హోమియో కౌన్సెలింగ్
నా వయసు 38. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. గత పదేళ్లుగా కిడ్నీలో, మూత్రనాళంలో రాళ్లతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించట్లేదు. ఒకసారి ఆపరేషన్ కూడా అయింది. మళ్లీ రాళ్లు ఉన్నాయంటున్నారు. దీనికి హోమియోలో పరిష్కారం ఉంటే చెప్పగలరు.
- బి.సురేందర్, ఆదిలాబాద్
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఒక సర్వే ప్రకారం మన దేశంలో పురుషుల్లో 10.6 శాతం మంది, స్త్రీలలో 7.1 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం, జన్యుపరమైన ఇన్ఫెక్షన్లు, ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండటం, మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్యత, కొన్ని రకాల మందుల వాడకం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా భావించవచ్చు.
లక్షణాలు: పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం, విపరీతమైన చెమటలు, బరువు తగ్గడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రంలో మంటతో కూడిన చీము పడటం.
జాగ్రత్తలు
* నీటిని ఎక్కువగా తాగడం, నీరుగాని ఇతర ద్రవపదార్థాలు గాని మొత్తం కలిపితే రోజుకు నాలుగు లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి.
* కిడ్నీలో ఆక్సలేట్ రాళ్లు ఉంటే, ఆక్సలేట్ ఉండే పదార్థాలు అంటే చాకొలేట్, పాలకూర, సోయా, చిక్కుడు వంటివాటిని బాగా తగ్గించాలి.
* కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఇవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది.
* కూల్‌డ్రింక్స్‌ను పూర్తిగా మానేయడం మంచిది.
నిర్థారణ: కిడ్నీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కిడ్నీ పరీక్ష, రక్తపరీక్ష, మూత్రపరీక్ష
హోమియో చికిత్స
హోమియోపతిలో శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కిడ్నీ రాళ్ల పరిమాణం, అవి ఏ వైపున ఏర్పడ్డాయో, వాటి ఆధారంగా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బెరి బెరి వల్గారిస్, సారస్పరిల్లా, కాల్కేరియా కార్బ్, కోలోసింత్ మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. స్టార్ హోమియోపతిలో రోగిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతూ, ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ లేకుండా, శస్త్రచికిత్సతో అవసరం లేకుండా కిడ్నీలు, మూత్ర నాళాలలోని రాళ్లను తొలగించే మందుల వాడకం ద్వారా సమస్యకు శాశ్వత చికిత్స లభిస్తుంది.
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. ఇటీవల నా భర్తకు ఛాతీలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడిందని చెప్పి స్టెంట్ వేశారు. తర్వాత మా ఆయన మళ్లీ సాధారణ జీవితం గడపగలుగుతున్నారు. ఇటీవల మా ఆయనకు వచ్చినట్లే నాకు కూడా ఛాతీలో నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఎక్కువ సేపు నడిచినప్పుడు నొప్పి ఎక్కువవుతోంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ సాధారణంగా అవుతోంది. అయితే నా వయసు గల మహిళలకు గుండెజబ్బులు రావని తెలిసిన వాళ్లు అంటున్నారు. నాకు గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.
- మాధవి, కర్నూలు
ఒకప్పుడు మహిళలకు త్వరగా గుండె జబ్బులు వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగాలు చేసే మహిళల్లో గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యాలయలలో పనిభారంతో పాటు ఇంట్లో పనిభారం కూడా పెరిగిపోవడంతో మహిళలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగాని ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నా, మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఏమైనా ఉన్నా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మీకు ఎన్ని రోజులుగా ఛాతీలో నొప్పి వస్తోందో మీరు తెలపలేదు. మీరు రాసిన లక్షణాలను బట్టి గుండెజబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ ఆరోగ్యపరిస్థితిని బట్టి చికిత్స ప్రారంభిస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నా భర్త వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడాది అయ్యింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. మేమేమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా?
- సరళ, హైదరాబాద్
గర్భధారణ కోరుకుంటున్నప్పుడు అందుకోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ప్రధానం. ముందుగా మీరిద్దరి సాధారణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. మీకు డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలుంటే ముందుగానే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే గర్భధారణ సమయంలో వాటివల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికే ఏమైనా మందులు వాడుతున్నట్లయితే, గర్భధారణ సమయంలో తల్లికీ, బిడ్డకూ అవి సురక్షితమేనా అని డాక్టర్ ద్వారా సరిచూసుకోవాలి.
సాధారణంగా చాలామంది దంపతుల్లో తాము ప్లాన్ చేసుకున్న ఆర్నెల్లలో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక శరీర బరువు మరో ప్రధానమైన అంశం. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) గనక 35 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా లేదా 19 కంటే తక్కువ ఉన్నా గర్భధారణ జరగడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకే ఆరోగ్యకరంగా ఉండాల్సిన బరువు ఉంటూ బీఎమ్‌ఐను ఆ విలువల మధ్య ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీ భర్తకు పొగతాగే అలవాటు ఉంటే అది గర్భధారణపైన దుష్ర్పభావం చూపవచ్చు.
మీ భర్తకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయమని చెప్పండి. ఎందుకంటే ఆల్కహాల్ వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి ఇద్దరూ దూరంగా ఉండండి. ఎందుకంటే ఒత్తిడి కూడా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకొండి. దీనివల్ల బిడ్డ మెదడు ఎదుగుదల బాగుండటంతో పాటు బిడ్డలో వెన్నుపాము సంబంధించిన లోపాలు రాకుండా ఉంటాయి. మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మీ డాక్టర్‌ను సంప్రదించండి.
మహిళలకు ఏ వయసులో గుండెజబ్బులు వస్తాయి?
Published Mon, Oct 19 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM
Advertisement