకు పిలిచారు. నంది అవార్డ్సు కమిటీకి చైర్‌ పర్సన్‌గా పెట్టారు. అంతే తప్ప స్పెసిఫిక్‌ రోల్‌ ఏదీ ఇవ్వలేదు. ఏ పనీ లేకుండా ఊరికే వెళ్లి గుడ్‌ మార్నింగ్, గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ చెప్పే టైప్‌ కాదు నేను. అలా రెండేళ్లు గడిచాయి. ఏ పోస్ట్‌ లేదు. మధ్యలో నా పర్సనల్‌ లైఫ్‌ (భర్త చనిపోవడం గురించి)లో పెద్ద కుదుపు.

ఓ ఆరేడు నెలలు షూటింగ్‌లు చేయలేదు. కానీ అప్పటికే కమిట్‌ అయిన సినిమాలుండటంతో మళ్లీ షూటింగ్స్‌ మొదలుపెట్టాను. ‘అసలు ఇక్కడే ఉన్నారా? మీరు యాక్టివ్‌గా ఉండాలి. మీరు బయటకు రావాలి’ అంటూ ఏదో నేను యాక్టివ్‌గా లేనట్లు ఆ పార్టీవాళ్లు అనడంతో, ‘నేను యాక్టివ్‌గానే ఉన్నాను, ఇప్పటికి మూడు సినిమాలు కంప్లీట్‌ చేశాను’ అన్నాను. ఇక ఆ పార్టీలో బాధ్యత దొరకడం అయ్యే పని కాదు, బయటకు వస్తే బెటర్‌ అనుకున్నాను. మనల్ని గుర్తించనప్పుడు అక్కడ ఉండటం వేస్ట్‌ అనుకున్నాను. అంతకుముందు వేరేవాళ్ల సలహాలు కూడా తీసుకున్నాను. కానీ  ఈసారి నా అంతట నేనే డెసిషన్‌ తీసుకున్నాను. నన్ను పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చింది రాజశేఖర్‌ రెడ్డిగారు కాబట్టి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. 

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి వ్యక్తిత్వం గురించి?
ఎమ్మెల్యే అయ్యాక క్యాంప్‌ ఆఫీసుకి వెళ్లేవాళ్లం కదా. గంటా గంటన్నర ఉండేదాన్ని. అప్పుడు రాజశేఖర్‌ రెడ్డిగారు ‘ఆమెను అలా తీసుకొచ్చి ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోబెట్టకండి.. ముందు రమ్మనండి.. త్వరగా పంపించేయండి. లేకపోతే ఆలస్యంగా రమ్మనండి’ అని అక్కడున్నవాళ్లకు ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారు. అంత గౌరవించేవారు. డిగ్నిఫైడ్‌గా బతకాలనుకునే నాలాంటివాళ్లకు ఎన్ని కోట్లు ఇస్తారు? అనేది కాదు. నాకు గౌరవం ఇచ్చారంటే అదే వందల కోట్లతో సమానం. క్యాంప్‌ ఆఫీసులో ఒకసారి గంట కూర్చున్నాక డోర్‌ తెరుచుకుని లోపలికి వెళ్లగానే ‘ఏమ్మా.. ఎక్కువసేపు కూర్చోబెట్టేశానా?’ అని సౌమ్యంగా మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న ఆయన్ను ఎంతోమంది కలుస్తారు. ఆలస్యం అవుతుందనుకోవచ్చు. కానీ ‘ఇవాళ చాలామంది ఉన్నారమ్మా’ అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా వ్యక్తి మనకోసం వెయిట్‌ చేశారని గుర్తించారు.

అది నాకు చంద్రబాబు నాయుడిగారి దగ్గర జరగలేదు. ‘ఈసారి డెఫినెట్‌గా ఏదో ఒకటి చేస్తాను’ అని మాటిచ్చాక.. ఆవిడకి మాటిచ్చాను అనేది గుర్తుండాలి కదా? ఒకవేళ వీలు పడకపోతే ‘ఏమ్మా.. ఇప్పుడు కుదరడంలేదు. డిలే అవుతోంది. కొంచెం వెయిట్‌ చేద్దాం’ అని పిలిపించి చెబితే అది గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. ఇక వైఎస్సార్‌గారిలానే ఆయన కొడుకు జగన్‌గారు కూడా. ఏమాత్రం డిఫరెన్స్‌ ఉండదు. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను. నేను ఈ పార్టీ నుంచి వెళ్లినప్పుడు సరైన గైడెన్స్‌ లేకపోవడంతో వెళ్లాను. మళ్లీ వచ్చినప్పుడు ‘హోమ్‌ కమింగ్‌’లా అనిపించింది. ఇప్పుడు వచ్చి జగన్‌గారి దగ్గర నాకది కావాలి.. ఇది కావాలి అని అడగాలనిపించలేదు. ఇప్పుడు నేను కోరుకుంటున్నదేంటంటే.. ఆయన గెలవాలి. సీఎం అవ్వాలి. గెలిస్తే ‘హీ విల్‌ టేక్‌ కేర్‌ ఆఫ్‌ ద సొసైటీ’. నాకా నమ్మకం ఉంది. ఒక్కసారి మాటిస్తే అది నెరవేరుస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. ఆయన గెలవాలన్నది నా ముఖ్య ఆశయం.

ఏపీ అభివృద్ధి గురించి మీ ఒపీనియన్‌?
అసలు జరగాల్సిన పనులు జరగలేదు. నా వరకు తెలిసింది చెబుతున్నాను. బయటకు చాలా గ్రాండ్‌గా జరిగిందని చెప్పుకుంటున్నారు.
(మిగతా పక్క పేజీలో)

మీ అబ్బాయిల గురించి?
మా పెద్దబ్బాయి నిహాల్‌కి పెళ్లి కుదిరింది. లవ్‌ మ్యారేజ్‌. నార్త్‌ అమ్మాయి. పేరు అమృత్‌. ఈ మధ్యే నార్త్‌ ఆచారం ప్రకారం నిశ్చితార్థానికి ముందు జరిగే ‘రోకా’ ఫంక్షన్‌ జరిగింది. ఐయామ్‌ హ్యాపీ. చిన్నబ్బాయి శ్రేయాన్స్‌ ఇంటర్నేషనల్‌ షూటర్‌ కోచ్‌.

మొన్న మీతోపాటు పార్టీ ఆఫీసుకి మీ పెద్దబ్బాయి వచ్చారు.. తనకి పాలిటిక్స్‌ అంటే ఆసక్తి ఉందా?
అవును.. నాతోపాటు వచ్చాడు. జగన్‌గారు ‘వాట్‌? యు వాంట్‌ టు కమ్‌.. ఆర్‌ యు ఇంట్రస్టెడ్‌’ అంటే ‘యస్‌.. సార్‌’ అన్నాడు. వాడు మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుకున్నాడు. షార్ట్‌  స్టోరీలవీ రాస్తుంటాడు.

సినిమాల్లోను, విడిగా మీరు కట్టుకునే చీరలు, వేసుకునే డ్రెస్సులు బాగుంటాయి. విడిగా మీరే డిజైన్‌ చేసుకుంటారు. సినిమా కాస్ట్యూమ్స్‌ కూడా మీరే చేసుకుంటారా?
నా సినిమాలన్నింటికీ  దాదాపు 30, 35 ఏళ్ల నుంచి నేనే డిజైన్‌ చేసుకుంటున్నాను.  జయసుధ శారీస్, బ్లౌజెస్‌ అంటే ఫేమస్‌. పాట కూడా ఉంది.. జయసుధ బ్లౌజెస్‌ అని. ఈవెన్‌ మణిరత్నంగారి సినిమాకి కూడా నేనే డిజైన్‌ చేసుకున్నాను. క్యారెక్టర్‌ విన్నాక దానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ని నేనే డిజైన్‌ చేసుకుంటాను. నాకు చీరల డిజైనింగ్‌ అంటే ఇష్టం. ఎగ్జిబిషన్లు ఇష్టంగా పెడతాను. ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీ ఎగ్జిబిషన్‌ పెట్టాలని ఉంటుంది. కన్‌స్ట్రక్షన్స్‌ అంటే ఇష్టం. ఎక్కడైనా కొత్త బిల్డింగ్‌ కట్టడం చూస్తే.. ఎలా కడుతున్నారో చూడ్డానికి వెళుతుంటాను. అలా 100, 150 బిల్డింగ్‌ల వరకూ చూశాను. నన్నక్కడ చూసినవాళ్లు ఫ్లాట్‌ కొనుక్కోవడానికి వెళ్లానని చెప్పుకునేవాళ్లు. అలా చూస్తే ఇప్పుడు 150 ఫ్లాటులు కొన్నట్లు లెక్క (నవ్వుతూ). ‘అమ్మా... నీ పిచ్చి కాకపోతే.. నువ్వు అలా చూడ్డానికి వెళితే అన్ని ఇళ్లూ కొంటున్నావనుకుంటున్నారు’ అని పిల్లలు అంటుంటారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement