వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న హైటెక్ స్క్రీన్
వావ్ ఫ్యాక్టర్
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ కావాలంటే అక్కడ సినిమాలు, వీడియోలు చూసేస్తున్నాం. చిక్కల్లా మన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ సైజెంత అన్నదే. చిన్న చిన్న స్క్రీన్‌లపై సినిమాలు చూడటం బోర్ కొడుతోందా? ఇబ్బందిగా మారుతోందా? అయితే ఫొటోల్లో కనిపిస్తున్న హైటెక్ స్క్రీన్ ‘స్పడ్’ మీకోసమే. బ్యాటరీతో నడిచే ఈ మైక్రో ప్రొజెక్టర్‌ను గొడుగు మాదిరి మడతపెట్టేసి కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. ఒక్క బటన్ నొక్కితే చాలు... పది సెకన్లలో 24 అంగుళాల స్క్రీన్ సిద్ధం.
మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లను యూఎస్‌బీ కేబుల్‌తో లింక్ చేసుకుని నచ్చిన కంటెంట్‌ను చూసేయవచ్చు. అంతేకాదు... అవసరమైతే దీన్ని మీ ల్యాప్‌టాప్‌కు రెండో స్క్రీన్‌లా వాడుకుంటూ ఆఫీసు పనులను వేగంగా చక్కబెట్టుకోవచ్చు. కేవలం ఒక కిలో బరువుండే ఈ స్క్రీన్ హై డెఫినిషన్ చిత్రాలను కూడా సులువుగా ప్రదర్శించగలదు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థాన్ని వాడటం వల్ల ఈ స్క్రీన్ ఎక్కువ కాలం మన్నడంతోపాటు అవసరమైనప్పుడు ఎంచక్కా శుభ్రం చేసుకునే వీలూ ఉంది. స్పడ్ తయారీ కోసం రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుకాగా... గత ఏడాది తొలి ప్రోటోటైప్ సిద్ధమైంది. ఆ తరువాత అరోవియా పేరుతో కంపెనీ ఏర్పాటై, అన్నిరకాల పరీక్షలు పూర్తి చేసుకుని ప్రస్తుతం వాణిజ్య స్థాయి ఉత్పత్తికి అవసరమైన నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తగినన్ని నిధులు అందితే వచ్చే ఏడాది జూన్‌కల్లా ఈ పోర్టబుల్ స్క్రీన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని అంటోంది అరోవియా. ప్రస్తుతానికి దీని ధర దాదాపు రూ.24 వేలు. విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తే ధర తగ్గే అవకాశాలు లేకపోలేదు!