బైపాస్ అంటే భయం... ఏం చేయాలి? | That fear bypass | Sakshi
Sakshi News home page

బైపాస్ అంటే భయం... ఏం చేయాలి?

Published Wed, Jan 13 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

That fear bypass

హోమియో కౌన్సెలింగ్
 

నా వయసు 48 సంవత్సరాలు. గత పదేళ్లుగా దీర్ఘకాలిక జలుబు, దగ్గు, తుమ్ములతో బాధపడుతున్నాను. జూన్ నుంచి ఫిబ్రవవరి వరకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
 - సునిల్‌కుమార్, హైదరాబాద్

 అలర్జీ అనే పదాన్ని మనం సర్వసాధారణంగా రోజూ వింటూ ఉంటాము. పారిశ్రామిక ప్రాంతాలలో, పెద్ద పట్టణాలలో ఉండటం వల్ల వాతావరణ కాలుష్యానికి లోనవడం అలర్జీకి ప్రధాన కారణాలు. అలర్జీ అంటే శరీర రోగ నిరోధక శక్తి అసందర్భ ప్రతిచర్య. అలర్జీకి కారకమైన వాటిని అలర్జైన్స్ అంటారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అలర్జీ బారిన పడుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో అలర్జిక్ రైనైటిస్ అంటారు. అలర్జీకి సంబంధించిన ప్రేరేపకాలు ఎదురయినప్పుడు శరీరం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ముక్కులో మాస్ట్ కణాలకు అతుక్కుని ఉంటాయి. ఏదైనా పడని వస్తువు తిన్నా, తాగినా మాస్ట్‌కణాలు హిస్టామిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. 70 శాతం మంది ముక్కు అలర్జీతో బాధపడుతున్నారు. ఆస్తమా రోగులలో 80 శాతం మందిలో అలర్జీ ప్రధాన కారణంగా ఉంటుంది. డస్ట్ అలర్జీ ఉన్నవారు దుమ్ములో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే విపరీతంగా తుమ్ములు, కళ్ల దురద, ముక్కు దురద, గొంతులో, చెవిలో దురద, ముక్క వెంట నీళ్లు కారడం, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, ఆయాసం, పిల్లికూతలు వస్తుంటాయి.

కారణాలు: మనం తినే ఆహారంలో, తాగే పదార్థాలలో, పీల్చే గాలిలో అలర్జీ కారకాలు ఉంటాయి. పొగ, ఆల్కహాల్, హెయిర్ డైస్, కొన్ని రకాల నొప్పులు తగ్గించే మందులు అలర్జీ ప్రేరేపకాలుగా గుర్తించవచ్చు. డస్ట్‌మైట్స్, ధూళికణాలు, బొద్దింకలు, చెట్లు, గడ్డి, కొన్ని రకాల పువ్వులనుంచి వచ్చే పుప్పొడి వల్ల కూడా డస్ట్ అలర్జీ వస్తుంది. జంతువుల బూరు, ఈకల వల్ల కూడా దీని బారిన పడతారు.
 
లక్షణాలు: తుమ్ములు, ముక్కులో నుంచి నీరు కారడం, కళ్లలో దురద, ముక్కు బిగుసుకుపోవడం, గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన, ఆయాసం, గురక, దగ్గు, ఛాతి బిగుసుకుపోవడం,
 
నిర్ధారణ
: సీబీపీ, సీటీస్కాన్, ఎక్స్‌రే, అలర్జీ లెవెల్ పరీక్షల ద్వారా.

హోమియో చికిత్స: డస్ట్ అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులున్నాయి. రోగినిరోధక శక్తిని పెంచి వ్యాధి నివారణ అయ్యేలా చేస్తాయి. హోమియో నిపుణుని ఆధ్వర్యంలో మందులు వాడాలి.
 
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
కార్డియాలజీ కౌన్సెలింగ్

 
మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల నిర్థారణ అయ్యింది. ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఐదేళ్ల క్రితం మా పెదనాన్నకి గుండెపోటు వస్తే బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఆయనకి సర్జరీ జరిగి పదేళ్లు గడచినా ఇప్పటికీ దగ్గినప్పుడు ఛాతి నొప్పి వస్తుంటుందని ఆయన చెబుతుంటారు. గతంలో మా పెదనాన్నకి చేసిన విధంగానే ఛాతిపై, కాలిపై పెద్ద పెద్ద కోతలు పెట్టి బైపాస్ సర్జరీ చేస్తారేమో అని మా నాన్న భయపడుతున్నారు. బైపాస్ సర్జరీకి కచ్చితంగా ఛాతిని కోసి ఆపరేషన్ చేస్తారా? మా నాన్నగారి సమస్యకు ప్రత్యామ్నాయం ఉందా?
 - ఫణికుమార్, అదిలాబాద్

బైపాస్ సర్జరీ చేస్తారేమో అనే భయంతో మీ నాన్నగారు వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత తీవ్రతరమై ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఎక్కువగా ఉంటే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. బైపాస్ సర్జరీలో గుండెకు రక్త ప్రసరణను పునరుద్ధరించేందుకు కొత్త మార్గాన్ని సృష్టిస్తారు. ప్రస్తుతం బైపాస్ సర్జరీ విధానంలో ఎన్నో మార్పులు చేటు చేసుకున్నాయి. గతంలో మీ పెదనాన్న గారికి చేసిన విధంగా ఛాతీపై పెద్ద పెద్ద కోతలు లేకుండానే చిన్న కోతలతో బైపాస్ సర్జరీ నిర్వహించగలిగే మినిమల్లీ ఇన్‌వేసివ్ డెరైక్ట్ కరొనరీ బైపాస్ (ఎంఐడిసిఎబి-మిడ్‌కాబ్) వంటి అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి.  చాతీకి ఎడమవైపు 5-6 సెం.మీ. కోతతో సర్జరీ నిర్వహిస్తారు. ఈ విధానంలో కోత తక్కువగా ఉండటంతో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. గాయం త్వరగా మానుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలను చాలావరకు తగ్గించవచ్చు. కానీ ప్రస్తుతం ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ విధానంలో చిన్న కోతతో కాలి నుంచి సిరలను తొలగించి బైపాస్ సర్జరీ నిర్వహించగలుగుతున్నారు.

నూతన శస్త్రచికిత్స విధానాలలో కోతలు తక్కువగా ఉండటంతో రోగి త్వరితగతిన కోలుకుంటారు. దాంతో ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా 3-4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేస్తారు. శరీరంపై పెద్ద పెద్ద కోతలు పెట్టేవసరం లేకుండానే బైపాస్ సర్జరీ నిర్వహిస్తారని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మీ నాన్నగారికి అర్థమయ్యేలా వివరించి, వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు తీసుకెళ్లండి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది వైద్యులు నిర్థారిస్తారు.
 
డాక్టర్ పి.వి.నరేష్ కుమార్
సీనియర్ హార్ట్ అండ్ లంగ్
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
 
నా కిడ్నీలో 5.4 మి.మీ. పరిమాణంలో రాళ్లు ఉన్నాయని కేయూబీ సీటీ స్కాన్ రిపోర్టులను పరిశీలించాక డాక్టర్ చెప్పారు. వాటిని మామూలుగా తొలగించడం సాధ్యం కాదనీ, ఎండోస్కోపీ సర్జరీ చేయాలని అన్నారు. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే... వాటిని టాబ్లెట్ల సహాయంతో కరిగించడం వీలు కాదా? పైగా దాదాపు రూ. 25,000 ఖర్చవుతుందని కూడా చెప్పారు. నేను అంత ఖర్చు భరించలేను. కాబట్టి దయచేసి నా విషయంలో తగిన సలహా ఇవ్వగలరు.
 - కె. శివమ్మ, ఈ-మెయిల్

కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే ఈ రాళ్లను రీనల్ కాల్యుకులీ అంటారు. ఈ కండిషన్‌ను నెఫ్రోలిథియాసిస్ అని చెబుతారు. మీ కిడ్నీలో 5.4 మి.మీ. పరిమాణంలోని రాళ్లు సాధారణంగా ఆపరేషన్ అవసరం లేకుండానే మందులతో కరిగిపోతాయి. పేషెంట్ విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లోనూ పేషెంట్ కండిషన్ బట్టి ముందుగా మందులతో చికిత్స చేసి, నెలరోజుల పాటు రాయి ఉన్న పరిస్థితిని పరిశీలిస్తారు. నెలరోజుల్లో కరిగి మూత్రంతో పాటు బయటకు వెళ్లనప్పుడు మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది.  మీరు ఆపరేషన్ కంటే ముందుగా కనీసం ఒక నెల రోజుల పాటు మందులు వాడి చూడండి. వాటి ద్వారా మీ మూత్రపిండాల్లోని రాళ్లు యూరిన్ ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీ రిపోర్టులతో ఒకసారి మీ దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
నా వయసు 48 ఏళ్లు. నేను తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నాను. దాన్ని తట్టుకోలేక   నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?
 - హరిబాబు, నెల్లూరు

 పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి హాని చేస్తాయి. ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి.
 
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్ హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement