లూకాస్‌ గారి ‘స్టార్‌’ రేంజ్‌ మ్యూజియమ్ | wow factor on lucas museum of narrative art | Sakshi
Sakshi News home page

లూకాస్‌ గారి ‘స్టార్‌’ రేంజ్‌ మ్యూజియమ్

Published Thu, Nov 3 2016 2:38 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

చికాగోలో ప్రతిపాదించిన మ్యూజియమ్ డిజైన్‌

చికాగోలో ప్రతిపాదించిన మ్యూజియమ్ డిజైన్‌

మీరు ‘అవతార్‌’ సినిమా చూశారా?... పోనీ ‘స్టార్‌ వార్స్‌’? చూసే ఉంటారులెండి. వాటిల్లో బ్యాక్‌గ్రౌండ్‌ సీన్స్‌ ఎలా ఉన్నాయి? చిత్రవిచిత్రమైన గ్రహాలు, మనుషులు, గ్రహాంతరవాసులతో సూపర్‌ అంటున్నారా? మరి... వీటన్నింటి సృష్టికర్త... అదేనండి నిర్మాత, దర్శకుడు జార్జ్‌ లూకాస్‌ ఓ బిల్డింగ్‌ కట్టాలనుకుంటే ఏ స్థాయిలో ఉంటుంది? పక్క ఫొటోల్లో కనిపించేంత!

విషయం ఏమిటంటే– లూకాస్‌ తన పెయింటింగ్‌లు, చిత్రాలు, డిజిటల్, సినిమా ఆర్ట్‌లతో ‘లూకాస్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేరేటివ్‌ ఆర్ట్‌’ పేరుతో ఓ మ్యూజియమ్ పెట్టదలిచారు. మొదట ఈ మ్యూజియమ్ ను చికాగోలో పెట్టాలని భావించారు. తీరా అక్కడి ఉద్యానాల పరిరక్షకుల నుంచి అభ్యంతరాలు రావడంతో, సరైన స్థలం దొరకలేదు. దాంతో, ఈ ప్రతిపాదిత మ్యూజియమ్‌ను వేరే చోటకు తరలిస్తున్నామని మొన్న జూన్‌లో లూకాస్‌ ప్రకటించారు. దీంతో కొత్త చోట ఆ భవనాలు ఎలా ఉండాలన్న విషయంపై చర్చ మొదలైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలిస్‌లలో ఏదో ఒకచోట ఏర్పాటు చేస్తే తమ డిజైన్లను పరిశీలించాల్సిందిగా చైనాకు చెందిన ఎంఏడీ ఆర్కిటెక్చర్‌ సంస్థ కొన్ని డిజైన్లను ప్రతిపాదించింది. ఫొటోల్లో ఉన్నవి అవే.

లూకాస్‌ స్థాయికి తగ్గట్టుగా... ఎక్కడో అంతరిక్షం నుంచి ఊడిపడినట్లుగా ఉన్నాయి కదూ ఈ డిజైన్లు! వీటిల్లోని అంశాలూ ఆసక్తికరంగానే ఉన్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో తీరంలో ఉన్న ఓ కృత్రిమ ద్వీపంపై ఒక భవనం ఏర్పాటవుతూండగా, రెండోది లాస్‌ ఏంజెలిస్‌లోని ఎక్స్‌పోజిషన్‌ పార్క్‌లో ఏర్పాటవుతోంది. అలాగని ఆ యా ప్రాంతాల్లో ఉండే ఒక్క చెట్టునూ కొట్టేయడం లేదండోయ్‌! ఉన్నవాటిని అలాగే ఉంచుతూ ఈ భవనాలను ఏర్పాటు చేయడంతోపాటు అందరి సౌకర్యార్థం వీటి పైకప్పులపై అదనంగా పచ్చదనాన్ని పొదుగుతున్నారు. ఒక్కో భవనం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవనాలపై నాలుగు నెలల్లో లూకాస్‌ ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంచనా.

ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలో (పైన), లాస్‌ ఏంజెలిస్‌లో (కింద) ప్రతిపాదించిన డిజైన్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement