ఐటమ్ అచ్ఛా హై
హోటల్‌లో భోజనం తినడానికి వెళ్లినప్పుడు ఏదైనా డిష్ బాగుంది అనుకుంటే తమన్నాగారు ‘ఐటమ్ అచ్ఛా హై’ అంటారట. డిష్ బాగుండాలంటే పదార్థం బాగుండాలి. వండినవాడి చేతిలో మ్యాజిక్ ఉండాలి. ఆ గిన్నె దగ్గర్నుంచి పైన పెట్టిన క్యారెట్ పువ్వుతో సహా ప్రజెంటేషన్ అదిరిపోవాలి. సినిమా పాత్రలూ అంతే. యాక్టర్‌లో సబ్‌స్టెన్స్ ఉండాలి. డెరైక్టర్ చేతిలో మ్యాజిక్ ఉండాలి. ప్రొడక్షన్ హౌస్‌కి ప్రజెంటేషన్ స్టైల్ ఉండాలి. ‘‘అవును.. నేను ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. భలే మజా వస్తుంది. ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది... డబ్బూ ఉంటుంది’’ అంటున్న తమన్నాతో సాక్షి అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ‘ఐటమ్ అచ్ఛా హై’......
► హాయ్ తమన్నా.. పదేళ్లుగా నటిస్తున్నప్పటికీ.. ఇంకా తనివి తీరినట్లు లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ, బిజీ బిజీగా ఉంటున్నారు?
అదేంటండీ.. నేను ఎక్కువ సినిమాల్లో నటించడం మీకిష్టం లేదా? వద్దంటే చెప్పండి.. మానేయడానికి ప్రయత్నిస్తా (నవ్వుతూ..). అప్పుడు నా అభిమానులు ఊరుకోరు. ప్లస్ నేనూ అంత త్వరగా సినిమాలు వదులుకోలేను. మీకో విషయం చెప్పనా? లవ్‌లో పడ్డాను.
► ఇంత సూటిగా చెప్పారంటే.. ప్రొఫెషన్‌తోనే లవ్‌లో పడి ఉంటారు...
కరెక్ట్‌గా గెస్ చేశారు. ‘యస్.. ఐయామ్ ఇన్ లవ్ విత్ మై ప్రొఫెషన్’. ఇక వేరే దేని గురించీ ఆలోచన లేదు. సినిమాలు.. సినిమాలు... సినిమాలు... అంతే.
► అవునూ! అంతకు ముందు ఎప్పుడూ మీతో పాటు మీ అమ్మగారు తోడుగా వచ్చేవారు. ఈ మధ్య ఎక్కడా కనిపించడంలేదేంటి?
తెలుగులో మొదటి సినిమా ‘శ్రీ’లో నటించినప్పుడు నా వయసు 15. అప్పుడు నాకు తెలుగు రాదు.. హైదరాబాద్‌లో ఎవరూ తెలీదు. ఊరి కాని ఊరిలో.. భాష కాని భాషలో.. పదిహేనేళ్ల అమ్మాయి సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే, నాకు తోడుగా నాతో పాటు అమ్మ హైదరాబాద్ వచ్చింది. నేనిక్కడ అలవాటయ్యే వరకూ నన్ను అంటిపెట్టుకునే ఉంది. నాకు ఏ టెన్షన్స్ లేకుండా చూసుకుంది. ఏడెనిమిదేళ్లు నాతో పాటే షూటింగ్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు నా వయసు 26 ఏళ్లు. కొంచెం పెద్దమ్మాయిని అయ్యాను కదా! ఇంకా అమ్మ హెల్ప్ కోరుకోవడం భావ్యం కాదనిపించింది. అమ్మ కూడా ఇప్పుడు ఇంటి పట్టున ఉండి నాన్న బాగోగులు చూసుకోవాలను కుంటోంది. ఆమె ఆలోచనలో న్యాయం ఉంది. అందుకే ఓకే అనేశా.
► హీరోయిన్‌గా ఈ పదేళ్ల కెరీర్‌లో వచ్చిన సినిమాలను కాదనకుండా చేశారు. ఇప్పుడు మీకు నచ్చిన సినిమాలు, క్యారెక్టర్లు ఎంపిక చేసుకునే స్టేజిలో ఉన్నారని అనుకుంటున్నారా?
యస్... ఉన్నాను. (రెండు సెకన్లు ఆలోచించి) మనసుకి ఏమాత్రం నచ్చకపోయినా, ఆ సినిమాకి ‘నో’ చెప్పే స్టేజిలోనే ఉన్నాను. అంత మాత్రాన ఇప్పటివరకూ చేస్తూ వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ‘నో’ అంటాననుకోవద్దు. టిపికల్ ఫోర్ సాంగ్స్, మాస్ మసాలా ఫైట్స్ గట్రా ఉన్న కమర్షియల్ సినిమాలు నాకింకా ఇష్టమే. అలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు వాటిని వదులుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తానని స్టేట్‌మెంట్ ఇవ్వను. ఎట్ ద సేమ్ టైమ్... ఏదో కొంచెం కొత్తగా ఉన్న క్యారెక్టర్లు, సినిమాలు చేయాలనుంది. ‘అభినేత్రి’లో నాకు అటువంటి కొత్తదనం కనిపించింది. నా క్యారెక్టర్‌లో రెండు షెడ్స్ ఉన్నాయి. చీర కట్టుకుని పల్లెటూరి అమ్మాయిలా కనిపించడంతో పాటు గ్లామరస్ రోల్ చేశా.
► కొత్త రకం సినిమాలు చేయకపోతే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తామని భయమా?
ఆ భయం కచ్చితంగా ఉంటుంది. ఓ హీరోయిన్‌గా, యాక్టర్‌గా కొత్తగా చేయకపోతే ప్రేక్షకులు దూరం పెట్టేస్తారని భయం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కమర్షియల్ సినిమాలు చేయక తప్పదు. వాటి ద్వారా మెప్పిస్తూనే.. కొంచెం డిఫరెంట్‌గా ఉండే మూవీస్‌లో కొత్త రకం క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కెరీర్‌కి లాంగ్విటీ ఉంటుందని నా నమ్మకం.
► అయితే.. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మీకు ఎలాంటి గుర్తింపు ఉందనుకుంటున్నారు?
ఐ డోంట్ నో. నాకెలాంటి ఇమేజ్ ఉందో తెలీదు గానీ... ‘బాహుబలి’ ముందు ఎవరూ అవంతిక వంటి పాత్రలో నేను నటించగలనని అనుకోలేదు. ఆరడుగుల ఎత్తున్న ప్రభాస్ పక్కన ఉండగా... నేను కత్తి కత్తి పట్టుకుని నరికేస్తుంటే వర్కౌట్ అవుతుందా? అని ఆలోచించా. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. సో, డిఫరెంట్ క్యారెక్టర్లు ఎటెంప్ట్ చేయడం ముఖ్యమని ఫీలయ్యా. మనం డిఫరెంట్‌గా చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కూడా కుదిరింది.
► నిర్భయ వంటి ఘటనలు జరిగినప్పుడు హీరోయిన్లు వేసుకునే డ్రస్సులు కారణం అంటూ కొంతమంది మీకు లింకు పెడుతున్నారు. వాళ్లకు మీ సమాధానం?
ఏం చెప్పినా వాళ్ల బుద్ధి మారదు. హీరోయిన్‌గా నేనేం చెప్పినా పట్టించుకోరు. వేసుకునే డ్రస్సులను బట్టి అమ్మాయిలను జడ్జ్ చేయడమనేది మారాలి. మన దేశంలో అమ్మాయిలకు చాలా నిబంధనలున్నాయి. మారడానికి ఇంకా టైమ్ పడుతుంది.
► ‘బేటీ బచావో... బేటీ పడావో’కి మీరు బ్రాండ్ అంబాసిడర్... మరి మీ వంతుగా ఏం చేస్తున్నారు?
మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం చదువు లేకపోవడమే. ఎప్పుడైతే తమ కాళ్ల మీద నిలబడతారో అప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందుకే స్త్రీలు చదువుకోవాలి. గాళ్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకుంటున్నా.
►ప్రేక్షకులకు మీరెలా గుర్తుండాలనుకుంటున్నారు?
ఓ మంచి యాక్టర్‌గా గుర్తుంటే బాగుంటుంది.
► అలాంటప్పుడు విద్యాబాలన్, కంగనా రనౌత్ తరహాలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యొచ్చుగా!
కమర్షియల్ మూవీయా? లేడీ ఓరియెంటెడా? అని ఆలోచించడం ముఖ్యం కాదు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడం ముఖ్యం. విద్యాబాలన్, కంగనా చేసే సినిమాలు వాళ్లకు మంచి పేరు తెస్తున్నాయి. కానీ, స్టార్ హీరో సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ వాళ్ల సినిమాలకు రావడం లేదు. ఒక్కోసారి లో బడ్జెట్‌లో తీసిన సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అని కాకుండా కంటెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టం కాదు. మంచి కంటెంట్ ఉంటే అటువంటి సినిమాలు నేను కూడా చేస్తా.
► సౌత్‌లో మీ దగ్గరకి అలాంటి స్క్రిప్ట్స్ రాలేదా?
వచ్చాయి. ఆ స్క్రిప్ట్స్‌లో కొన్ని చాలా బాగున్నాయి. విన్నప్పుడు బాగానే ఉంటాయి. ఎగ్జిక్యూషన్ లెవల్‌కి వచ్చేసరికి ఆ స్టాండర్డ్ రాదు. అదే పెద్ద సమస్య. స్క్రిప్ట్‌తో పాటు దర్శకుడు కూడా చాలా ముఖ్యం. అతను ఈ స్క్రిప్ట్‌ను సరిగ్గా తీయగలడా? లేదా? అనేది ఇంకా ముఖ్యం.
►తమన్నా కమర్షియల్ సినిమాలే చేస్తుంది. చాన్స్ వచ్చినా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్నవి చేయడంలేదని విమర్శించేవారికి మీ సమాధానం?
ఏం లేదు. ఒక్కో సినిమా చేయడానికి ఒక్కో టైమ్ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్‌లో ‘ది బెస్ట్’ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ కథలను బట్టి మారుతున్నాను. అందర్నీ పట్టించుకుంటూ, విమర్శలకు విలువ ఇస్తే పని చేయలేం. అప్పుడు నటించడం చాలా కష్టమవుతుంది.
► యాక్టర్‌గా కమర్షియల్ సినిమా లేదా పర్ఫార్మెన్స్ మూవీ ఏది శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది?
రెండూ ఉండాలండీ. అప్పుడే కెరీర్ బ్యాలెన్స్ అవుతుంది. ముందు చెప్పినట్టు కమర్షియల్, ఆర్ట్ ఫిల్మ్స్ కంటే మంచి సినిమాలు చేయడం ముఖ్యం. కొన్నిసార్లు కమర్షియల్ సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు లభిస్తాయి. ఇండస్ట్రీ ఇంతే. కొన్ని రోజులు బాగుంటుంది. కొన్ని రోజులు బాగోదు. ఎప్పుడూ మనకు నచ్చినవి దొరకవు.
► స్టార్ హీరోల పక్కన నటిస్తూనే కొత్త హీరోల పక్కన ఐటమ్ సాంగ్స్ చేయడానికి కారణం?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన ‘అల్లుడు శీను’లో నేను చేసిన ఐటమ్ సాంగ్ బాగుంటుంది. మంచి బీట్‌తో సాగే ఆ పాటకు డ్యాన్స్ చేయడం అంటే చిన్నపాటి సవాలే. అందుకే చేశాను. ‘కొత్త హీరో పక్కన తమన్నా ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి?’ అని ఎవరూ కామెంట్ చేయలేదు. సాంగ్‌ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమైన ‘జాగ్వార్’లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా బాగుంటుంది. అయినా స్పెషల్ సాంగ్స్ చేస్తే తప్పేంటి?
► ఒక్కోసారి నెగటివ్ కామెంట్స్ వచ్చే చాన్స్ ఉంది. రిస్క్ అవుతుందేమో అనిపించలేదా?
సాంగ్, కొరియోగ్రఫీ బాగుంటే ఐటమ్ సాంగ్స్ చేయడంలో తప్పు లేదు. ఎవరు కొరియోగ్రఫీ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓ ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు లిరిక్స్, స్టెప్స్, ట్యూన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తా. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. తెలుగులో కాజల్ అగర్వాల్, శ్రుతీహాసన్.. చేశారు. నాకు రిస్కేమీ అనిపించలేదు.
► కాజల్, శ్రుతిలు స్టార్స్‌తో ఐటమ్ సాంగ్స్ చేశారు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారనే మీరు కొత్త హీరోల పక్కన చేశారని టాక్?
నేను రెమ్యునరేషన్ ఎప్పుడూ ఎక్కువే తీసుకుంటాను.
► మంచి పాత్ర, సినిమా కంటే రెమ్యునరేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు?
లేదండీ. మంచి క్యారెక్టర్, రెమ్యునరేషన్.. రెండూ నాకు ముఖ్యమే. డబ్బులు లేకుండా ఎవరు పని చేస్తారు చెప్పండి? ఉదాహరణకు.. మీరు జర్నలిస్ట్‌గా చేస్తున్నారు. జీతం ఇవ్వకపోయినా శాటిస్‌ఫ్యాక్షన్ కోసం చేస్తారా? అసలు జీతం తీసుకోకుండా ఎవరైనా ఉద్యోగం చేస్తారా? ఒకవేళ చేస్తే వాళ్లు ఫైనాన్షియల్‌గా ఫుల్ సౌండ్ అయ్యుండాలి. అలా కాకపోయినా ‘సర్వైవల్ ప్రాబ్లమ్’ ఉండి ఉండకపోవచ్చు. రెమ్యునరేషన్ ఎక్కువని తమన్నా ఐటమ్ సాంగ్స్ చేస్తుందనేవాళ్లని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ‘మనం జీతం తీసుకోకుండా పని చేస్తున్నామా?’ అని వాళ్లు తమకు తాము ఈ ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది.
►నిర్మాతగా మారుతున్నారట?
ఈ జీవితంలో నేనా పని చేయను. నాకు ప్రొడక్షన్ అర్థం కాదు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని అర్థం చేసుకుని చేయాలి. ప్రొడక్షన్ చేయాలంటే ఆ మైండ్ సెట్ మరోలా ఉండాలి. నాకా మైండ్‌సెట్ లేదు.
►హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని హాలీవుడ్, బాలీవుడ్‌లో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమంటారు?
వాళ్లు చెప్పింది కరెక్టే. హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్‌లో డిఫరెన్స్ ఉంటుంది. మార్కెట్ కూడా అలాగే ఉంది. సినిమా ఫ్లాపయితే హీరోయిన్ కంటే హీరోకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాయిన్‌కి రెండు వైపులా మనం చూడాలి. అయితే.. రెమ్యునరేషన్లలో డిఫరెన్స్ మరీ ఎక్కువుంది. కొంచెం తగ్గాలనేది నా అభిప్రాయం.
► సక్సెస్.. ఫెయిల్యూర్స్‌కి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
రెండిటినీ నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. హిట్టయినా.. ఫ్లాపైనా.. మరో సినిమా చేయాలి. ఏం వచ్చినా ముందుకు వెళ్లాలి.
►‘ఐయామ్ ఇన్ లవ్ విత్ ప్రొఫెషన్’ అని మొదటి ప్రశ్నలోనే చెప్పేశారు. చివరి ప్రశ్నలో ఎవరైనా అబ్బాయితో ప్రేమలో పడే ఆలోచన ఉంటే చెప్పండి.?
నా మనసుకి నచ్చినవాడు ఇంకా తారసపడలేదండి. ఒకవేళ ప్రేమలో పడితే అప్పుడు మీకు చెప్తా (నవ్వేస్తూ).
- సత్య పులగం