ఈ బైక్‌కు కిందపడే అలవాటే లేదు!
శాన్‌ఫ్రాన్సిస్కో: అమ్మానాన్న ఊరెళ్తూ.. ఇంట్లో బైక్ తాళాలు మర్చిపోయారో కుర్రకారుకు ఇక పండగే. అమాయక చక్రవర్తుల్లా వారితో బస్టాప్ దాకా నడుచుకుంటూనే వెళ్తారు. వారలా బస్సెక్కగానే ఇక విశ్వరూపం చూపించేస్తారు. బైకును బయటకు తీసి.. రయ్ రయ్‌మంటూ వీధులన్నీ తిరిగేస్తారు. ఇలాంటి వారు మూలమలుపుల దగ్గరకు వచ్చేసరికి అదుపుతప్పి మోకాలి చిప్పలు పగలగొట్టుకుంటుంటారు. కుర్రకారుకే కాదు.. పెద్దోళ్లకు కూడా ఇది అనుభవమే. టర్నింగుల దగ్గర బైక్ కంట్రోల్ కాకపోవడంతో కిందపడడం సాధారణమే. అయితే ఇక్కడ కనిపిస్తున్న బైక్‌కు మాత్రం కిందపడే అలవాటే లేదట.
ఎవరు తయారు చేశారంటే..
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లిట్ మోటార్స్ సంస్థ ఈ బైక్‌ను తయారు చేసింది. దీనికి ‘సీ-1’ అనే పేరు కూడా పెట్టింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది దానికదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. దీనిని నడిపేవారు కారులో కూర్చున్నట్లుగా లోపలే కూర్చుంటారు. ట్రాఫిక్ నిలిచిపోయినా, ఏదైనా అడ్డువచ్చినా ఈ బైక్‌ను మనం ప్రత్యేకంగా బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. కాస్త వంగితే చాలు దానిలో దాగున్న స్టాండ్ బయటకు వచ్చేస్తుంది. ఇక లోపల మాత్రం కారులో ఉండే సదుపాయాలన్నీ ఈ బైక్‌లో ఉన్నాయట.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
- ఇది 100 శాతం విద్యుత్‌తో నడుస్తుంది.
- గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు.
- ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 మైళ్లు ఆగకుండా సాగిపోవచ్చు.
- కేవలం అరగంట చార్చింగ్ చేస్తే చాలు.
- కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
- ట్రాఫిక్‌లో రయ్‌మంటూ దూసుకుపోయేలా నాజూగ్గా రూపొందించారు.
- పైగా దీనిని బైక్‌ను పార్కింగ్ చేసినంత స్థలంలోనే పార్‌క చేయవచ్చు.