
కొత్త చోటు
వేటాడే జ్ఞాపకాల నుంచి ఎందాక పారిపోగలవు వెంటాడే నీడల నుంచి ఎట్లా తప్పించుకుపోగలవు...? ఇక్కడ అవే నది నీళ్లు కొత్తగా అరుచిగా అనామోదితంగా ఇక్కడ అదే ఊరి గాలి పరాయిగా, పరాకుగా,అయిష్టంగా....
ఎక్కడో పోగొట్టుకున్నది వేరెక్కడో వెతుకుతున్నట్టు ఎప్పుడూ కోల్పోనిదాన్ని ఇప్పుడు అనునిత్యం పోగొట్టుకుంటున్నట్టు పరాధీన జీవనం పావన మౌనంలో తడిచి ముద్దయిపోతున్నట్టు ఎవ్వరూ ఎన్నడూ వినని గంట యేదో ఎవరూ కొట్టకుండానే చెవులలో మోగుతున్నట్టు. కాళ్లు నేల మీద ఆనడం లేదేమిటో ఏమిటో కళ్లు చూపుకి తగిలిన దేనినీ చూడటం లేదు
రుచుల జాడ మరిచిన నాలుక సుఖం సోయి మరిచిన శరీరం అవే మాటలు, అవే రణగొణలు ఇప్పుడేమిటో కొత్తగా ధ్వనిస్తున్నాయి
ముందుకు దొర్లిపోవలసిన శకట చక్రాలు వెనక్కి బలవంతంగా తిరిగిపోతున్నట్టు ఎక్కడో పెరిగిన చెట్టును పెకలించుకు వచ్చి ఇక్కడ కొత్త మట్టిలో మొక్కగా మార్చి పాతుతున్నట్టు జ్ఞాపకాలు చిరిగిన జెండా ముక్కలై తలో దిక్కుకు నాలుకలు చాచి యెగురుతున్నట్టు
పారిపోతున్న నన్ను పట్టుకుని ఇక్కడ కుర్చీలకీ మంచాలకీ కట్టిపడేస్తున్నట్టు వేటాడే నీడల నుంచి ఎందాకా పారిపోగలనో
ఏ దిశగా మారిపోగలనో
- దేవీప్రియ