దైవసందేశహరునిగా ముహమ్మద్ (స) | The life of the Prophet | Sakshi
Sakshi News home page

దైవసందేశహరునిగా ముహమ్మద్ (స)

Published Sat, Jun 18 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

దైవసందేశహరునిగా ముహమ్మద్ (స)

దైవసందేశహరునిగా ముహమ్మద్ (స)

ప్రవక్త జీవితం

 

బీబీ ఖదీజా మనసులో సంతోషం పరవళ్ళు తొక్కుతోంది. కాని అదేసమయంలో చిన్నపాటి భయం, సందేహం కూడా పట్టిపీడిస్తోంది. ఎందుకైనా మంచిది వరఖ బిన్ నౌఫిల్  దగ్గరికెళ్ళి సందేహ నివృత్తి చేసుకుందామనుకున్నారు. వృద్ధుడైన వరఖ ఆమెకు వరసకు సోదరుడవుతాడు. వివిధ మతధర్మాలను కాచివడపోసిన సుప్రసిద్ధ పండితుడు. గొప్పతత్వవేత్త. మహా జ్ఞాని. ఎటువంటి చిక్కుసమస్యకైనా చిటికెలో పరిష్కారం చూపగల వివేకి. మతగ్రంథాలపై మంచి పట్టుకలిగిన పండితుడు. ఖదీజా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. పూర్తి వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు వివరించారు.

 
అంతా శ్రధ్ధగా ఆలకించిన వరఖ ముఖకవళికలు ప్రసన్నంగా మారిపొయ్యాయి. ‘‘దైవం మహా పవిత్రుడు. శుభం ఖదీజా, శుభం.! ఈ వరఖ ప్రాణం ఎవరి గుప్పిట్లో ఉందో ఆ మహత్తరశక్తి సాక్షిగా చెబుతున్నా విను... ఖదీజా! నువ్వు చెప్పిన విషయాలు నిజమే అయితే ముహమ్మద్ ముందు ప్రత్యక్షమై, ఆయనతో సంభాషించిన ఆ అపరిచిత మానవ రూపం నిస్సందేహంగా దైవదూతే. మూసాప్రవక్త(అ) దగ్గరికి వచ్చిన మహా దూత జిబ్రీలే ఈయన దగ్గరికీ వచ్చాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళు. ముహమ్మద్‌ను తనదినచర్య యధావిధిగా కొనసాగించమని చెప్పు. త్వరలోనే నేనతన్ని కలుసుకుంటాను’. అన్నాడు వరఖా పరమ సంతోషంగా..

 ఖదీజా వడివడిగా ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే సేదదీరుతున్న ముహమ్మద్ (స) నుద్దేశించి, ‘శుభాభినందనలు. దేవుడు మీ మొరను ఆలకించాడు. మీరిప్పుడు దేవుని ప్రవక్త. అన్నయ్య వరఖాకు మీ వృత్తాంతమంతా వినిపించాను. అంతా విని పూర్వగ్రంథాల వెలుగులో, అపార అనుభవంతో ఆయన చెప్పిన విషయం ఇది. త్వరలోనే ఆయన మిమ్మల్ని కలుసుకోబోతున్నారు’. అంటూ అభినందనల్లో ముంచెత్తారు ఖదీజా.

 తరువాత ముహమ్మద్ (స) ప్రదక్షణ కోసం కాబా మందిరానికి బయలు దేరారు. దారిలో వృద్ధ పండితుడు వరఖా ఎదురుపడ్డాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ‘‘అబ్బాయీ! విషయం ఏమిటి? ‘హిరా గుహలో నువ్వు ఏం చూశావూ?’ అంటూ ఆరా తీశాడు. ముహమ్మద్ (స) జరిగిన విషయమంతా ఏకరువు పెట్టారు.

 
అంతా సావధానంగా విన్న వరఖా ‘‘బాబూ! నీకు అభినందనలు తెలుపుతున్నాను. మూసా ప్రవక్త దగ్గరికి వచ్చినై దెవదూతే నీ దగ్గరికీ వచ్చాడు. ఇప్పుడు నువ్వు దైవ ప్రవక్తవు. మానవజాతికి మార్గం చూపడానికి దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వీ విషయం బహిరంగంగా ప్రకటిస్తే, నీ జాతే నిన్ను తిరస్కరిస్తుంది. హింసిస్తుంది. బహిష్కరిస్తుంది. నీపై యుద్ధం ప్రకటిస్తుంది.ప్రవక్తలొచ్చి సన్మార్గ పథం చూపిన ప్రతిసారీ ప్రజలు ఇలానే వ్యవహరించారు. అలాంటి రోజే గనక వచ్చి అప్పటికి నేను బతికుంటే నీకు పూర్తి సహకారం అందిస్తాను. నీకు తోడు నీడగా ఉంటాను. శాయశక్తులా నిన్ను ఆదుకుంటాను’. అంటూ ఎంతో ప్రేమానురాగాలతో ముహమ్మద్ (స) నుదుటిని చుంబించాడు వరఖా.

 - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
(మిగతా వచ్చేవారం)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement