మహిళలకు సమ ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ/సూరత్: మన జీవితాల్లోని ప్రతి అంశంలోనూ, అడుగులోనూ మహిళ పాత్ర ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రాథమిక విధి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మనసులో మాట’ (మన్ కీ బాత్)లో ఆయన ఆదివారం ప్రసంగించారు. నవభారతమంటే శక్తిమంతమైన, సాధికారత కలిగిన, అభివృద్ధి కార్యక్రమాల్లో సగం పాత్ర పోషించే మహిళలు ఉండే భారతదేశమని మోదీ నిర్వచించారు. స్త్రీలలో ఉండే అంతర్ శక్తి, ఆత్మ విశ్వాసమే వారిని నేడు తమ కాళ్లపై నిలబడగలిగేలా చేస్తున్నాయన్నారు.
‘ఆమె తను ఎదగడమే కాకుండా దేశాన్ని, సమాజాన్ని కూడా కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. నేడు దేశం మహిళాభివృద్ధి అనే దారిలో కాకుండా, ఆ మహిళలే నాయకత్వం వహిస్తున్న దారిలో పయనిస్తోంది’ అని మోదీ ప్రశసించారు. స్వామి వివేకానందుడు చెప్పిన ‘పరిపూర్ణ స్త్రీత్వమే పరిపూర్ణ స్వాతంత్య్రం’ అన్న సూక్తిని మోదీ గుర్తుచేశారు. స్త్రీ పేరుతో పురుషుడిని గుర్తించే సంప్రదాయంలో మనం భాగమనీ, యశోదా నందన్, కౌసల్యా నందన్, గాంధారి పుత్ర తదితర పేర్లే అందుకు నిదర్శనమన్నారు. ఈ నెల 28న జరుపుకోనున్న జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ప్రశ్నలకు సమాధానాలు వచ్చేంతవరకూ పరిశోధనలు చేస్తూనే ఉండాలన్నారు.
నిబంధనలను పాటిస్తేనే భద్రత
మార్చి 4న పాటించే జాతీయ భద్రతా దినోత్సవం గురించి కూడా మోదీ మాట్లాడారు. ప్రజలంతా భద్రతను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఎన్నో పెద్దపెద్ద విపత్తులను నివారించడంలో ఇది సాయపడుతుందని ఆయన సూచించారు. ప్రజలు రోడ్లపై సూచిక బోర్డులను చదువుతారేగానీ ఆ నిబంధనలను పాటించరంటూ విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే మానవ తప్పిదాల వల్ల జరిగే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చని మోదీ పేర్కొన్నారు.
ఇటీవలే ప్రారంభించిన ‘గోబర్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్) ధన్’ పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. పల్లెలను పరిశుభ్రంగా మార్చడానికే ఈ పథకం తీసుకొచ్చామనీ, పశువుల పేడ, పంట వ్యర్థాలతో పర్యావరణహిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు ఆదాయం సమకూర్చడమే దీని ఉద్దేశమన్నారు. ఈ వారంలోనే జరుపుకోనున్న హోలీ పండుగ అందరి జీవితాల్లోనూ రంగులు నింపాలని మోదీ ఆకాంక్షించారు.
కులమతాల్లేని నవ భారతాన్ని నిర్మిద్దాం
కుల, మత, అవినీతిరహిత నవభారతాన్ని నిర్మించాలని మోదీ పిలుపునిచ్చారు. డైమండ్ సిటీ సూరత్‌లో ‘రన్ ఫర్ న్యూ ఇండియా’ పేరుతో ఏర్పాటుచేసిన మారథాన్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భారత ప్రాముఖ్యాన్ని గుర్తించటం ప్రారంభించింది. మనలోని లోపాలను పక్కనబెట్టాల్సిన అవసరం ఉంది. కులమనే విషప్రభావం లేని నవభారతాన్ని నిర్మించుకోవాలి.
ఈ నవభారతంలో మతవివాదాలు, అవినీతి ఉండకూడదు. ప్రతిపౌరుడికీ సాధికారత కలిగిన నవభారతాన్ని నిర్మిద్దాం’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయులను గౌరవించుకోవాలన్నారు. ప్రజల శక్తిని ప్రశంసిస్తూ.. ‘ఏ దేశాన్నైనా.. నేతలు, ప్రభుత్వాలు నిర్మించలేదు. పౌరుల బలంతోనే దేశం నిర్మితమైంది’ అని తెలిపారు. యోగా దినోత్సవం, అక్టోబర్‌లో సమగ్రతా పరుగు కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని సూరత్ ప్రజలను మోదీ కోరారు.
ఈ 48 నెలలను ఆ 48 ఏళ్లతో పోల్చండి
► అన్నేళ్లు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది
► రానున్న అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ గెలుస్తాం
► పుదుచ్చేరి సభలో మోదీ
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 48 ఏళ్లు ఈ దేశాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక్క కుటుంబమే పాలించిందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. త్వరలోనే తమ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోందనీ, తమ ‘అభివృద్ధి కేంద్రక’ 48 నెలల పాలనను కాంగ్రెస్ 48 ఏళ్ల పాలనతో పోల్చి చూడాలని మోదీ కోరారు. పుదుచ్చేరిలో మోదీ ఆదివారం పర్యటించారు. ఆ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.
పేర్లను ప్రస్తావించకుండానే నెహ్రూ–గాంధీ కుంటుంబం గురించి మోదీ మాట్లాడుతూ ‘తొలి ప్రధాని (జవహర్లాల్ నెహ్రూ) 17 ఏళ్లు, ఆయన కూతురు (ఇందిరా గాంధీ) 14 ఏళ్లు, ఆమె కొడుకు (రాజీవ్ గాంధీ) ఐదేళ్లు దేశాన్ని పాలించారు. ఆ తర్వాత మరో పదేళ్లు రిమోట్ పాలన (ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలం గురించి) సాగింది’ అని మోదీ విమర్శించారు. ‘మా 48 నెలల పాలనను వారి 48 ఏళ్ల పాలనతో పోల్చాలని నేను మేధావులను పుదుచ్చేరి నుంచి కోరుతున్నా. వారు ఈ అంశంపై చర్చలు పెట్టొచ్చు’ అని అన్నారు.
కాంగ్రెస్ సీఎం నారాయణస్వామి మాత్రమే..
ఈ ఏడాది జూన్ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఒక్క పుదుచ్చేరిలో మాత్రమేనని మోదీ జోస్యం చెప్పారు. కర్ణాటక సహా త్వరలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించారు. ‘జూన్ తర్వాత కాంగ్రెస్‌కు పుదుచ్చేరి మాత్రమే మిగులుతుంది. అప్పుడు వారి సీఎం అంటే నారాయణస్వామి మాత్రమే ఉంటారు. ఆయనకు నా అభినందనలు’ అని మోదీ అన్నారు. అయితే పంజాబ్‌లోనూ అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న విషయాన్ని ఆయన వదిలేశారు.
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్
► ‘ఆరోవిల్’ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోదీ
ఆరోవిల్: అనాదిగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక గమ్యంగా విరాజిల్లుతోందని ప్రధాని మోదీ తెలిపారు. వేర్వేరు సంస్కృతులు, మతాలు పరస్పరం కలసిమెలసి శాంతియుతంగా జీవించేందుకు భారత్ అనుమతించిందన్నారు. ప్రపంచంలోనే గొప్ప మతాల్లో చాలావరకూ భారత్‌లోనే పుట్టాయన్న మోదీ.. ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక మార్గంవైపు మరలేలా ఇవి ప్రేరేపించాయని పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఆరోవిల్ అంతర్జాతీయ టౌన్షిప్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
అరబిందో అశ్రమంలో మదర్‌గా పేరుగాంచిన మిర్రా అల్ఫాసా ఆలోచన మేరకే అరోవిల్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. ‘ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించే విషయంలో అరబిందో ఆశ్రమం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇందుకు ఆరోవిల్ ప్రత్యక్ష సాక్ష్యం’ అని చెప్పారు. గత ఐదు దశాబ్దాలుగా ఆరోవిల్ సామాజిక, విద్యా, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు.
భారత్ విశ్వసించే వసుధైక కుటుంబం నినాదానికి ఆరోవిల్ ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. 1968లో 124 దేశాల ప్రతినిధులు హాజరుతో ప్రారంభమైన ఆరోవిల్ టౌన్షిప్.. నేడు 49 దేశాలకు చెందిన 2,400 ప్రతినిధులకు కేంద్రంగా మారిందన్నారు. అంతకుముందు పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో అశ్రమాన్ని సందర్శించిన మోదీ.. ఆశ్రమ స్థాపకుడు శ్రీ అరబిందోకు నివాళులర్పించారు. అక్కడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
శ్రీ అరవిందోకు నివాళులర్పిస్తున్న మోదీ