Lit Motors
-
ఈ బైక్ పడదు!
వావ్ ఫ్యాక్టర్ మోటర్‌సైకిల్ స్టాండ్ తీసేస్తే... అది అలాగే పక్కకు ఒరిగిపోతుంది. నలుగురు కలిసి గట్టిగా ఓ తోపు తోశారనుకోండి. నాలుగు చక్రాల బండైనా తల్లకిందులవుతుంది. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఈ వాహనం దగ్గర మాత్రం మీ పప్పులుడకవు. మీరెంత గట్టిగా తోసినాసరే... కొంచెం దూరం వెళ్లిపోయి నిటారుగా నుంచుంటుందేగానీ.. అస్సలు పడిపోదు! ఎందుకంటే, అమెరికా కంపెనీ లిట్ మోటార్స్ తయారు చేసిన ‘సీ1’ అనే ఈ సరికొత్త వాహనంలో అన్ని రకాల కుదుపులను తట్టుకుని నిలబడేలా రెండు జైరోస్కోపులు ఏర్పాటు చేశారు. అలాగని దీనికి పార్కింగ్ స్టాండ్ లేదనుకునేరు. ఇంజిన్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ఈ పార్కింగ్ స్టాండ్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఇంకా బోలెడున్నాయి. పూర్తిగా విద్యుత్తుతో నడిచే వాహనం కావడం, ఒకసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే అవకాశం సీ1 విశేషాల్లో కొన్ని మాత్రమే. కేవలం ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ వాహనంలో కారు మాదిరి స్టీరింగ్ ఉంటుంది. పైగా దీంట్లో ఉన్న అనేక సెన్సర్లు రోడ్డు పరిస్థితి, గాలివేగం, చుట్టూ ఉన్న ట్రాఫిక్ వంటి అంశాలతోపాటు డ్రై వర్ స్టీరింగ్‌ను ఏవైపునకు తిప్పుతున్నాడు? వాహనం వేగమెంతుంది? వంటి వాటిని కూడా లెక్కకట్టి మలుపుల్లో వాహనాన్ని ఎంతమేరకు వంపాలో నిర్ణయించి, అమలు చేస్తుంది. దాదాపు పది కిలోవాట్/హవర్ బ్యాటరీతో పనిచేసే సీ1ను నాలుగు గంటల్లో (220 వోల్టులు) పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వోల్టేజీ ఉన్న డీసీ కరెంటుతోనైతే ఆరగంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకంటే పదోవంతు తక్కువ విడిభాగాలున్న సీ1 నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువట! మరో రెండేళ్లలో అందుబాటులోకి రానున్న సీ1 ధర దాదాపు రూ.16 లక్షల పైమాటే! -
ఈ బైక్‌కు కిందపడే అలవాటే లేదు!
శాన్ఫ్రాన్సిస్కో: అమ్మానాన్న ఊరెళ్తూ.. ఇంట్లో బైక్ తాళాలు మర్చిపోయారో కుర్రకారుకు ఇక పండగే. అమాయక చక్రవర్తుల్లా వారితో బస్టాప్ దాకా నడుచుకుంటూనే వెళ్తారు. వారలా బస్సెక్కగానే ఇక విశ్వరూపం చూపించేస్తారు. బైకును బయటకు తీసి.. రయ్ రయ్‌మంటూ వీధులన్నీ తిరిగేస్తారు. ఇలాంటి వారు మూలమలుపుల దగ్గరకు వచ్చేసరికి అదుపుతప్పి మోకాలి చిప్పలు పగలగొట్టుకుంటుంటారు. కుర్రకారుకే కాదు.. పెద్దోళ్లకు కూడా ఇది అనుభవమే. టర్నింగుల దగ్గర బైక్ కంట్రోల్ కాకపోవడంతో కిందపడడం సాధారణమే. అయితే ఇక్కడ కనిపిస్తున్న బైక్‌కు మాత్రం కిందపడే అలవాటే లేదట. ఎవరు తయారు చేశారంటే.. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన లిట్ మోటార్స్ సంస్థ ఈ బైక్‌ను తయారు చేసింది. దీనికి ‘సీ-1’ అనే పేరు కూడా పెట్టింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది దానికదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. దీనిని నడిపేవారు కారులో కూర్చున్నట్లుగా లోపలే కూర్చుంటారు. ట్రాఫిక్ నిలిచిపోయినా, ఏదైనా అడ్డువచ్చినా ఈ బైక్‌ను మనం ప్రత్యేకంగా బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. కాస్త వంగితే చాలు దానిలో దాగున్న స్టాండ్ బయటకు వచ్చేస్తుంది. ఇక లోపల మాత్రం కారులో ఉండే సదుపాయాలన్నీ ఈ బైక్‌లో ఉన్నాయట. ఎన్నెన్నో ప్రత్యేకతలు ఇది 100 శాతం విద్యుత్‌తో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 మైళ్లు ఆగకుండా సాగిపోవచ్చు. కేవలం అరగంట చార్చింగ్ చేస్తే చాలు. కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ట్రాఫిక్‌లో రయ్‌మంటూ దూసుకుపోయేలా నాజూగ్గా రూపొందించారు. పైగా దీనిని బైక్‌ను పార్కింగ్ చేసినంత స్థలంలోనే పార్క చేయవచ్చు.