
అమ్మాయి ఓ అంతుపట్టని అంశం!
ఇతరుల మనసులో ఆలోచనలను నాటడం ఒక గొప్ప కళ. ఆ ఆలోచనలు ప్రేరణనిచ్చేవి అయితే మీరొక స్ఫూర్తిదాత. ఆ ఆలోచనలు దేశభక్తినో, సామాజిక స్పృహనో నింపేవి అయితే మీరొక నాయకుడు. ఆ ఆలోచనలు మీవి, మీ గురించి మరొకరిలో ప్రేమను పెంచేవి అయితే... మీరు అక్షరాలా ప్రేమికుడు!
అమ్మాయి తను ఇష్టపడినవాడి వద్ద నిశ్శబ్దంగా ఉన్నా శబ్దమే... అదొక సంగీతమే! కానీ అబ్బాయి మాత్రం ఆమె హృదయాంతరాళాలలోకి చొచ్చుకుపోవాలి. ఆమెలో తన గురించి ఆలోచనలను కలిగించాలి. టీనేజ్‌లో ఫస్ట్‌లవ్‌లో ఉన్నవారి దగ్గర నుంచి కాలేజ్‌లోని క్లాస్‌మేట్‌నో, ఆఫీస్‌లోని అమ్మాయినో ప్రేమించే ప్రొఫెషనల్ దాకా ఎవరికైనా తప్పని స్థితి ఇది! ప్రేమికులుగా మారాలంటే తప్పనిసరిగా ఆలోచనను నాటడం అనే కళ తెలిసి ఉండాలి. అందుకు తొలి అస్త్రం ‘చూపు’.
ప్రేమకు భాష లేదు, భావం తప్ప. ఆ భావాన్ని కళ్లలో నుంచి మొదలుపెట్టి పెదవుల చివర దాకా తీసుకెళ్లి మధుర హాసంగా ప్రవహింపజేయాలి. ఆలోచనలు నాటడానికి ఈ అస్త్రాన్ని అలా వాడుకోవచ్చు! అయితే, కళ్లలోకి సూటిగా చూడాల్సిన పని లేదు. నేల చూపులతో కూడా అమ్మాయిని ఆకర్షించవచ్చు!
ప్రతిస్పందనను అర్థం చేసుకొనేదెలా?!
ఆమెవి అందమైన కళ్లు. కానీ చూపులు మాత్రం ఆకర్షణతో చూసేవో, అమాయకత్వంతో చూసేవో, ఆరాధనతో చూసేవో తెలీదు. అలాంటప్పుడు ఆ చూపులను ప్రేమగా మలుచుకోవడం అబ్బాయి సామర్థ్యానికి నిదర్శనం! ఆమె చూపులు మిమ్మల్ని వెంటాడేలా చేసుకోవడమే కాదు, ఆమె ఆలోచనలు మీ గురించి వేటాడేలా చేసుకోవడంతోనే తెలుస్తుంది ప్రేమికుడిగా మీ అసలు సిసలు సత్తా!
మీరేంటో అర్థం కావాలి!
అమ్మాయి చూపుల్లో అమాయకత్వం అనే కోణాన్ని కూడా చూడగలం కానీ అబ్బాయిల చూపుల్లో అపార్థాలే కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరేంటో అర్థమవ్వాలి. మీలోని అందాలను వారు గుర్తించాలి. మీలోని తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత వాళ్లలో కలిగించాలి. అంతవరకూ మీ తొందరను కాస్త తొక్కిపెట్టాల్సిందే!
పలుచన కావద్దు!
ఆమె పాలరాతి శిల్పం... మనం మాత్రం నీళ్లలా పలుచన కావడం ఎందుకు? మీరు ఆమె గురించి ఎంతగా పడిచ స్తు న్నారో మొదట్లోనే చెప్పేయడం, మీరేంటో వందశాతం ఆమెకు అర్థమయ్యేలా చేసేయడం, వెనువెంటనే ఆమెకు ప్రేమిస్తున్నట్టు చెప్పేసి ‘నో’ చెప్పించేసుకోవడం... అవసరమా.. ఇదంతా? అలా చేస్తే చేజేతులారా ప్రేమకథకు క్లయిమాక్స్ రాసుకోవడమే! అందుకే... మీరు ఎంపిక చేసుకొన్న అమ్మాయి మీకు ఎంత చేరువలో ఉందో తెలుసుకొనే వరకూ మాటల్నీ, మనసులోని ఊసుల్నీ పొదుపుగా వాడటమే మంచిది.
వ్యూహం ఉండాలి..!
స్నేహం లేకుండా నేరుగా గురిపెడితే లక్ష్యం తప్పే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ముందు చేయి కలపండి. తర్వాత మనసు అదే కలుస్తుంది. నిజానికి స్నేహంతో అమ్మాయి మానసిక స్థితి దాదాపు అర్థమైపోవచ్చు!
మనసంటే మ్యాథమేటిక్స్ కాదు!
అమ్మాయి ప్రేమను గెలవడానికి ఒక యూనివర్సల్ ఫార్ములా అంటూ ఏమీ లేదు! అమ్మాయి మనసు అంటే మ్యాథమేటిక్స్ కాదు... ఎవరు ఎవరిని కాలిక్యులేట్ చేసినా ఒకే ఆన్సర్ రావడానికి! ఎన్ని చెప్పినా ఏ అమ్మాయికి ఆ అమ్మాయి ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే... అమ్మాయంటేనే ఓ అంతుపట్టని అంశం. అది తెలిసి నడుచుకొనే వాడే ప్రేమలో విజేతలో కాగలడు!
- జీవన్‌రెడ్డి. బి