ఆ నేడు 15 సెప్టెంబర్, 1860
జ్ఞాన సముద్రుడు
మహా గ్రంథాలే కాదు... మహనీయుల జీవితాలు కూడా మౌనంగా దారి చూపుతాయి. అటువంటి మహనీయుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గుర్తు తెచ్చుకోవడం అంటే... ఎప్పటికప్పుడు సరికొత్త స్ఫూర్తిని అందిపుచ్చుకోవడమే. జ్ఞానం ఉన్నచోట క్రమశిక్షణకు లోటు రావచ్చు. క్రమశిక్షణ ఉన్నచోట జ్ఞానలేమి కనబడవచ్చు. కానీ మోక్షగుండం మేధస్సు ఎంత పదునైనదో, క్రమశిక్షణ అంత గట్టిది. ఉపన్యాసం ఇవ్వాల్సిన రోజు నాలుగు గంటలకి నిద్రలేచి నోట్స్ తయారు చేసుకోవడం, మెరుగులు దిద్దుకోవడం లాంటివి చేసేవారు. తన బట్టలు తానే ఉతుక్కొని, ఐరన్ చేసుకునేవారట.
ఏ పనీ ఆషామాషీగా చేయడం ఆయనకు ఇష్టముండేది కాదు... అది ఉపన్యాసమైనా సరే, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనైనా సరే. జీవితానికి సంబంధించిన నైతికవిలువలు, జ్ఞానధోరణులకు విశ్వేశ్వరయ్య జీవితం ప్రతీకగా మారింది. ‘‘విశ్వేశ్వరయ్యకు ఉన్నంత జ్ఞానం ఉంది’’ అంటారు జ్ఞానానికి సంబంధించిన అంచనాల్లో.
‘‘వీధిదీపాల కింద కష్టపడి చదువుకున్నారు’’ అంటూ తల్లిదండ్రులు పిల్లలకు విశ్వేశ్వరయ్య జీవితాన్ని పాఠంగా చెబుతారు. ఎంత కాలం గడిచినా.... చరిత్రను వెలిగించే స్ఫూర్తిదాయకమైన అరుదైన పేర్లు కొన్ని ఉంటాయి. విశ్వేశ్వరయ్య పేరు అలాంటిదే. ఆయన పుట్టిన రోజును ‘ఇంజనీర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన నుంచి సరికొత్త స్ఫూర్తిని ఎప్పటికప్పుడు అందుకుంటున్నాం.