
బ్యాన్ బాజా..!
నైతిక నియంత్రణ
ఇండియాలో కొన్ని తినకూడదు.
ఇండియాలో కొన్ని చూడకూడదు.
ఇండియాలో కొన్ని చదవకూడదు.
ఎందుకు? ఎందుకంటే... బ్యాన్!
‘అదుర్స్’ సినిమా యాక్షన్ కామెడీ. 2010లో వచ్చింది. డెరైక్టర్ వి.వి.వినాయక్. హిట్ మూవీ. కానీ తెలంగాణాలో ఫట్ మంది. అదేంటి ఆంధ్రాలో హిట్ కొట్టి, తెలంగాణాలో ఫట్ మనడం! అప్పుడు తెలంగాణా ఉద్యమం నడుస్తోంది. జూ॥ఎన్టీఆర్ ఆంధ్రా హీరో కదా. అందుకే బ్యాన్. ఎవరు బ్యాన్ చేశారు? ప్రభుత్వమా.. సేఫ్‌సైడ్‌గా? కాదు. ప్రజలా.. స్వచ్ఛందంగా? కాదు. మరి? ఉద్యమకారులు! వారిలోనూ అందరూ కాదు కొందరు. ఉద్యకారులైతే మాత్రం అలా బ్యాన్ చెయ్యొచ్చా? ప్రభుత్వాలే బ్యాన్‌లు చేస్తున్నప్పుడు ఉద్యమకారులు చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది? పైగా వాళ్లు ఏం బ్యాన్ చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా. అయితే ప్రభుత్వాలు చేసే బ్యాన్‌లను ఎవరికి వ్యతిరేకమైనవని అనుకోవాలి? ఇంకెవరికి? ప్రజలకే.
అదుర్స్ సినిమానే తీసుకుందాం. సినిమాను ఉద్యమకారులు బ్యాన్ చేస్తే, ఈ సినిమాలోని ఒక పాటలో రెండు లైన్‌లను ప్రభ్వుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వం అంటే ఇక్కడ సెన్సార్ బోర్డు. బ్యాన్ అంటే ఇక్కడ ఆ రెండు లైన్లను మార్చేయడం. అదుర్స్‌లో... సి.హెచ్.ఎ.ఆర్.ఐ... చారి.. అనే పాట ఉంది. అది జూ॥ఎన్టీఆర్‌కీ, నయనతారకి మధ్య సాగుతుంది. పాటను చంద్రబోస్ రాశారు. సినిమాలో జూ॥డబుల్ యాక్షన్. ఒకరు పురోహితుడు. ఇంకొకడు ఖతర్నాక్. నయనతార ఫ్రెండ్ పురోహితుడు. ఖతర్నాక్‌ని చూసి, అతడే తన ఫ్రెండ్ అనుకుని, ‘అరె ఇంత మోడర్న్‌గా మారిపోయాడేంటి?’ అని ఆశ్చర్యపోతుంది. వెంటనే పాట అందుకుంటుంది. వేర్ ఈజ్ ద పంచకట్టు? వేర్ ఈజ్ ద పిలకజుట్టు? వేర్ ఈజ్ ద నిలువుబొట్టు చారీ.. అని పాడుతుంది.
ఆడియో రిలీజ్ కాగానే సెన్సార్ పట్టుకుంది! సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని చెప్పి... వెంటనే ఆ పిలకజుట్టును, నిలువుబొట్టును (ఆ పదాలను) మార్చేమని హుకుం జారీ చేసింది. దాంతో పాపం చంద్రబోస్ పిలకజుట్టును పాతబైకుగా, నిలువుబొట్టును ఓల్డు లుక్కుగా మార్చేశారు. భారత ప్రభుత్వంవారి బ్యాన్‌ల చరిత్రలను చూస్తే ఇది చాలా చిన్న విషయం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియా ఇంతవరకు పుస్తకాలను, సినిమాలను, కళలను, టీనేజర్ల ఆటపాటలను మాత్రమే బ్యాన్ చేస్తూ వస్తోంది. ఇప్పుడిక తినే తిండిపైన కూడా నిషేధాజ్ఞలు విధించడం మొదలుపెట్టింది! ఇండియన్ హిస్టరీలో లేటెస్టు బ్యాన్... బీఫ్. గొడ్డు మాంసం.
నిషేధిస్తే పోయిందేమిటి?
బ్యాన్‌లను భరిస్తూ పోతుంటే అప్పటికప్పుడు మనకు వచ్చే ఇబ్బంది, జరిగే నష్టం ఏమీ లేదనిపించవచ్చు. కానీ సాంస్కృతికంగా గానుగ ఎద్దులమైపోయి, మూసలోకి ఒదిగిపోయి, మనుషులుగా మిగలకపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా చూసినా దెబ్బతింటాం. మాంసాన్ని నిషేధించారు. ఏమైంది? మాంసాన్ని ఉత్పత్తి చేసేవారికి, విక్రయించేవారికి ఉపాధి పోయింది. వేరే ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుందా? కల్పించినా అది, వీళ్లకు చేతనైన పని అవుతుందా? ఒక పుస్తకాన్ని బ్యాన్ చేసినా, సినిమాని నిషేధించినా జరిగేది ఇదే. క్రియేటివిటీ చచ్చిపోతుంది. కొత్త క్రియేటివిటీ బతికి బట్టకట్టడానికే భయపడుతుంది. ఇంకో సంగతి. అసలు వాటికి మార్కెట్ పడిపోయి, నకిలీల బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. డ్రై డేస్‌లో దొంగతనంగా జరిగే అక్రమ అమ్మకాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాలూ అంతే. ఎంతగా బ్యాన్ అయితే, అంతగా డీవీడీలు మార్కెట్‌లో పారలల్ ఎకానమీని నడిపేస్తుంటాయి. ఇలా చెలామణీ అయ్యే మనీ అంతా చిన్న స్థాయిలో టాక్స్‌ను తప్పించుకుంటుంది. పెద్ద స్థాయిలో బ్లాక్ మనీగా అవతరిస్తుంది.
మోరల్ పోలీసింగ్
ప్రభుత్వం ఇలా ఉన్నదానికీ, లేనిదానికీ బ్యాన్‌లు చేసుకుంటూ పోతుంటే... సాంస్కృతిక విలువల పరిరక్షకులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. వాలెంటైన్స్ డే పార్టీల మీద పడి... యువతీయువకులను వాళ్ల సంతోషాల నుంచి, చిన్నచిన్న ప్రేమల్నుంచి, జీన్స్ వేసుకోవడం నుంచి, సెల్‌ఫోన్స్ వాడడం నుంచి బ్యాన్ చేసేస్తారు. ఎంత ఘోరం! అధికారం ఉన్న వారు అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఎంత ఘోరమో, ఏ అధికారమూ లేనివారు అధికారం ఝళిపించడం అంతకన్నా ఘోరం. అసంబద్ధమైన, అవివేకమైన, ఆలోచనారహితమైన నిషేధాల వల్ల జరుగుతున్న అనర్థం ఇదంతా. ఈ మోరల్ పోలీసులైతే మరీను... వాళ్లకు నచ్చని ఆర్ట్‌ని... అదొక పిచ్చికుక్క అని తేల్చేసి ధ్వంసం చేసేస్తారు. ఇదిలాగే కంటిన్యూ అయితే ఇండియా బ్యాన్‌లకే పెద్ద బ్యానర్ అవుతుంది. ఇప్పుడేదో అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు కదా, ఇండియాని! అభివృద్ధికి కనీసం ప్రయత్నం కూడా చెయ్యడం లేదని అప్పుడంటారు.
- సాక్షి ఫ్యామిలీ
ఇవి తినకూడదు
ఈ ఏడాది మార్చి 3 నుంచి మహరాష్ట్రలో గొడ్డు మాంస విక్రయాలు బంద్ అయ్యాయి. ఇలా నిషేధించిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ఎనిమిదవది. మిగతా ఏడు... ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర యానిమల్ ప్రిజర్వేషన్ (అమెండ్‌మెంట్) యాక్టు ప్రకారం గొడ్డు మాంసం ఇంట్లో ఉన్నట్టు బయటపడినా సరే ఐదేళ్ల జైలు లేదా పదివేల జరిమానా! జూన్‌లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనం నుంచి కోడిగుడ్లను నిషేధించింది. గుడ్డు మాంసాహారమని! గుజరాత్‌లో 1960 నుండి మద్యంపై నిషేధం ఉంది. జార్ఘండ్‌లో రెండు దశాబ్దాలకు పైగా మహువా కలిసిన లిక్కర్‌పై బ్యాన్ కొనసాగుతోంది. మణిపూర్, నాగాలాండ్‌లలో 1990ల నుంచి మద్యం అమ్మకాలపై తీవ్రవాదుల నిషేధం కొనసాగుతోంది. కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లు మినహా మిగతా హోటళ్లేవీ మద్యం విక్రయించడానికి లేదు. ఈ ఏప్రిల్లో అమలులోకి వచ్చిన ఈ నిషేధం దెబ్బకి దాదాపు 300 హోటళ్లు... బీరు, వైన్ పార్లర్లుగా మారిపోయాయి.
ఇవి చదవకూడదు
ముంబై యూనివర్శిటీ తన రీడింగ్ జాబితా నుంచి రోహిన్‌టన్ మిస్త్రీ పుస్తకం ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’ని తొలగించింది. తమ భావజాలాన్ని అవహేళన పరిచే విధంగా ఈ పుస్తకం ఉందని శివసేన అభ్యంతరం వ్యక్తంచేయడంతో యూనివర్శిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మిస్త్రీ పుస్తకం బుకర్ ప్రైజ్‌కు పోటీగా నిలిచిన పుస్తకం కావడం విశేషం. ప్రముఖ నాటక రచయిత, సామాజిక కార్యకర్త హబీబ్ తన్వర్ రాసిన ‘చంద్రదాస్ చోర్’ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2009లో బ్యాన్ చేసింది. బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ రాసిన ‘జిన్నా : ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకాన్ని గుజరాత్ ప్రభుత్వం 2009లో నిషేధించింది. ఈ పుస్తకం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందన్నది ప్రధాన అభ్యంతరం. ఉత్తరప్రదేశ్‌కు కూడా లెక్కకు మిక్కిలిగా పుస్తకాలను నిషేధించిన ఘన చరిత్ర ఉంది. అక్కడ మీకు లక్ష్మీకాంత్ శుక్లా రాసిన ‘జతిన్ రాజ్’ పుస్తకం చదవడానికి అటుంచి, కనీసం చూడ్డానికి కూడా కనిపించదు. అలాగే ‘ఉదయిమన్ భార్‌తీయ సమాజ్ మే శిక్షక్’ (డాక్టర్ కరణ్‌సింగ్), ‘నెహ్రూ గాంధీ పరివార్ సెక్యులర్’, ‘వర్ణ్ సంకర్’ (హరిరామ్ గుప్త), రాణీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ‘రాణి’ (జయశ్రీ మిశ్రా) కాపీలు ఒక్కటి దొరికినా ఆశ్చర్యమే. వీటన్నిటినీ యూపీ ప్రభుత్వం నిషేధించింది. తమిళనాడు ప్రభుత్వం 2012లో ‘వాసంతీస్ జయలలిత : ఎ ప్రోర్ట్రెయిట్’ పుస్తకాన్ని బ్యాన్ చేసింది.
ఇవి చూడకూడదు
బిబిసి కోసం బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఎడ్విన్ తీసిన ‘నిర్భయ’ డాక్యు మెంటరీని భారత ప్రభుత్వం గత మార్చిలో నిషేధించింది. బ్రిటిష్ అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ని గత ఆగస్టులో భారత ప్రభుత్వం నిషేధించింది. యశ్‌చోప్రా ‘ఆజా నచ్‌లే’, అశుతోష్ గోవరికర్ ‘జోధా అక్బర్’, ప్రకాష్ ఝా ‘ఆరక్షణ్’ చిత్రాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. గుజరాత్ ప్రభుత్వమైతే ఎన్ని సినిమాలను నిషేధించిందో లెక్కేలేదు. ఫనా, పర్జానియా, చాంద్ భుజ్ గయా, ఇన్ దినో ముజఫర్‌నగర్... వీటిలో కొన్ని.