పూల భవనాల వనం
నిన్నమొన్నటివరకూ చెట్లతో కళకళలాడిన అడవులిప్పుడు కాంక్రీట్ జనారణ్యాలు అవుతున్నాయి. రోడ్డెక్కితే కనుచూపు మేర పచ్చదనం కరవై బోసిపోయిన వీధులే కనిపిస్తాయి. అయితే అక్కడక్కడైనా సరే.. ఈ దుస్థితి మారుతోంది. అపార్ట్‌మెంట్లలోనే భారీగా మొక్కలు పెంచడం.. ఇందుకోసం ప్రత్యేకమైన డిజైన్లు సిద్ధం చేస్తూండం మనం ‘వావ్ ఫ్యాక్టర్’లోనే చాలాసార్లు ప్రస్తావించాం. నగరీకరణ పెరిగిపోయి వాయుకాలుష్యం ప్రాణాలు తీస్తున్న క్రమంలో ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది.. అడవులను తెగనరికేసి నగరాలను కట్టేయడమన్న పాత పద్ధతికి స్వస్తి పలికి.. అడవులను పెంచి వాటిమధ్యల్లో భవనాలు కట్టేదామన్న ఆలోచనకు వస్తోంది. తేడా ఏమిటీ? ఫొటోలు చూడండి. అర్థమైపోతుంది.
చైనాలోనీ లీఝౌ అనే ప్రాంతంలో నిర్మించబోయే అటవీ నగరమిది! అక్కడున్న పదిహేను లక్షల మందికీ సరిపడా భవనాలను నిర్మిస్తూనే.. మొత్తం నగరం పచ్చదనంలోనే మునిగిపోయి ఉండేలా దీన్ని డిజైన్ చేశారు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ స్టిఫానీ బోరీ. ఈ నగరంలో ఒకే ఒక్క ఎత్తైన భవనం ఉంటుంది. దీని చుట్టూ వంద నుంచి 200 వరకూ వేర్వేరు సైజులున్న భవనాలు కడతారు. ఈ ప్రాంతమంతా ఒక మినీ సిటీ మాదిరిగా ఉంటుంది. ఇలాంటివి ఐదింటిని ఒక పువ్వు ఆకారంలో అభివృద్ధి చేయడం.. ఇలాంటి పువ్వులు అనేకం పక్కపక్కనే ఏర్పాటు చేయడం బోరీ ప్లాన్‌లో భాగం.
ఈ ఏడాది చివరికి నిర్మాణం మొదలుపెట్టి 2020 కల్లా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవనాలన్నీ పచ్చటి తీగలు, మొక్కలతో కప్పబడి ఉంటాయి కాబట్టి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుతుందని బోరీ అంచనా. బోరీ ఇప్పటికే ఇటలీలో బాస్కో వర్టికాలీ పేరుతో ఓ అపార్ట్‌మెంట్ అడవిని çసృష్టి్టంచిన విషయం తెలిసిందే. దీంతోపాటు చైనాలోని నాన్‌జింగ్ ప్రాంతంలో ఈయన ఓ ట్విన్ టవర్‌ను డిజైన్ చేశారు. ఈ భవనాల గోడలపై 23 జాతులకు చెందిన 2500 మొక్కల లతలు అల్లుకుని ఉంటాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్