పెవిలియన్లు ద్వారా కాలుష్య ప్రభావాన్ని తగ్గించవచ్చు.
వావ్ ఫ్యాక్టర్
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టుముట్టింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందీ అంటే... బడులకు సెలవు ప్రకటించేశారు. ఐదేళ్లు నిండని పసికందులకూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా 92 శాతం ప్రజలు పీలుస్తున్నది కలుషిత వాయువులేనని ఇటీవల అంతర్జాతీయ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఫొటోల్లో కనిపిస్తున్నవి ఈ సమస్యకు ఓ తెలివైన పరిష్కారం సూచిస్తున్నాయి కాబట్టి.
మీకు చెరువుల్లో, కాల్వ గట్ల వెంబడి పెరిగే నాచు తెలుసుకదా...! క్లోరెల్లా అని పిలిచే ఒకరకమైన నాచును ఫొటోల్లో కనిపిస్తున్న ‘క్లోరెల్లా ఆక్సిజన్ పెవిలియన్’లో వాడతారు. ఫలితంగా లోపలి గాలిలోని కాలుష్యాలన్నీ దాదాపుగా నాశనమైపోతాయి. క్లోరెల్లా సూర్యరశ్మిని, కార్బన్‌డై యాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమవుతుందన్నమాట. నగరాల మధ్యలో అక్కడక్కడా ఇలాంటి పెవిలియన్లు ఉంచితే... దాంట్లో కాసేపు కూర్చున్నా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని సేద తీరవచ్చనన్నది దీన్ని డిజైన్ చేసిన ఆడమ్ మిక్లోస్కీ అంచనా. అలాగని దీంట్లో ఎలాంటి హైటెక్ హంగులు ఉండవు. పారదర్శకమైన ప్లాస్టిక్ గొట్టాలను ఈ ఆకారంలో అమరుస్తారు అంతే. ఒక్కో పెవిలియన్‌లో దాదాపు 5 ఘనపు మీటర్ల పరిమాణంలో క్లోరెల్లాను వాడతారు. ఈ నాచు శుద్ధి చేసి విడుదల చేసే స్వచ్ఛమైన గాలి పెవిలియన్ మధ్యభాగంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పైగా ఈ పెవిలియన్లను కావాల్సిన చోటికి కావాల్సిన టైమ్‌లో తీసుకెళ్లేలా మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌పై ఏర్పాటు చేశారు. ఇటీవల ఇన్‌హ్యాబిటాట్ వెబ్‌సైట్ నిర్వహించిన ఓ పోటీలో ఈ డిజైన్ విజేతగానూ నిలిచింది. ఇలాంటివి మన దగ్గర ఒకటో రెండో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?... ఏమో నేడో రేపో వచ్చేస్తాయేమో చూడాలి!
క్లోరెల్లా అనే నాచు పెవిలియన్‌లోని కాలుష్యాల్ని మింగేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.
ఈ పెవిలియన్‌లో కాసేపు కూర్చుంటే చాలు గుండె నిండా
స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు.