బాలూ పాటకు ‘సెంటినరీ’!
‘‘సినిమా రంగంలో, ముఖ్యంగా సంగీత ప్రపంచంలోని అందరికీ ఈ అవార్డు చెందుతుంది. జన్మనిచ్చిన నా తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం లేనిదే 50 ఏళ్లకు పైగా కొనసాగడం కష్టసాధ్యం. అన్నిటి కంటే మించి ఇప్పటికీ నా పాట వింటూ ఆశీర్వదిస్తూ ఇంతలా ఎదిగేలా చేసిన వారికి రుణపడి ఉంటాను’’ అని ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్న 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల (ఇఫీ) వేడుకలో ఎస్పీబీ 2016వ సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘ది సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ’ అవార్డును అందుకోనున్నారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని మంగళ వారం ప్రకటించారు. ఈ ప్రకటనకు ఎస్పీబీ తన స్పందన తెలియజేస్తూ - ‘‘ఎంతో మంది నిష్ణాతులు ఉండగా నాకు అవార్డు ప్రకటించడం ఆశ్చర్యమేసింది’’ అన్నారు.
నాలుగు తరాలకు వంతెనలా...
రెండేళ్ల క్రితం దక్షిణాదికి చెందిన రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. మళ్లీ దక్షిణాదికి చెందిన మీకు రావడం పై మీ అభిప్రాయం? అనే ప్రశ్న ఎస్పీబీ ముందుంచితే - ‘‘అవార్డు రావడం ఆనంద దాయకం. దక్షిణాది పరిశ్రమపై ఎందుకో కొంత చిన్నచూపు ఉంది. దీన్ని విమర్శగా తీసుకోవద్దు. జనరల్‌గా జరుగుతోంది. నేను, ఇళయరాజా, రజనీకాంత్ గారూ అన్ని భాషల్లో పనిచేశాము. మేమంతా ప్రాంతీయతత్వాలకు అతీతమైన భారతీయ కళాకారులం’’ అన్నారు. గత 55 ఏళ్లుగా చిత్రరంగంలో ఉన్నారు, మీ దృష్టిలో ఏవి మంచి రోజులు? అనడిగితే - ‘‘కాలానికి అనుగుణంగా మార్పులు సహజం. నేను చిత్రరంగంలోకి ప్రవేశించిన రోజులు అపూర్వమైనవి. నా ముందు తరం వారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజులు. సినీరంగం లోకి వచ్చి, వారితో కలిసి పనిచేస్తూ ఎన్నో నేర్చుకున్నా. నాలుగు తరాలకు ఒక వంతెనలా కొనసాగుతూ నేటికీ పాడటం సంతోషకరం. నేను ఆస్వాదించింది 1975 నుండి 90 వరకు. ఆ 15 ఏళ్లు బెస్ట్’’ అన్నారు.
మహారాష్ట్రలో, తమిళనాడులో ఉంది... మన దగ్గరే లేదు- సీవీ రెడ్డి
గోవాలో జరగనున్న ‘ఇఫీ’లో భాగమైన ‘ఇండియన్ పనోరమ 2016’ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. ఇండియన్ పనోరమ జ్యూరీ సభ్యులైన ప్రముఖ దర్శక, నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ - ‘‘ఇండియాలో అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్నది హిందీ తర్వాత తెలుగు పరిశ్రమే. కానీ, అవార్డుల ఎంపిక కోసం తమ చిత్రాలను జ్యూరీకి పంపే విషయంలో తెలుగు పరిశ్రమ బాగా వెనక బడింది’’ అన్నారు. ‘‘మంచి చిత్రాలు తీసినవారికి మహారాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు, కన్నడ, తమిళ ప్రభుత్వాలు 20 లక్షల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నాయి. కానీ, తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి చిత్రాలకు ఎలాంటి ప్రోత్సాహకాలూ ఇవ్వడం లేదు. తెలుగు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహ కాలు, సబ్సిడీలు ఇస్తే ఇక్కడా మరిన్ని ఉత్తమ చిత్రాలు వస్తాయి’’ అన్నారు.