మనిషికి మనిషే బద్ధశత్రువు...మనిషే ఆప్తమిత్రుడు!
సువార్త
ఏవేవో ఆశించడం అవి పొందేందుకు అడ్డదారులు తొక్కడం అనే నైజం వల్ల యాకోబు జీవితమే ఒక సమస్యల సుడిగుండంగా మారింది. జ్యేష్ఠత్వాన్ని, దాని తాలూకు దీవెనల్ని మోసంతో కబళించి తన అన్న ఏశావును బద్ధశత్రువును చేసుకున్నాడు. ఏశావు వల్ల ప్రాణభయంతో పద్దనరాముకు పారిపోయి అక్కడ మేనమామ పంచన చేరి అతని వద్ద పనికి కుదిరాడు. అతని ఇద్దరు కుమార్తెలనూ పెళ్లి చేసుకున్నాడు. అయితే కుయుక్తితో మేనమామ ఆదాయానికి గండికొట్టి ఎంతో ఆస్తిపరుడయ్యాడు కాని బావమరుదులను శత్రువులను చేసుకొని బోనస్‌గా బోలుడు అశాంతినీ మూటగట్టుకున్నాడు. అక్కడా ప్రాణభయం ఏర్పడడంతో సకుటుంబ సపరివారంతో స్వస్థలమైన కనానుకు తిరుగు ప్రయాణమయ్యాడు. కాని తన మీద పగతో రగిలిపోతున్న ఏశావు తనను తన వారినందరినీ సమూలంగా నాశనం చేస్తాడన్న భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు.
ఆ అరణ్యమార్గంలో తననాదరించేవారు లేక, సాయం చేసేవారూ కానక ఏకాకిగా మారి ఒక రాత్రి తన దేవునినాశ్రయించాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అంతకాలంగా దేవుడతన్ని చూస్తున్నాడు కానీ అతను దేవుణ్ణి చూడలేదు. అతనిలోని పట్టుదలను చూసిన దేవునికి అతనిపట్ల అద్భుతమైన ప్రణాళిక ఉంది. అబ్రహాము వంశానికి చెందిన అతను కుటుంబాన్నే తనదైన స్వంత జనాంగంగా ప్రత్యేకించి ఆ కుటుంబాన్నే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపేందుకు వాడుకోవాలన్నది దేవుని స్వర్ణసంకల్పం. ఫలితంగా యబ్బోకు రేవు వద్ద యాకోబు ఒక రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడి నన్ను దీవిస్తే తప్ప వదలనని పట్టుబడితే దేవుడది మెచ్చి, అతన్ని ఆశీర్వదించి, అతనికి ‘ఇశ్రాయేలు అనే వినూత్న నామాన్నిచ్చి అతని కుటుంబాన్నే నేటి ఇశ్రాయేలీయులను చేశాడు (ఆది 32:3-22).
యాకోబుకు బాహ్యశత్రువులున్నారు కాని ఆంతర్యంలో ఆతనికతడే బద్ధశత్రువు! అదే అతని సమస్యలకు మూలహేతువు. మనిషి తనను తాను అర్థం చేసుకున్న రోజునుండే, ‘ఆశీర్వాదాల యాత్ర’ ఆరంభమవుతుంది. ఒక కారు పనితీరు తెలియాలంటే దాన్ని తయారు చేసిన కంపెనీ వారి మాన్యువల్ చదవాలి. మనకు మనం అర్థం కావాలన్నా మనకు దేవుడే సాయం చేయాలి. సమస్యల్లో ఉన్న వాడికి సాయం చేసే వారొక్కరూ ఉండరు కాని సలహాలిచ్చే వారు బోలెడుమంది ఉంటారు. ఆ అరణ్యమార్గంలో యాకోబుకు ఎవరూ సాయం చేసేవాళ్లు, సలహాలిచ్చేవారూ లేని భయంకరమైన ఒంటరితనం. కాని అదే అతనికి ఆశీర్వాదమైంది. ఎందుకంటే ఆ ఒంటరితనమే అతన్ని దేవుని పాదాలమీద పడేలా చేసింది.
అందరినీ తన పాదాలతో దిగతొక్కుతూ పెకైక్కడమే అంతకాలంగా ఎరిగిన యాకోబుకు ఆ రాత్రి దేవుని పాదాలనాశ్రయించడం ఎంత ఆశీర్వాదకరమో, ఆదరణకరమో అర్థమైంది. ఏశావు అనే కనిపించే శత్రువుకన్నా, తనలోని తానే ఎంత ప్రమాదకరమో ప్రభువు పాదాలవద్దే అతనికి తెలిసింది. మనకు మనమే మిత్రులుగా ఉంటే లోకమంతా మనల్ని ప్రేమించే వాళ్లే కనిపిస్తారు. మనకు మనమే బద్ధశత్రువులమైతే లోకం నిండా శత్రువులే ఉంటారు. యబ్బోకు రేవు వద్ద దేవునితో పెనుగులాడిన అనుభవంతో యాకోబు నేర్చుకున్న ఆత్మీయ సత్యమిది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్