నా ఇడ్లీ విరిగి చట్నీలో పడేది ఎప్పుడు..?!
పెద్దయ్యాక ఏమవుతావు? అని నా చిన్నప్పుడు ఎవరైనా అడిగితే... హోటల్ సర్వర్‌నవుతాను అనేవాడిని. నా మనసులో సర్వర్ పట్ల బోల్డంత ఆరాధన భావం ఉంది. సర్వాంతర్యామి అనే పదానికి, సర్వరాంతర్యామి అనే పదానికీ ఎంతో దగ్గర పోలిక ఉంది. అందుకేనేమో... భగవంతుడిలాగే సర్వర్, బేరర్, వెయిటర్, సప్లయర్ అని ఎన్నో నామాలతో అన్నార్తులు ఆయనను పిలుచుకుంటారు. భగవంతుడు ఎన్నో లోకాలను తనలో కలిగి ఉన్నట్లే... ఎందరికో ఇవ్వాల్సిన ప్లేట్లను ఏకకాలంలో నైపుణ్యంగా నియంత్రిస్తుంటాడు సర్వరాంతర్యామి. భగవంతుడి చేతిలో ఉండే చక్రాయుధంతో పోలిన ప్లేటును ఆయనా నిత్యం ధరిస్తుంటాడు. అందుకే ఎవరైనా సర్వోత్తముడు అనే మాట వాడితే, నాకది సర్వరోత్తముడులాగే వినిపిస్తుంది.
‘ఓ పెసరా... రెండు ప్లేట్ వడ... ఏక్ చాయ్...’ అంటూ ఆర్డరు చెప్పడం సాహసోపేతమైన పని. అందుకే సర్వర్‌ను చాలా ఫాసినేటింగ్‌గా చూస్తుండేవాణ్ణి నేను. అలా కమాండింగ్‌గా అరుస్తున్నందుకే ఆయన ప్యాంటేసుకున్న ‘పెదరాయుడు’ లా కనిపిస్తాడు. గిరగిరా తిప్పి భుజాన వేసుకోవడానికి కండువా లాంటి న్యాప్‌కిన్ ఎలాగూ ఉంటుంది. నా దృష్టిలో సర్వర్ వృత్తి చాలా గొప్పది. ఎన్నెన్నో ప్లేట్లను, కప్పులను, గ్లాసులను ఏకకాలంలో నియంత్రించగలిగే సాధన ఉండాలి. ఏయే టేబుళ్లవాళ్లు ఏయే పదార్థాలను ఆర్డరిచ్చారో... జ్ఞాపకముంచుకుని, వారి వారి బిల్లులను తేడా రాకుండా చూసే సర్వారాయుణ్ణి చూస్తుంటే సివిల్ డ్రస్‌లో ఉన్న శతావధాని గుర్తుకొస్తాడు.
సర్వర్‌ను చూసి ఫలహారాన్ని చూడమన్నారన్నది ఓ సామెత. టిఫిన్ ఎంత రుచిగా, శుచిగా ఉన్నా... సర్వర్ శుభ్రంగా లేకపోతే ఆ ఫలహారానికి విలువుండదు. ఓ సుల్తానుకు ఉన్నంత ఠీవి, ధీమా, దర్జా ఉండేలా ఆ యూనిఫామ్‌ను రూపొందిస్తారు. పైగా కిరీటంలాంటి టోపీ లేదా తలపాగా కూడా. టిప్పుల గలగలలతో ఆయన జేబు లక్ష్మీనిలయంలా అలరారుతుంటుంది. అందుకేనేమో గిట్టనివాళ్లు ఆయనని పొగుడుతున్నట్లే ఆడిపోసుకోవడానికి టిప్పుసుల్తాన్ అంటూ అక్కసు వెళ్లగక్కుతుంటారు.
ఇన్ని గుణాలు ఉన్నందువల్ల చిన్నప్పుడు నేను సర్వర్ కావడం ఎంతో కష్టమైన పనిగానూ, దాన్ని సాధించడం అంటే పెట్టిపుట్టాలనీ అనుకునేవాణ్ణి. అయితే ఎప్పటికైనా అలా ఓ సర్వరోత్తముడిలా దర్జాగా అరిచి, టిఫిను సప్లై చేయాలన్న కోరిక మా బుజ్జిగాడు పుట్టడంతో తీరింది. ఇప్పుడు వాడు భోజనాలనీ, టిఫిన్లనీ, బిస్కెట్లనీ పురమాయిస్తుంటే... ప్లేట్ మీల్స్, ఒక పాల్, ఓ అరటిపండ్... అని అరుస్తున్నాను. అరుపూ నేనే అరచి, లోపల కిచెన్‌లో నుంచి ప్లేటందుకుని మా బుజ్జిగాడికి సప్లై చేస్తున్నాను.
ఇలా నా ముచ్చట తీర్చుకుంటూ ‘ఇదీ కదా జీవితం. దీంతో నా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయ్యింది’ అని నేనంటే మా ఆవిడ, ‘‘నీకు రొట్టె, నెయ్యి పెద్దగా ఇష్టం ఉండవు కదా! మనకో బుజ్జిది పుట్టి... అప్పుడు నువ్వు ‘ఒన్ పాల్ విత్ పాల్ పీకా’ అని అరిస్తే... అప్పుడు... ‘నీ ఇడ్లీ విరిగి చట్నీలో పడినట్టు’ అని నన్ను సవరించింది.
- యాసీన్