మార్చి మూడో వారంలో టెన్త్ పరీక్షలు
విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ దృష్టి సారించింది. పరీక్షలకు సంబంధించిన వివిధ పనుల ఖరారుకు చర్యలు చేపడుతోంది. అలాగే ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులు, నిధులు, విధానాల్లో మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆయా అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. 2016 మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. మార్చి 16 లేదా 18 నుంచి ప్రారంభించే అవకాశముంది. వచ్చే నెలలో పరీక్షల ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్ పరీక్షలను మార్చి 25నప్రారంభించారు.
మరోవైపు ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై కూడా ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. మార్చి మొదటి వారంలో పరీక్షలను ప్రారంభించి, ఏప్రిల్ ఆఖరులోగా ఫలితాలను వెల్లడించాలని భావిస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రభుత్వం ప్రతి ఏటా అంతకంటే ముందుగానే ప్రకటిస్తోంది. గత విద్యా సంవత్సరంలో (2014-15) పరీక్షలను మార్చి 9న ప్రారంభించారు. ప్రథమ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22న, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 27న ప్రకటించారు. ఇక 2015-16 విద్యా సంవత్సర ఫలితాలను వీలైతే ఆయా తేదీల కంటే ముందుగానే వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది.
ఫీజు మినహాయింపుపై దృష్టి
ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫీజు మినహాయింపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేలు ఉంటేనే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ నిబంధన ఏ రకంగా చూసినా శాస్త్రీయం కాదు. కూలీ పని చేసుకునే వారి వార్షిక ఆదాయం కనీసంగా రూ. 35 వేలపైనే ఉంటోంది. ఇదే అంశంపై గత నెల 20న ‘పేరుకే ఫీజు మినహాయింపు’ శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై అధికారులు చర్చించి వార్షికాదాయం పెంపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.
అలాగే ప్రభుత్వ స్కూళ్లలో, ప్రైవేటు స్కూళ్లలో వేర్వేరుగా ఫీజుల విధానం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పదోతరగతి ఫీజుల చెల్లింపు ప్రారంభమైంది. ఈనెల 16తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రతిపాదనలు ఈసారికి అమలయ్యే అవకాశం లేదని, వచ్చే విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొం టున్నారు. ఇక మార్చిలో జరిగే టెన్త్ పరీక్షల విధుల్లో పాల్గొనే ఎగ్జామినర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరీక్షల అటెండెంట్లు, మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయుల భత్యాల పెంపుపై కసరత్తు చేస్తోంది.
మొబైల్ ద్వారా సమాచారం
టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని విద్యార్థులకు మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగా ప్రస్తుతం పరీక్ష ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల (గార్డియన్) మొబైల్ నంబర్లను తీసుకుం టోంది. పరీక్షలతోపాటు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ తేదీలు, ఫలితాల వెల్లడి తేదీల వంటి సమాచారాన్ని విద్యార్థులకు ఎప్పటికప్పుడు పంపిం చనుంది. వీటితోపాటు ఆధార్ నంబర్‌ను కూడా సేకరిస్తోంది. టెన్త్ మార్కుల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. విద్యార్థులందరికీ ఆధార్ నంబర్ లేనందున అనుసంధాన సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.