విడిపోయినా... ధైర్యాన్ని వీడనక్కర్లేదు
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమౌతాయంటారు కదా, మరి వాటి వైఫల్యాలను ఎక్కడ, ఎలా నిర్ణయిస్తారో తెలుసా? నరకంలో..! అవును నిజం! ఎందుకంటే పవిత్రమైన వైవాహిక బంధం విఫలమైతేగనక వారితోబాటు వారి పిల్లలు, వారిపైన ఆధారపడిన వారు కూడా రకర కాల సామాజిక ఇబ్బందుల రూపేణా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒకప్పటి కాలంలో భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా విడాకుల దాకా వెళ్లకుండా ఓపిగ్గా సర్దుకుపోయేవారు.
ప్రస్తుత కాలంలో మాత్రం విడాకులు లేదా చట్టబద్ధంగా విడిపోవడం సర్వసాధారణమైపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, భర్తల నుంచి విడిపోతున్న భార్యలకన్నా, నయానో, భయానో, బెదిరించో విడాకుల రూపేణా భార్యలను వదిలించుకుంటున్న పురుషులే ఎక్కువమంది ఉండటం! భర్త నిరాదరణకు, అత్తమామల ఛీత్కరింపులకు గురై, వారే ఆమెను ఎలాగోలా వదలించుకున్న సందర్భాలే అధికం. సదరు స్త్రీ విద్యావంతురాలూ, ఉద్యోగస్థురాలూ అయితే, ఇతరుల మీద అంతగా ఆధారపడవలసిన అవసరం ఉండదు. అదే, అసలు ఆమె ఏమీ చదువుకోనిదీ, సంపాదన లేనిదీ అయితే..? ఆమె పరిస్థితి వర్ణనాతీతమే కదా! అటువంటి వారికోసం ఢిల్లీకి చెందిన అదనపు జిల్లా జడ్జి స్వర్ణకాంత శర్మ అందించిన అక్షర సహకారమే ‘డైవోర్స్’ అనే పుస్తకం. ‘విడిపోయినా విలపించనక్కర్లేదు’ అనేది దీనికి ట్యాగ్‌లైన్. వైవాహిక జీవితం విచ్ఛిన్నమై, ఏ ఆసరా లేక దిక్కుతోచని స్త్రీల పాలిట చీకట్లో చిరుదీపం లాంటిది ఈ పుస్తకం. న్యాయమూర్తిగా పని చేసిన అనుభవంతో ఆమె రాసిన ఈ పుస్తకం వివిధ కారణాలతో భర్త నుంచి చట్టరీత్యా విడిపోయిన స్త్రీలకు, భర్త నిరాదరణకు గురై, పిల్లలను పెట్టుకుని ఒంటరి పోరాటం చేస్తున్న అబలలకు భరోసా ఇస్తూ, వారికి ధైర్యంగా జీవించడమెలాగో నేర్పుతూ, కొండంత అండగా నిలిచే ఈ పుస్తకం ఇప్పటికే మూడు ముద్రణలు పూర్తి చేసుకుని, నాలుగో ముద్రణకు సిద్ధమైంది.
ఒంటరి ఆడవాళ్లు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రతికూలతలనే అనుకూలతలుగా మలచుకుంటూ, స్వతంత్రంగా, ధైర్యంగా జీవించడమెలాగో తెలియజెప్పే ఈ పుస్తకం ఒకవిధంగా ఒంటరి స్త్రీల పాలిట చింతామణి వంటిది. ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ భాషలలో లభ్యమవుతున్న ఈ పుస్తకం త్వరలోనే తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లోకీ అనువాదం కావాలని ఆశిద్దాం.