పరిపూర్ణ పరిణామవాది
అరబిందో ఘోష్‌ను అర్థం చేసుకునే ప్రయత్నంలోని జటిలత్వాన్ని సరళీకరించుకోవడం కోసం ముందుగా ఆయన్ని ఒక పరిపూర్ణ పరిణామవాదిగా మనసులో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనలోని కవి పుంగవుడు, జాతీయవాది, యోగసాధకుడు ఒకరొకరుగా దర్శనమివ్వడం మొదలుపెడతారు. ఘోష్ ఒక విలక్షణమైన తాత్విక చింతనాపరుడు. జీవ పరిణామక్రమంలో మనిషికి ఒక మెట్టు పైన ఉన్న, లేదా మనిషిని ఒక మెట్టు పైన ఉంచిన ‘మనస్సు’ అనే దశను కూడా దాటి అధిమానవ స్థితిలోకి వెళ్లేందుకు తన చివరి నలభై ఏళ్లూ తపోనిష్టలో ఉన్నారు అరబిందో ఘోష్! ఆయన పూర్వ నిర్యాణ అవశేషమే ‘ఇంటెగ్రల్ నాన్ డ్యూయలిజం’. ఈ అద్వైత పూర్ణ పరిణామాన్ని ఘోష్ దర్శించారా లేక కేవలం ప్రతిపాదించారా అంటే మాత్రం ఆయనే రాసిన ‘ది లైఫ్ డివైన్’, ‘సావిత్రి’ వంటి గ్రంథాలను ఆశ్రయించవలసిందే. ది లైఫ్ డివైన్.. పూర్ణయోగ సైద్ధాంతిక అంశాలను తర్కిస్తుంది. ‘సావిత్రి’.. మహాభారతంలోని సావిత్రి, సత్యవంతుల కథ ద్వారా ఘోష్ దర్శన సమస్తాన్ని ఆవిష్కరిస్తుంది.
ఘోష్‌లోని గాఢతను ఆయన చూసిన ప్రపంచం నుంచి కాక, ఆయన చదివిన వాజ్ఞయ జ్ఞానసారం నుంచి మాత్రమే సాక్షాత్కరింపజేసుకోవాలి. దీనర్థం ఘోష్ చూసిన ప్రపంచం పరిమితమైనదని కాదు. ప్రాపంచిక దృక్పథానికి ఆవలే ఆయన జీవనయానం మొత్తం సాగిందని. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగ, తంత్ర శాస్త్రాలతో పాటు పాశ్చాత్య చింతనను ఆయన తన యానానికి సోపానాలుగా నిర్మించుకున్నారు.
1872 ఆగస్టు 15న కోల్‌కతాలోని ఒక బెంగాలీ సంపన్న కుటుంబంలో జన్మించిన అరవిందో ఘోష్... తండ్రి నిర్ణయం మేరకు తన ఏడవయేట సోదరులతో కలిసి అప్రమేయంగా ఇంగ్లండ్ వెళ్లాడు. ప్రపంచ భాషలు నేర్చుకున్నాడు. ఉన్నత విద్యావంతుడయ్యాడు. ఇరవై ఒకటో యేట ఇండియా తిరిగివచ్చి ప్రభుత్వోద్యోగంలో చేరాడు. భారత జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరవడం ఆయన్ని జాతీయవాదిగా మార్చిందో లేక, జాతీయవాదిగా మారాక సభలకు వెళ్లారో చెప్పలేం కానీ, మితవాద రాజకీయాల్లో ఆయన ఎక్కువకాలం ఉండలేకపోయారు. ఆధ్యాత్మికం వైపు మళ్లి, అధిభౌతిక తాత్వికునిగా మానవుని దివ్య చైతన్య దశను అన్వేషించే క్రమంలో 1950 డిసెంబర్ 5న జ్ఞానగర్భితుడయ్యారు.