wow factor
-
గంటల్లో గూళ్లు రెడీ!
వావ్ ఫ్యాక్టర్ పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నా, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్వాసితులయ్యే వారికి తాత్కాలికంగానైనా ఒక గూడు కల్పించాలన్నా ఎంత శ్రమో మనకు తెలియంది కాదు. ఈసమస్యకు ఇప్పటికే ఎందరో ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చూపారు. తాజాగా చార్లెస్ అనే ఓ ఆర్కిటెక్ట్ ‘లైఫ్ ఆర్క్’ పేరుతో ఇంకో వినూత్నమైన సమాధానాన్ని సూచిస్తున్నారు. ఫొటోలోకనిపిస్తున్నవన్నీ నీటిపై ఏర్పాటు చేసిన ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు. వీటిని ఒకదానితో ఒకటి జతచేసుకుంటూ, ఒకేదగ్గర కాలనీలా, ఒక పల్లె మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చు. హెచ్డీపీఈ పదార్థంతో రొటేషనల్ మౌల్డింగ్ అనే టెక్నాలజీతో సిద్ధమయ్యే ప్యానెళ్లను నట్లు, బోల్టులతో జోడించుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఒక్కో ఇంటికి కంటెయినర్ బాక్స్‌లోకి సులువుగా ఇమిడిపోయే దాదాపు 24 ప్యానెళ్ల అవసరముంటుంది. అన్నింటినీ కాలిఫోర్నియాలోని తన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నారు చార్లెస్. ప్యానెళ్లు తయారైన తరువాత వంటింటి అరుగు, ఎలక్ట్రిక్ వైరింగ్ వంటి అదనపు హంగులనుఇంకో ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఇళ్లు దాదాపుగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంటే విద్యుత్తు, నీళ్లు వంటి అవసరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వీటిల్లోనే ఉన్నాయన్నమాట. నీటిపైనే కాకుండా నేలపై కూడా సునాయాసంగా కొన్ని గంటల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కోటి అరవై చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటాయి. ప్రస్తుతం అక్కడికక్కడే కాయగూరలు పండించుకునేందుకు కూడా ఈ లైఫ్ఆర్క్ ఇంట్లో హైడ్రోపోనిక్స్ ఏర్పాట్లు ఉన్నాయి. చార్లెస్ ఫ్యాక్టరీలో రోజుకు పది ఇళ్లకు సరిపడ ప్యానెళ్లు సిద్ధమవుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే వీటిని వచ్చే మార్చి నాటికి డల్లాస్, టెక్సాస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ చౌక ఇళ్లను అమ్మడం ద్వారా వచ్చే లాభాలతో మరిన్ని లైఫ్ఆర్క్లు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నిర్వాసితులైన వారికి, శరణార్థి శిబిరాల ఏర్పాటుకూ ఉపయోగిస్తామంటున్నారు చార్లెస్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెలుసుకుని తీసిపారేస్తుంది
మీరెప్పుడైనా పొలాల్లో కలుపు తీశారా? తీసుంటే.. కనీసం చూసుంటే.. ఆ పని ఒళ్లు హూనమయ్యేంత కష్టమని మీకు తెలిసే ఉంటుందికదా! ఆ కష్టాన్ని తీసేసే రోబో ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కలుపు మొక్కల్ని నాశనం చేసేసే రోబో. భలే ఉంది కదూ. దీన్ని తయారు చేసింది ఎవరనుకుంటున్నారు? ఆమధ్యకాలంలో వచ్చిన రోబో వాక్యూమ్ క్లీనర్ రూంబాను తయారు చేసిన జో జోన్స్దే ఈ ఐడియా కూడా. కాకపోతే ప్రస్తుతానికి దీన్ని పెరటి తోటలకు మాత్రమే వాడుకునే వీలుంది. మొక్క సైజును బట్టి ఏది కలుపు, ఏది కాదన్నది గుర్తుపడుతుందట టెర్టిల్ అనే పేరున్న ఈ రోబో. అంగుళం కంటే ఎక్కువ సైజున్నవి పనికొచ్చే మొక్కలుగా గుర్తిస్తుంది. అంతకంటే చిన్న వాటిని తన చక్రాల మధ్యలో ఉండే చిన్న యంత్రం సాయంతో నేలమట్టం చేసేస్తుంది. అవసరమైన మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వాటిచుట్టూ ఇనుప కంచెలాంటిది వేస్తే చాలు. దాని జోలికి వెళ్లదు. పైగా వాలుగా ఉన్న దీని చక్రాలను చూశారా.. అవికూడా అటుఇటూ తిరిగేటప్పుడు కలుపు మొక్కలను పెరక్కుండా నిరోధిస్తాయి. అంతేకాదు, ఏ రకమైన రసాయనాలూ వాడకుండానే కావాల్సినప్పుడల్లా కలుపు తీసేసుకోవచ్చు. అడ్డంకులను గుర్తించేందుకు, తన దారి తానే వెతుక్కునేందుకు వీలుగా దీంట్లో కొన్ని సెన్సర్లను ఏర్పాటు చేశారు. పైన ఉన్న సోలార్ ప్యానెల్స్‌తో పనిచేస్తుంది కాబట్టి... కరెంటు కనెక్షన్ కూడా అవసరం లేదన్నమాట. కలుపు మొక్కలను పూర్తిగా పీకేయకున్నా, ఎప్పటికప్పుడు ఎదగకుండా చూస్తుంది కాబట్టి టెర్టిల్తో ఉపయోగమే కానీ నష్టమేమీ లేదంటున్నారు జోన్స్. ఇప్పటì వరకైతే టెర్టిల్ రోబోల నమూనాలు సిద్ధమయ్యాయి గానీ.. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జోన్స్ ప్రస్తుతం కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే పనుల్లో ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చికల్లా దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఫ్రాంక్లిన్ రోబోటిక్స్ అనే అమెరికన్ సంస్థ! బాగానే ఉందిగానీ.. దీన్ని వ్యవసాయ పొలాల్లో వాడుకోవచ్చా? సమీప భవిష్యత్తులో అదీ సాధ్యమేనేమో! -
పూల భవనాల వనం
నిన్నమొన్నటివరకూ చెట్లతో కళకళలాడిన అడవులిప్పుడు కాంక్రీట్ జనారణ్యాలు అవుతున్నాయి. రోడ్డెక్కితే కనుచూపు మేర పచ్చదనం కరవై బోసిపోయిన వీధులే కనిపిస్తాయి. అయితే అక్కడక్కడైనా సరే.. ఈ దుస్థితి మారుతోంది. అపార్ట్మెంట్లలోనే భారీగా మొక్కలు పెంచడం.. ఇందుకోసం ప్రత్యేకమైన డిజైన్లు సిద్ధం చేస్తూండం మనం ‘వావ్ ఫ్యాక్టర్’లోనే చాలాసార్లు ప్రస్తావించాం. నగరీకరణ పెరిగిపోయి వాయుకాలుష్యం ప్రాణాలు తీస్తున్న క్రమంలో ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది.. అడవులను తెగనరికేసి నగరాలను కట్టేయడమన్న పాత పద్ధతికి స్వస్తి పలికి.. అడవులను పెంచి వాటిమధ్యల్లో భవనాలు కట్టేదామన్న ఆలోచనకు వస్తోంది. తేడా ఏమిటీ? ఫొటోలు చూడండి. అర్థమైపోతుంది. చైనాలోనీ లీఝౌ అనే ప్రాంతంలో నిర్మించబోయే అటవీ నగరమిది! అక్కడున్న పదిహేను లక్షల మందికీ సరిపడా భవనాలను నిర్మిస్తూనే.. మొత్తం నగరం పచ్చదనంలోనే మునిగిపోయి ఉండేలా దీన్ని డిజైన్ చేశారు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ స్టిఫానీ బోరీ. ఈ నగరంలో ఒకే ఒక్క ఎత్తైన భవనం ఉంటుంది. దీని చుట్టూ వంద నుంచి 200 వరకూ వేర్వేరు సైజులున్న భవనాలు కడతారు. ఈ ప్రాంతమంతా ఒక మినీ సిటీ మాదిరిగా ఉంటుంది. ఇలాంటివి ఐదింటిని ఒక పువ్వు ఆకారంలో అభివృద్ధి చేయడం.. ఇలాంటి పువ్వులు అనేకం పక్కపక్కనే ఏర్పాటు చేయడం బోరీ ప్లాన్‌లో భాగం. ఈ ఏడాది చివరికి నిర్మాణం మొదలుపెట్టి 2020 కల్లా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవనాలన్నీ పచ్చటి తీగలు, మొక్కలతో కప్పబడి ఉంటాయి కాబట్టి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుతుందని బోరీ అంచనా. బోరీ ఇప్పటికే ఇటలీలో బాస్కో వర్టికాలీ పేరుతో ఓ అపార్ట్మెంట్ అడవిని çసృష్టి్టంచిన విషయం తెలిసిందే. దీంతోపాటు చైనాలోని నాన్జింగ్ ప్రాంతంలో ఈయన ఓ ట్విన్ టవర్‌ను డిజైన్ చేశారు. ఈ భవనాల గోడలపై 23 జాతులకు చెందిన 2500 మొక్కల లతలు అల్లుకుని ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉండీ లేనట్టు కనిపించే వంతెన!
వావ్ ఫ్యాక్టర్ ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేయడాన్ని కనికట్టు అంటారు. ఇందులో మాయమంత్రాలేవీ ఉండవు. చేతివాటమే కీలకం. కానీ ఇక్కడి ఫొటోలు చూస్తే కనికట్టు చాలా చిన్న పదం అనిపించక మానదు. అవతార్ సినిమాలోని వేలాడే కొండల్ని పోలిన ప్రదేశం... రెండు ఎత్తైన శిఖరాల మధ్య ఓ బ్రిడ్జి. అదీ స్టోరీ! చైనాలోని ఝాంగ్గీయాజీ ప్రాంతంలో త్వరలో పూర్తి కానుందీ బ్రిడ్జి. కేవలం గాజు బ్రిడ్జి కావడం ఒక్కటే దీని ప్రత్యేకత కానేకాదు. ఎటు నుంచి చూసినా... అటువైపు ఉన్న సీనరీ మొత్తం పారదర్శకంగా కనిపించడం ఒక విశేషమైతే... అసలు బ్రిడ్జి ఉండీ లేనట్టుగా ఉండటం ఇంకో ముఖ్యమైన అంశం. మార్టిన్ డుప్లాంటైర్, డాకియాన్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్సు డిజైన్ చేసి నిర్మిస్తున్న ఈ వంతెనను స్టెయిన్లెస్ స్టీల్‌తో, నల్ల రాళ్లతో కడుతున్నారు. ఫొటోలను కొంచెం పరిశీలనగా చూస్తే వాటిల్లో రెండు పొరలున్న విషయం తెలుస్తుంది. అడుగున ఉన్న పొరల్లో పూర్తిగా పారదర్శకమైన పదార్థాన్ని వాడారు. పై అంతస్తులో ఇలాంటి ఏర్పాటేదీ ఉండదు. కాకపోతే నల్లరాళ్లపై దాదాపు రెండు సెంటీమీటర్ల ఎత్తువరకూ నీళ్లు ప్రవహించే ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇది ఒక అద్దం మాదిరిగా మారిపోతుంది. పరిసరాల ఛాయాచిత్రాలతో దాదాపుగా కనిపించకుండా పోతుంది. ఏడు నిమిషాలకోసారి ఈ నీటిని తోడివేసి మంచులాంటి నీటి ఆవిరితో నింపుతూంటారు. దీంతో అక్కడ మేఘాల్లో తేలియాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బ్రిడ్జికి ఒకవైపున ఒక పార్క్, ఓ హోటల్, ఓ వీఐపీ సూట్ వంటి ఏర్పాట్లు ఉన్నాయి. -
నాచులోకి వెళ్లి క్లీన్‌గా, గ్రీన్‌గా బయటికి రావొచ్చు!
వావ్ ఫ్యాక్టర్ దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టుముట్టింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందీ అంటే... బడులకు సెలవు ప్రకటించేశారు. ఐదేళ్లు నిండని పసికందులకూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా 92 శాతం ప్రజలు పీలుస్తున్నది కలుషిత వాయువులేనని ఇటీవల అంతర్జాతీయ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఫొటోల్లో కనిపిస్తున్నవి ఈ సమస్యకు ఓ తెలివైన పరిష్కారం సూచిస్తున్నాయి కాబట్టి. మీకు చెరువుల్లో, కాల్వ గట్ల వెంబడి పెరిగే నాచు తెలుసుకదా...! క్లోరెల్లా అని పిలిచే ఒకరకమైన నాచును ఫొటోల్లో కనిపిస్తున్న ‘క్లోరెల్లా ఆక్సిజన్ పెవిలియన్’లో వాడతారు. ఫలితంగా లోపలి గాలిలోని కాలుష్యాలన్నీ దాదాపుగా నాశనమైపోతాయి. క్లోరెల్లా సూర్యరశ్మిని, కార్బన్‌డై యాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమవుతుందన్నమాట. నగరాల మధ్యలో అక్కడక్కడా ఇలాంటి పెవిలియన్లు ఉంచితే... దాంట్లో కాసేపు కూర్చున్నా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని సేద తీరవచ్చనన్నది దీన్ని డిజైన్ చేసిన ఆడమ్ మిక్లోస్కీ అంచనా. అలాగని దీంట్లో ఎలాంటి హైటెక్ హంగులు ఉండవు. పారదర్శకమైన ప్లాస్టిక్ గొట్టాలను ఈ ఆకారంలో అమరుస్తారు అంతే. ఒక్కో పెవిలియన్‌లో దాదాపు 5 ఘనపు మీటర్ల పరిమాణంలో క్లోరెల్లాను వాడతారు. ఈ నాచు శుద్ధి చేసి విడుదల చేసే స్వచ్ఛమైన గాలి పెవిలియన్ మధ్యభాగంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పైగా ఈ పెవిలియన్లను కావాల్సిన చోటికి కావాల్సిన టైమ్‌లో తీసుకెళ్లేలా మొబైల్ ప్లాట్ఫార్మ్పై ఏర్పాటు చేశారు. ఇటీవల ఇన్హ్యాబిటాట్ వెబ్సైట్ నిర్వహించిన ఓ పోటీలో ఈ డిజైన్ విజేతగానూ నిలిచింది. ఇలాంటివి మన దగ్గర ఒకటో రెండో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?... ఏమో నేడో రేపో వచ్చేస్తాయేమో చూడాలి! క్లోరెల్లా అనే నాచు పెవిలియన్‌లోని కాలుష్యాల్ని మింగేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. ఈ పెవిలియన్‌లో కాసేపు కూర్చుంటే చాలు గుండె నిండా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. -
స్క్రీన్ మడత వేసేయవచ్చు...
వావ్ ఫ్యాక్టర్ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ కావాలంటే అక్కడ సినిమాలు, వీడియోలు చూసేస్తున్నాం. చిక్కల్లా మన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ సైజెంత అన్నదే. చిన్న చిన్న స్క్రీన్లపై సినిమాలు చూడటం బోర్ కొడుతోందా? ఇబ్బందిగా మారుతోందా? అయితే ఫొటోల్లో కనిపిస్తున్న హైటెక్ స్క్రీన్ ‘స్పడ్’ మీకోసమే. బ్యాటరీతో నడిచే ఈ మైక్రో ప్రొజెక్టర్‌ను గొడుగు మాదిరి మడతపెట్టేసి కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. ఒక్క బటన్ నొక్కితే చాలు... పది సెకన్లలో 24 అంగుళాల స్క్రీన్ సిద్ధం. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లను యూఎస్బీ కేబుల్‌తో లింక్ చేసుకుని నచ్చిన కంటెంట్‌ను చూసేయవచ్చు. అంతేకాదు... అవసరమైతే దీన్ని మీ ల్యాప్‌టాప్‌కు రెండో స్క్రీన్‌లా వాడుకుంటూ ఆఫీసు పనులను వేగంగా చక్కబెట్టుకోవచ్చు. కేవలం ఒక కిలో బరువుండే ఈ స్క్రీన్ హై డెఫినిషన్ చిత్రాలను కూడా సులువుగా ప్రదర్శించగలదు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థాన్ని వాడటం వల్ల ఈ స్క్రీన్ ఎక్కువ కాలం మన్నడంతోపాటు అవసరమైనప్పుడు ఎంచక్కా శుభ్రం చేసుకునే వీలూ ఉంది. స్పడ్ తయారీ కోసం రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుకాగా... గత ఏడాది తొలి ప్రోటోటైప్ సిద్ధమైంది. ఆ తరువాత అరోవియా పేరుతో కంపెనీ ఏర్పాటై, అన్నిరకాల పరీక్షలు పూర్తి చేసుకుని ప్రస్తుతం వాణిజ్య స్థాయి ఉత్పత్తికి అవసరమైన నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తగినన్ని నిధులు అందితే వచ్చే ఏడాది జూన్‌కల్లా ఈ పోర్టబుల్ స్క్రీన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని అంటోంది అరోవియా. ప్రస్తుతానికి దీని ధర దాదాపు రూ.24 వేలు. విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తే ధర తగ్గే అవకాశాలు లేకపోలేదు! -
లూకాస్ గారి ‘స్టార్’ రేంజ్ మ్యూజియమ్
మీరు ‘అవతార్’ సినిమా చూశారా?... పోనీ ‘స్టార్ వార్స్’? చూసే ఉంటారులెండి. వాటిల్లో బ్యాక్‌గ్రౌండ్ సీన్స్ ఎలా ఉన్నాయి? చిత్రవిచిత్రమైన గ్రహాలు, మనుషులు, గ్రహాంతరవాసులతో సూపర్ అంటున్నారా? మరి... వీటన్నింటి సృష్టికర్త... అదేనండి నిర్మాత, దర్శకుడు జార్జ్ లూకాస్ ఓ బిల్డింగ్ కట్టాలనుకుంటే ఏ స్థాయిలో ఉంటుంది? పక్క ఫొటోల్లో కనిపించేంత! విషయం ఏమిటంటే– లూకాస్ తన పెయింటింగ్‌లు, చిత్రాలు, డిజిటల్, సినిమా ఆర్ట్‌లతో ‘లూకాస్ మ్యూజియమ్ ఆఫ్ నేరేటివ్ ఆర్ట్’ పేరుతో ఓ మ్యూజియమ్ పెట్టదలిచారు. మొదట ఈ మ్యూజియమ్ ను చికాగోలో పెట్టాలని భావించారు. తీరా అక్కడి ఉద్యానాల పరిరక్షకుల నుంచి అభ్యంతరాలు రావడంతో, సరైన స్థలం దొరకలేదు. దాంతో, ఈ ప్రతిపాదిత మ్యూజియమ్‌ను వేరే చోటకు తరలిస్తున్నామని మొన్న జూన్‌లో లూకాస్ ప్రకటించారు. దీంతో కొత్త చోట ఆ భవనాలు ఎలా ఉండాలన్న విషయంపై చర్చ మొదలైంది. శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలిస్‌లలో ఏదో ఒకచోట ఏర్పాటు చేస్తే తమ డిజైన్లను పరిశీలించాల్సిందిగా చైనాకు చెందిన ఎంఏడీ ఆర్కిటెక్చర్ సంస్థ కొన్ని డిజైన్లను ప్రతిపాదించింది. ఫొటోల్లో ఉన్నవి అవే. లూకాస్ స్థాయికి తగ్గట్టుగా... ఎక్కడో అంతరిక్షం నుంచి ఊడిపడినట్లుగా ఉన్నాయి కదూ ఈ డిజైన్లు! వీటిల్లోని అంశాలూ ఆసక్తికరంగానే ఉన్నాయి. శాన్ఫ్రాన్సిస్కో తీరంలో ఉన్న ఓ కృత్రిమ ద్వీపంపై ఒక భవనం ఏర్పాటవుతూండగా, రెండోది లాస్ ఏంజెలిస్‌లోని ఎక్స్పోజిషన్ పార్క్‌లో ఏర్పాటవుతోంది. అలాగని ఆ యా ప్రాంతాల్లో ఉండే ఒక్క చెట్టునూ కొట్టేయడం లేదండోయ్! ఉన్నవాటిని అలాగే ఉంచుతూ ఈ భవనాలను ఏర్పాటు చేయడంతోపాటు అందరి సౌకర్యార్థం వీటి పైకప్పులపై అదనంగా పచ్చదనాన్ని పొదుగుతున్నారు. ఒక్కో భవనం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవనాలపై నాలుగు నెలల్లో లూకాస్ ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంచనా. ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలో (పైన), లాస్ ఏంజెలిస్‌లో (కింద) ప్రతిపాదించిన డిజైన్లు -
ఈ బైక్ పడదు!
వావ్ ఫ్యాక్టర్ మోటర్‌సైకిల్ స్టాండ్ తీసేస్తే... అది అలాగే పక్కకు ఒరిగిపోతుంది. నలుగురు కలిసి గట్టిగా ఓ తోపు తోశారనుకోండి. నాలుగు చక్రాల బండైనా తల్లకిందులవుతుంది. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఈ వాహనం దగ్గర మాత్రం మీ పప్పులుడకవు. మీరెంత గట్టిగా తోసినాసరే... కొంచెం దూరం వెళ్లిపోయి నిటారుగా నుంచుంటుందేగానీ.. అస్సలు పడిపోదు! ఎందుకంటే, అమెరికా కంపెనీ లిట్ మోటార్స్ తయారు చేసిన ‘సీ1’ అనే ఈ సరికొత్త వాహనంలో అన్ని రకాల కుదుపులను తట్టుకుని నిలబడేలా రెండు జైరోస్కోపులు ఏర్పాటు చేశారు. అలాగని దీనికి పార్కింగ్ స్టాండ్ లేదనుకునేరు. ఇంజిన్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ఈ పార్కింగ్ స్టాండ్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఇంకా బోలెడున్నాయి. పూర్తిగా విద్యుత్తుతో నడిచే వాహనం కావడం, ఒకసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే అవకాశం సీ1 విశేషాల్లో కొన్ని మాత్రమే. కేవలం ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ వాహనంలో కారు మాదిరి స్టీరింగ్ ఉంటుంది. పైగా దీంట్లో ఉన్న అనేక సెన్సర్లు రోడ్డు పరిస్థితి, గాలివేగం, చుట్టూ ఉన్న ట్రాఫిక్ వంటి అంశాలతోపాటు డ్రై వర్ స్టీరింగ్‌ను ఏవైపునకు తిప్పుతున్నాడు? వాహనం వేగమెంతుంది? వంటి వాటిని కూడా లెక్కకట్టి మలుపుల్లో వాహనాన్ని ఎంతమేరకు వంపాలో నిర్ణయించి, అమలు చేస్తుంది. దాదాపు పది కిలోవాట్/హవర్ బ్యాటరీతో పనిచేసే సీ1ను నాలుగు గంటల్లో (220 వోల్టులు) పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వోల్టేజీ ఉన్న డీసీ కరెంటుతోనైతే ఆరగంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకంటే పదోవంతు తక్కువ విడిభాగాలున్న సీ1 నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువట! మరో రెండేళ్లలో అందుబాటులోకి రానున్న సీ1 ధర దాదాపు రూ.16 లక్షల పైమాటే!