ఈ బైక్ పడదు! | The bike does not down | Sakshi
Sakshi News home page

ఈ బైక్ పడదు!

Published Tue, Aug 23 2016 11:28 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ఈ బైక్ పడదు! - Sakshi

ఈ బైక్ పడదు!

వావ్ ఫ్యాక్టర్


మోటర్‌సైకిల్ స్టాండ్ తీసేస్తే... అది అలాగే పక్కకు ఒరిగిపోతుంది. నలుగురు కలిసి గట్టిగా ఓ తోపు తోశారనుకోండి. నాలుగు చక్రాల బండైనా తల్లకిందులవుతుంది. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఈ వాహనం దగ్గర మాత్రం మీ పప్పులుడకవు. మీరెంత గట్టిగా తోసినాసరే... కొంచెం దూరం వెళ్లిపోయి నిటారుగా నుంచుంటుందేగానీ.. అస్సలు పడిపోదు! ఎందుకంటే, అమెరికా కంపెనీ లిట్ మోటార్స్ తయారు చేసిన ‘సీ1’ అనే ఈ సరికొత్త వాహనంలో అన్ని రకాల కుదుపులను తట్టుకుని నిలబడేలా రెండు జైరోస్కోపులు ఏర్పాటు చేశారు. అలాగని దీనికి పార్కింగ్ స్టాండ్ లేదనుకునేరు. ఇంజిన్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ఈ పార్కింగ్ స్టాండ్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఇంకా బోలెడున్నాయి. పూర్తిగా విద్యుత్తుతో నడిచే వాహనం కావడం, ఒకసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే అవకాశం సీ1 విశేషాల్లో కొన్ని మాత్రమే. కేవలం ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ వాహనంలో కారు మాదిరి స్టీరింగ్ ఉంటుంది.


పైగా దీంట్లో ఉన్న అనేక సెన్సర్లు రోడ్డు పరిస్థితి, గాలివేగం, చుట్టూ ఉన్న ట్రాఫిక్ వంటి అంశాలతోపాటు డ్రై వర్ స్టీరింగ్‌ను ఏవైపునకు తిప్పుతున్నాడు? వాహనం వేగమెంతుంది? వంటి వాటిని కూడా లెక్కకట్టి మలుపుల్లో వాహనాన్ని ఎంతమేరకు వంపాలో నిర్ణయించి, అమలు చేస్తుంది. దాదాపు పది కిలోవాట్/హవర్ బ్యాటరీతో పనిచేసే సీ1ను నాలుగు గంటల్లో (220 వోల్టులు) పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వోల్టేజీ ఉన్న డీసీ కరెంటుతోనైతే ఆరగంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకంటే పదోవంతు తక్కువ విడిభాగాలున్న సీ1 నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువట! మరో రెండేళ్లలో అందుబాటులోకి రానున్న సీ1 ధర దాదాపు రూ.16 లక్షల పైమాటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement