
సృజనాత్మకతకు సోర్స్..!
తను రూపొందించిన‘ఐస్‌క్రీమ్’ సినిమా గురించి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ సినిమాను అత్యల్ప బడ్జెట్‌లోనే రూపొందించానని చెప్పిన ఆ దర్శకుడు సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్ విషయంలో అనుసరించిన ఒక పొదుపు పద్ధతి గురించి విపులంగా చెప్పారు. ఆ సినిమా కు ప్రత్యేకంగా బీజీఎం కంపోజ్ చేయలేదని... ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొన్న సౌండ్స్‌నే మ్యూజిక్‌గా కూర్చామని చెప్పారు! ఇప్పటికే చాలా మంది షార్ట్‌ఫిలిమ్ మేకర్స్ అనుసరిస్తున్న పద్ధతి ఇది. మరి ఇంటర్నెట్ నుంచి ఇంకా ఏమేం పొందవచ్చు.. మన సృజనాత్మకతకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు..?! దేన్నైనా ఉచితంగా వాడేసుకోవడానికి అవకాశం ఉంటుందా?! మరి ఇంత వరకూ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ల గురించి విన్నాం.. ఇప్పుడు సృజనాత్మకత కూడా ఓపెన్‌సోర్స్‌లో లభ్యమయ్యే సమయం వచ్చేసింది!
మూడువేల సౌండ్స్‌తో సౌండ్‌క్లౌడ్...
మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కమర్షియల్‌పర్పస్‌లో ఉపయోగించుకోవడానికి సౌండ్‌క్లౌడ్ ఒక ఉత్తమమైన వెబ్‌సైట్. దాదాపు మూడువేల రకాల భిన్నమైన ధ్వనులు, సౌండ్‌బీట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ వెబ్‌సైట్‌లో. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్‌తో వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
జెవెల్‌బీట్.. వీళ్లకు క్రెడిట్ ఇస్తే చాలు..!
బ్యాక్‌గ్రౌండ్ ధ్వనుల, యాడ్స్ కోసం ఈ వెబ్‌సైట్ నుంచి సౌండ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటే షరతు. మీరు ఏ వీడియోలోనైతే ఈ సౌండ్స్‌ను ఉపయోగించుకొన్నారో.. ఆ వీడియోలోనే సౌండ్స్ క్రెడిట్ ఈ సైట్‌కు ఇవ్వాలి. పూర్తిగా ఉచితంగా సంగీతాన్ని అందించే ఈ వెబ్‌సైట్ పేరును డిస్‌ప్లే చేయడం కృతజ్ఞతను చాటుకోవడమే అవుతుందేమో!
నాలుగు లక్షల ట్రాక్స్‌తో జమెండో..
దాదాపు నాలుగు లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంటాయి ఈ వెబ్‌సైట్‌లో. అయితే ఇందులో కొన్ని మాత్రమే క్రియేటివ్ కామన్స్ లెసైన్స్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని వడపోసుకొని ఏ సౌండ్స్ అయితే ఉచితంగా అందుబాటులో ఉంటాయో వాటిని తీసుకోవాలి.
ఇవి కూడా ఉన్నాయి: వేనవేల వాతావరణాలను ధ్వనిద్వారా ప్రతిబింబించే సంగీతాన్ని సొంతానికి ఉపయోగించుకోవడానికి ఇంకా అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. ఆడియోన్యూట్రిక్స్, ఫ్రీమ్యూజిక్ ఆర్కీవ్, ఫ్రీసౌండ్, ఇన్కమ్‌పెటెక్, ఆడియోఫార్మ్, ఐబీట్, సీసీ ట్రాక్స్, మ్యూస్‌ఓపెన్, బంప్‌ఫూట్... ఇలాంటి వెబ్‌సైట్‌లు బోలెడున్నాయి.
యూట్యూబ్... ఉపయోగపడుతుంది!
ఏదైనా ప్రాజెక్ట్‌వర్క్‌కైనా, షార్ట్‌ఫిలిమ్ కోసమైనా కొన్ని సార్లు వీడియో బిట్స్ అవసరమవ్వొచ్చు. అలాంటి సమయంలో హ్యాపీగా యూట్యూబ్‌పై ఆధారపడటమే! యూట్యూబ్‌లో ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల వీడియోలు ఉచితంగా వాడుకోవడానికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్ ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు.
పాతవీడియోలూ అందుబాటులో..!
1982లో రిక్ ప్రిలింగర్ అనే రచయిత, దర్శకుడు నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలను తీసిపెట్టాడు. ఇవి ప్రిలింగర్ ఆర్కీవ్స్‌గా పేరు పొందాయి. డాక్యుమెంటరీ పిలిమ్ మేకర్‌లకు ఈ వీడియోలు చక్కటి వనరు. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్ కింద అప్‌లోడ్‌చేసిన వీటిని కమర్షియల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.
కాపీ చేసుకొనే ముందు..!
ఒక్కసారి నెట్‌లో శోధిస్తే.. ఏ విషయంలోనైనా, ఏ టాపిక్ పైనైనా టన్నుల కొద్దీ కంటెంట్ లభ్యమవుతుంది. దాన్ని వాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఉచితంగా లభించే చిన్న ఇమేజ్‌నైనా సరే అనుమతి లేకుండా వాడుకోవడం అనైతికం అవుతుంది. మరి ఈ విషయంలో చట్టబద్ధమైనది ఏది? కానిదేది? అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సృజనాత్మకతగల వ్యక్తులు రూపొందించిన కంటెంట్‌ను అందరూ ఉపయోగించుకోవడానికి అనుగుణమైన ‘క్రియేటివ్ కామన్స్ లెసైన్స్’ ను పరిశీలించుకొని ఆ డాటాను వాడుకోవడం ఉత్తమమైన పద్ధతి!
- జీవన్
కంపోజ్ చేసి మార్కెట్ చేయవచ్చు!
ఉపయోగించుకోవడానికే కాదు... సొంతంగా సృష్టించిన సంగీతాన్ని అప్‌లోడ్ చేసి డబ్బు సంపాదించుకొనే అవకాశం కూడా ఇస్తున్నాయి ఈ సైట్‌లు. కాపీ రైట్ ప్రాబ్లమ్ లేకుండా... కంపోజ్ చేసిన సౌండ్స్‌ను ఈ సైట్‌లలోకి అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకోవచ్చు!