ఆ నేడు 25 సెప్టెంబర్, 2011
ఓటుకు పోదాం ఛలో ఛలో!
మహిళలకు ఓటు హక్కు కల్పిస్తున్నట్లు సౌదీ అరేబియ రాజు అబ్దుల్లా ప్రకటించారు. కరడు గట్టిన ఒక సంప్రదాయ రాజ్యంలో ఇది చారిత్రక ఘట్టమే. ఓటు హక్కు మాత్రమే కాదు ‘షుర కౌన్సిల్’ (సంప్రదింపుల సభ)లో కూడా మహిళలు భాగస్వాములు కావాలని 87 ఏళ్ల అబ్దుల్లా పిలుపునిచ్చారు.
తన చర్యను ‘జాగ్రత్తతో కూడిన సంస్కరణ’ అన్నారు ఆయన. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడాలని అబ్దుల్లా సౌదీ మహిళలను కోరారు. అబ్దుల్లా ప్రకటనపై దేశంలో చాలా మంది సానుకూలంగా స్పందించడం విశేషం.
‘‘మహిళలకు సంబంధించి దేశంలో అనుకూల మార్పులు తీసుకురావడానికి ఇదొక లిట్మస్ టెస్ట్‌లాంటిది’’ అన్నారు సామాజిక విశ్లేషకులు. ‘‘ఇది కంటితుడుపు చర్య..పాశ్చాత్యదేశాల మెప్పుకోసం వేసిన పిల్లి మొగ్గ’’ అన్నవారు కూడా లేకపోలేదు.
ఏది ఏమైనా ఈ ఓటుహక్కు అనేది తొలి అడుగు అనుకోవచ్చు.